Wednesday, May 9, 2012

స్వేచ్ఛకోసం మత(ఠ) సంకెళ్ళను తెంచుకున్న ”ఆమె”న్‌!

Posted By on December 8, 2009
నక్కా హేమా వెంక్రటావు
క్రైస్తవ మత(ఠ) ప్రతినిధులైన ఇరువురు మహిళలు క్రైస్తవ, ప్రపంచాన్ని సందిగ్ధంలో పడవేసిన సంవత్సరం, 2009. సిస్టర్‌ ఆల్ఫోన్స్‌ చర్చి చేత పునీతురాలిగా ప్రకటింపబడింది. క్రైస్తవ విలువలుగా ప్రకటింపబడిన వాటిని, అధికార వర్గాల దురాగతాలను, దుశ్చర్యలను ధిక్కార స్వరంతో ప్రశ్నిస్తూ వచ్చిన సిస్టర్‌ జెస్మె చర్చి నుండి బయటకు నెట్టి వేయబడింది. అదే సమయంలో కేరళకు చెందిన సిస్టర్‌ అభయ హత్య ఉదంతంలో ఇద్దరు ఫాదర్స్‌ను, ఒక నన్‌ను సిబిఐ అరెస్టు చేయడం, సిస్టర్‌ అనూప మేరీ ఆత్మహత్య, తోటి సన్యాసిని లైంగిక హింస అప్పటికే క్రైస్తవ ప్రపంచాన్ని ఉక్కిరి బిక్కిరి చేసున్నాయి. అప్పుడే సిస్టర్‌ జెస్మె తన అనుభవాను, ఆవేదన, ఆకాంక్షలను ‘ఆమెన్‌’గా ప్రచురిస్తుంది.
ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ మఠాధిపతులు పుస్తకాన్ని అప్రకటితంగా నిషేధిస్తారు. తస్లిమా నస్రీన్‌ ‘లజ్జ’కు ఫత్వా విధించినట్టో లేక జస్వంత్‌ సింగు ‘జిన్నా’ పుస్తకాన్ని బహిష్కరించినట్టు కాకపోయినా ‘ఆమెన్‌’ ప్రకంపనల నుంచి తమను తాము కాపాడుకోవడానికి చర్చిలోని ఒక వర్గం సిస్టర్‌ జెస్మెను ఒక ‘వేశ్య’గా, ఏసుక్రీస్తును అప్పగించిన శిష్యుడు ‘జుదా’ లాంటి ద్రోహిగా అభివర్ణిస్తుంది. పుస్తక ప్రచురణ అపివేయడానికి డబ్బు ఆశ కూడా చూపుతారు. పునీతురాలిగా ప్రకటించబడిన ఆల్ఫోన్సా గురించి గాని, విద్రోహిగా ముద్రింపబడిన జెస్మె గురించి గానీ కొన్ని యింగ్లీషు పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. కాని యిప్పటి వరకు తెలుగుసాహిత్య వేదికపై ‘ఆమెన్‌’ గురించి గాని కనీసం క్రైస్తవ స్త్రీల గురించి గానీ చర్చ జరగలేదు. దానికి కారణం మైనార్టీలలో మైనార్టీలుగా క్రైస్తవ మహిళలు మిగిలిపోవడమే కావచ్చు.
‘ఆమెన్‌’ పరిచయం
ఈ పుస్తకంలో మత సైద్దాంతికత, వాటికి నిబద్దులైన వ్యక్తులకు మధ్య జరిగే సంఘర్షణ, అధికారిక పితృస్వామ్య ధోరణులు, విద్యార్హతలతో వచ్చే అంతరాల వివక్ష, సేవాభావంతో పేదల విద్యకై ప్రారంభించబడిన విద్యా సంస్థలలో డొనేషన్లు, కాపిటేషన్‌ ఫీజులను ప్రవేశపెట్టి పేదలకు విద్యావకాశాలు మృగ్యం చేసి, కార్పోరేటు ధోరణిలో పయనించడం, చర్చి చేసిన బ్రహ్మచర్య ప్రమాణాలకు విరుద్ధంగా సిస్టర్లు, ఫాదర్లు సన్యాసిని, సన్యాసుల మధ్య శారీరక సంబంధాలు, నన్స్‌ మధ్య సంబంధాలు, వాటిని చూసి చూడనట్టు ప్రవర్తించే అధికారగణం, విద్యార్థుల మధ్య ఉండవలసిన స్వేచ్ఛాయుత స్నేహపూరిత సంబంధాలు, వారి వికాసానికి, సమాజాన్ని అర్థం చేసుకోవటానికి తోడ్పడే సాహిత్యం, సినిమాలు, మనుష్యుల మధ్య ఉండే రాగద్వేషాలు యిలా ఎన్నో అంశాలను ‘ఆమెన్‌’ మన ముందు ఆవిష్కరించి, మనల్ని ఆలోచన సంద్రంలో ముంచెత్తుతుంది.
ఎప్పుడూ సరదాగా నవ్వుతూ, అందరితో కలివిడిగా వుండే జెస్మె కాథలిక్‌ మతాన్ని నిబద్దతతో ఆచరించే కుటుంబం నుంచి వచ్చింది. ఆమె పి.యు.సి. చదువు తర్వాత సన్యాసినిగా మారటానికి ‘కార్మెల్‌ మదర్‌’ మఠంలో చేరుతుంది. కేరళలో క్రీ.శ. ఒకటవ శతాబ్దంలోనే ప్రవేశించిన క్రైస్తవ మతం అప్పటికే వేళ్ళూనికొని ఉంది. ఆ కుటుంబాలలో దేవుని సేవకు బిడ్డలు అంకితం కావడం అసాధారణం కాకపోయినప్పటికీ, జెస్మె దగ్గర బంధువులలో అప్పటి వరకు ఎవరూ సన్యాసినిగా మారలేదు. అందుకే చిన్నప్పటి నుంచి తనలోనే దాచుకున్న కోరికను జెస్మె బయట పెట్టినప్పుడు వారు ఆశ్చర్యపోతారు. కాని ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత ఎట్టి పరిస్థితిలోనూ కాన్వెంటు గడప దాటి రాకూడదని జీవితాన్ని తుది వరకు అక్కడే గడపాలని ఆశీర్వదించి పంపుతారు.
మఠంలో శిక్షణకు చేరిన జెస్మెకు చాలా విషయాలు విస్మయాన్ని కల్గిస్తాయి. అప్పుడప్పుడే చర్చిలో (1974లో) ప్రార్థనలు మలయాళంలో వుండాలన్న  ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఉద్యమం ఊపందకుంటుంటే పాత తరానికి చెందిన వారు సంప్రదాయవాదులు వ్యతిరేకించడాన్ని, ప్రజాస్వామ్యానికి భిన్నంగా వుందని భావిస్తుంది. అప్పట్నుంచి ప్రతి విషయాన్ని జీసస్‌ బోధనల వెలుగులో విశ్లేషించడానికి ప్రయత్నిస్తుంది. అలాగే జెస్మెకు యూనివర్శిటీలో సెకండు ర్యాంకు వస్తే వేరొకరి కోసం మూడవ ర్యాంకులోకి నెట్టబడటాన్ని కూడా ‘విధేయత’లో భాగంగా ఒప్పుకున్నా మనసులో సంఘర్షణకు బీజం పడుతుంది. శిక్షణా కాలంలో టీచరుగా పనిచేస్తున్న సందర్భంలో పనిచేయని కాలానికి కూడా సంతకాలు పెట్టించుకోవడాన్ని నిరసించినా మళ్ళీ విధేయతలో భాగంగానే చేస్తుంది. కాబోయే సన్యాసినుల మధ్య ఏర్పడుతున్న శారీరక సంబంధాలు కంగారు పుట్టిస్తుంటే అంతకంటే మించి పాప సంకీర్తన (కన్‌ఫెషన్‌) సమయంలో ‘పవిత్ర ముద్దు’ పేరిట చేసే వెకిలి చేష్టలు ఇతరులను ఎలా యిబ్బందికి గురి చేస్తాయో మర్యాద పూర్వకంగానే ఫాదరుకు తెలియజేస్తుంది. పాశ్చాత్య సంస్కృతిలో వారి వాతావరణానికి అనుగుణమైన సంప్రదాయాలు భారతదేశంలో అనుసరించవలసిన అవసరం లేదని తెగేసి చెబుతుంది. 1970కు ముందు అట్టడుగు వర్గానికి చెందిన విద్యార్హతలు తక్కువగా వున్నవారిని వంటపనిలోనో, తోటపనిలోనో, పార్లర్‌లో పనిచేయించే సంస్కృతి తగ్గినా వాటి ఛాయలు వర్గాల్ని చదువు, డబ్బు, రంగు హోదాలతో నిర్ణయించడం పోలేదంటుంది ‘జెస్మె’.
మఠంలో యిరువురు సన్యాసినులు సన్నిహితులుగా మెలిగితే వారి మధ్య వుండే అనుబంధాన్ని ‘స్పెషల్‌ లవ్‌’గా ముద్ర వేసేవారు. ఇది పలుకుబడి కలిగిన సిస్టర్ల విషయమైతే బయటకు పొక్కదంటుంది జెస్మె. అందుకు తోటి వారితో జాగ్రత్తగా వుండటానికి ప్రయత్నిస్తుంది. దేనిని అయితే తప్పించుకుందామని ప్రయత్నిస్తుందో అదే సిస్టర్‌ ‘బెమీ’ రూపంలో ఎదురుపడుతుంది. అదే కాలేజీలో పని చేస్తున్న సిస్టర్‌ ప్రేమలేఖలు రాసి యిబ్బంది పెడుతుంటే తట్టుకోలేని జెస్మె తన పైన ఉన్న సిస్టర్లకు తెలియచేసినా ఫలితం లేకపోతుంది. పైగా ఆమె కోపానికి గురి కాకుండా సహకరించవలసిందిగా కోరినప్పుడు ఆశ్చర్యపోతుంది. ఇక గత్యంతరం లేని పరిస్థితులలో ‘బెమీ’కు లొంగిపోతుంది. ఇదే విషయాన్ని పాప సంకీర్తనలో ఫాదర్‌కు చెప్పినా ప్రయోజనముండదు. ఆ మఠాధిపతి (మదర్‌ ప్రొవిన్షియల్‌) సహాయంతో ఆ సిస్టరును బదిలీ చేయిస్తుంది. అలా స్పెషల్‌ లవ్‌ అంకం నుంచి బయటపడుతుంది జెస్మె.
నిధుల దుర్వినియోగం, రిజర్వుడు సీట్ల మినహాయింపు, మోసం, ‘అత్యధిక’ ఫీజుల వసూలు జెస్మెను బాధించినా, భయంతో మౌనంగా వుండిపోతుంది తప్ప ప్రతిఘటించ లేకపోతుంది. కాలేజీలో సైతం కుళ్ళు రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఎదురుతిరిగిన విద్యార్థుల ప్రజాస్వామిక ఆకాంక్షలను అర్థం చేసుకోకపోగా, వారిని నక్సలైట్లుగానో, మార్క్సిస్టులు గానో చిత్రిస్తూ వారికి కాండక్టు సర్టిఫికెట్లు కూడా యివ్వకుండా యాజమాన్యం యిబ్బంది పెడుతుంది. కాలేజిలో జరిగే ఎన్నికలలో సైతం మతాన్ని అడ్డుపెట్టుకొని ప్రగతిశీల విద్యార్థినులను గెలవకుండా చెయ్యడానికి సిస్టర్‌ జెస్మెను పావుగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తే నిరాకరిస్తుంది. ఫలితంగా విద్యార్థుల ప్రతికూల (వారి దృష్టిలో) చర్యలకు జెస్మెను బాధ్యులను చేస్తారు.
మఠానికి సంబంధించిన విధివిధానాలు ఏర్పాటుచేసే కమిటీలో జూనియర్‌ సిస్టర్‌గా జెస్మెకు స్థానం లభిస్తుంది. ఆ కమిటీ ద్వారా వారి మఠంలో అనేక సంస్కరణలను ప్రతిపాదిద్దామనుకున్న జెస్మెకు నిరాశే మిగులుతుంది. మఠంలోని వారు క్రీస్తు బోధనలను మరచి పాలనాధికారానికే ప్రాధాన్యతను ఇవ్వటాన్ని నిరసిస్తుంది. అలాగే తప్పు చేసిన సిస్టర్లను శిక్షించేకంటే ప్రేమతోనే వారిని మార్చాలని ప్రతిపాదిస్తుంది. వీటికి సభ ఆమోదం తెలిపినా ఆ తర్వాత కమిటీలో జెస్మెకు స్థానం లభించదు. కారణం సిస్టర్లు నమ్రతతతో ఉండాలే కాని, పదిమందిలో జూనియర్‌ సిస్టర్లు మాట్లాడటాన్ని యిష్టపడరు’ అంటుంది.
చర్చి ఆదేశాలను పాటించే వారికి కావలసింది ‘గుడ్డి విధేయత’ కాదని ‘బాధ్యతాయుతమైన విధేయత’ అవసరమంటుంది. చర్చిలో క్రైస్తవ బోధనలకు వ్యతిరేకంగా పాశ్చాత్య ధోరణలు రుద్దబడ్డాయంటుంది. పెళ్ళికాని సెయింట్‌ పాల్‌ క్రీస్తు అనుచరుడైనప్పటికీ స్త్రీల పట్ల వివక్షత, వ్యతిరేకత చూపించి చర్చిలలో స్త్రీలకు ప్రాముఖ్యత లేకుండా చేసాడని వాపోతుంది. స్త్రీలు సువార్తను బోధించడం గాని, పురుషులపై పెత్తనం కల్గివుండకూడదని,  స్త్రీలు కేవలం పిల్లలను కనడం ద్వారానే రక్షింపబడతారన్న పాతవాదనను తిరస్కరిస్తుంది. పాల్‌ గొప్ప అధ్యాత్మిక శిష్యుడైనప్పటికీ అతని దృక్పథాన్ని సమర్థించలేకపోతుంది. యిదే చర్చి ఫాదర్లకు మాత్రం స్వేచ్ఛని యిచ్చి స్త్రీలపై ‘అణచివేత’ ఈనాటికి కొనసాగిస్తుంది. సిస్టర్లు సినిమాలు కూడా చూడకూడదని ఆంక్షలు వున్నాయి కానీ ఫాదర్లు మాత్రం పండుగలకు పబ్బాలకు తమ మత సంబంధిత దుస్తులను కూడా వేసుకోకుండా వెళ్ళే స్వేచ్ఛ (వివక్ష) ను ప్రశ్నిస్తుంది. ప్రిన్సిపాల్‌గా విద్యార్థులకు కూడా మగపిల్లలతో సమానంగా స్వేచ్ఛ వుండాలని కోరుతుంది. ఇంతే కాకుండా విద్యార్ధుల సలహాలతో సంప్రదింపులతో వారి సమస్యలను పరిష్కరించాలనుకుంటుంది, అలాగే చేస్తుంది కూడా! ఇది పనిభారం పెంచడంతో కూడినదిగాను, సంప్రదాయ ధోరణులకు వ్యతిరేకంగా వుండటం చేత మేనేజిమెంటుకు రుచించదు.
అనేక సినిమాల గురించి ముఖ్యంగా మలయాళ సినిమాల గురించి చక్కటి అవగాహనతో చర్చిస్తుంది. లాక్‌జోన్‌ నిర్మించిన ‘అచ్చమ్‌ రంగష వాడు కథవెషన్‌’ (టి.వి. చంద్రన) చాకోలేట్‌, నిరకు, వేదబ్రహ్మం యిలా ఎన్నో సినిమాలను వాటి కథాంశాలను మనకు పరిచయం చేయటానికి ప్రయత్నం చేస్తుంది జెస్మె. సమాజంలోని సమస్యలకు మానవ సంబంధాలకు అద్దం పట్టే సినిమా మీడియాను ప్రశంసిస్తుంది. ప్రశంసించడమే కాదు కాన్వెంటులో జరిగే ప్రార్థనలలో వాటి కథాంశాలను భాగం చేస్తుంది. విద్యార్ధులు వ్రాసిన కథాంశంతో ‘పెరల్స్‌ ఇన్‌ ఎ లోన్లీ ఐల్యాండ్‌’ అనే డాక్యుమెంటరీని (మలయాళంలో) నిర్మిస్తుంది. దానిని మలయాళ మనోరమ దినపత్రిక, ఎయిర్‌ ఇండియాల నుంచి అవార్డు లభిస్తుంది. ఈ సినిమాలు వ్యాపార ధోరణి నుంచి విడివడి ఉన్నత విలువలను సమాజానికి అందిస్తాయి. ఇతర కాలేజిలలో సినిమాను చూసిన తరువాత విద్యార్ధుల చర్చలు పెడుతుంది. సినిమాలు చూడటానికి విద్యార్ధులను సిద్దపరచటం, చర్చలు అవసరమంటుంది జెస్మె. ‘లెస్బెయనిజమ్‌’ మీద, లైంగికత స్వేచ్ఛ యిలాంటి ఎన్నో అంశాలు చర్చిస్తే తప్ప వాటిని తప్పుడు ధోరణిలో విద్యార్థులు అర్థం చేసుకునే అవకాశముందంటుంది. లేకపోతే ఒక విధంగా ఆ సంబంధాలకు ఆమోదం తెలిపినట్టే అంటుంది. జెస్మె చేసిన ప్రతిపాదన కూడా ఆమెపై వ్యతిరేక ప్రచారాన్కి ఉపయోగపడతాయి. జెస్మెకు సినిమాలే కాదు సాహిత్యం కూడా చాలా యిష్టం. దక్షిణ కేరళలోనే కాలేజి స్థాయిలో ‘పుస్తక ప్రదర్శన’ ను ఏర్పాటు చేస్తుంది. దాని ప్రారంభం ఒక వీధి పుస్తక విక్రేత ద్వారా చేయిస్తుంది. దానిలో భాగంగానే కవిత్వపఠనం, పత్రికా ప్రదర్శన కేరళ రాష్ట్ర అవతరణ సందర్భంగా కేరళ చరిత్రను పరిచయం చేస్తుంది. ఒక సెక్స్‌ వర్కర్‌ ఆత్మకథ పుస్తకావిష్కరణ చేయాల్సిందిగా ప్రచురణ కర్తలు జెస్మెను కోరుతారు. ఆ పుస్తక రచయిత నళిని జమీల పరిచయం వున్నప్పటికీ కాన్వెంటు యంత్రాంగానికి భయపడి మానుకున్నా, మీడియా వ్యక్తుల ప్రోత్సాహంతో ఒప్పుకుంటుంది. అనుకున్నట్టుగానే అభ్యంతరాలు వెల్లువ ముంచెత్తుతుంది. అయినా సరే క్రీస్తు పాపులను రక్షించడానికి వచ్చాడని, తాను అదే బాటలో పయనిస్తానని ధైర్యంగా చెబుతుంది. ఏ స్త్రీ కూడా ‘వేశ్య’ గా మారాలని కోరుకోదని పరిస్థితులు, సమాజం ఆమెను అలా తయారుచేస్తుందని వాదిస్తుంది. ఇలా యిన్ని వైవిధ్యాల మధ్య తన 25 ఏళ్ళ సన్యాసి జీవితం గడిచిపోతుంది.
సిస్టర్‌ జెస్మె విధానాలు నచ్చని మఠ యాజమాన్యం ఆమెను బలిపీఠం ఎక్కించడానికి రంగం సిద్దం చేస్తుండగా ఒక ఆకాశరామన్న ఉత్తరం వస్తుంది. అందులో జెస్మె ”బ్లూ ఫిలింలు” చూడటమే కాకుండా, ‘స్త్రీ పనివారి’ కి కూడా చూపించి వాళ్ళతో అనైతిక సంబంధాలు కలిగివుంది. కాబట్టి ఆమెను ప్రిన్సిపాల్‌ పదవి నుంచి తప్పించాలన్నది సారాంశం. తనమీద విశ్వాసం లేకుండా ఆ లేఖను నమ్మి ప్రశ్నిస్తున్న వారికి సమాధానం చెప్పకుండా వచ్చేస్తుంది. అక్కడితో ఆగకుండా ఆ ఆకాశరామన్న ఉత్తరం గురించి కాన్వెంటులో ప్రతి ఒక్కర్ని యాజమాన్యం ప్రశ్నిస్తుంటే ప్రిన్సిపాల్‌గా తనకు ఏమి విలువనిస్తారని వాపోతుంది. ఇలాంటి సమస్యే హాస్టల్‌ విద్యార్థినులకు, సిబ్బందికి వచ్చినప్పుడు తాను ఎంత సున్నితంగా వ్యవహరించిందో గుర్తుకు వచ్చి కన్నీటిపర్యంతమవుతుంది. ఈ క్లిష్ట పరిస్థితులలో తోటి సిబ్బంది, విద్యార్థినులు జెస్మెకు తోడుగా వుంటారు.
ఒక ఆకాశరామన్న ఉత్తరం వలన తను శిక్షింపబడేకంటే సన్యాసి జీవితాన్నే వదులుకోవాలని మొదటిసారిగా అనుకుంటుంది. అదే విషయాన్ని కాన్వెంటు ప్రతినిధులకు తెలుపుతుంది. కాని వారు ఒప్పుకోరు. ఒక డాక్టరును కలవమని సలహా యిస్తారు. ఆరోగ్య రక్షణ పేరిట మానసిక చికిత్సను గోప్యంగా తనకే తెలియకుండా చెయ్యాలనుకున్న వారి ఎత్తుగడలను జెస్మె అడ్డుకుంటుంది. తనని తొలగించుకోవటానికి ‘పిచ్చి’ అనే ముద్రవేసి, వైద్యాన్ని అందించాలనే వారి కుట్రను త్రిప్పికొడుతుంది. కాని అనుక్షణం వారిభయంతో టేబుల్‌ మీద తన ప్లేటులోని ఆహారం కూడా తీసుకోకుండా కిచెన్‌ నుంచి తెప్పించుకోవడమో, అందరికోసం వుంచిన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటుంది. ఆఖరుకు జెస్మె కుటుంబాన్ని కూడా మభ్య పెట్టి, మానసిక చికిత్స చేయించటానికి ప్రయత్నిస్తారు మఠ యాజమాన్యం. కుటుంబసభ్యులు ఆమోదించకపోగా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తారు. కాన్వెంటు బయట స్నేహితుల అండతో కుటుంబ సభ్యుల ద్వారా కొన్ని సర్టిఫికెట్లతో కట్టుకున్న బట్టలతో ఎవరూ లేని సమయంలో బయట పడుతుంది జెస్మె.
ఇంటికి వచ్చిన జెస్మెకు ఘనస్వాగతం ఏమీ లభించదు. కుటుంబ సభ్యులలోని కొందరు సూటిపోటి మాటలతో బాధిస్తారు. జెస్మె ఎవరితోనైనా లేచిపోయివుంటే లేదా పెళ్ళి చేసుకొని వుంటే తమ గుండెల మీది బరువు తగ్గేదని నిందిస్తారు. చచ్చిపోతే కొన్ని రోజుల మర్చిపోయేవాళ్ళమంటారు. మళ్ళీ మధ్యవర్తుల ద్వారా కాన్వెంటుకు పంపటానికి ప్రయత్నాలు జరుగుతాయి. క్రైస్తవ మతాధికారి బిషప్‌ కూడా తిరిగి వచ్చిన జెస్మెను సాదరంగా ఆహ్వానించినట్టు కనపడినా యాజమాన్య విధివిధానాలకు అడ్డుపడకూడదని కాలేజికి సెలవు పెట్టించి ప్రార్థనా సెంటరుకు పంపుతారు. జెస్మె అక్కడకు చేరకముందే ఆమె పిచ్చిదన్న వార్తలు అక్కడ ప్రచారమవుతాయి. యిక్కడే ఏసుక్రీస్తు తనతో సంభాషించినట్టు తన 33 సంవత్సరాల ‘నాలుగ్గోడల’ సన్యాసిని జీవితానికి స్వస్తిపలికి విశాల ప్రపంచంలోకి నిజమైన క్రైస్తవ విలువలకోసం బ్రతకడానికి ప్రభువు ఆదేశించాడని చెబుతుంది. అక్కడ్నుంచి రెండు సంవత్సరాలు ఢిల్లీకి శెలవు మీద వెళ్ళిపోతుంది. అదే సమయంలో విద్యారంగంలో కృషికి జిల్లా అవార్డు పొందుతుంది. ఢిల్లీలో యువతకోసం పనిచెయ్యడానికి వెళ్ళినా కవిత్వంతో బంధాల్ని తెంచుకోదు. పోయిట్రీ క్లబ్‌లో కవితలు చదువుతుంటుంది. అప్పటివరకు సంప్రదాయ సన్యాసిని వస్త్రధారణను యిష్టం లేకపోయినా వదులుకుంటుంది. అక్కడ కార్యక్రమాలు ఎప్పటికీ మొదలు కాకపోయేటప్పటికి, యిక కేరళకు వెనుదిరిగి తన సన్యాసి జీవితానికి స్వస్తి పలకాలనుకుని, కుటుంబానికి తెలియజేస్తుంది. కాని వారు ఎటువంటి సహాయాన్ని ఆశించవద్దంటారు. అందుకే మీడియా స్నేహితుల సహాయంతో కేరళ చేరుకొని తన ఉద్ధేశాన్ని మఠానికి తెలియచేస్తుంది. తనపైన జరుగుతున్న అసత్యప్రచారాల దృష్ట్యా మీడియా ముందు వాస్తవాలను వెల్లడిస్తుంది. జెస్మెకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తామన్న మఠయాజమాన్యం పెదవి విప్పదు. పదవీ విరమణ చేసిన డబ్బుతోనే బ్రతుకు కొనసాగిస్తుంది. మొదట్లో క్రైస్తవేతరులు, విద్యార్థులు జెస్మెను అభినందిస్తారు. తరువాత ఎంతోమంది ఫాదర్లు, సిస్టర్లు రహస్యంగా మద్దతు తెలుపుతారు. అందుకే ప్రజల మధ్య, స్నేహితులు, శ్రేయోభిలాషుల మధ్య క్రీస్తు విలువలతో బ్రతకటానికి విశాల ప్రపంచంలోకి వచ్చానని ఎంతో ఆత్మవిశ్వాసంతో ప్రకటిస్తుంది సిస్టర్‌ జెస్మె.
సమీక్ష
జెస్మె ఆత్మకథలో అనేక పార్శ్వాలు ఉన్నా ప్రధానంగా మనల్ని ప్రభావితం చేసేవి మతం పునాదిలో వుండే పితృస్వామ్య భావజాలం, వ్యవస్థీకృత రూపంలో నన్స్‌పై జరుగుతున్న హింస, చర్చిలో క్రీస్తు బోధనలకు వ్యతిరేకంగా జరుగుతున్న వివక్ష. ప్రపంచీకరణ నేపథ్యంలో విలువల పతనం, పోటీ తత్వంతో క్రైస్తవ సంస్థలు, మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు రాకపోవడం మనల్ని కలిచి వేస్తాయి.
క్రీస్తు సిద్దాంతాలకు తిలోదకాలు యిచ్చి చర్చి సెయింట్‌ పాల్‌ దారిలో మహిళా సాధికారత సాధ్యం కాదనుకుంటే మరి ఎలా సాధ్యం? తనపై మానసిక చికిత్సకు ఒత్తిడి రాకపోయినట్లయితే క్రైస్తవ భక్తురాలిగా కాన్వెంటులోనే వుండిపోయేదాన్నంటుంది. అంటే కొన్ని మార్పులు ప్రవేశపెడితే మరింత మానవీయతతో కాన్వెంటులో వుండిపోవాలను కుంటుంది. కాని చర్చి ప్రతినిధి అయిన ఫాజోమ్‌ కల్లిత 25 శాతం క్రైస్తవ సన్యాసినులు అసంతృప్తితో ఉంటే మౌళికంగా క్రైస్తవ మఠాలు (నన్నరీ) అనే వ్యవస్థ ఉండాలని కోరుకుంటుందా? అలాగే మలబార్‌ చర్చికు సంబంధించిన మతాధిపతి ప్రకారం నన్స్‌ చాలా దయనీయమైన పరిస్థితులలో సాధికారతకు ఆమడ దూరంలో ఉన్నారు. కాబట్టి వారికి స్వేచ్ఛ అవసరమను కుంటుందా? విద్య, ఆత్మాభిమానం, స్వయంశక్తి మీద నమ్మకం ఉన్న జెస్మె స్త్రీ పురుషుల మధ్య ఉన్న అసమ సాంఘీకస్థాయి, వేళ్ళూనుకున్న వివక్ష, స్త్రీల హక్కుల్ని, స్వాతంత్య్రాన్ని, జ్ఞానాన్ని, శక్తిని హరించివేయగలిగిన పురుషాధిపత్యం మానవీయ సంబంధాలను పటాపంచలం చేస్తుందని నమ్ముతుందా? మఠాధిపతులు, ఫాదర్లు రకరకాలుగా సిస్టర్లను సేవకులుగా ఉపయోగించుకుంటూ, వారిని బలిపశువులుగా మార్చే పితృస్వామిక ధోరణులకు ఆలవాలమైన మతం గురించి మాట్లాడకపోవడం మనల్ని అయోమయంలో పడవేస్తుంది. వ్యవస్థ మారకుండా స్వేచ్ఛ సాధ్యం అనుకోవడం శోచనీయం కాదా?
 క్రైస్తవ విలువలు, స్త్రీని భోగవస్తువుగా చూపే వ్యాపార పితృస్వామిక లక్షణాలు అవి మానవ సంబంధాలపై చేసే పెత్తనం ఎన్ని రూపాలుగా, విధాలుగా వుంటాయో, వాటివల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలు ఎలా వుంటాయో జెస్మె జీవిత గాథ వివరించినా వాటి పరిష్కారాలు, మూలాలు ఎక్కడున్నాయో వివరించడంలో విఫలం అవుతుంది. ఉద్యమాల ఫలితంగా సాధించుకుంటున్న ‘లైంగిక హక్కుల్ని’, బ్రహ్మచర్యం బరువుగా మారి తమ సహజ ప్రేరణలను చర్చి నియంత్రిస్తుంటే ‘మౌనం’ సమాధానం కాజాలదు. ప్రతీదీ ప్రశ్నించి చర్చకు పెట్టిన ‘జెస్మె’ ప్రజాస్వామిక యుగానికి అనుగుణంగా ‘సన్యాసి’ ని జీవితం ఎలా వుండాలో నిర్వచించలేకపోయింది.
ఎప్పుడూ జెస్మె ఆత్మరక్షణలో పడిపోవడమే కాని వాటిని అంతర్గత చర్చకు పెట్టగలగడం కాని అలా వివక్షతకు గురవుతున్న వారిని ఒక త్రాటి మీదకు తేగలిగిన దాఖలాలు లేవు. మత చట్రంలో స్వేచ్ఛకు, హక్కులకు అవకాశమే లేదు. అసమానత, నియంతృత్వ రూపం పునాదిగా నిర్దేశించబడిందే మతం అయినప్పుడు స్త్రీలు ఎప్పుడో ఒకప్పుడు ఆ చట్రాన్ని బద్దలు కొట్టకమానరు. అదే జెస్మె విషయంలోనూ జరిగింది. సంస్కరించబడవలసిన మత విలువలు గురించి, అవెందుకు సంస్కరించబడాలో స్పష్టత లేకపోయినా దైనందిన జీవితంలో సాగుతున్న సంఘర్షణకు అద్దం పట్టే ‘అమెన్‌’ సంప్రదాయక చెర నుంచి స్త్రీని విడిపించాలన్న తపన మాత్రం కన్పిస్తుంది. స్త్రీలు అస్తిత్వంలో వున్న సామాజిక వ్యవస్థలో సంఘర్షిస్తూ జీవించే స్థైర్యాన్ని సంపాదించుకోవాలని జీవితానుభవం నేర్పినా కాన్వెంటు నాలుగ్గోడల మధ్య సంఘర్షణను మాత్రమే ఎత్తిచూపుతుంది. నాలుగ్గోడలను దాటిన తరువాత ‘స్త్రీ’ గా తాను ఎదుర్కొనబోయే సమస్యలపట్ల జెస్మెకు సరైన ఆలోచన వుండదు.
చర్చిలోని ఆధిపత్య ధోరణి విధేయతను గుడ్డిగా కాకుండా బాధ్యతాయుతమైన విధేయతగా మారాలన్న ప్రజాస్వామిక ఆకాంక్ష మత(ఠ)ంలో ఎప్పటికీ సాధ్యపడదు. మత నిబంధనల ప్రకారం స్త్రీ అణగద్రొక్కబడిందిగా వున్నప్పుడు క్రైస్తవ మత యాజమాన్యం ఎందుకు అంగీకరిస్తుంది! మత భావజాలం స్త్రీలను ఎదగనివ్వక పోవడానికి కారణమయినప్పుడు, మత వ్యవస్థను రూపుమాపినప్పుడే స్త్రీలకు స్వేచ్ఛా సమానత్వం ఏర్పడి ఉన్నతమైన సమాజం ఏర్పడుతుంది. సమాజంలో వుండే వివక్షకు, దోపిడీకి కారణమైన మౌళిక అంశాల పట్ల ఉదాసీనంగా వుంటే భావవాదంలో మునిగిన వారమే అవుతాం. గ్లోబలైజేషన్‌లో స్త్రీ, ఆమె అనుభవాలు ఒక సరుకుగా మారుతున్న తరుణంలో జెస్మె ఆత్మకథ ఒక మౌళికమైన మార్పుకు, మానవ సంబంధాల ఉన్నతీకరణకు తోడ్పడాలని కోరుకుందాం.
జెస్మె చేసే పోరాటం వ్యక్తిగతం కాకపోయినా దానికి కొన్ని పరిధులు ఉన్నాయి. సహజంగా దానికి కొన్ని బలహీనతలు ఉన్నాయి. చరిత్రలో చూసినట్టయితే ‘ప్రొటెస్టెంటీసమ్‌’ (16 శతాబ్దపు అపుడున్న చర్చికు వ్యతిరేకంగా పోరాడిన వర్గం) అలా ఉత్పన్నమయింది. అలా చర్చకు వ్యతిరేకించిన వర్గం ఈ రోజుకి ‘స్త్రీ’కి సమానత్వాన్ని యివ్వలేకపోయింది. ఆధిపత్యాలు, అణచివేతలు మామూలే! అయినా, దాని నిర్ణీత లక్ష్యం ‘స్వేచ్ఛా, స్వాతంత్య్రం’ కాదు. మతంలో ఇప్పటికి వర్గ, కుల, లింగ, ప్రాంత, భాషా పీడనకు అవకాశం ఉంది. మతపరమైన పాలకవర్గాలు తమ అధికారం చేజారిపోతున్నపుడు కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టవచ్చు. మతం ఎప్పుడూ రాజ్యానికి అనుబంధంగానే వుంది. రాజ్యం యొక్క పోకడలకు అది నిలువుటెత్తు అద్దం. ‘సంక్షేమ’ ఫోజు నుంచి సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఏజెంటుగా మారిన రాజ్యం చేతిలో ఈ రోజున మతం కీలు బొమ్మయ్యింది. అన్ని రకాల పీడనలకు, దోపిడీకి, అణిచివేతకు గురవుతున్న వర్గాలు సమిష్టిగా పోరాడినప్పుడే చివరి లక్ష్యాన్ని చేరుకుంటాం. ప్రజాస్వామిక ఆకాంక్షలతో మన ఉద్యమం మతతత్వ వ్యతిరేక పోరాటంగా రూపుదిద్దుకున్నప్పుడే జెస్మె లాంటి ఎంతోమంది సిస్టర్లకు, స్త్రీలకు విముక్తి. జెస్మె ఆలోచనా దృక్పథంలో గందరగోళం, పరస్పరమైన భిన్నమైన అభిప్రాయాలు, సమగ్ర తాత్వికత లోపించడం చూస్తాం. దానికి మతం యొక్క అణిచివేతే కారణం. మతం అణచివేతకు ఆయుధంగా ఉపయోగపడ్తుంది. కాబట్టి దాని రూపురేఖలు మార్చే సంస్కరణవాదం కంటే ఆ వ్యవస్థను బద్దలు కొట్టి, స్త్రీ స్వేచ్ఛను మన్నించి ప్రజాభీష్టానికి అద్దం పట్టే సమాజ ఆవిష్కరణకు అందరం సిద్దం కావాలి.
మారుతున్న సమాజంలో ”సిస్టర్లు”, స్త్రీలు పితృస్వామిక చట్రాన్ని ప్రశ్నించి, దానికి మూలమైన మత పునాదులను కదిల్చే లేదా కూల్చటానికి విప్లవీకరించే తత్వాన్ని అలవరచుకొని సలక్షణమైన వ్యక్తిత్వంతో ఎవరి యుద్దం వారు చేసుకుంటూ సంఘటితంగా కదిలి రావటానికి ”ఆమె”న్‌ ను ఆయుధంగా మలుద్దాం!
ఆమెన్‌!
(ఆమెన్‌ అంటే ”అట్లే అగుగాక” అని అర్థం.)
Share

కిరస్తానీ స్త్రీ – సాహిత్యం – తాత్వికత

Posted By on April 30, 2010
నక్కా హేమా వెంకట్రావ
భారతదేశంలో ‘కిరస్తానీ స్త్రీ’ అంటే ఎవరు? ఒక మదర్‌, మదర్‌ థెరిస్సా – తన మొత్తం జీవితాన్ని పేద ప్రజల సేవ కోసమే అంకితం చేసిన మాతృమూర్తి. ఆమె భారత రత్న! నోబుల్‌ శాంతి బహుమతి విజేత!! ‘సిస్టర్‌’- ఒక అక్కలా, చెల్లిలా  రోగులికి సేవ చేసే ప్రేమ మూర్తి. ఒక టీచర్‌- చదువుల్ని సరళంగా మలిచి బోధించే గురువు. స్టెనో, పి.ఏ.-క్రైస్తవ విద్యాసంస్థల ద్వారా నేర్చుకున్న చదువుతో కంపెనీల్లో తనదే పై చేయి. ఒక సన్యాసిని- తను నమ్మిన మతాన్ని మనసా-వాచా ప్రచారం చేస్తూ, సేవలో పునీతురాలయ్యే నిస్వార్థ జీవి. ఆంధ్రప్రదేశ్‌లో దళిత ఉద్యమానికి ఊపిరిపోసిన ఓ ఆలిశామ్మ. ఇలా క్రైస్తవ స్త్రీకి ఈ సమాజంలో రూపాలు ఎన్నెన్నో! ఐతే ఆమె తప్పిపోయిన కుమార్తె కూడా! హిందూ కుల సమాజంలో అణచివేతకు గురై దళితులు క్రైస్తవంలో చేరి తిరిగి కొంత చదువు నేర్వగానే అంతరాలు సమసి పోయాయి అనుకునే భ్రమలో బ్రాహ్మణ భావజాలంతో అగ్రకులాల వారితో జతకట్టాలని కొందరు ఇష్టపడినా, అగ్రవర్ణ సమాజం దళితుల్ని, వారి మూలాల్ని ఎప్పుడూ అవహేళన చేస్తూనే వుంటుంది. ఈ విధంగా పరాయీకరణకు గురై తప్పిపోయిన కుమారుడి కథ వుంటుంది. తప్పిపోయిన కుమారుడి పట్ల ఎక్కువ ప్రేమను చూపించాల్సిన అవసరాన్ని ఆ కథ నొక్కి చెపుతుంది.
‘మదర్‌ థెరిస్సా లాంటి వారినేమో గొప్ప మనిషి’ అని పొగుడుతారు. కానీ కిరస్తానీ స్త్రీల పట్ల ఈ సమాజంలో ఒక చిన్న ‘చూపు’ అలానే కొనసాగుతుంది. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ కారణాల్ని విశ్లేషిస్తే గానీ ఈ స్త్రీని సమగ్రంగా అర్థం చేసుకోలేము. మొదటగా సామాజిక కారణాల్ని చూద్దాం. దేశంలోకి మొట్టమొదటిగా 1వ శతాబ్దంలోనే యేసుక్రీస్తు శిష్యుడైన థామస్‌ ద్వారా కేరళ రాష్ట్రంలోనే క్రైస్తవం ప్రవేశించింది. అది అంచెలంచెలుగా ఎదిగి ఆ తర్వాత బ్రిటిష్‌ సామ్రాజ్య విస్తరణలో భాగంగా మరింతగా విస్తరించింది. దేశంలో అన్ని ప్రధాన నగరాల్లో చర్చీలు, క్రిస్టియన్‌ ఆసుపత్రులు, విద్యాలయాలు స్థాపించబడ్డాయి. క్రైస్తవ మతం ఫ్యూడల్‌ అయినప్పటికీ, భారతదేశంలో కొన్ని మూఢాచారాలకి వ్యతిరేకంగా లిబరల్‌ భావాలకి వెన్నుదన్నుగా నిలబడింది. స్త్రీ విద్య, సంస్కరణలకు, పెద్దపీట వేసింది.
జాషువా చెప్పిన నాలుగు పడగల హైందవ రాజు భారత సమాజాన్ని కులంపేరులో కాటేసి, వర్గాలుగా చీల్చివేసాడు. ఈ సామాజిక సమీకరణలో సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ దోపిడికి గురైన వారే దళితులు. కుల నిచ్చెన మెట్ల సమాజంలో ఊరికి దూరంగా విసిరివేయబడిన వారు. వేదాలు చదివితే నాలుక కోసివేయమని, వింటే వేడి సీసం కరిగించి పోయాలని, చూస్తే కనుగుడ్లు పీకి వేయాలని సూత్రీకరించింది అగ్రవర్ణ బ్రాహ్మణ సమాజం. తాము పూజించే గోవును తింటారు కాబట్టి దళితుల్ని బహిష్కరించారు. దళితుల అడుగులు నేలమీద కనపడకుండా నిర్భందాన్ని విధించారు. అందుకే దళితులు మొలకు తాటాకు కట్టుకొని, తమ అడుగు జాడలు కనపడకుండా, తుడిచి వేసే విధంగా నడిచేవారు. అగ్రవర్ణ స్త్రీలతో వీరికి సంపర్కం నిషేధం. ఆలయ ప్రవేశాన్ని కూడా నిరాకరించారు. దళితుల్ని దళితులుగా వుంచడానికి వేదాలు పనికి వచ్చాయే తప్ప వారి విముక్తి కోసం కాదు.
ఇలాంటి సమాజంలో హిందూ మతంలోని అగ్రకుల దురహంకారుల వల్ల వెలివేయబడ్డ దళితులు, శూద్రుల్ని క్రైస్తవం గుండెలకు హత్తుకుంది. వారిని జంతువుల కంటే హీనంగా చూస్తూ దేవాలయాలకు, విద్యాలయాలకు దూరంగా వుంచిన హిందూ బ్రాహ్మణ భావజాలానికి భిన్నంగా క్రైస్తవ మిషనరీలు ”మీరు కూడా దేవుని బిడ్డలే” అని ప్రార్థనా మందిరాలలో ప్రవేశం కల్పించారు. హిందూ మతంలో వెలివేయబడ్డ కులాలకు చెందిన వారే ఎక్కువగా క్రైస్తవ మతంలో చేరి, అగ్రకులాల వారి ఎదురుగా తల యెత్తుకొని తిరగటం, వారి స్త్రీల కంటే స్వేచ్ఛగా ఉండగలగటం వారికి కంటగింపవుతుంది. దాంతో వారిని తక్కువ చేసి మాట్లాడటం, బరితెగించిన వారని అనటం మామూలు అయింది. ఎక్కడ తమ స్త్రీలు వారి ప్రభావంలోకి వెళ్ళిపోతారేమోనని భయంతో ‘చైతన్యాన్ని’ అవహేళన చెయ్యటం కూడా వారికి అలవాటుగా మారింది. ‘స్త్రీ’ అంటే వారికున్న అభిప్రాయాలకు వారి వ్యాఖ్యలే దర్పణం.
అగ్రకులాల్లో క్రైస్తవులు లేరా అనే ప్రశ్న రావచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో క్రైస్తవ దళితులతో పోలిస్తే వీరు చాలా తక్కువ సంఖ్యలో వున్నారు. వీరికి రాజకీయ ఆర్థిక పునాదులు సమాజంలో బలంగా వున్నాయి. ఒకవేళ రాజకీయ ఆర్థిక దోపిడికి గురైన దళితుల్లాగా సాంఘిక దోపిడికి గురైన వారు కాదు. వీరు సాధారణంగా హిందూ సమాజంలోని తమ తోటి కులాల సహవాసంతోనే బతుకుతారు. మతం మారిననూ, చర్చిలలో తమ కుల ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తారు. వీరు క్రైస్తవం పుచ్చుకున్న, కులం యొక్క తోకలను కత్తిరించడానికి చాలా మంది ఇష్టపడరు కూడా. అలా తమ ”సోషల్‌ స్టేటస్‌”ను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే అగ్రకుల క్రైస్తవ స్త్రీలు, క్రైస్తవులుగా అవమానాలకి గురికారా అంటే వీరు దళిత క్రైస్తవ స్త్రీలు అవమానాలకు గురి అయినంతగా కారు, అందుకు కారణం కులం యొక్క రొచ్చులో క్రైస్తవం కూడా కొట్టుమిట్టాడుతుంది. కాబట్టే కారంచేడు, చుండూరు లాంటి దుర్ఘటనలన్నీ దళిత క్రైస్తవ వాడలపైనే జరిగాయి కానీ, ఏ రెడ్డి, కమ్మ క్రైస్తవుల పైన జరిగినట్లు ఆంధ్ర చరిత్రలో లేదు. సాధారణంగా క్రైస్తవాన్ని దళితులే ఎక్కువగా తీసుకోవడం వలన కులం తెలియనంత వరకు క్రైస్తవుల్ని దళితులుగా గుర్తించడం జరుగుతుంది ఆంధ్ర సమాజంలో. ఇప్పటి క్రైస్తవం కులం కబంధ హస్తాల్లోనే వుంది. క్రైస్తవంలో వున్న శాఖలన్నీ ఏదో ఒక కులాధిపత్యంతోనే నడుస్తున్నాయి. అగ్రకులం వారు దళిత క్రైస్తవులతో బంధుత్వాల్ని కలుపుకోరు. కాబట్టి దళిత క్రైస్తవ స్త్రీలు ఇటు కులపరంగాను, మత పరంగాను దోపిడికి గురవుతున్నారు.
క్రైస్తవ స్త్రీలు ఉద్యోగాలు చెయ్యటం, ఈ సమాజంలో ప్రధాన స్రవంతికి సుతారాము ఇష్టం వుండదు. ఐతే వారు ఆ విధంగానే ఆర్థికంగా నిలదొక్కుకోగలిగారు. ఇంక చర్చి నుంచి అందే ఆర్థిక సహాయం కూడా కొందరి స్త్రీల జీవితాల్లో మార్పును తీసుకువచ్చింది. హిందూ మతం ఆచారాలు పండుగలకు చేసే అనవసర వ్యయాలు తగ్గిపోయాయి. ఆర్థికంగా క్రైస్తవ కుటుంబాలు ఓ మేర స్థిరపడ్డాయి. క్రైస్తవ విద్యాలయాల్లో ఉన్నత విద్య చదివిన స్త్రీలు పెద్ద పెద్ద ఉద్యోగాల్లోకి వెళ్లి, ఆర్థిక సాధికరతను పొందారు. అది కూడా కుళ్ళుకునే విషయమైపోయింది. దానికి వారికి ”విలువలు లేవు” అని చెవులు కొరుక్కొంటూ మొత్తానికి క్రిస్టియన్‌ స్త్రీలు అంటే ‘నైతికత ఉండదు’ అనే ముద్ర వేస్తున్నారు.
ఇక రాజకీయ కారణాల్ని చూస్తే, క్రైస్తవ మతం మొదటి దశాబ్దంలో వచ్చిన సామ్రాజ్య వలస వాద కారణంగా మన దేశంలోని వెనుకబాటు తనాన్ని, కుల వర్గ వివక్షను ఆసరా చేసుకొని వేళ్లూనుకొంది. బ్రిటిష్‌ పాలకులున్నంత కాలం క్రైస్తవ మతం అప్రకటిత అధికార మతంగానే విరాజిల్లింది. అప్పుడు హిందూ అగ్ర కుల మత వాదులు అధికారం కోసం పాలక వర్గాలతో మిలాఖతై, క్రైస్తవ మతం పట్ల వ్యతిరేకతను ప్రదర్శించలేకపోయారు. ఎప్పుడైతే వారికి స్వాతంత్య్రం ప్రకటించబడిందో అప్పటి నుండి తమ నిజ స్వరూపాన్ని బయటపెట్టుకుంటూ మైనార్టీలపై దాడులకు పూనుకున్నారు.
దళిత బహుజన వర్గానికి చెందిన క్రైస్తవ స్త్రీలు ఈ నేలా నింగికి వారసులైనప్పటికీ ఆత్మాభిమానం చంపుకొని జై శ్రీరాం అంటే గానీ మనలేని స్థితిలో అభద్రతతో ప్రాణభయంతో బ్రతికే పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నారు. నిజమైన హిందువులంటే మైనార్టీ వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారు. ఈ ఫాసిస్టు శక్తులకు అండగా రాజ్యం భరోసా ఇస్తుంది. వీరు వివిధ జాతుల మధ్య ఉన్న శత్రురహిత ప్రజా వైరుధ్యాలను, శత్రు పూరిత వైరుధ్యాలుగా మారుస్తున్నారు. హిందూ మతం నుండి స్వయంగా బయటపడే పరిస్థితిని కప్పిపుచ్చుకోవడానికి నెపాన్ని ఇతర మతాలపైకి నెట్టి పక్కదారి పట్టించి వారిపై దాడులు చేస్తున్నారు. హిందూ జాతీయ వాదాన్ని ఎక్కుబెట్టి క్రైస్తవులను దేశద్రోహులుగా చిత్రిస్తున్నారు. క్రైస్తవుల తిండి కట్టు బొట్టు మీద నిషేధం విదించడానికి పూనుకొంటున్నారు. దీనికి ఒరిస్సా కంధమాల్‌లో జరిగిన సంఘటనలే ప్రత్యక్ష సాక్ష్యాలు. సెక్యులర్‌ ప్రజాస్వామ్యం ప్రకటించిన మత స్వేచ్ఛను అణచివేయడానికి తమ మనుగడ కోసం మతాన్ని జాతిగా మన ధర్మ సంస్కృతిని భారత సంస్కృతిగా చేసి క్రైస్తవ స్త్రీల మీద దాడి చేస్తున్నారు. మత మార్పిడిల వలనే క్రైస్తవుల మీద దాడులని నిర్లజ్జగా ఆర్‌.ఎస్‌.ఎస్‌. దాని అనుబంధ సంఘాలు ప్రకటిస్తున్నాయి. నిజానికి ఏ మతానికి చెందని దళిత, ఆదీవాసీలు క్రైస్తవాన్ని నిరసనగా స్వీకరించారు. ఇది మత మార్పిడి కాదు. వారిని తిరిగి హిందూమతంలోకి మార్చడమే మత మార్పిడి అవుతుంది.
దాడుల్ని తిప్పి కొట్టేందుకు మిగిలిన మతాల వారికి ఉన్న ప్రత్యేక రాజకీయ పార్టీల వెనుదన్ను కూడా ఈ మతానికి లేదు. జనాభా లెక్కల్లో 3 శాతం మించకపోయినా దళితులలో 90 శాతం మైనార్టీలు వుండగా వీరి మద్దతును తీసుకొని ఒక రాజకీయ శక్తిగా ఎదగలేకపోయారు. అధికార పార్టీలతో లాబీయింగు ద్వారా గట్టెక్కాలనే దృక్పథమే తప్ప ‘తిరగబడు’ తత్వం లేకపోవటం వలన దాడులకు బలైపోవటం జరుగుతుంది. గ్రాహం స్టీన్‌ హంతకులను క్షమించే గ్రాహంస్కీన్‌ భార్యని మనం అభినందించాలో, ఆక్షేపించాలో అర్థం గాదు. రాజకీయంగా తన పునాదుల్ని నిర్మించుకోలేకపోతే క్రైస్తవ స్త్రీల ఎప్పుడూ ప్రశ్నార్థకమే.
దళితులు క్రైస్తవాన్ని స్వీకరించిన తరువాత అప్పటి వరకు సామాజిక బహిష్కరణకు గురైన దళితులు మతం తెచ్చిన కొత్త సమస్యను ఎత్తుకోవలసి వచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 సమానత్వపు హక్కును ప్రతిపాదించినా, ఆర్టికల్‌ 15 ప్రకారం మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం లేదా వాటిలో ఏదైనా కారణాల చేత ప్రభుత్వం ఏ వ్యక్తి పట్ల వివక్ష చూపరాదని పేర్కొన్నా, 25వ అధికరణ ఈ దేశంలో ప్రతిపౌరునికి మత విశ్వాసాలను కల్గివుండి ప్రచారం చేసుకొనే హక్కు యిచ్చినా 1950 రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా క్రైస్తవ మతంలో చేరిన దళితులకు అన్ని రకాల రిజర్వేషన్లు రద్దు చేసింది. యిది ఒక విధంగా రాజ్యం సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కబడిన అంటరాని వారిపై హిందూ మతాన్ని రుద్దడమే ధ్యేయంగా పెట్టుకోవడమే. కానీ హిందూ ఆచార వ్యవహారాలు, నివాసాల నుండి వెలివేయబడ్డ దళితులు హిందూ మతాన్ని ఎప్పుడో వెలివేశారు. భారతదేశంలోని 7 లక్షల గ్రామాల్లో దళితుల చర్చిలు కనపడతాయి. అంటే క్రైస్తవం వారిని ఎంతగా గుండెలకు హత్తుకుందో తెలుస్తుంది. అసలే కడుపేదరికంలో మగ్గుతున్న దళిత మహిళలు ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి లెక్కల్లో హిందువులుగా మిగిలిపోయిన వారెందరో!
చర్చి – భావజాలం
ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించాలనే చర్చి భావజాలం క్రైస్తవుల్ని కర్తవ్య విముఖుల్ని చేస్తుంది. దానివల్ల క్రైస్తవ స్త్రీల భద్రతకి మరింత ముప్పు ఏర్పడింది. విద్యా వైద్య, సేవా రంగాలలో పనిచేస్తున్న అనేక మంది మహిళలు క్రైస్తవులు కావడం, వారి పట్ల సమాజం చిన్న చూపు, మొత్తంగా స్త్రీలందరిపై ఆ ప్రభావం వుంటుంది. స్త్రీలపై నానాటికీ జరుగుతున్న దాడులు, అత్యాచారాల్ని దీనిలో భాగంగానే చూడాలి. కాబట్టి క్రైస్తవ స్త్రీల పట్ల వివిక్షతను మొత్తంగా చైతన్యవంతమయిన స్త్రీ సమూహాలు, సమాజాలు ఎప్పటికప్పుడూ ఖండిస్తూ, ఆరోగ్యవంతమయిన సమాజాన్ని నిర్మించే ప్రయత్నంలో కలిసి నడవాలి.
క్రైస్తవం ప్రకారం దైనందిన ప్రార్థనలలో ఉపవాసాలు మొదలగు అంశాలలో స్త్రీ పురుషులకు ఒకే రకమైన నిబంధనలు లేవు. ఎక్కువగా స్త్రీలే మతాచారాలను మోసే వారుగా తయారు చేయబడుతున్నారు. క్రైస్తవ స్త్రీల మీద పురుషులకు సర్వహక్కులు ఆధిపత్యం ఉన్నట్టు బైబిల్‌ చెబుతుంది. స్త్రీ పురుషుని ప్రక్కటెముకల నుంచి సృష్టించబడింది. క్రీస్తు అనంతరం వచ్చిన శిష్యుల అధికారిక పితృస్వామ్య భావజాలం చర్చిలో అడుగడుగునా ప్రతిఫలిస్తాయి. ఉదా|| పౌలు అనే క్రీస్తు అనుచరుడు కొరంతీయులకు లేఖ వ్రాస్తు, జారులైనను విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం కలవారైనను, పురుష సంయోగులైనను లోభులైనను త్రాగుబోతులైనను దేవుని రాజ్యమునకు వారసుల కానేరరు. : (కొరంధియుల 6 : 9-10) ఇక్కడ ఆడంగితనం అంటే అర్థం చేసుకోగలం. ”నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రము తగదు. వేశ్యతో కలిసికొనువాడు దానితో ఏకదేహమై యున్నాడని మీరెరుగరా?! (1 కొరంధియులు 6:16).
స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. (1 కొరంథేయులు 7:1) ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసికొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. పురుషుడైతే దేవుని పోలికలు మహిమకై యున్నాడు కనుక తల మీద ముసుగు వేసికొనగూడదు కాని స్త్రీ పురుషుని మహిమై యున్నది. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి గలిగెనే గాని పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టించబడలేదు. (1 కొరంధియులు 11:7-10) పురుషునికి స్త్రీకి మధ్య ఆపాదించబడిన విభిన్న విలువలను మనం యిక్కడ గుర్తిస్తాం. స్త్రీలు సంఘములలో మౌనంగా వుండవలెను. వారు లోబడియుండవలసిందే గాని మాట్లాడానికి వారికి సెలవు లేదు. ఇలా ధర్మశాస్త్రం చెపుతుంది. వారు ఏమైనా నేర్చుకోవలసి వస్తే, ఇంట తమ భర్తల్ని అడగవలెను. సంఘములో స్త్రీ మాట్లాడటం అవమానం. (1 కొరంధియులు 14:34-36) స్త్రీలారా! ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి వుండండి. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడి వుండవలెను. ప్రతి పురుషుడు తన వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్యయైతే తన భర్తయందు భయము కలిగియుండునట్లు చూచుకొనవలెను. (ఎఫెసెయులు 5 అధ్యాయం 23:33)
స్త్రీలు అణుకువయు, స్వస్థ బుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనా గాని, బంగారంతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనను, అలంకరించుకొనక, దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలు సత్క్రియలచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనంగా వుండవలసినదేకానీ, ఉపదేశించుటకైనను, పురుషునిమీద అధికారం చేయుటకైనను ఆమెకు వీలు లేదు. మొదట ఆదాము తర్వాత అవ్వ సృష్టించబడ్డారు కదా! ఆదాము మోసగించబడలేదు కాని స్త్రీ మోసగింపబడి అపరాధములో పడెను. అయినను వారు సుబుద్ధి కలిగి, విశ్వాస ప్రేమ, పరిశుద్ధతలయందు నిలకడగా వుండిన యెడల శిశు ప్రసూతి ద్వారా రక్షింపబడుదురు. (1తిమోతు 2:9-15) యివి అప్పటి క్రీస్తు శిష్యగణం యొక్క పితృస్వామ్య విలువలకు అద్దం పడుతుంది. క్రమేణా క్రైస్తవమతం అంతర్గత సంక్షోభానికి గురై కాథలిక్కులుగాను, ప్రొటెస్టెంటులుగాను విడిపోయారు. అప్పటి సనాతన వ్యవస్థీకృత చర్చిను ప్రశ్నించిన ప్రొటెస్టెంటులు కూడా క్రమేణా స్త్రీల విషయంలో పితృస్వామ్య ధోరణులను వదిలిపెట్టలేదు. అక్కడకూడా దేవుని ఆరాధనలో పురుషునికి సమానంగా స్త్రీలు ప్రొటెస్టెంటు చర్చిలో కనిపించినా వారిని వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. యిక పితృస్వామిక భావజాలం యింకా వారి జీవితాలలోని అన్ని కోణాలను అత్యంత ప్రభావితం చేస్తూ స్త్రీలను రెండవ తరగతి పౌరురాలిగా గణించబడుతుంది. దళిత క్రైస్తవులలో స్త్రీలు సమాజంలోనే కాక చర్చిలలో కూడా వివక్షకు గురౌతున్నారు. ఇతర వర్గానికి చెందినవారిపై కూడా హిందూ బ్రాహ్మణ పితృస్వామ్య ధోరణీ వీడలేదు. ఈ ధోరణులు సాహిత్యంలో ఎలా ప్రతిఫలిస్తున్నాయో చూద్దాం.
సాహిత్యం
సమాజంలో అంతర్గతంగాను, బహిర్గతంగాను మతం యొక్క పితృస్వామిక విలువలతో క్రైస్తవ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల స్పందించే రచనలే క్రైస్తవ సాహిత్యం. క్రైస్తవ స్త్రీల ఆలోచనలను, భావోద్వేగాలను, సంస్కృతిని వివిధ సాహిత్య ప్రక్రియలలో వెలికి తీసుకురావలసిన ఆవశ్యకత నేడు ఎంతైనా వుంది. ఐతే ఇప్పటివరకు క్రైస్తవ సాహిత్యం ఒక అస్థిత్వాన్ని, గొంతుకను సాహిత్య రంగంలో పదిలపరచలేకపోయింది. మనలో మనం రచయిత్రుల ఉమ్మడి వేదిక చేపట్టిన వివిధ అస్థిత్వాల సాహిత్య చర్చా సందర్భము ఆ లక్ష్య సాధనను మరొకసారి గుర్తు చేసింది. అసలు క్రైస్తవ సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలంటే క్రైస్తవ స్త్రీల జీవితాలను వాటి మూలాలను స్పృశించాల్సిందే!
అన్ని మతాల మాదిరిగానే క్రైస్తవ మతం స్త్రీని రెండో తరగతి పౌరురాలిగానే చూస్తుంది. కాకపోతే మతంలోని కొన్ని వెసులుబాట్ల వలన స్త్రీ సామాజికంగా ఆర్థికంగా ఓ మేరకు నిలదొక్కుకోగలిగింది. కానీ వ్యక్తిగతంగా చూస్తే పితృస్వామ్య భావజాలం వల్ల ఎన్నో అవమానాలను భరిస్తూనే వుంది. ఐతే వాటిని విశ్లేషిస్తూ సాహిత్యం పెద్దగా రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. స్త్రీ జీవన చిత్రాన్ని ఆవిష్కరించడంలో వెనకబడిపోయింది. ఆస్పత్రులు, విద్యాలయాలు మెజార్టీ వర్గానికి సేవలందించడానికి పనికి వచ్చాయి కాని మతాన్ని, సంస్కృతిని గౌరవించలేకపోయారు. ఈ సేవలు అందించటానికి వాటి పదచక్రాల క్రింద నలుగుతున్న స్త్రీల ఆవేదనలు ఆకాంక్షలు ఎవరికి పట్టలేదు. అందరి స్త్రీలలాగానే క్రైస్తవ స్త్రీలకు సమస్యలు, అణచివేత, పురుషాధిపత్య ధోరణులు, ఆర్థిక అసమానతలు, సామాజిక కట్టుబాట్లు, మనసు, శరీరం, ఒంటరితనం వుంటాయన్న వాస్తవాన్ని యితర సాహితీవేత్తలు గుర్తించలేకపోయారు. వంటగది, పడగ్గది రాజకీయాలు స్త్రీల జీవితాలను ఎలా నిర్భందించాయో వారి కలల్ని, స్వేచ్ఛని ఎలా ఛిద్రం చేసాయో వాటి గురించి వ్యక్తీకరణ జరుగలేదు.
దానికి కారణం మత సంకెళ్ళ గట్టిదనమే అని చెప్పుకోవాలి. హిందూ స్త్రీలు, ముస్లిం స్త్రీలు వారి జీవితాన్ని ఆవిష్కరిస్తూ ఎంతో సాహిత్యాన్ని సృష్టించారు. క్రైస్తవ స్త్రీల నుండి అలాంటి సృజన కావలసినంత ఉదృతంగా రాలేదు. దానికి కారణం ఇక్కడి భావజాల స్రవంతిలో భాగం కాకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. ఈ సాహిత్యానికి ఆదరణ లేకపోవడం కూడా మరొక కారణం. ప్రధానంగా రచయితలు/రచయిత్రులు జనకర సాహిత్యాన్ని రాశారు తప్ప ప్రత్యేక అస్థిత్వ సాహిత్యాన్ని రాయలేదు. క్రైస్తవ మతాధికారులు టీవిలు, ఇతర సాహిత్యాన్ని వీరికి దూరంగా ఉంచడం వల్ల జరిగిన పరిణామం లేదా హిందూ మత గ్రంథాలకి ఇక్కడి ఆచారాలకు అవినాభావ సంబంధముండటం, బైబిలులో చెప్పిన గాథలకు, ఇక్కడ సంస్కృతికి ఎలాంటి సంబంధం లేకపోవటం వల్ల కూడా కావచ్చు.
మత ప్రాతిపదికగా సాహిత్య సృజన ఎలా జరుగుతుంది? మతాన్ని సమాజానికి వ్యక్తులకు మధ్య తలెత్తే వైరుధ్యాల వలన సాహిత్యం పుట్టొచ్చు.
ఒక ఉద్యమంలా వస్తున్న ముస్లిం సాహిత్యాన్ని పరిశీలించి నట్లయితే క్రైస్తవ సాహిత్యం ఎలా రావాలో ఒక అవగాహనకు రావచ్చు. ముస్లిం రచయిత్రి షాజహానా స్త్రీలను చీకటి గదిలో వుంచే వరదా పద్దతి, దానిలో ఊపిరి ఆడని జీవితాల గురించి, స్వేచ్ఛ కోసం, చదువుల కోసం తన్లాడే మనస్తత్వాన్ని, అధిక సంతానవంతులుగా అవహేళనకు గురవుతున్న వారి మనోభావాల గురించి ప్రస్తావించారు. మైనార్టీకి చెందిన ఖదీరు, యాకూబ్‌, స్కైబాబా, ఖాజా మొహియిద్దీన్‌ లాంటి రచయితలు తమ రచనలలో ముస్లిం సమాజంలోని అట్టడుగు వర్గంగా చూడబడిన దూదేకుల వారి జీవితం ఎలా అవహేళనకు గురవుతున్నారో రాస్తూ కుల ప్రాతిపదికన కాకుండా సాటి మనిషిగా గుర్తించాలని కోరుతారు. ముస్లిములు అయినంత మాత్రాన వారిని దేశద్రోహులుగా ముద్రవేయడాన్ని గర్హిస్తూ గళాన్ని విప్పారు. స్త్రీల జీవితాలను చీకటి మయం చేస్తున్న మతంలోని ప్రతికూలాంశాల్ని సంస్కరించాలని పిలుపునిచ్చారు.
ఏమతమైనా మానవీయ విలువలకు పట్టం కట్టి సమానత ప్రాతిపదికగా ఉండాలి. ఆ విలువలే సాహిత్యంలో ప్రతిఫలించాలి. ఖాదీర మొహియుద్దీన్‌  రాసిన ‘పుట్టుమచ్చ’, షాజహానా’నఖాబ్‌’ వివిధ రచయిత్రుల సంకలనమైన గుజరాత్‌ గాయం లాంటి ముస్లిం వర్గ స్త్రీని వర్ణించటాన్ని ఉదహరించవచ్చు. ప్రేమను వ్యక్తీకరించటానికి గజల్‌, ఖవ్వాలి లాంటి  ప్రత్యేక సాహిత్య ప్రక్రియలను సృష్టించారు. కాని క్రైస్తవ మతం పునాది కలిగినప్పటికీ వారి భావావేశాలకు అలాంటి ప్రక్రియలను సాహిత్యంలో పెంపొందించలేకపోయారు.
క్రైస్తవ మహిళా రచయిత్రుల కథలలో, నవలలో క్రైస్తవ మహిళలు మతంతోపాటు కులపరమైన అణిచివేతను ఎలా ఎదుర్కొంటున్నారో చెప్పిన కథలు లెక్కకు తక్కువైనా ఎన్నదగినవే. మతం మారినా అంటరానితనం వెంటాడడాన్ని కథారూపంగా మార్చిన వైనం, పేదరికాన్ని విశ్లేషించిన రచయిత్రులు తమ కొన్ని ప్రశ్నలను సూటిగానే సమాజానికి సంధించారు. క్రైస్తవ మహిళలు సమాజం నుంచి వివక్షను, అసమానతను ఎలా ఎదుర్కొంటున్నారో దానికి కారణమైన పితృస్వామిక ధోరణులను ఎత్తిపట్టారు. అలాగే ఆధిపత్య కులాలే కాకుండా తమ తోటి దళిత మహిళలు సైతం అదే హిందూ మత భావజాలాన్ని క్రైస్తవ స్త్రీల పట్ల కలిగివుండటం బాధిస్తుందని శ్రీమతి పుట్ల హేమలత వాపోయారు. హిందూమతం నుంచి దాడిని, వేధింపులను చీత్కారాలను ఎదుర్కొంటూనే అంతర్గతంగా చర్చి ధోరణులను నిరసించారు. ఏది ఏమైనప్పటికీ క్రైస్తవమహిళల జీవితానికి సంబంధించిన కథలు, నవలలు విస్తృతంగా రాలేదన్నది వాస్తవం. రాకపోవడం విషాదం!
క్రైస్తవ కీర్తనలు, పాటలు కవితలు, ఈ సాహిత్యమంతా కూడా భక్తి సాహిత్యమే. వీటిలో స్త్రీల జీవితాల్ని ప్రభావితం చేస్తున్న అనుకూల ప్రతికూల అంశాల్ని విశ్లేషించలేకపోవడం దురదృష్టకరం. ఈ సాహిత్యం కూడా ఆ మత సంబంధిత పత్రికలలో వచ్చాయే తప్ప యితర పత్రికల్లో కాదు. మెజార్టీవర్గ భక్తి స్రవంతి గీతాల్లోకి చేరలేకపోయాయి. ఎక్కడో ఒక్కరిద్దరు రచయిత్రులు తప్ప క్రైస్తవ మహిళల సామాజిక, ఆర్థిక రాజకీయ సాంస్కృతిక అంశాలు అంతగా వెలికిరాలేదు. క్రైస్తవుల మీద జరుగుతున్న ధాష్టికాల గాయం గేయంగా మారలేదు. మతం యొక్క పరిధులు దాటి విముక్తి గీతంగా మారి సామాజిక ఉద్యమ గొంతుకలో భాగం కాలేకపోయింది.
వ్యాసరచనలో యిపుడిపుడే సామాజిక అంశాల మీద దృష్టిని పెడుతున్న రచయిత్రులు క్రీస్తు సమభావనను, స్త్రీ అభ్యుదయాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని కాంక్షించారు. వాస్తవానికి ఈ ప్రక్రియలలో విస్తరిస్తున్న ఫాసిస్టు దాడుల చర్యలు, సామ్రాజ్యవాద ప్రపంచీకరణలో ఉపాధి భూమిని పోగొట్టుకున్న వారి సామాజిక, రాజకీయార్ధిక కోణాలు, సంస్కృతి సంప్రదాయాలపై దాడి గురించి కొన్ని వ్యాసాలు మాత్రమే ప్రచురణకు నోచుకున్నాయి. కాని పరిశోధనాత్మక వ్యాసాలు రాలేకపోయాయి. వినోదిని, జల్లి ఇందిర, ఝాన్సీ కె.వి. కుమారి, పుట్ల హేమలత,  స్వరూప రాణి, హేమా వెంకట్రావ్‌, విల్సన్‌, కళ్యాణ్‌ రావ్‌, లాంటి కొంతమంది తప్ప క్రైస్తవ సాహిత్య కథలు-వెతలు హిందూ సంస్కృతిలో ఆచార వ్యవహారాల్లోనే రచింపబడ్డాయి. వీరి జీవిత వాస్తవికతను దుఃఖం హిందూ భావజాలంలో భాగంగానే కొట్టుకుపోయాయి. ఒక క్రైస్తవరాలుగా కాక తమను తాము భారతీయులుగా ఐడెంటిఫై చేసుకుంటూ కదిలారు. సాహిత్యాన్ని ఉపరితలం నుంచి కాక మతం మూలాల్లోకి వెళ్లి, వాటి సామాజిక సాంస్కృతిక అంశాలను శోధించి వ్రాసినది అతి తక్కువ.
రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా 2009 నవంబరు 15, 16 తేదీలలో మహిళా అధ్యయన కేంద్రం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మరియు ‘మనలో మనం’ రచయిత్రుల ఉమ్మడి వేదిక సంయుక్త ఆధ్వర్యంలో కోస్తాంధ్ర క్రైస్తవ మైనార్టీ సాహిత్యంపై సదస్సు జరిగింది. సాహిత్యాన్ని ఒక సముద్రంగా భావిస్తే వివిధ అస్థిత్వాల కలయికే దాని ఉనికి. ఈ  చారిత్రక సదస్సుకు  నక్కా హేమా వెంకట్రావ్‌ అధ్యక్షత వహించారు.  నక్కా హేమా వెంకట్రావు క్రైస్తవ తాత్వికత-క్రైస్తవ స్త్రీల సాహిత్యంపై,  పుట్ల హేమలత కథలు, నవలలపై, డాక్టరు బండారు జ్యోతి, స్వరూప రాణి కవిత్వం, కీర్తనలపై  కొలుకలూరి స్వరూపరాణి వ్యాసంపై కుమారి లావణ్య సామెతలపై పత్ర సమర్పణ చేయగా  ఝాన్సీ కె.వి. కుమారి క్రైస్తవ సాహిత్య విహంగ వీక్షణం చేయగా  విజయభాను వందన సమర్పణ చేశారు. విరామ సమయంలో రచయిత్రుల మధ్య క్రైస్తవం సాహిత్యంలోని వివిధ అంశాలు చర్చకు వచ్చాయి. చర్చిలలోని అనుకూల ప్రగతిశీలక అంశాలను క్రైస్తవ తాత్వికతలోని భాగంగా చూడటం జరిగింది. ఈ సదస్సులో తొలిసారిగా క్రైస్తవ రచయిత్రులు బయటకు వచ్చి తమ సాహిత్యాన్ని పరిచయం చేయడమే కాకుండా తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పారు.
ధిక్కార స్వరాలు
”ఆమెన్‌” ఆత్మకథా రచయిత్రి సిస్టర్‌ జెస్మె (కేరళ) అభిప్రాయంలో జెరూసలెం నుంచి పశ్చిమ దేశాలకు విస్తరించిన క్రైస్తవం పాశ్చాత్యుల భావాలకు, ఆలోచనా దృక్పథాలకు ఆలవాలమైపోయిందని వాపోతుంది. క్రీస్తు అనుచరుడయిన సెయింట్‌పాల్‌ స్త్రీల అస్తిత్వానికే ముప్పు వాటిల్లే విధంగా బోధించాడని ఈ ధోరణి యిప్పటికీ చర్చిలో కొనసాగుతుందని అంటుంది. కేథలిక్‌ చర్చిలో ఫాదర్‌ జాయ్‌ కల్లియత సి.ఎమ్‌.ఐ. దృష్టిలో 25% సన్యాసినులు అసంతృప్తులతో ఉన్నారని అంటాడు. కార్డినల్‌ వర్కీ వైతాయుత సన్యాసినులను జాలికొలిపే పరిస్థితుల నుండి స్వేచ్ఛగా వదిలిపెట్టవలసిన అవసరాన్ని గురించి ప్రస్తావిస్తాడు. ఈ స్త్రీలకు సాధికారిత లభించలేదని, ఫాదర్ల భావోద్వేగాలకు బలైపోతున్నారని, వీరు బానిసలుగా చూడబడుతున్నారని చెప్పాడు. క్రీస్తు సమానతకు ఆలవాలం కావలసిన కాన్వెంటులలో అసమానతలు, వర్గం, కులం బట్టి స్థాయిలు నిర్ణయింపబడతాయంటుంది సిస్టర్‌ జెస్మె. ఈ అంతర్గత జీవన పోరాటాలు ఏవి సాహిత్యంలో చోటుచేసుకోలేకపోయాయి. ఒకవేళ సిస్టర్‌ జెస్మె లాంటి వారు ప్రయత్నించినా అది అధికార చర్చికు వ్యతిరేకం కాబట్టి ఆమెను జీసస్‌ను అప్పగించిన ‘జుదా’ తో పోల్చడం, ఫాదర్లలాగ మఠజీవితంలో స్వేచ్ఛా సమానత్వ నిబంధనలు కోరినందుకు గాను ఆమె ఒక ‘వేశ్యగా’ ఒక చర్చి వర్గం చేత ముద్ర వేయబడుతుంది. అందుకే చాలా మంది మఠానికి చెందిన స్త్రీలు తమ వ్యక్తిగత భావాలను అణగద్రొక్కి పురుషాధిపత్య చర్చి భావజాలాన్ని కాపాడే కాపరులుగా, పావులుగా మిగిలిపోయారే తప్ప వాటికి అక్షర రూపాన్ని యివ్వలేకపోయారు.
శ్రామిక వర్గానికి చెందిన దళిత బహుజనులు క్రైస్తవ మహిళల ఆవేదనల గురించి చరిత్రలో గాని సాహిత్యంలోగానీ చెప్పింది చాలా తక్కువ. కారంచేడు అలిశమ్మ లాంటి దళిత క్రైస్తవ స్త్రీల పోరాటాలు ప్రాచుర్యంలోకి రాలేకపోయాయి.
హిందూ మతోన్మాద దాడులు – మీడియా పాత్ర
”మత పీడన అంతా నిజ జీవితంలోని పీడనే. అదే సమయంలో నిజ జీవితంలోని పీడనకు మతం ఒక నిరసన. అది హృదయం లేని ప్రపంచంలో హృదయం లాంటిది!” – మార్క్‌ ్స. యివేవీ పట్టని హిందూత్వ శక్తుల తల్వార్లకు ఒక చెంప కొడితే మరొక చెంప చూపించే క్రైస్తవ మతస్థుల తలలు తెగిపడుతున్నాయి. 1990 దశకంలో ఉత్తరప్రదేశ్‌లో క్రైస్తవ సన్యాసినులపై సామూహిక అత్యాచారం దగ్గరనుంచి కంథమాల్‌లో సిస్టర్‌ లలిత బారువ సామూహిక అత్యాచారం వరకు ఎన్ని కన్నీటిగాథలో! పెట్రోలు, యాసిడ్‌, కత్తి, త్రిశూలం లాంటి ఆయుధాలతోపాటు స్త్రీలపై రేప్‌ కూడా ఒక ప్రధాన ఆయుధమైంది. క్రైస్తవ స్త్రీల దుఃఖపు చారికలు, క్షమించే హృదయం, లౌకిక స్వప్నం, ప్రేమ ఇవన్నీ కవితా వస్తువులు కాలేకపోతున్నాయి. దేశజనాభాలో మూడు శాతంగా వున్న క్రైస్తవులపై జరిగే అఘాయిత్యాలు, అత్యాచారాలు, మారణకాండలు, మత కట్టడాల కూల్చివేతలపై మీడియా స్పందించింది తక్కువే. హిందూ మతతత్వాన్ని ప్రచారం చేయడంలో, ఒక సిద్ధాంతంగా వ్యాప్తి చేయడంలో చూపించిన అత్యుత్సాహం, క్రైస్తవులపై జరిగిన దాడులకు రాలేదు. అందుకే కంథమాల్‌లో సన్యాసినిపై జరిగిన అత్యాచారం, దాడులను స్థానిక పత్రికలు ప్రచురించకపోగా, వక్రీకరించాయి. యిక సాహిత్యంలో మైనార్టీలపైన జరిగిన దారుణాలపై, గాయాలపై క్రైస్తవ, క్రైస్తవేతర రచయిత్రులు మౌనం వహించకపోయినా, విస్తృతంగా స్పందించకలేక పోయారు. దళితగోవిందం, కళ్యాణమస్తులు లాంటి కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించి క్రైస్తవుల్ని ప్రలోభపెట్టి క్రైస్తవ ఆచారాలను, వివాహ పద్ధతులను, సంస్కృతి కట్టుబాట్లను పెకిలించి, హైందవ సంస్కృతిని రుద్దటం పట్ల లౌకికవాద సాహిత్యం స్పందించలేదు. ప్రత్యేక చట్టాల పేరిట స్త్రీలకు జరుగుతున్న అన్యాయాల జీవిత పార్శ్వాలను స్పృశించలేదు.
దిశానిర్దేశం
పోరాటాల నేపథ్యంలో క్రైస్తవ స్త్రీ అస్థిత్వ మూలాలను వెదుక్కొంటూ సాహిత్యాన్ని ఆవిష్కరించాల్సిన సందర్భాన్ని, దాని బాధ్యతలను గుర్తించవలసిన అవసరాన్ని మా భుజాలపై ఎత్తుకొంటూ ఇటు కథ, నవలా, కవిత, సాహిత్య ప్రక్రియలలో మా ముద్ర వేసుకొంటూ వచ్చే తరాలకు మా అడుగు జాడలను వదిలి వెల్లవలసిన అవసరం వుంది. సమకాలీన సాహిత్యంలో మా జీవన సంఘర్షణలకు సాహిత్యం వేదిక కాగలగాలి. నిబద్దతతో విభిన్ని అస్థిత్వాలను గౌరవించగల తోటి రచయిత్రులు మా సాహిత్య పోరాటాన్ని గుర్తించాలి. మాకు సాహిత్య స్పేస్‌ వున్నప్పుడే మా సామాజిక సంఘర్షణకు ప్రజాస్వామ్య ఆకాంక్షలకు ప్రతి రూపం కాగలిగినపుడు విభిన్న భావజాల వైరుధ్యాలలోని దొంతరలను తొలగించుకుంటూ ముందుకు పోగలం. ఏ ఒక్క అస్థిత్వాన్ని మర్చిపోయినా, ఆ మేరకు వారి ఆదర్శాలను విస్మరించినట్టే. ఆ ఖాళీ ఎపుడు సాహిత్యశాలలో నిశ్శబ్ద గీతికగా మిగిలిపోదు. ఉవ్వెత్తున ఎగసిపడే అలలా తన రూపాన్ని తీసుకుంటుంది. వర్తమానపు వారధిలా తన ప్రపంచాన్ని తాను నిర్మించుకుంటుంది.
అందుకే క్రైస్తవ అంతర్గత అసమానతలకు బలైపోతున్న క్రైస్తవ మహిళల జీవిత పార్శ్వాలను స్పృశించి విస్తృతంగా సాహిత్యాన్ని తీసుకురావాలి. హిందూ జాతీయవాదాన్ని, ఉమ్మడి సంస్కృతిని రుద్దబడే భావజాలానికి నిరసనగా సాహిత్య కెరటాలు ఎగిసిపడాలి. విస్తరిస్తున్న హిందూ మతోన్మాద చర్యలకు, రాజ్యహింసకు వ్యతిరేకంగా అక్షర సాయుధలమై నేటి రాజ్య నిరంకుశ వాదానికి వ్యతిరేకంగా పోటెత్తిన గళంగా మారి మన మైనారిటీ ఉద్యమాల సాధనకు ఆయుధాలమై సాహిత్య సాయుధలమవుదాం. భిన్న మైనారిటీ శక్తులతో స్థానిక హిందూత్వ ఫాసిస్టు దాడులను ఎదుర్కొనే క్రమంలో మరెన్నో కవితాగీతాల్ని ఐక్యతారాగంతో ఆలపించి సుసంపన్నం చేయాలి. లౌకిక భావజాలంలో సహనంతో సాహితీవనంలో విహరించగలగాలి. ఆఫ్రికన్‌, లాటిన్‌ అమెరికాలలోని క్రైస్తవ సమూహాలు సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు వ్యతిరేకంంగా తన ధిక్కార స్వరాన్ని అన్ని సాహిత్య ప్రక్రియలలో ఎలుగెత్తి చాటినట్టుగా మన రచయితలు కూడా మన దేశ సందర్భానికి తగినట్టుగా సాహిత్యరూపాన్ని యివ్వవలసిన ఆవశ్యకతను గుర్తించాలి. అంబేద్కర్‌, పూలే సిద్ధాంత ఆధారిత దళిత బహుజనుల ఉద్యమాలలోని స్ఫూర్తిని క్రైస్తవ సాహిత్యానికి అందించగలగాలి. అస్థిత్వ ఉద్యమాల చరిత్రలో క్రైస్తవ స్త్రీ ఆవిష్కరించబడాలి.
మనం మనంగా గుర్తింపబడ్డానికి మన బ్రతుకులలోని అసమానతలను సమాజం ముందు ఆవిష్కరించడానికి సాహిత్యం తొలిమెట్టు అవుతుంది. క్రైస్తవ సమాజంలో వున్న కుల వర్గ సాంస్కృతిక వైరుధ్యాలను ముందుకు తేగలగాలి. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ నేపథ్యంలో గుత్తపెట్టుబడిదారుల చేతుల్లోకి శ్రామిక వర్గానికి చెందిన వనరులు, భూమి, ఉపాధి పోయిన నేపథ్యంలో మన కథలు వెతలు కావ్యాలుగా మలుద్దాం. క్రైస్తవేతర రచయిత్రుల సహకారంతో క్రైస్తవ స్త్రీల పై జరుగుతున్న అమానుషత్వానికి అక్షరాన్ని మరింత పదునెక్కిద్దాం. దళిత క్రైస్తవ మహిళల ఆత్మగౌరవ పోరాటాన్ని, శ్రమని, వృత్తుల్ని సాహిత్యంలో ప్రతిబింబించేలా కృషి చేద్దాం. ఎలక్రానిక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియా ఎక్కువగా క్రైస్తవులను రౌడీలుగాను, గుండాలుగాను, స్త్రీలను వ్యాంపులుగాను అశ్లీలంగాను చూపిస్తున్నారు. ఈ సంస్కృతికి త్యతిరేకంగా రచయిత్రల మద్దతు కూడగడదాం. సాహిత్య భాషకున్న కులీన పితృస్వామ్య భావజాలాన్ని దాని స్వభావాన్ని ప్రశ్నిస్తూ పరిధిని విశాలం చేస్తూ, క్రైస్తవ మహిళలోని అన్ని కోణాలను ఆవిష్కరిస్తూ సమకాలీకులకు అందిద్దాం. భిన్నత్వాలను అంగీకరిస్తూనే మన ఆత్మ గౌరవ పోరాటంలో మనదైన వాదంతో ప్రత్యేకమైన మనదైన శైలితో మన స్థానాన్ని భద్రపరచుకుందాము. చరిత్ర గతిలో భాగస్వాములమవుదాం. సాహిత్య అధ్యయనంలో మాత్రమే కాకుండా సాహిత్య ప్రక్రియలో కూడా మన హృదయవాదం వినిపిద్దాం. ఏమైనప్పటికీ ఛాయాచిత్రంగా ప్రారంభమవుతున్న సాహిత్యం వస్తు నిర్ధేశికత కలిగి భావపరిపుష్టి పెంచుకొని సమగ్ర రూపాన్ని సంతరించుకుని, ప్రధాన స్రవంతిలో భాగం కావాలి. దీనికి అనువైన తాత్వికతను రూపొందించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా వుంది.
తాత్వికత
మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకొనే ప్రక్రియనే తాత్వికతగా చెప్పుకోవచ్చు. ఈ ప్రపంచాన్ని అనేక మంది తత్వవేత్తలు అనేక రకాలుగా వ్యాఖ్యానించారు. ఆ క్రమంలో ఎన్నో తాత్వికతలు పుట్టాయి. భారతదేశానికి వస్తే ఎన్నో మతాలకు, తాత్వికతలకు పుట్టినిల్లుగా వుంది. జైన బౌద్ధ మతాలు ఇక్కడ పుట్టి, అణచివేయ బడి అనేక దేశాలలో విస్తరించాయి. వాటికి ధీటుగా క్రైస్తవం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ తరువాత ఇక్కడ సమాజంలో వివక్షతల వలన అనేక అస్తిత్వాలు వెలుగులోకి వచ్చాయి. స్త్రీ వాదం దళిత వాదం ఇలాంటివే. హిందూ మతోన్మాదం, ప్రపంచీకరణ నేపథ్యంలో ఇస్తాం కూడా ముస్లిం సమాజాన్ని మిలిటెంటుగా ప్రభావితం చేస్తుంది. ఆ క్రమంలో ముస్లింవాద సాహిత్యం, ముస్లిం తాత్వికత వెలుగులోకి వచ్చాయి. ఎంతోమంది దళితులను అక్కున చేర్చుకున్న క్రైస్తవ మత తాత్వికత నేటి అవసరంగా రూపుదిద్దుకోవాలి.
క్రైస్తవం అన్నది ఒక ప్రత్యేక అస్తిత్వం. హిందూ మతోన్మాదం అక్రమ దాడులు, చర్చిలోని అంతర్గత పితృస్వామ్య భావజాలం, అగ్రవర్ణాల వివక్షత లాంటి తిరోగమన భావాల్ని తిప్పికొట్టి దళిత బహుజన స్త్రీ విముక్తికై నూతన క్రైస్తవ తాత్వికత రూపుదిద్దుకోవలసిన అవసరం ఉంది. ప్రపంచీకరణ నేపథ్యంలో చర్చిలు, సంపద భూమిని కోల్పోతున్న క్రైస్తవులు నేరుగా తమ సమూహాల్ని సరైన దిశలో తీసుకుపోవలసిన సందర్భం ఇది. భూస్వామ్య వ్యవస్థ నుంచి పెట్టుబడీదారి వ్యవస్థగా మారుతున్న క్రమంలో దానిని ప్రతిఘటించే ఏ శక్తినైనా పాలక వర్గాలు అడ్డుకుంటాయి. సహజంగానే రాజ్యహింస, క్రైస్తవుల మీద కూడా జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే సామ్రాజ్యవాద ప్రపంచీకరణ నేపథ్యంలో యువతలో హింస పెరుగుట వలన స్త్రీలపై హింస నానాటికి పెరుగుతుంది. మతం కూడా మన ప్రతిఘటనని ప్రశ్నించే తత్వాన్ని నీరు కారుస్తుంది. ఈ నేపథ్యంలో క్రైస్తవ తాత్వికత రూపుదిద్దుకోవాలి. ఐతే ఇక్కడ వివిధ వైరుద్యాలను అర్థం చేసుకొంటూ ప్రధాన వైరుధ్యంతో పోరాడుతూ మత వైరుధ్యాలను కూడా అవగాహనతో సరిదిద్దుకొని ముందుకు సాగాలి. తాత్వికతను ఆధారం చేసుకొని సమాజాన్ని అర్థం చేసుకోవడంలో ఆచరణలో సామాజిక కార్యకర్తలు, సోకాల్డ్‌ మత పరిధికి కట్టుబడి వుండవలసిన అవసరం లేదు. తాత్వికత క్రైస్తవ వ్యక్తులు, సమూహాల విముక్తికి ప్రాతిపదికత మాత్రమే కానీ, వ్యవస్థీకృత మత బోధనలను నమ్మే వాదం కాదు.
క్రీస్తు బోధనలు – తాత్వికత
యేసుక్రీస్తు అప్పటి సమాజంలో ప్రగతి శీల సైద్ధాంతిక అవగాహన కలిగిన విలక్షణమైన వ్యక్తి. అప్పటి పాత నిబంధనలను కాలరాసి, ఆనాటి సమాజానికి కావలసిన స్వేచ్ఛ, సమానత్వం ప్రాతిపదికన కొత్త నిబంధనలను బోధించి ఆచరించి, ఆంక్షలతో కూడిన రాజ్యం చేతిలో అమరుడైన వాడు. నేను మనుష్య కుమారుడినే అని స్పష్టీకరించిన వాడు.

సోంపేట-సీకాకుల పోరాట బావుటా.

Posted By on August 2, 2010
హేమా వెంక్రటావు
”నక్సల్బరీ”ని అందిపుచ్చుకున్న సీకాకులం రాష్ట్రంలో అన్ని పోరాటాల్ని కొత్త మలుపు తిప్పింది. వెంకట్రావు సత్యం, పంచాది నిర్మల, సుబ్బారావు, పాణిగ్రాహిలాంటి ఎందరో వీరులు అమరులైనారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ సోంపేట ”అభివృద్ధి” పేరుమీద జరుగుతున్న జీవన ”విధ్వాంసానికి” వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాడింది. ఆ త్యాగం వృధా పోదు.
గత దశాబ్దకాలంగా రాష్ట్రంలో సెజ్‌లు , కోస్టల్‌ కారిడార్‌లు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తమ భూముల్ని గ్రామాల్ని ప్రభుత్వం దగ్గరుండి కంపెనీలకు కట్టబెడుతుంటే తిరగ బడుతున్న జనాల మీద దారుణ మారణ కాండ జరుగుతూనే వుంది. గంగవరంలో ఒక మత్స్య కారుడు ప్రాణాలు కోల్పోయాడు. కాకినాడ సెజ్‌ వ్యతిరేక నాయకులపై అక్రమ కేసులు నడుస్తూనే ఉన్నాయి. వాన్‌పిక్‌లో అగ్గి రాజుకుంటూనే ఉంది. ఈ సందర్భంలో సోంపేట ప్రజలు తమ భూమికోసం, ”బీల” కోసం సాహసోపేతంగా పోరాడటం ప్రజాపోరాటాలకు కొండంత ధైర్యాన్నిచ్చింది. ఆ స్ఫూర్తిని నింపుకుంటూ సోంపేట పోరాటానికి బాసటగా మనమందరం నిలవాలని కోరుకుంటూ వారి బాధను తెలపడమే ఈ వ్యాసం ఉద్దేశం.
జూలై 14వ తేదీ కాల్పుల సంఘటనకు ముందు గ్రామాలకు వెళ్ళిన పోలీసులు, సాయుధ కంపెనీ గుండాలు ప్రతీ ఇంటిని సోదాచేసి ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేసారు. ముఖ్యంగా స్త్రీలను బయటకు రావద్దని, వారి పురుషుల్ని కట్టడి చేయాలని లేకపోతే తీవ్ర పరిమాణాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. విచ్చలవిడిగా ఒక పత్రికా విలేఖరి సహాయంతో గ్రామాల్లో డబ్బులు వెదజల్లారు. వీధుల్లో కవాతు చేసారు. సుమారు 1000 మంది గుండాలను చత్తీస్‌ఘడ్‌, ఒరిస్సాల నుండి అక్కడ ధర్మల్‌ విద్యుత్‌ పవర్‌ప్లాంటు నిర్మాణం చేపట్టపోతున్న నాగార్జున కనస్ట్రక్షన్‌ కంపెనీ రప్పించింది. వీరు మారణాయుధాలు ధరించి వీధులలో, గ్రామాలలో తిరుగాడుతూ ప్రజల్ని ముఖ్యంగా స్త్రీలను భయభ్రాంతులకు గురి చేస్తుంటే పర్యావరణ పరిరక్షణ సంఘ సభ్యులు కలెక్టరుకు విషయాన్ని నివేదించినా స్పందన శూన్యం. మొత్తంగా కంపెనీ తరఫున, పాలక వర్గాల పక్షాన జిల్లా పాలనా యంత్రాంగం నిలబడింది. సోంపేట ఉద్యమ నాయకత్వాన్ని అందిస్తున్న పర్యావరణ పరిరక్షణ సంఘం ప్రధాన కార్యదర్శి బీన ఢిల్లీరావు భార్యజ్ఞానేశ్వరిని నడిరోడ్డు మీద తగలరాని ప్రదేశంలో కొట్టి అవమానించారు. కొందరు స్త్రీలను వివస్త్రలను చేయడానికి ప్రయత్నించారు. సంఘ అధ్యక్షులు డా. క్రిష్టమూర్తి రిలే నిరాహార దీక్షలో కూర్చున్న స్త్రీలకు మద్ధతుగా శిబిరానికి వెళితే ఆయనతోపాటు స్త్రీలను చావగొట్టి చితకబాదారు. మరో నాయకుడు టి. రామారావు సంఘ ఉపాధ్యక్షులు ఆసుపత్రి మీద దాడి చేసి అక్కడ ఉన్న నర్సులను బెదిరించి చేయి చేసుకున్నారు. మహిళా రోగులనగలు దోచుకున్నారు. గర్భిణీ స్త్రీలను బయటకు ఈడ్చేసి బీభత్సాన్ని సృష్టిం చారు. ఇంత జరిగితే హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఒక స్త్రీ అయివుండి కూడా అది ఒక అల్లరి మూక పని అని చెప్పటం సిగ్గు చేటు. మరి యింతగా ప్రజల్ని పోరాటంలోకి నడిపించిన ఆ పరిశ్రమ ఏమిటి? స్త్రీలు నాయకత్వం వహించి ముందుండి పోలీసుల్ని, గూండాల్ని తమ భూమిలోకి రాకుండా అడ్డుకోవడానికి అవసరమైతే తమ ప్రాణాలు వదలడానికి కూడా సిద్దపడి ఆ పరిశ్రమలను ఎందుకు ఆపాలనుకుంటున్నారు.
అభివృద్ధి, పారిశ్రామీకరణ పేరిట, ఉత్తరాంధ్ర (మూడు జిల్లాల్లో) 14 ధర్మల్‌ విద్యుత్‌ప్లాంట్లు నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో శ్రీకాకుళం జిల్లా సోంపేటలో నాగార్జున కనస్ట్రక్షన్‌ కంపెనీ అనుమతి పొందింది. సోంపేట మండలంలోని గొల్లగండి, గ్రామ ప్రాంతం పరిశ్రమ ఏర్పాటుకు అనువైనదని గుర్తించింది. ఈ ప్రాంతం పురాతన రేపుల్లో ఒకటైన బారువాకు చేరువగా ఉన్న బారువ, ప్రముఖ స్వాతంత్య్ర యోధుడైన గౌతు లచ్చన్న జన్మస్థలం కూడా! 12 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2640 మెగావాట్ల సామర్ధ్యంగల పరిశ్రమను 1890 ఎకరాల భూమి అవసరమని నిర్ణయించారు. పరిశ్రమల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కోసం ఆంధ్ర ప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పోరేషన్‌ పూనుకుంది. ప్రభుత్వ పట్టా భూమికి 80000/- ప్రయివేటు వ్యక్తుల భూమికి 2 లక్షల నుండి 3.5 లక్షల వరకు ధరను ప్రకటించారు. ఇది కూడా భూమి నాణ్యత బట్టి కాకుండా వ్యక్తుల పరపతి మీద ధర ఆధారపడి ఉంటుంది. ఇప్పటివరకు ప్రభుత్వ భూమికి 970 ఎకరాలు ప్రయివేటు వ్యక్తుల నుంచి 560 ఎకరాలు నయానో భయానో సేకరించారు. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.నిర్మాణ ప్రదేశంలో ”బీ” అని స్థానికులు, పిల్చుకునే చిత్తడి భూములున్నాయి. ఏడాది పొడవునా వీటిలో నీరుంటుంది. మత్స్యకారులు వీటిలో చేపలు వేట చేస్తారు. రైతులు వీటి ఆధారంగా రెండు సీజనుల్లో వరి పండిస్తారు. ఈ ప్రదేశంలో నిర్మాణం చేపడితే వర్షాధారిత బీలు, జలాశయాలు ఎండిపోతాయి. దీనివలన వ్యవసాయానికి, చేపలు వేటకి జీవ వైవిధ్యానికి విఘాతం కలుగుతుంది. ఈ ప్రదేశంలో 118 రకాల పక్షులు, అంతరించిపోతున్న అరుదైన జంతువుల నాశనం అవుతుంది.
ఈ ప్రాంతం అంతా మరో కోనసీమగా భావించే ”ఉద్ధానం”లో భాగం బొగ్గు దిగుమతికి జెట్టీని సముద్రంలో నిర్మిస్తారు. కాని కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ నిబంధనల ప్రకారం సముద్రానికి 500 మీటర్లు లోపు ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ఈ నిబంధనకు వ్యతిరేకంగానే కంపెనీ చర్యలు చేపడుతుంది. ఈ పరిశ్రమల వలన గంటకు 228 క్యూబిక్‌ మీటర్ల వ్యర్ధ జలాల విడుదల వలన చేపల వేటకు సమస్యలు ఉత్పన్నమవుతాయి. చేపలు, రొయ్యల ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతుందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. నీటిలో కాలుష్యం పెరగటం, ప్లాంటు ప్రాంతంలో భూ ఉపరితల భాగం, పచ్చదనం, మట్టి కొంతమేరకు కోల్పోయే అవకాశం ఉంది.
అయితే బూడిద, వ్యర్ధజలాల వల్ల ఎటువంటి యిబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అత్యంత ఆధునికమైన, నాణ్యమైన సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో పరిశ్రమను నడుపుతామని నాగార్జున కన్‌స్ట్రక్సన్‌ కంపెనీ యాజమాన్యం ప్రజలను నమ్మించ డానికి ప్రయత్నించింది. తమకు అనుకూలంగా స్పందించి రిపోర్టులు యిచ్చే కొంతమంది పర్యావరణ శాస్త్రవేత్తలను, వివిధ రకాల నిపుణులను ఈ ప్రాంతానికి రప్పించి స్థానికులను మభ్య పెట్టడానికి ప్రయత్నాలు చేసింది. అదే సమయంలో సలాసపురం గ్రామం నుండి అగ్రికల్చరల్‌ యం. యస్సీ. చేసిన వ్యక్తి ఈ నష్టాన్ని గుర్తెరిగి ప్రజల ముందు పెట్టగా 2008 సం. అక్టోబర్‌ నెలలో జనరక్షణ సమితి పేరుతో బీన ఢిల్లీరావు 10 వేల కరపత్రాలు ప్రచురించి గ్రామ గ్రామాన ఆటోలో తిరిగి సమావేశం ఏర్పాటు చేయగా 7గురు రైతు ప్రతినిధులు సనపల శ్రీరాంమూర్తి, మాదిన రాఘువుల, మొదలగు వారు 7గురు హజరై దీనిని పర్యావరణ పరిరక్షణ సమితిగారూపకల్పన చేసారు. పర్యావరణ స్థానిక పరిరక్షణ ఉద్యమ నాయకులు కూడా ప్రజల పక్షాన నిలబడి నిబద్ధతతో వ్యవహరించే శాస్త్రవేత్తలను, నిపుణులను రప్పించి పరిశ్రమల వల్ల ముప్పు ఉందని ప్రకటించారు. అంతేకాకుండా గాలి, నీరు, భూమి, వాతావరణం మొత్తం వేడెక్కుతుందని అనేక జబ్బులు వస్తాయని, వ్యవసాయం కుంటుపడుతుందని తద్వారా ఆహార ధాన్యాల కొరత ఏర్పడు తుందని మత్స్య ఐక్యవేదిక ఏర్పడి ప్రజలు పర్యావరణ సమితి, తీర ప్రాంత మత్స్యకార ఐక్యవేదిక వాటి తీరుతెన్నులను ప్రజల ముందర ఎండగట్టారు.
తరువాత క్రమంలో సోంపేటలో ఉన్న లోకనాధేశ్వర కళాపీ సంఘం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ సమితికి మద్దతుగా పవర్‌ ప్లాంటుకు వ్యతిరేకంగా బందు పిలుపు ఇవ్వడం జరిగినది. అప్పుడు ఈ ప్రాంత మేధావి వర్గం, డాక్టర్లు, అడ్వకేట్సు, తాపీ మేస్త్రీల సంఘంవారు, ఉపాధ్యాయులు, వ్యాపార వేత్తలు, స్వచ్ఛంద సంస్థలు వారంతట వారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ జరుగుతున్న దానిపై చర్చించుకొని పరవాడ, తాల్చేర్‌ ప్లాంటులు చూసి వచ్చి అపుడు పర్యావరణ పరిరక్షణ సమితికి మద్దతు తెలపడం జరిగింది. అప్పటినుండి పర్యావరణ పరిరక్షణ సంఘంగా మార్పు చెందింది. సంఘ అధ్యక్షులు డా. క్రిష్టమూర్తి ముందుగా ఒక డాక్టరుగా ప్రజారోగ్యానికి, పర్యావరణానికి ప్రాధాన్యత యిచ్చి ఈ ఉద్యమాల్లో పాల్గొన్నారు. ప్రజల జీవించే హక్కులకే భంగం ఏర్పడుతుందని గ్రహించి ప్రజాపోరాటానికి ఇతర సంఘాలను కలుపుకుని ఇక్కడ మెకానిక్‌ ఇంజనీర్‌ చదువుకొని ఈ ప్రాంతంలోనే విద్యాసంస్థలు నడుపుతున్న సంఘ ఉపాధ్యక్షులు రామారావు పోరాటంలో చేరి ముందుకు సాగుతున్నారు. ఈ ఉద్యమ ప్రాంతంలోకి అన్ని అస్తిత్వ వర్గాల వృత్తుల యూనియన్లు భాగస్వామ్యంలో సంఘం మరింతగా బలపడింది.
ఉద్యమ నేపధ్యం :
పోలీసు, రెవెన్యూ శాఖలు నయానో కొంతమంది దగ్గర భూమిని యిక్కడ కూడా ప్రజల నుంచి బలవంతంగా లాక్కొవడం జరిగింది. కానీ పోరాటాలకు మారు పేరైన శ్రీకాకుళం సోంపేట వాస్తవ్యులు తమపట్ల జరిగిన మోసాన్ని త్వరితగతినే గ్రహించారు. అందుకే గ్రామ గ్రామాన ప్రజలు ధర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టును మనసా వాచా ప్రతిఘటించారు. అవసరమైతే తమ ప్రాణాన్ని ఓడైకడనా నిలువరిస్తామని శపథం చేసారు. తమ భూములలోకి వచ్చే వారికి మొదట నుంచి అడ్డుకోవడానికి ప్రయత్నించారు. గ్రామ గ్రామాన వీధి వీధినా సభలు పెట్టుకున్నారు. అభివృద్ధే ప్రధానమని అధికార కాగ్రెస్‌పార్టీ స్పష్టంగా ప్రకటించింది. పరిశ్రమను అడ్డుకునే ప్రయత్నాలకు ఎవరూ సహకరించవద్దని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ముందుగానే కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపు నిచ్చారు. సోంపేటలో ఎన్నో దశాబ్దాల అనుబంధం గల సర్దార్‌ గౌతు లచ్చన్న కుమారుడు మాజీ మంత్రి గౌతు శివాజీ కూడా బహిరంగంగా ఈ పరిశ్రమకు మద్దతునిచ్చాడు.
స్థానిక పరిస్థితుల వలన కొందరు కాంగ్రెస్‌ శ్రేణులు ఉద్యమంలో పాల్గొన్నా ప్రజలకు వారి స్టాండు తెలుసు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల సీనియర్‌ నాయకులు ఒకటి రెండు సార్లు వచ్చి బహిరంగ సభల్లో ఉద్యమానికి మద్దతు ప్రకటించినా మమేకం కాలేకపోయారు. ఇక సి.పి.యం. ప్రభుత్వం నందిగ్రాంలో పారించిన రక్తపుటేర్లు వారి కళ్ళ ముందు కదులుతూనే ఉన్నాయి. ప్రజారాజ్యం పార్టీ సీనియర్‌ నాయకులు ఒకటి రెండు సార్లు వేదికలపై ఉపన్యాసాలు యివ్వడం తప్ప ఉద్యమంలో కొనసాగిన దాఖలాలు లేవు. శ్రీకాళం జిల్లా ఏకైక శాసన సభ్యుడైన పి. సాయిరాజ్‌ స్థానికులకు దూరమైపోతాననే భావనతో మద్దతు ప్రకటించినా, దాదాపు 194 రోజుల పాటు ఉద్యమంలో భాగస్వామిగా కన్పిస్తూ కుంటి సాకులతో ఉద్యమాన్ని చీల్చి స్థానిక తెలుగు దేశం నాయకులు ఉద్యమ కారులకు షాకిచ్చారు. అయినా రాజకీయ పార్టీల నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధి పట్ల ప్రజలకు వుండే సందేహాలు ప్రజలకున్నాయి.
గత ఏడాది ఆగష్టు 8న మానవ హక్కుల వేదిక బాలగోపాల్‌ తదితర నాయకులు పాదయాత్ర నిర్వహించి ఉద్యమానికి మద్దతు తెలిపారు. అదే నెల 18న గొల్లగండిలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో దాదాపు అందరూ పరిశ్రమను వ్యతిరేకించారు. ఆగష్టు 29న ముఖ్యమంత్రిగారిని, తెలుగు దేశం పార్టీ నేత చంద్రబాబుగారిని పి.ఆర్‌.పి. నేత చిరంజీవిని, సి.పి.ఐ నేత నారాయణను, లోక్‌సత్తా నేత జయప్రకాష్‌ నారాయణని కలిసి ఉద్యమకారులు వినతి పత్రాలను ఇచ్చారు. అదే రోజు మానవ హక్కుల కమీషన్‌ ఛైర్మన్‌ శ్రీ సుభాషణ్‌ రెడ్డి గారిని కూడా కలిసి సదరు మహజరు ఇవ్వడమైనది. రైల్‌రోకోలతో మొదలై డిసెంబరు 5న పదిమందితో రిలే నిరాహార దీక్ష శిబిరం ప్రారంభించడం జరిగింది. కాల్పులు సంఘటన జరిగే నాటికి అనేక గ్రామాల నుంచి స్త్రీలు పాల్గొని 222 రోజులు పూర్తి చేసారు. గత జనవరిలో ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు మమతా బెనర్జీ, జైపాల్‌ రెడ్డిలను కలిసారు. సోనియా, రాహుల్‌ గాంధీ, మన్‌మోహన్‌లకు వినతి పత్రాలు సమర్పించారు. ఫిబ్రవరిలో జాయింట్‌ కలెక్టర్‌ పర్యటనను అడ్డుకుని అదే నెల 25న భారీ ఎత్తున ప్రజాగర్జన సభ ఏర్పాటు చేసారు. ఏప్రిల్‌లో రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత, ప్రముఖ పర్యావరణ వేత్త సందీప్‌ పాండే ఈ ప్రాంతాన్ని సందర్శించారు. జూన్‌ 21న నర్మదా బచావో ఉద్యమ సారధి మేధా పాట్కర్‌ ఈ ప్రదేశానికి వచ్చి వీరి ఉద్యమానికి మద్దతు పలికారు. యిప్పటికీ ఉద్యమకారులపై 25 కేసులు తాజాగా కాల్పులు సందర్భంగా హత్యానేరారోపణలపై కేసులు బనాయించారు. వాటిలో 10 నాన్‌ బెయిల్‌బుల్‌ కేసులు, ఆరుగురిపై రౌడీ షీట్‌కేసులు తెరిచారు. యస్‌.సి, యస్‌.టి కేసును సంఘ ప్రధాన కార్యదర్శిపై మోపారు. కానీ ప్రజల మనోభావాలను గుర్తించలేదు సరికదా చివరకు జూలై 14న పిట్టల్ని కాల్చినట్టు కాల్చారు.
సోంపేట ప్రజల్ని పిట్టల్ని కాల్చినట్లు కాల్చాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ప్రపంచీకరణ, ప్రయివేటీకరణ విధానాల అమలు ఈ దుర్మార్గానికి మూలం.
రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం ప్రపంచ వ్యాప్తంగా జాతీయోద్యమాలు ఉవ్వెత్తున లేచి సామ్రాజ్యవాదుల విస్తృత కాంక్షను వెనక్కి తిప్పి కొట్టారు. పాత పద్ధతులలో తమ ప్రభావాన్ని కొనసాగించలేమని అబివృద్ధి చెందిన దేశాలు గుర్తించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలోని పాలక వర్గాలను బుట్టలో వేసుకొని వారి ద్వారా తమ దేశంలోకి పెట్టుబడిదారులు, బహుళ జాతి సంస్థల ప్రయోజనాలను కాపాడటానికి నడుం బిగించారు. ఆయా దేశాలలో పెట్టుబడులు పెట్టి ఆ దేశ సహజ వనరులను ఉపయోగించుకొని పరిశ్రమలు స్థాపించి లాభాలను తమ దేశాలకు తరలించుకు పోవడం జరుగుతుంది. అందుకు స్థానిక దళారీ సంస్థల సహాయం కోరడం జరుగుతుంది.
మానవ జీవితానికి సంబంధించిన ప్రతి విషయం ఇక్కడ వినియోగ వస్తువుగానే పరిగణించబడుతుంది. అందుకే మనకు కావల్సినంత విద్యుత్‌ ఉత్పత్తి ఉన్నప్పటికీ దాని పేరిట లాభాలను కొల్లగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. సోంపేట మీద కూడా ఆ ప్రపంచీకరణ రాబందు నీడ పడింది. అందుకే ప్రజల ప్రాణాలను అంత సులభంగా తీయగలిగారు.
ఈ పాశవిక ఘటనకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగానూ ప్రజా సంఘాలు ప్రజల పక్షాన నిలబడ్డారు. ప్రతి జిల్లాలోనూ సంఘటనలకు ఖండిస్తూ మత్స్యకారులు, రైతు సంఘాలు, ప్రజాస్వామ్య వాదులు ధర్నాలు, మౌన ప్రదర్శనలు, కలక్టరేటు ముట్టడిలతో తమ నిరసనను తెలియజేసారు. మానవ హక్కుల వేదిక, సాంప్రదాయ మత్స్యకారుల సమితి, ఇండియన్‌ పీపుల్స్‌ లాయర్స్‌, పర్యావరణ పరిరక్షణ సంఘం, ప్రజా ఉద్యమాల జాతీయ సమాఖ్య మానవ హక్కుల కమీషన్‌కు న్యాయవాది హేమా వెంకట్రావు ద్వారా పిటీషన్లు దాఖలు చేసారు. తక్షణమే పోలీసులను ఉపసంహ రించాలని, ఉద్యమకారుల ప్రాణాలకు పోలీసుల నుండి, కంపెనీ యాజమాన్యం నుండి రక్షణ కల్పించాలని నాగార్జున కనస్ట్రక్షన్‌ కంపెనీకి చట్టవ్యతిరేకంగా మద్దతునిచ్చి ప్రజల ప్రాణాలను హరించిన వారిపై న్యాయ విచారణ జరిపించాలని, జరిగిన సంఘటనలపై కమీషన్‌ ఆధ్వర్యంలో కమీషన్‌ ఏర్పాటును లేదా హైకోర్టు సిట్టింగు జడ్జితో విచారణ ఆదేశించాలని, కంపెనీ యాజమాన్యపు గుండాలు ప్రజల్ని భయ భ్రాంతుల్ని చేస్తుంటే ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టిికి తెచ్చినా స్పందించని కలెక్టరుపై చర్య తీసుకోవాలని, ముఖ్యంగా ”అశోక్‌ కుమార్‌, నవీన్‌ కుమార్‌” ఎస్త్సెలు ప్రజలకు సినిమా చూపిస్తామని అడ్డుకుంటే ప్రాణాలు తీస్తామని బహిరంగంగా ప్రకటించినందుకు తక్షణమే వారిని సస్పెండు చేయాలని, ఉద్యమ కారులపై ఆక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేయాలని, హత్య, లూటీ, దాడి, స్త్రీలపై అత్యాచార ప్రయత్నం, ఇతరుల భూములలోకి అనుమతి లేకుండా ప్రవేశించడంపై పోలీసులపై, గూండాలపై సంబంధింత ఐ.పి.సి సెక్షన్‌ క్రింద కేసులు పెట్టి అరెస్టు చేయాలని, వారిని విధులనుండి బహిష్కరించాలని కోరారు. ముఖ్యంగా మహిళా నాయకురాలు అయిన జ్ఞానేశ్వరిని బహిరంగంగా బట్టలు ఊడదీసి అవమాన పరిచినందుకు, మౌర్య ఆసుపత్రిలో, శిబిరంలో స్త్రీలపై జరిగిన దాడులకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. దీనికి కొంత అనుకూలంగా స్పందించిన మానవ హక్కుల కమీషన్‌ ఉద్యమ కారులను బెదిరింపులకు గురిచేయవద్దని, ఎలాంటి హాని తలపెట్టవద్దని తక్షణమే వైద్య సహాయం అందించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి మానవ హక్కుల కమీషన్‌ ఎక్స్‌గ్రేషియాకై ఆదేశిస్తామని తెలిపినా అలాంటిదేమీ వద్దని న్యాయవాది ద్వారా హక్కుల కమీషన్‌కు తెలిపారు. అలాగే మేథాపాట్కర్‌, మిగతా మేధావులు తమ ప్రాంతానికి వచ్చినా ఎట్టి పరిస్థితులలోను పునరావాసం కొరకు ప్రస్తావించవద్దని ఉద్యమ కారులు కోరారు. ఆ సంఘటనా స్థలానికి వెళ్ళి నిజా నిజాలను కమీషన్‌కు తెలియచేస్తామన్న న్యాయవాది ప్రతిపాదనను మానవ హక్కుల కమీషన్‌ ఆమోదించింది.
సమత అనే స్వచ్ఛంద సంస్థ పర్యావరణ అప్పిలేటు కమీషన్‌కు పిటీషన్‌ దాఖలు చేయగా కంపెనీ యాజమాన్యం వాస్తవాలను తప్పుదోవ పట్టించింది. కాబట్టి పూర్తి అధ్యయనం తరువాతే అనుమతుల్విడం జరుగతుందని వారు ఆదేశించారు. ఇవన్నీ కొంతమేరకు ప్రజలు సాధించిన విజయాలే.
కానీ ధర్మల్‌ ప్లాంటు ఆగిపోయేంతవరకు విశ్రమించకూడదని పట్టుదలతో ఉన్నారు. అంతేకాకుండా పరిశ్రమను ఆపడమే కాదు. ఇప్పటివరకు ఆక్రమంగా బెదిరించి, మోసగించి తమ వద్దనుండి లాక్కున్న భూములను డీ-నోటిఫై చెయ్యాలని, డిమాండు చేస్తున్నారు.
గత రెండు సంవత్సరాలుగా నిరవధికంగా రిలే నిరాహార దీక్షలు ధర్నాలు, బందులు, ప్రజల్ని చైతన్య పర్చడం, అన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడే ప్రజలందరిని కూడగట్టడం, కుళ్ళు రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించి 3000 మంది పోలీసులు, మరో వెయ్యి మంది గుండాల ప్రయివేటు సైన్యానికి ఎదురు నిల్చి ఉద్యమ స్ఫూర్తిని నిలబెట్టడంలో సోంపేట, దాని చుట్టూ ఉన్న 84 గ్రామాల ప్రజలు ముఖ్యంగా మహిళలు ప్రదర్శించిన తెగువ అన్ని ప్రజా పోరాటాలకు ఆదర్శం అనుటలో అతిశయోక్తి లేదు. అందుకే ఇప్పుడు సోంపేట శ్రీకాకుళ పోరాట బావుటా.
(రచయిత్రి సోంపేట ఉద్యమ సంఘాల న్యాయవాదిని) ఫోటోలు పంపిన ప్రశాంతి ఉప్పలపాటి, రాకేష్‌రెడ్డి దుబ్బుడుకి ధన్యవాదాలు.)
వీర గున్నమ్మ దారిలో…
స్త్రీవాదం అంటే మనం, మన కుటుంబం అనే చట్రాలను దాటుకొని వాటికి మూలాలైన సామాజిక, ఆర్థిక, రాజకీయ, వ్యవస్థల మార్పుకై నడుం బిగించి సెజ్‌లకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న మహిళలెందరో. ”కాకినాడ” రాములమ్మ ”పోలేపల్లి” చుక్కమ్మ ”జిందాల్‌” దేవుడమ్మ, ”మహాముంబాయి” ఉల్కా మహాజన్‌, ”మంగుళూరు” విద్యా నటేషన్‌..వీరిలో కొందరు మాత్రమే!!
సోంపేట ప్రాంతానికి చెంది, 1940 సం. లో జమీందారీ వ్యతిరేక పోరాటంలో అమరురాలైన వీర గున్నమ్మ స్ఫూర్తిని ఎత్తిపడుతూ సోంపేట మహిళలు వీరోచితంగా తిరగబడ్డారు. ఇక్కడ స్త్రీలంతా శ్రామిక వర్గానికి చెందిన వారే. మత్స్యకార కుటుంబాలకు చెందిన స్త్రీలు, మగవారు వేటచేసి రాగా చేపలను ఆరబెట్టి, గ్రేడింగు చేసి, అమ్మకాలు చేసేవారు. మిగిలిన కులాలకు చెందిన వారు రైతు కూలీలుగాను, తమకున్న కొంత భూమిని సాగు చేసుకుంటూనే, కుల వృత్తులు చేసుకుంటూ ఉపాధిని పొందుతూ కొంత మేర ఆర్ధికంగా నిలబడ్డావారే. అందుకే ఇతర సెజ్‌లలోలాగానే ఇక్కడ స్త్రీలు కూడా థర్మల్‌ విద్యుత్‌ ప్లాంటు యాజమాన్యపు మాటలు నమ్మి ఉపాధిని పోగొట్టుకోదల్చలేదు. ఉద్యోగం పురుష లక్షణం అని నమ్మే సమాజంలో ఎలాంటి ఉపాధి కంపెనీ నుండి దొరుకుతుందో వారికి తెలుసు. అందుకే ససేమిరా అన్నారు. ప్రభుత్వ స్వయం సహాయ బృందాలకు చెందిన మహిళలు ఉద్యమంలో పాల్గొనకూడదని ప్రభుత్వం పరోక్షంగా హెచ్చరించినా సంక్షేమ పధకాలు నిలిపివేస్తామని బెదిరించినా పోరులో ముందు భాగాన ఉన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రాజెక్టులు మాకొద్దు, మా సహజ వవనరుల్ని ఆక్రమించవద్దని ఆక్రందనలు చేసారు. పాద యాత్రలు, ప్రజాభిప్రాయ సేకరణ, సమావేశాలలో ఒకటిగా ఉద్యమించి భాగస్వామ్యమయ్యారు. గురి చూసి కాలుస్తున్న పోలీసుల్ని బ్రతిమిలాడారు. ప్రాధేయపడ్డారు. వారికి ఎదురు నిలిచి తమను గురి పెట్టమన్నారు. ధర్మల్‌ పవర్‌ ప్లాంటుకు వ్యతిరేకంగా మహిళలు పెద్ద ఎత్తున కదిలారు.

గల్ఫ్‌ బుచ్చమ్మ

Posted By on May 4, 2011
హేమ
ఒక ముని మాపు వేళ కల్లోల సముద్రాలకావల బ్రతుకు తెరువు కోసం కంటిపాపదాయని కన్నీటిని చీర చెంగుకు ఒత్తుకుంటూ పిల్లల్ని గుండెలకు హత్తుకొని కడసారి వీడ్కొలు చెబుతుంది ‘ఆమె’. కొంగు ముడివేసుకొని గంపెడు ఆశలతో సహచర్యం కోరుకొని అత్తారింటికి అడుగు పెట్టిన ఆరునెలలకే అప్పుల బాధ తాళలేకో, ఆడబిడ్డ పెళ్ళికో, చారెడు అరక స్వంతం చేసుకోవడానికో, మరిన్ని అప్పులు చేసి వలస వెళ్ళిపోయే మగని నిశ్శబ్ద నిష్క్రమణకు సాక్షిగా నిలిచిపోతుంది ‘ఆమె’. ఆమె ఎవరో కాదు. తమ వారి భవిష్యత్తు కోసం రెక్కలల్లారుస్తూ గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్ళే స్త్రీమూర్తి ఒకరైతే, బీడు భూములపైన కలల విత్తనాలు చల్లుకుంటూ ఆశల లోగిలిలో అతని కోసం ఎదురు చూసే గల్ఫ్‌ వలస కార్మికునికి భార్య/ తల్లి ‘ఆమె’.
గురజాడ అప్పారావు రచించిన ‘కన్యాశుల్కం’ లోని బుచ్చమ్మ పాత్రలాంటిదే ఈమె బ్రతుకు చిత్రం. గిరీశం మాటల్లో చెప్పాలంటే ‘ఓ పూర్‌ విమెన్‌’. కాలం మారినా విజ్ఞానం వికసించినా అణిచివేత, దోపిడి రూపాలు మాత్రం మారాయనటానికి ఈమె సజీవ సాక్షి. గిరీశంలాంటి వాళ్ళు ఎందరో ఆశలు కల్పించి జీవితాలతో ఆడుకుంటారు. ప్రపంచీకరణ నేపధ్యంలో ‘ఆమె’ శరీరం ఒక సరుకు మాత్రమే కాదు డబ్బు సంపాదించే ఒక యంత్రంగా కూడా మారింది. గడపదాటటమే కష్టమయిన పితృస్వామ్య సమాజంలో సంద్రాన్కి ఆవల భిన్నమైన సమాజంలోకి ఆమె విసిరివేయబడింది. అక్కడ ఆహారం వేరు. అలావాట్లు వేరు. కట్టుబాట్లు వేరు. భాషరాదు. బాధొస్తే పంచుకునే నేస్తముండదు. భారమైన పనితోపాటు యజమానుల హింసా దౌర్జన్యాలను పంటిబిగువున భరించాలి. ఒక్కోసారి వేశ్యవృత్తిలోకి నెట్టి వేయబడుతుంది. ఒంటరి కొవ్వొత్తిలా కరిగిపోయే ‘ఆమె’ తన కుటుంబానికి, దేశానికి సంపదను చేకూర్చే అంతర్జాతీయ వలస కార్మికులు.
ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు లెక్కల ప్రకారం సుమారు 5 మిలియన్ల మంది వలస కార్మికులైతే అందులో 14.6% మహిళా కార్మికులు ఉన్నారు. మొత్తం 7,37,300 మందిలో 3,68,650 మంది యింటి పని కార్మికులైతే మిగతావారు నర్సులు మరియు కొంత నైపుణ్యం కలిగిన, నైపుణ్యం లేని కార్మికులే. వీరి వలన 52 మిలియన్‌ డాలర్లు దేశానికి విదేశీ మారకద్రవ్యం అందుతుందని అంచనా. పాస్‌పోర్టు చట్టం 1967 ప్రకారం యజమాని నుంచి ఖచ్చితమైన విధి విధానాలతో క్లియరెన్సు వుండాలి. 2002 జూలైలో 30 సంవత్సరాల కంటె తక్కువ వయస్సున్న స్త్రీలను గల్ఫ్‌ దేశాలకు పనికి వలస వెళ్ళకూడదని నిబంధనలు పెట్టారు. అయినా ఏజెంట్లు, బ్రోకర్లు ఇమ్మిగ్రేషన్‌ అధికారులు  కుమ్మక్కై వేలాదిమంది యువతుల్ని నిబంధనలకు వ్యతిరేకంగా పంపుతున్నారు. 2007 వ సంవత్సరంలో భారత ప్రభుత్వం గల్ఫ్‌ దేశాలకు వెళ్ళే మహిళా యింటిపని కార్మికులకు కనీస  వేతనం 400 డాలర్లు ఉండాలని, 2500 డాలర్లు డిపాజిట్‌ చెయ్యాలని ప్రతిపాదించినా, కార్మిక సంక్షేమం పట్టించుకునే దేశాలకు మాత్రమే వీసా మంజూరు చేస్తామని ప్రకటించినా అవి పేపర్లకు మాత్రమే పరిమితమయ్యాయి. కేవలం రూ. 4000 నుంచి 7000 వరకే వీరి వేతనం పరిమితమవుతుంది. వీరికి ఏ దేశీయ, అంతర్జాతీయ చట్టాలు న్యాయాన్ని, రక్షణను యివ్వలేకపోతున్నాయి.
వలస పోయిన స్త్రీకి జీవితం ఒంటరితనపు ఎడారిగా మిగిలితే, సజీవ జ్ఞాపకాలతో సహచరుని జాడలు వెతుక్కునే వలస కార్మికుని సహచరి జీవితం అంతకంటే దుర్లభం. భర్త చేసిన అప్పులకు బందీ అయ్యి వడ్డీ వ్యాపారస్థులు, వారి ఏజెంట్ల అఘాయిత్యాలకు బలవుతుంది, అప్పటివరకు కాస్తో కూస్తో చేదోడు వాదోడుగా వున్న భర్త భారాన్ని కూడా మోయాల్సి వస్తుంది. తెలంగాణ జిల్లాలకు చెందిన మస్తానమ్మ మాటల్లో చెప్పాలంటే ‘మొగుడు మొద్దులు లేని నీకు షోకులేంటి’ అని ఆమె కట్టుబొట్టుపై కూడా పరోక్ష నియంత్రణ వుండనే వుంటుంది. తొలకరి జల్లై పలకరిస్తాడని పలవరించే ఆమెలాంటి ఎందరికో స్వప్న సంద్రంలో సూర్యాస్తమయమైనట్టు సహచరుడు శవమై వచ్చిన సందర్భాలెన్నో!
అన్ని మానవ హక్కులు హరించబడుతున్న ఈ ఎడారి పూలు వెలుగు రేఖలను వెదుక్కుంటూ యిప్పుడిప్పుడే సంఘటితమవుతున్నారు. మరికొందరు ఆ పరిస్థితుల నుండి తప్పించుకొని స్వదేశానికి చేరుకొని కోర్టులను సైతం ఆశ్రయిస్తున్నారు. కేరళలోని కులశేఖర పత్తి గ్రామానికి చెందిన మహిళ వేసిన పిటిషన్‌ను విచారించిన కేరళ హైకోర్టు న్యాయమూర్తులు జె. చలమేశ్వర్‌ మరియు పి. ఆర్‌ రామచంద్రాన్‌, షార్జాలో జరిగిన సెక్స్‌ రాకెట్‌ గురించి విచారించి రిపోర్టు చెయ్యమని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తే అనేక వాస్తవాలు వెలుగు చూసాయి. ఈ సంఘటన దేశంలోని గల్ఫ్‌ బాధితులకు పోరాటస్ఫూర్తిని యిచ్చింది. అలాగే యిప్పటివరకు అసంఘటితంగా వున్న గల్ఫ్‌ బాధిత కుటుంబాలు ఒక్కటవ్వడానికి తెలంగాణ జిలాల్లలో కదులుతున్నారు. ఇంతకీ ఈ స్త్రీ మూర్తులు సంఘాల డిమాండ్లు వారు మాట్లాడిన అంశాలు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను.
కేంద్ర ప్రభుత్వం గల్ఫ్‌ దేశాలతో వలస కార్మికుల పని కుదుర్చుకునే ఒప్పందాలలో వారి పనిగంటలు, సంఘాలు ఏర్పాటు చేసుకొనే హక్కు, వారి డబ్బు సరియైన బ్యాంకు ద్వారా స్వదేశానికి చేరవేసే ఏర్పాటు, సెలవులు, తమ వారితో సంభాషించడానికి ఫోన్‌ ఏర్పాటు , ఇతర పని విధానాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఏజెంట్లు బ్రోకర్ల అవినీతి, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దేశాన్ని వదిలిపెట్టే ముందు పని సంబంధిత శిక్షణ యివ్వాలని, స్త్రీ మహిళా ఇమ్మిగ్రేషన్‌ అధికారులను నియమించాలని డిమాండు చేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులకు కేంద్రం అమలు చేసే జీవిత భీమా పథకాన్ని తమకు వర్తింపచేయాలని ప్రతిపాదిస్తున్నారు.  ఈ పథకం ప్రకారం మొదటి సంవత్సరంలో రూ. 62 ఆ తర్వాత సంవత్సరాలలో రూ. 12 కడితే ఆ కుటుంబ యజమాని గల్ఫ్‌లో ప్రమాదవశాత్తు మరణిస్తే రెండు లక్షలు, ప్రమాదం జరిగితే రూ. 32 వేలు, రెండు ప్రసవాలకు రూ. 5000 మంజూరవుతాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం లక్ష రూపాయలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని గల్ఫ్‌లో చనిపోయినవారి చావులకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి కుటుంబాలను ఆదుకోవాలని ఉద్యమిస్తున్నారు.
ఈ కాలమ్‌ ముగించే సమయానికి గల్ఫ్‌ డైలీ న్యూస్‌ వార్త ఏమిటంటే 70 ఏళ్ళ యజమాని హింస భరించలేని 22 ఏళ్ళ ఇధియోపియన్‌ స్త్రీ ఆ పురుషుని మర్మాంగాలు కోసి వేసిందని.. ఆమె ఆవేదనని అర్ధం చేసుకున్న మానవ హక్కుల కార్యకర్తలు అక్కడ దోపిడి, దౌర్జన్యాలపై ఎలుగెత్తి చాటుతున్నారు. మరి మనం కూడా ‘ఆమె ‘ పోరాటానికి మద్దతు తెలిపే సమయమాసన్నమైంది. అయినా ‘పుట్టిన గడ్డ మీద బుక్కెడు బువ్వ దొరికితే నా బిడ్డకు యిన్ని కడగండ్లు రావు కదా”! అన్న ఆ తల్లి ప్రశ్నకు జవాబు దొరికెదెప్పుడో! విషాద, నిశ్శబ్ద శిధిల జ్ఞాపకాల్ని కౌగిలించుకొని కనుమూసిన ‘ఆమె’కు తొలి వెలుగుల సూర్యోదయమెప్పుడో కదా!!!

మానవ హక్కుల కమీషన్‌ – మనం

Posted By on June 1, 2011
హేమ
నమ్మిన సిద్ధాంతం కోసం చావునే లెక్క చేయకుండా నడిచిన బాటలో అతడు నేలకొరిగితే, కలల శకలాలలను మూట గట్టుకొని ఆశయాల సజీవ స్వప్నమై జనసంద్రంలో కలిసి జీవైక హక్కులకై పోరాడాలనుకుంటుంది  ”ఆమె” ఒక అక్క. హింసాహింసల మధ్య  సన్నటి పరదాలను తొలగించి చూస్తే పగిలిన జీవన దర్పణంలో అస్తిత్వం వెయ్యి ముక్కలై పకపకమని నవ్వుతుంది. ”ఆమె” ఒక ఇల్లాలు. గ్రీన్‌ హంట్‌లో భాగంగా సర్కార్‌ సైన్యాలు అడవి బిడ్డల్ని చేరబడితే న్యాయస్థానాల ముంగిటకు నడిచి వచ్చిన ”ఆమె”, వాకపల్లి. ప్రభుత్వఆసుపత్రిలో నీడలేక రోడ్డు మీదే ప్రసవించి, బిడ్డలను కోల్పోయే ”ఆమె” పేదరాలు. వీరందరూ, తమహక్కుల గురించి ప్రశ్నిస్తూన్న వాళ్లే. అయితే ఇంతకు మునుపులా కాకుండా వీరందరూ ‘మానవ హక్కుల కమీషన్‌’ కు రావడం కొత్త మలుపు. అందుకే ఈ మానవ హక్కుల కమీషన్‌ అంటే ఏమిటో తెలుసుకునే చిన్న ప్రయత్నమే ఇది.
రెండు ప్రపంచ యుద్ధాలు  మానవ జీవితంలో అంతులేని విషాదాన్ని, వేదనను మిగిల్చాయి. ఈనేపథ్యంలో మానవహక్కులను నిర్వచించడం ఆనాటి తక్షణకర్తవ్యంగా మారి విశ్వజనీన మానవ హక్కుల ప్రకటనకు దారితీసింది. మానవహక్కులంటే  ”భారతరాజ్యాంగంలోని ప్రాధమిక హక్కులలో పొందు పరిచి  అభయమివ్వబడిన వ్యక్తి జీవితం, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం, గౌరవం లేక ఇంకా అంతర్జాతీయఒప్పందాలలో పొందుపరిచి భారతదేశ కోర్టులలో అమలు పరిచే అవకాశం వున్న హక్కులన్ని మానవ హక్కులే” అని గ్రాంథిక భాషలో చెప్పిన నిజానికి స్త్రీ జీవితంలో పెత్తనాన్ని వ్యతిరేకించేదే హక్కు. స్త్రీ తాను నమ్మినదానికై ఆత్మగౌరవంతో శ్రమించి బుద్దిబలంతో దోపిడీ వివక్షకు వ్యతిరేకంగా జీవించేదే మానవ హక్కు. అందుకే స్త్రీల హక్కులన్ని మానవ హక్కులుగా మనముందుకొచ్చాయి. కొన్ని  స్త్రీల ప్రగతికి బతికే హక్కుకి అడ్డంకులుగా మారినప్పుడు ఆ హక్కుల పరిరక్షణలో భాగంగా వాటిని త్రోసిపుచ్చే ప్రయత్నంలో  సంఘనియమాలను  చట్టాలను ఉల్లంఘిస్తే వాటికి వ్యతిరేకంగా పోరాడితే  అది జీవించే హక్కు వ్యక్తీికరణలో భాగంగా చూడాలి. అందుకే  బ్రతికేహక్కుకోసం అమలులో వున్న నియమాలను ధ్వంసం చేసే హక్కు ప్రతి స్త్రీ కలిగివుంటుంది.  అయితే ప్రశ్నల్లా వాటిని ఎక్కడ ప్రశ్నించాలా అన్నదే. అందుకు కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు రాజ్యం ప్రకటించింది.
వాటిలో భాగంగానే  మహిళా జాతీయకమీషన్‌, షెడ్యూల్డ్‌ కులాల, జాతుల జాతీయ కమీషన్‌, మైనారిటీ జాతీయకమీషన్‌, మానవ హక్కుల కమీషన్‌లు ఏర్పడ్డాయి. ఈ మధ్య  మనం  మహిళ కమీషన్‌కంటే  మానవ హక్కుల కమీషన్‌ కొన్ని  సామాజిక పొరపాట్లపై ప్రతిస్పందించడం గమనిస్తాం! (అవి ఏమేరకు న్యాయం చేకూర్చనప్పటికీ కూడా..) ఇదే మానవ హక్కుల కమీషన్‌ స్త్రీల హక్కులకై చేస్తున్న కృషిని పరిచయం చేయడానికి ప్రయత్నిస్తాను. మానవ (స్త్రీల) హక్కుల ఉల్లంఘన కమీషన్‌ దృష్టికి వచ్చినప్పుడు కమీషన్‌ తనకుతానుగా గాని, బాధితులుగాని, బాధితుల తరఫునగాని ఎవరైన ఫిర్యాదు చేసినప్పుడు కమీషన్‌ విచారిస్తుంది. ఏదైనా కోర్టులో విచారణలో వున్నప్పుడు ఆ కోర్టు అనుమతితో కమీషన్‌ స్త్రీల హక్కుల విషయంలో జోక్యం కలుగజేసు కోవచ్చు. జైళ్ళను అదేవిధంగా వ్యక్తులను చికిత్సకోసం, సంస్కరణలకోసం, రక్షణకోసం సంబంధించిన ఇతర ప్రభుత్వ సంస్థలను దర్శించి అక్కడ నిర్భంధంగా వున్న వ్యక్తుల బాగోగుల గురించి, స్థితిగతుల గురించి అధ్యయనం చేసి వాటి మెరుగుదలకు కావలసిన చర్యలు చేపట్టవచ్చు. అవసరమైతే నష్టపరిహారాన్ని ఇప్పించవచ్చు. మానవ హక్కుల భావవ్యాప్తికై సాహిత్యాన్ని అందరికీ అందేటట్లు చేయడం, సెమినార్‌లు నిర్వహించడం మీడియాద్వారా కృషిచేయడం చేస్తుంది.
సాధారణంగా కమీషన్‌లు పితృస్వామ్యం, కులస్వామ్యం, ధనస్వామ్యం చేసే ఉల్లంఘనలకంటే పోలీసుహక్కుల ఉల్లంఘనకై కమీషన్‌లో వ్యాజ్యాలు వేస్తుంటారు. సమాజంలో వున్న శక్తివంతమైన గ్రూఫులు పాల్పతున్న  మానవ హక్కుల ఉల్లంఘన  విచారణపై కమీషన్‌ సామర్థ్యంపై ప్రజలకు అనుమానం వుంది. (నిజానికి ఎంతోమంది స్త్రీలకు ఈ కమీషన్‌ గురించి తెలియదు) ఇంకో విషయం ఏమిటంటే  మానవ హక్కు ఉల్లంఘనకు పాల్పడుతున్న పబ్లిక్‌ సర్వ్‌ంట్‌లే కాదు ప్రేక్షక పాత్ర వహించేవారు కూడా ఉల్లంఘనకు బాధ్యులవుతారు. క్రిమినల్‌ ప్రొసిజర్‌ కోడ్‌లోని 26వ ఛాప్టర్‌ సె.195 ప్రకారం కమీషన్‌ను  సివిల్‌ కోర్ట్‌గా పరిగణిస్తారు. ఈ కమీషన్‌కు బాధితులకు, బాధితకుటుంబాలకు సత్వర న్యాయసహాయం అందజేయడానికి సిఫారస్సు చేయడానికి మాత్రమే అవకాశం వుంది. అంతేకాని ఆదేశించే అవకాశం అధికారం లేదు. అంటే కమీషన్‌ అధికారానికి నియంత్రణ వుంది. అదే విధంగా ఉల్లంఘనలకు పాల్పడిన వ్యక్తులపై తగినచర్యలు తీసుకోమని సిఫారస్సు మాత్రమే  కమీషన్‌ చేయగల్గుతుంది.ఈ సిఫారస్సుపై ప్రభుత్వ చర్యలు తెలియజేయాలి. కమీషన్‌ రిపోర్ట్‌లు ఉభయ సభలకు అందజేయపడ్తాయి. దీనివలన ప్రజల నిరసనని ప్రభుత్వాన్ని గురి చూసే అవకాశం వుంది. సాయుధదళాలు స్త్రీలపై జరిపే హక్కుల ఉల్లంఘనపై  కేంద్రప్రభుత్వం నుంచి  రిపోర్టు రాకపోయిన సంతృప్తి చెందకపోయినా విచారణ జరపడానికి అవకాశం లేదు.( మానవ హక్కులు – మంగారి రాజేందర్‌) మానసిక బాధిత స్త్రీలపౖౖె జరిగిన సంఘటన ఈ నేపథ్యాన్నే గుర్తు చేస్తుంది. మానవ హక్కుల పరిరక్షణకి పాల్పడుతున్న ప్రభుత్వేతర సంస్థలను ప్రోత్సహించడం కమీషన్‌ బాధ్యత అయినప్పటికీ ఈనాటికీ స్త్రీల హక్కులకోసం పోరాడుతున్న మహిళాసంఘాల సహకారాన్ని తీసుకున్న దాఖలాలు కాని, ప్రోత్సహించిన సందర్భాలు కాని కమీషన్‌కు లేవు. ( ఒక మానవ హక్కుల న్యాయవాదిగా తెలిసినమేరకు) అలాగే జనాభాలో సగభాగమైన స్త్రీలకో కమీషన్‌ సభ్యుల నియామకంలో ప్రత్యేకఅవకాశాలు లేవు. హక్కుల పరిరక్షణలో భాగంగా స్త్రీలకు ఒక హెల్ప్‌లైన్‌ లేక స్త్రీల హక్కుల భావపరివ్యాప్తికి సాహిత్యం, ప్రత్యేక సమావేశాల ఏర్పాట్లు లేవు. మరి స్త్రీల హక్కుల పరిరక్షణ ఎలా అంటారా? మన హక్కులకై ప్రాతినిధ్యానికై మనమే నడుం కట్టాలేమో! అయితే ప్రభుత్వం లేక రాజ్యం సామాజిక సంబంధాలను యధాతధా స్థితిలో కొనసాగించే పరికరం. అది కూడా కుటుంబాన్ని మతాన్ని, వర్గాన్ని మరీ ముఖ్యంగా పితృస్వామ్య విలువల్ని పరిరక్షించడానికే పాటుపడుతుంది. కాబట్టి సంబంధిత న్యాయమూర్తులకు పితృస్వామ్యంపట్ల అవగాహన ప్రగతిశీల భావాలు లేకపోతే మరింత సమస్యల్లో యిరుక్కున్నట్టే. కమీషన్‌ యొక్క స్వేచ్ఛ, సమానత, సౌభ్రాతృత్వ ప్రమాణాలను ప్రశ్నించవలసిన అవసరం కేవలం బాధిత స్త్రీలకే పరిమితం కాకూడదు. ఈ కమీషన్‌ మానవ హక్కుల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు యిచ్చే సూచనలలో సిఫార్సులలో, స్త్రీల పాత్ర పెరగాలి. మానవ (స్త్రీల) హక్కుల పరిరక్షణ అన్నది స్త్రీ పురుషుల స్నేహ సంబంధాల కోసం తీవ్ర అన్వేషణ చేసే ప్రతి ఒక్కరి సాంఘిక బాధ్యత కూడా.
ఐక్యరాజ్యసమితిలో మానవ హక్కుల కమిటీలో భారతదేశం ఒకటి అయిన తరుణంలో అలసిన స్వప్నాలతో ‘ఆమె’ శిథిలం కాకమునుపే, ఆకుపచ్చని జీవితం సాయుధమై తిరగబడకముందే విధ్వంస విస్పోటానికి ‘ఆమె’ నాంది కాకముందే మానవహక్కుల మరో ఇంధ్రధనస్సు ఆవిష్కరణ సాధ్యం కాదేమో!

అభివృద్ధి వెలుగునీడల్ని ఆనాడే చూపించిన ఆర్‌ఎస్‌రావు

Posted By on July 7, 2011
హేమ
అణగారిన వర్గాలకోసం అహర్నిశం పట్టించుకొనేవారు ఒక్కరొక్కరుగా రాలిపోతున్న సందర్భం ఇది. కన్నాభిరాన్‌, బాలగోపాల్‌, బుర్రరాములు,  పతిపాటి వేంకటేశ్వర్లు… ఇప్పుడు ఆర్‌ఎస్‌రావు (రేగులగడ్డ సోమేశ్వరరావు)  తెలుగువాడే కాని ఒరిస్సాలోని  బుర్ల యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసారు. అయిన ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను, ఉద్యమాలను సాహిత్యాన్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. అతడు రాసిన ”అభివృద్ధి-వెలుగు నీడలు” ఒక అద్భుత రచన. అభివృద్ధి గురించి ఇప్పటికే జరుగుతున్న చర్చకి 1990లోనే శాస్త్రీయ సమాధానాన్ని వివరించి చెప్పిన ఆర్‌ఎస్‌రావును ఏ ఉద్యమకార్యకర్త మర్చిపోరు.
ఆర్‌ఎస్‌రావు అంటే ”అభివృద్ధి వెలుగునీడ” అనేవిధంగా గుర్తుండిపోయారు. ఆ తర్వాత కూడా అనేక విషయాల మీద ఆయన చేసిన రచనలు మనకు ఒక స్పష్టమైన అవగాహనని కల్పించే విధంగా వుంటాయి. కాబట్టి అతడ్ని గుర్తు చేసుకోవడం అంటే అతడి రచనల్ని మరొక్కసారి మననం చేసుకొని ముందుకు సాగిపోవడమే.
మీరు ఆనకట్టలకి, విద్యుత్‌కేంద్రాలకు, రోడ్లనిర్మాణాలకి వ్యతిరేకంమా? అంటే ”అభివృద్ధికి వ్యతిరేకులు” అభివృద్ధికి వ్యతిరేకులంటే ద్రోహులు అనే స్థాయికి వెళ్ళిపోయాయి మనలో కొందరి బుర్రలు, ఆ బుర్రలు బూజు వదలగొట్టాలి అంటే” అభివృద్ధి వెలుగు నీడల” గురించి లోతుగా చర్చించాల్సిందే. అభివృద్ధి  గురించి  ఆర్‌.ఎస్‌.రావు మాటలోనే” ఏ ఉత్పత్తి శక్తుల పెరుగుదల అయినా దాని వెనుక నిబిడమయి ఉన్న మానవ శ్రమ, విజ్ఞానాల ఫలితం. ఆ విజ్ఞానం ఒకనొక ప్రాపంచిక దృక్పధం కారణంగా జనిస్తుంది అంటే ఏ రూపంలో కన్పించే అభివృద్ధి పథకం అయినా అంతిమ పరిశీలనలో ఒకానొక ప్రాపంచిక దృక్పథం  నుండే పుడుతుంది. అందుచేత ఆయా అభివృద్ధి పథకాల సారం వాటికి కారణం అయిన  ప్రాపంచిక దృక్పథమే  అని చెప్పుకోవాలి. అలాంటప్పుడు ఆనకట్టనో ఫ్యాక్టరియో కాలేజినో అభివృద్ధో కాదో తెలుసుకోవాలంటే ఆ అభివృద్ధి పథకం ప్రాపంచిక దృక్పథంలో ఏమైనా మార్పులు తీసుకు వచ్చిందా, లేదా, అప్పటికే బలంగా వున్నా వేరొక ప్రాపంచిక దృక్పధంలో తానే ఒక భాగం అయి పోయిందా అనే అంశాన్ని పరిశీలించాలి. ప్రాపంచిక దృక్పథం అంటే ఏమిటి? నిర్ధిష్ట దేశకాల పరిస్థితుల్లో మనిషికీ ప్రకృతికీ మధ్య గల సంబంధాన్ని లేదా వైరుధ్యం గురించి తెలియజేపే దృక్పథమే ప్రాపంచిక దృక్పథం…
అభివృద్ధి అనే భావన ఏకకాలంలో క్లిష్టం అయినది సులభంగా  అర్ధమయ్యేది కూడా. సులభంగా ఎందుకు అర్ధం అవుతుందంటే దాని బలమైన దర్శనీయత వల్ల (విజుబ్యూలిటీ) క్లిష్టమయినది ఎందుకు అంటే దాని వెలుతురిని అర్ధం చేసుకోగలిగినంత సులభంగా అది సృష్టించే నీడల్ని అర్ధం చేసుకోలేం కాబట్టి.
అయితే అభివృద్ధిసారం దాని భౌతిక రూపంలో కాక ఆ అభివృద్ధి సాధ్యం చేసిన ప్రాపంచిక దృక్పథంలోనే ఉందని సులభంగానే అర్ధమముతుంది. అందుకే భయంకరదుర్ఘటన  జరగక ముందు భోపాల్‌ యూనియాన్‌ కార్భిదే అభివృద్ధికి ప్రతీక. ఆ సంఘటన తర్వాత ఆ భావం బీటలు వారింది.అభివృద్ధి వెలుగు నీడలు ఒక మంచి వ్యాసం అయితే దాన్ని ఒక జీవితంద్వారా చెప్పగలిగిన రచయిత కాళీపట్నం రామారావుగారు. అతడి యజ్ఞం కథ గురించి రాస్తూ గొప్ప విశ్లేషణ చేసారు.
యజ్ఞంకథలో గాంధీజీ ఆశయాలతో ప్రభావితం అయినా శ్రీరాములు నాయుడు గ్రామాభివృద్ధికి రోడ్లు స్కూలు ఏర్పాటు చేస్తాడు. రోడ్ల ద్వార మోటారు వాహనాలు వచ్చి రిక్షాలను మూల పడేశాయి. వ్యాపార పంటలు వలన సంప్రదాయ రీతులు నష్టపోయి అప్పులు పాలవుతారు. ఈ నేపధ్యంలో అప్పలరాముడు అప్పు తగువే ఈ కథ. ఈ తీరని అప్పులు వలన తనలాగే తన కొడుకును బానిస కావడానికి వీలు లేదని తన కొడుకును చంపేసి అప్పల రాముడు పంచాయితీ ముందు పడేస్తాడు.
గ్రామజీవితంలో అభివృద్ధి క్రమం ముందు శ్రీరాములు నాయుడు హీరోగా మొదలుపెడితే కథ అంతానికి అప్పలరాముడు అంటే హీరో నుంచి హీరో అయిపోతాడు. ఇంకా వర్గం రూపొందని కాలంలో అప్పల రాముడు అ వర్గ ప్రతినిధిగానే వర్గ సహకారం లేకుండా ఉండిపోయాడు. కాని ఆ తర్వాత కాలానికి వర్గ పోరాటాలద్వారా వర్గం రూపొందటం మొదలయింది. సంఘర్షణ ప్రదానం అయ్యింది. ఆ మార్పులో నూతన దృక్పథం కనిపిస్తుంది. ఇది ఎటువంటి  అప్పు అనే ప్రశ్న కాకుండా దానికి ఒక సమాధానం ఇస్తుంది. ఇది ఎటువంటి అభివృద్ధి అంటే ఏమిటి అనిఅంటే ఏమిటి అని చెపుతుంది. ఉద్యమం ప్రధానంగా ఉన్న గ్రామాలలోనే కాకుండా మిగిలిన ప్రాంతాలలో కూడా ఈ మార్పు కనిపిస్తుంది. రూపాలు వికృతం అవ్వచ్చును. అంటే నిజ జీవితం అంటే హీరో నుంచి ఆల్ట్రానేటివ్‌ హీరోకు మార్పు చెందింది. ఈ అల్ట్రానేటివ్‌ హీరో అట్టడుగు వర్గాల నుంచి అణగార్చబడ్డ ఆడవాళ్ళ దగ్గర నుండి ముందుకు వస్తున్నారు.
దేర్‌ ఇస్‌ నో ఆల్ట్రానేటివ్‌. ఈ అభివృద్ధి తప్ప వేరే దారి లేదు అని చెబుతూ సామ్రాజ్యవాద పెట్టుబడి దారి విధానం తన విధ్వంసకర కార్యక్రమాన్ని అణిచివేత విధానాలతో అమలు చేయ ప్రయత్నిస్తుంది. ప్రత్యామ్నాయం ఉందంటూ ప్రజలు ప్రతిఘటిస్తూనే వున్నారు వారి పక్షాన నిలిచిన ఆర్‌.ఎస్‌.రావు ప్రత్యామ్నాయరాజకీయాలను ప్రతిపాదించి మనందరికీ ”కొత్తచూపు”ను అందించారు.

భూమి-సేకరణ- పునరావాసం-స్త్రీలు

Posted By on December 6, 2011
హేమ
జార్ఖండ్‌లో భూనిర్వాసితుల పోరాటానికి మద్దతుగా నిల్చిన సిస్టర్‌ జాన్‌ వల్సను మైనింగ్‌ మాఫియా హతమార్చిందని వార్తాపత్రికలో (18.11.11) చూసి హతాశురాలినయ్యాను. భూవనరులను ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా బహుళజాతి కంపోనీలకు దోచిపెట్టకుండా ప్రజలతో కలిసి జాన్‌వల్స పోరాడింది. భూమి నుండి స్త్రీలను వేరు చేయడానికి దానిపై ఆధిపత్యానికి పురుషాధిక్య వ్యవస్థ ప్రయత్నిస్తున్నా స్త్రీలు ప్రతి భూపోరాటంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నారు. కాని వారి మనోభావాలు, ఆవేదన పాలకవర్గాల నిర్ణయాధికారంలో చోటు చేసుకోలేదు. ఫెడరిక్‌ ఏంగిల్స్‌ అన్నట్టు ‘ప్రపంచ మహిళలు చారిత్రక ఓటమికి గురయ్యారు’ ఈ నేపథ్యంలో జాతీయ భూసేకరణ పునరావాసం బిల్లు ఒకసారి పరిశీలిద్దాం.
పట్టణీకరణ-పారిశ్రామికాభివృద్ధి, వాటి మౌలిక సదుపాయాల కల్పన పేరుతో మూడింట రెండొంతులు స్త్రీలు పాల్గొనే గ్రామీణ వ్యవస్థను విచ్ఛిన్నం చేసి కార్పొరేటు సంస్థలకు భూమిని అప్పగించడానికి ప్రభుత్వం పూనుకుంది. వలస పాలనతో 1894లో చేసిర భూసేకరణ చట్టానికి ప్రతిగా ఈ చట్టం రాబోతుంది. ప్రజల్నుంచి ఎలాంటి అడ్డంగి లేకుండా ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులను భూ సేకరణ జరపవచ్చు. ప్రేవేటే కంపెనీల కోసం అయితే 80% అనుమతి వుంటేచాలు. కాని ఈ 80%లో ఎంత మంది స్త్రీలు పట్టాదారులు? దళిత బహుజన వర్గాల్లో భూమి సాగుకు స్త్రీలే అధికంగా పాల్గొంటారు. యిక 20% మంది నిర్ణయాలు అసలు పరిగణనలోకి రావు. భూమి విలువను కట్టేదపుడు మార్కెట్టు వ్యవస్థ, దాని వినియోగం బట్టి ధరను నిర్ణయిస్తున్నారే తప్ప స్త్రీల అభిప్రాయాలకు తావే లేదు. స్వాధీనం చేసుకునే భూమి 100 ఎకరాలు మించితేనే సామాజిక పర్యవసానం గురించి ఈ బిల్లు మాట్లాడుతుంది. అంతకంటే తక్కువైతే ఈ భూ యజమానుల సంగతేమటన్న దానికి జవాబు లేదు. నీటివనరుల భూమి, బహుళ పంటలు పండే భూమి స్వాధీనపరుచుకోమని చెప్పినా కాకినాడ, సోంపేట, నందిగ్రాం తదితర ప్రాంతాల్లో ఏం జరుగుతుందో మనందరికి తెలుసు. భూ సేకరణకై గుర్తించబడ్డ స్థలాన్ని బాధిత స్థలంగా నిర్వచించారే కాని ఆ ప్రాజెక్టు ఉత్పత్తుల ఫలితంగా నష్టపోయే ప్రాంతాన్ని గుర్తించలేదు. దాని మూలంగా వెలువడే కాలుష్యం అనారోగ్య పరిణామాలు ప్రసక్తే లేదు. ఎవరి భూమిని సేకరించారో వారినే బాధితులుగా గుర్తించారే తప్ప వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు, కౌలుదార్ల వర్గం, వారి స్త్రీల గురించి ప్రస్తావన లేదు.
భూమి ఒక వనరుగా కాక ఒక వస్తువుగా మారినక్రమంలో భూవనరులను పోగొట్టుకోవడమే కాకుండా దానితో జీవనాధారమైన జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పోగోట్టుకుంటారు. అప్పటివరకు శ్రామిక వర్గంగా వున్న స్త్రీలు కొత్త ప్రాజెక్టులలో స్థానం లేక మిగులు మనుషులుగా మిగిలిపోతారు. ఈ బిల్లు భూమికి సంబంధించిన పంచాయితీ ఎక్స్‌టెన్షన్‌  అయి షెడ్యూల్డ్‌ ఏరియాస్‌ చట్టానికి, 2006  అది హక్కుల చట్టానికి, గిరిజనులు అధికంగా వుండే 5వ షెడ్యూల్‌ ప్రాంతంలోని భూముల బదలాయింపు చట్టానికి లోబడి వుంటుందని పేర్కొన్నా వాటి అతిక్రమణ అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది.లోక్‌సభ ఎన్నికల్లో ఆహార రక్షణ, భద్రత అనేది యు.పి.ఏ కూడమి ప్రజలకు యిచ్చిన వాగ్ధానం. అందుకు మరింత భూమిని సేద్యానికి వినియోగించకుండా ఉన్న భూమిని పారిశ్రామీకరణ పేరుతో కంపెనీలకు బదలాయిస్తున్నారు. దేనికి అనువుగానే ప్రజల్ని మభ్యపెట్టడానికి ఆహారాన్ని బదులుగా నగదు చెల్లిస్తామని ఆహార భద్రతా చట్టాలలో పేర్కొన్నారు. దీనివలన ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసి చిల్లర వ్యాపారంలో కూడా విదేశీ బహుళజాతి కంపెనీలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పూనుకుంది. యిప్పటివరకు కాస్తో కూస్తో అందుతున్న కుటుంబాలకు అందదు.
యిక ‘పునరావసం’ ఒక రాజకీయ అవసరంగా గుర్తించి జాతీయ విధానాన్ని పొందుపరిచారు ఈ బిల్లులో. భూమి విలువతో పాటు యిల్లు, 20 వ సంవత్సరాలు రెండు వేల రూపాయల చొప్పున అందిస్తారు. కుటుంబంలో ఒకరికి ఉపాధి లేనట్లయితే 2 లక్షల రూపాయిలు యివ్వబడతుంది. రవాణాఖర్చులు, సెటిల్‌మెంటు, తాత్కాలిక ఉపశమన గ్రాంటు, పశుశాల, చిన్న దుకాణాల నిర్మాణం చేపడతారు. భూ విలువలో 25% షేర్లరూపంలో యివ్వబడుతుంది. యిల్లు భార్యభర్తల పేరు మీద యివ్వొచ్చు కాని యివ్వాలన్న నిబంధనలేదు ప్రభుత్వం నుంచి కల్పింపబడిన ఏ నష్టపరిహారమైనా, సదుపాయాలైనా పితృస్వామ్య వ్యవస్థలో ఎటువంటి పోరాటం చేయకుండానే పురుషునికి దక్కుతాయి. పురుషులు వస్తు వినిమయ వ్యామోహంలో పడి ఆ డబ్బును ఖర్చు చేస్తున్నారు. కొన్నాళ్ళ తరువాత డబ్బు యిబ్బందితో వాటికి అమ్మి సరైనా ఉపాధి దొరకక మరింత పేదరికంతో కూరుకుపోవడం కాకినాడ సెజ్‌లో అనుభవమే. ఆదివాసి సమాజంతో, సహా నష్టపరిహారాన్ని  విందులు, వినోదాలు, తాత్కాలిక అవసరాలకే హెచ్చిస్తున్నారు.
ప్రజాభిష్టం, కుటుంబాలపై సాంఘిక, ఆర్థిక అంశాల ప్రభావం, భూపరిధి తదితర అంశాలపై అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు చేసినా అందులో స్త్రీలు ఉండాలన్న నిబంధన లేదు. దేశ జనాభాలో మూడింట ఒక వంతు జనాభావున్న అసంఘటిత కార్మికులు దేశానికి రెండొంతుల ఆదాయాన్ని అందిస్తున్నారు. అధిక శాతం వీరిలో వ్యవసాయ, అనుబంధిత మహిళా కార్మికులే.
ఈ మొత్తం క్రమాన్ని పరిశీలించినట్లయితే స్త్రీలను భూమిక, దాని వనరులు నుండి గెంటివేసి ఆర్థిక స్వాతంత్య్రం కోల్పోయేలా చేస్తుంది. పితృస్వామిక భావజాలం ఉన్న సమాజంలో పురుషుల హింస ఈ పేట్రేగి కుటుంబభారం మొత్తం స్త్రీమీద పడుతుంది.కాబట్టి దేశాన్ని కబళించబోయే ఈ భూసేకరణ బిల్లులో మానవీయ ముఖ్యంగా స్త్రీకోణం లోపించింది. అత్యవసర పరిస్థితులలోనే భూసేకరణ పరిమితులతో జరగాలి. భూమికి భూమి యితర సదుపాయాలు కల్పించాలి. కుటుంబాన్ని యిద్దరి కలయికగా కాకుండా పితృస్వామ్య భావజాల ప్రభావిత యూనిట్‌గా గుర్తించి స్త్రీలకు ప్రాధాన్యం యివ్వాలి. స్త్రీలను ఉత్పత్తి చేసే మనుష్యులుగా చూసి శ్రమ ఆధారిత పరిశ్రమలు ప్రభుత్వ పరంగా తెరవాలి. వికేంద్రీకరణ, వనరులు, స్థానిక సాంకేతిక నైపుణ్యం ఉపయోగించుకొని నడిపే పరిశ్రమలు కోసం ఉద్యమించాలి. భూమిని వాటి వనరులను బహుళజాతి కంపెనీలకు దోచిపెట్టడానికి రూపొందించబడిన భూసేకరణ పునరావసం పునర్మిర్మాణం బిల్లు 2011ను వ్యతిరేకించడం పురుషుల కంటే దేశపౌరులుగా మనదే ఎక్కువ బాధ్యత!!
Share

Text