ఆమె @ సమానత్వం
"ఆమె ఆవేశం అర్థం కావాలంటే ఆమె స్థానం లో మన ముండాలి . అంతే కాదు , ఆమె గుండె కూడా మనకుండాలి " - కాళీ పట్నం రామారావు మాష్టారు
Sunday, March 24, 2024
Saturday, September 1, 2018
Wednesday, November 29, 2017
Thursday, May 21, 2015
దశాబ్దాల పోరాట చరిత్రకు చిచ్చు – హైకోర్టు మార్గదర్శకాలు- హేమలలిత
దశాబ్దాల పోరాట చరిత్రకు చిచ్చు – హైకోర్టు మార్గదర్శకాలు- హేమలలిత
ప్రముఖ మహిళా విప్లవకారిణి క్లారాజెట్కిన్‌తో లెనిన్ ఓ మాట అంటారు. ‘చట్టం ప్రాతిపదిక మాత్రమే చట్ట సమానత్వం సంపూర్ణ సమానత్వం కాదని, యిది నూటికి నూరుపాళ్ళు వాస్తవమే’. సమానత్వం కోసం చట్టాల్ని ప్రాతిపదిక చేసుకోవాలని ఆపై సంపూర్ణ సమానత్వం పొందడంలో చట్టం తొలి అడుగు కావాలని స్త్రీలు ఎన్నో పోరాటాలు చేసారు. అయితే వీటికి భిన్నంగా గడిచిన దశాబ్దాల మహిళా మేధావుల కృషి, ఉద్యమకారుల సంఘాల పోరాటాల సాక్షిగా స్త్రీల మనోభావాలకు, సామాజిక స్థితిగతులకు వ్యతిరేకంగా స్త్రీలపై మరింత హింస ప్రజ్వరి ల్లేలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొన్ని మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది.
భార్యా భర్తలను ఏకం చేయడం కంటే వారి బంధాన్ని విచ్ఛిన్నం చేయిడానికి భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 498(ఎ) (భార్యపై భర్త, ఆయన తరుపు బంధువులు క్రూరత్వాన్ని ప్రదర్శించడానికి సంబంధించిన సెక్షన్) ఒక ఆయుధంగా ఉపయోగపడటం దురదృష్టకరమని హైకోర్టు అభిప్రాయపడింది. భర్తను దారిలోకి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది ఈ సెక్షన్ ఉపయోగించి పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారని వ్యాఖ్యానించింది. సరైన సలహాలు ఇచ్చేవారు లేకనే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమైతున్నాయని భర్తని మాత్రమే కాకుండా అత్తమామలు, ఆడపడుచులు వారి బంధువులను వేధింపులకు గురిచేయటానికి ఈ సెక్షన్‌ను ఉపయోగిస్తు న్నారని పెర్కొన్నది. అయితే ఇది ఈనాటి తీర్పు మాత్రమే కాదు. అత్తింటి వారిపై అభియోగాలు (అనవసర) మోపరాదని వరకట్నం మృతికేసుల్లో సుప్రీమ్‌కోర్టు ఒక కీలక తీర్పును 2010లో ఇచ్చింది.
ఇంతకీ 498′ఎ’ సెక్షన్ అంతట మహమ్మారీగా కనిపిస్తుంది. నిజానికి రెండింతులు పైగానే ముద్దాయిలు విడుదలౌతున్నారు. చట్టం ప్రకారం 498′ఎ’ ప్రకారం ఒక స్త్రీ తనపై జరిగే హింస వలన అత్మహత్య చేసుకొనే పరిస్థితులు నెలకొన్నా, లేక వరకట్నం కోసం డిమాండ్ చేసి హింసించడం నేరము. ఈ సెక్షన్‌తో పాటు అపరాధిత నమ్మక ద్రోహం (406), బెదిరించడం (506) కూడ ఒక్కొక్కసారి మోపబడతాయి. ఒకవేళ వరకట్నం మృతి జరిగితే 304′బి’, అత్మహత్య చేసుకోవటానికి ప్రేరింపించడం 306 లాంటివి కూడా మోపబడతాయి. కాని ప్రాసిక్యూషన్ గట్టి సాక్ష్యాధారాలతో నిరూపించవలసి వుంటుంది. ఇవి చాలా వరకు కోర్టులో నిలబడవు. విచారణ ముగిసేలోపే చాలా కేసులు సయోధ్యకు వస్తాయి. ఒకవేళ శిక్షించబడ్డ ముద్దాయిలు అప్పీలు చేసుకోవటానికి బెయిల్ మంజూరు అవుతుంది. అలా వాడు సుప్రీంకోర్టుకు వెళ్ళెలోపల ఇక్కడ స్త్రీ జీవితం చిధ్రమౌతుంది. ఇన్ని అవకాశాలు ఉన్న ముద్దాయిలకు అన్యాయం జరుగుతుందనే ధోరణి హైకోర్టు, సుప్రిం కోర్టులలో కల్పించడం వారి పితృస్వామిక ధోరణికి నిదర్శనం.
సుప్రీమ్‌కోర్టు ప్రీతిగుప్తా వర్సెస్ స్టేట్ ఆఫ్ జార్ఖాండ్ కేసులో ఇచ్చిన అదేశాల మేరకు ‘లా’ కమిషన్ చాలా స్పష్టంగా 498′ఎ’ సెక్షన్ నాన్ బెయిలబుల్‌గా ఉండాలనే సిఫార్స్ చేసినది. అంతేకాకుండా పార్లమెంటరీ కమిటి ఒక్క సంవత్సరం పాటు వివిద రాష్ట్రాలలో పర్యటించి, ఈ సెక్షన్ అమలులో స్థితిగతులను తెలుసుకోవటానికి అధ్యయనం చేసింది. అయినప్పటికి ఆ కమిటి ఈ సెక్షన్‌ను ప్రజలు వ్యతిరేఖిస్తుందన్నారని చెప్పలేదు. కాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రజాభిప్రాయాలకు భిన్నంగా వెళ్ళడం ఆశ్చర్యకరం. హైకోర్టు అదేశాల ప్రకారం కేసు దర్యాప్తు డి.యస్పీ ర్యాంకుకు తగ్గని వారితో చేయాలి. ఒకవేళ తప్పుగా కేసులో ఇరికించారని అనుమానిస్తే, జిల్లా పోలీసు అధికారిగార్కి తెలియజేసి చార్జిషీటులో వారి పేరును తొలిగించవచ్చును. మేజిస్ట్రేట్ యాంత్రికంగా జైలుకు పంపకూడదు. ధనం, కులం, మతం అవినీతి అధికార హోదాలో ఉన్నప్పుడు స్త్రీలకు ఎటువంటి న్యాయం జరుగుతుందో ప్రజాస్వామిక వాదులుగా మనం ఊహించగలం.
ఈ తరహా మార్గదర్శకాలు డా|| బాబా సాహబ్ వ్రాసిన రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. 1950లలో హిందూ కోడ్ బిల్లు కోసం ఆయన చేసిన పోరాటం స్పురణకొస్తున్న సందర్భం ఇది. ఆనాడు ఫాసిస్టు మతవాద శక్తులు ఏలాగతై స్త్రీల హక్కుల రక్షణకు గండి కొట్టారో ఈనాడు ప్రపంచీకరణలో స్త్రీల స్థితి గతులకు అడ్డుపడుచున్నారు. ఈ తరహా మార్గదర్శకాలు మహిళా మేదావులు చేసిన కృషిని అపహస్యం చేయడమే కాదు, మహిళా సంఘాల అవిరణ పోరాట స్ఫూర్తిని అవమానపర్చినట్లే ఇలాంటి పితృస్వామిక భావజాలంతో కూడిన తీర్పులను ఇస్తున్న న్యాయ వ్యవస్థను ప్రశ్నించవలసిన అవసరం నేడు ఉంది. వ్యవస్థ మారనంత వరకూ సామాజికంగా స్త్రీలకు రక్షణ లేదన్నప్పటి అవగాహన మన న్యాయవ్యవస్థకు లేదనటానికి ఈ తీర్పు ఒక తార్కాణం. తను చేసిన చట్టాలను సక్రమంగా సరైన రీతిలో అమలు చేయలేని యాంత్రాంగం ఈనాడు తాను చేసిన చట్టాలనే తానే నిర్వీర్యపర్చుతుందన్నటానికి ఇది ఒక తాజా ఉదాహరణ.
సంఘటితంగా హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అడ్డుకోవాల్సిన చారిత్రిక బాధ్యత మన స్త్రీలందరిపైన ఉన్నది. స్త్రీలకోసం మన కేంద్ర పదవినే వదులుకొన్న త్యాగమూర్తి బాబాసాహెబ్ లాంటి పురుషుల సహాకారం, బాధ్యత ఉంది. అందరం కలిసి దశాబ్దాలుగా పోరాడి, సాధించి, పొందిన చట్టాలను రాజ్యాంగ స్ఫూర్తిని తూట్లు పొడవకుండా కాపాడుకోవల్సిన అవశ్యకత నేటి మన కర్తవ్యం. స్త్రీల హక్కులను హరించే ఈ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఐక్యమవుదాం. మన హక్కులను మనం తిరిగి పొందేందుకు అవిశ్రాంతిగా మన లక్ష్యం వైపు కలసినడుద్దాం.
భూమి-సేకరణ- పునరావాసం-స్త్రీలు
భూమి-సేకరణ- పునరావాసం-స్త్రీలు
హేమ
జార్ఖండ్‌లో భూనిర్వాసితుల పోరాటానికి మద్దతుగా నిల్చిన సిస్టర్ జాన్ వల్సను మైనింగ్ మాఫియా హతమార్చిందని వార్తాపత్రికలో (18.11.11) చూసి హతాశురాలినయ్యాను. భూవనరులను ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా బహుళజాతి కంపోనీలకు దోచిపెట్టకుండా ప్రజలతో కలిసి జాన్‌వల్స పోరాడింది. భూమి నుండి స్త్రీలను వేరు చేయడానికి దానిపై ఆధిపత్యానికి పురుషాధిక్య వ్యవస్థ ప్రయత్నిస్తున్నా స్త్రీలు ప్రతి భూపోరాటంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నారు. కాని వారి మనోభావాలు, ఆవేదన పాలకవర్గాల నిర్ణయాధికారంలో చోటు చేసుకోలేదు. ఫెడరిక్ ఏంగిల్స్ అన్నట్టు ‘ప్రపంచ మహిళలు చారిత్రక ఓటమికి గురయ్యారు’ ఈ నేపథ్యంలో జాతీయ భూసేకరణ పునరావాసం బిల్లు ఒకసారి పరిశీలిద్దాం.
పట్టణీకరణ-పారిశ్రామికాభివృద్ధి, వాటి మౌలిక సదుపాయాల కల్పన పేరుతో మూడింట రెండొంతులు స్త్రీలు పాల్గొనే గ్రామీణ వ్యవస్థను విచ్ఛిన్నం చేసి కార్పొరేటు సంస్థలకు భూమిని అప్పగించడానికి ప్రభుత్వం పూనుకుంది. వలస పాలనతో 1894లో చేసిర భూసేకరణ చట్టానికి ప్రతిగా ఈ చట్టం రాబోతుంది. ప్రజల్నుంచి ఎలాంటి అడ్డంగి లేకుండా ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులను భూ సేకరణ జరపవచ్చు. ప్రేవేటే కంపెనీల కోసం అయితే 80% అనుమతి వుంటేచాలు. కాని ఈ 80%లో ఎంత మంది స్త్రీలు పట్టాదారులు? దళిత బహుజన వర్గాల్లో భూమి సాగుకు స్త్రీలే అధికంగా పాల్గొంటారు. యిక 20% మంది నిర్ణయాలు అసలు పరిగణనలోకి రావు. భూమి విలువను కట్టేదపుడు మార్కెట్టు వ్యవస్థ, దాని వినియోగం బట్టి ధరను నిర్ణయిస్తున్నారే తప్ప స్త్రీల అభిప్రాయాలకు తావే లేదు. స్వాధీనం చేసుకునే భూమి 100 ఎకరాలు మించితేనే సామాజిక పర్యవసానం గురించి ఈ బిల్లు మాట్లాడుతుంది. అంతకంటే తక్కువైతే ఈ భూ యజమానుల సంగతేమటన్న దానికి జవాబు లేదు. నీటివనరుల భూమి, బహుళ పంటలు పండే భూమి స్వాధీనపరుచుకోమని చెప్పినా కాకినాడ, సోంపేట, నందిగ్రాం తదితర ప్రాంతాల్లో ఏం జరుగుతుందో మనందరికి తెలుసు. భూ సేకరణకై గుర్తించబడ్డ స్థలాన్ని బాధిత స్థలంగా నిర్వచించారే కాని ఆ ప్రాజెక్టు ఉత్పత్తుల ఫలితంగా నష్టపోయే ప్రాంతాన్ని గుర్తించలేదు. దాని మూలంగా వెలువడే కాలుష్యం అనారోగ్య పరిణామాలు ప్రసక్తే లేదు. ఎవరి భూమిని సేకరించారో వారినే బాధితులుగా గుర్తించారే తప్ప వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు, కౌలుదార్ల వర్గం, వారి స్త్రీల గురించి ప్రస్తావన లేదు.
భూమి ఒక వనరుగా కాక ఒక వస్తువుగా మారినక్రమంలో భూవనరులను పోగొట్టుకోవడమే కాకుండా దానితో జీవనాధారమైన జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పోగోట్టుకుంటారు. అప్పటివరకు శ్రామిక వర్గంగా వున్న స్త్రీలు కొత్త ప్రాజెక్టులలో స్థానం లేక మిగులు మనుషులుగా మిగిలిపోతారు. ఈ బిల్లు భూమికి సంబంధించిన పంచాయితీ ఎక్స్‌టెన్షన్ అయి షెడ్యూల్డ్ ఏరియాస్ చట్టానికి, 2006 అది హక్కుల చట్టానికి, గిరిజనులు అధికంగా వుండే 5వ షెడ్యూల్ ప్రాంతంలోని భూముల బదలాయింపు చట్టానికి లోబడి వుంటుందని పేర్కొన్నా వాటి అతిక్రమణ అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది.లోక్‌సభ ఎన్నికల్లో ఆహార రక్షణ, భద్రత అనేది యు.పి.ఏ కూడమి ప్రజలకు యిచ్చిన వాగ్ధానం. అందుకు మరింత భూమిని సేద్యానికి వినియోగించకుండా ఉన్న భూమిని పారిశ్రామీకరణ పేరుతో కంపెనీలకు బదలాయిస్తున్నారు. దేనికి అనువుగానే ప్రజల్ని మభ్యపెట్టడానికి ఆహారాన్ని బదులుగా నగదు చెల్లిస్తామని ఆహార భద్రతా చట్టాలలో పేర్కొన్నారు. దీనివలన ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసి చిల్లర వ్యాపారంలో కూడా విదేశీ బహుళజాతి కంపెనీలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పూనుకుంది. యిప్పటివరకు కాస్తో కూస్తో అందుతున్న కుటుంబాలకు అందదు.
యిక ‘పునరావసం’ ఒక రాజకీయ అవసరంగా గుర్తించి జాతీయ విధానాన్ని పొందుపరిచారు ఈ బిల్లులో. భూమి విలువతో పాటు యిల్లు, 20 వ సంవత్సరాలు రెండు వేల రూపాయల చొప్పున అందిస్తారు. కుటుంబంలో ఒకరికి ఉపాధి లేనట్లయితే 2 లక్షల రూపాయిలు యివ్వబడతుంది. రవాణాఖర్చులు, సెటిల్‌మెంటు, తాత్కాలిక ఉపశమన గ్రాంటు, పశుశాల, చిన్న దుకాణాల నిర్మాణం చేపడతారు. భూ విలువలో 25% షేర్లరూపంలో యివ్వబడుతుంది. యిల్లు భార్యభర్తల పేరు మీద యివ్వొచ్చు కాని యివ్వాలన్న నిబంధనలేదు ప్రభుత్వం నుంచి కల్పింపబడిన ఏ నష్టపరిహారమైనా, సదుపాయాలైనా పితృస్వామ్య వ్యవస్థలో ఎటువంటి పోరాటం చేయకుండానే పురుషునికి దక్కుతాయి. పురుషులు వస్తు వినిమయ వ్యామోహంలో పడి ఆ డబ్బును ఖర్చు చేస్తున్నారు. కొన్నాళ్ళ తరువాత డబ్బు యిబ్బందితో వాటికి అమ్మి సరైనా ఉపాధి దొరకక మరింత పేదరికంతో కూరుకుపోవడం కాకినాడ సెజ్‌లో అనుభవమే. ఆదివాసి సమాజంతో, సహా నష్టపరిహారాన్ని విందులు, వినోదాలు, తాత్కాలిక అవసరాలకే హెచ్చిస్తున్నారు.
ప్రజాభిష్టం, కుటుంబాలపై సాంఘిక, ఆర్థిక అంశాల ప్రభావం, భూపరిధి తదితర అంశాలపై అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు చేసినా అందులో స్త్రీలు ఉండాలన్న నిబంధన లేదు. దేశ జనాభాలో మూడింట ఒక వంతు జనాభావున్న అసంఘటిత కార్మికులు దేశానికి రెండొంతుల ఆదాయాన్ని అందిస్తున్నారు. అధిక శాతం వీరిలో వ్యవసాయ, అనుబంధిత మహిళా కార్మికులే.
ఈ మొత్తం క్రమాన్ని పరిశీలించినట్లయితే స్త్రీలను భూమిక, దాని వనరులు నుండి గెంటివేసి ఆర్థిక స్వాతంత్య్రం కోల్పోయేలా చేస్తుంది. పితృస్వామిక భావజాలం ఉన్న సమాజంలో పురుషుల హింస ఈ పేట్రేగి కుటుంబభారం మొత్తం స్త్రీమీద పడుతుంది.కాబట్టి దేశాన్ని కబళించబోయే ఈ భూసేకరణ బిల్లులో మానవీయ ముఖ్యంగా స్త్రీకోణం లోపించింది. అత్యవసర పరిస్థితులలోనే భూసేకరణ పరిమితులతో జరగాలి. భూమికి భూమి యితర సదుపాయాలు కల్పించాలి. కుటుంబాన్ని యిద్దరి కలయికగా కాకుండా పితృస్వామ్య భావజాల ప్రభావిత యూనిట్‌గా గుర్తించి స్త్రీలకు ప్రాధాన్యం యివ్వాలి. స్త్రీలను ఉత్పత్తి చేసే మనుష్యులుగా చూసి శ్రమ ఆధారిత పరిశ్రమలు ప్రభుత్వ పరంగా తెరవాలి. వికేంద్రీకరణ, వనరులు, స్థానిక సాంకేతిక నైపుణ్యం ఉపయోగించుకొని నడిపే పరిశ్రమలు కోసం ఉద్యమించాలి. భూమిని వాటి వనరులను బహుళజాతి కంపెనీలకు దోచిపెట్టడానికి రూపొందించబడిన భూసేకరణ పునరావసం పునర్మిర్మాణం బిల్లు 2011ను వ్యతిరేకించడం పురుషుల కంటే దేశపౌరులుగా మనదే ఎక్కువ బాధ్యత!!
Subscribe to:
Posts (Atom)