Tuesday, May 19, 2015

పుస్తకం – మా నాలుకలు తెగేసిన చోట….

పుస్తకం – మా నాలుకలు తెగేసిన చోట….


“స్త్రీలు శూద్రులు వేదాలు చదివితే వారి నాలుకలు తెగ నరకండి..” ఓ మను ధర్మ శాసనం.

 “వనితా, విత్తం, పుస్తకం పరహస్తం గతం గతం”.. మరో ఉద్భోధ..

“బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో కొడుకు సంరక్షణలో ఉండాలే తప్ప న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి “. ఓ సామాజిక కట్టుబాటు.వీటి గుట్టు విప్పకుండా ఓ బూటకపు మాయ పొరను కప్పేస్తూ స్త్రీని చదువుల తల్లి సరస్వతిగా చిత్రీకరణ పరిపాటి. జ్ఞానాన్ని తద్వారా ప్రశ్నించే సత్తాను స్త్రీ పొందకుండా  ఉండేందుకు భారత సమాజపు ద్వంద్వనీతికి అద్దం పడుతున్న వైనం ఇది. వైదిక మతాన్ని, బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ప్రశ్నించిన బుద్ధుడ్ని హైందవంలో కలిపేసిన బ్రాహ్మణీయ నైతిక సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఈ సంస్కృతే స్త్రీకు పుస్తకం దరిచేరనీయకుండా చేసింది. పుస్తకాన్ని కొందరి కబంధ హస్తాల్లో ఖైదు చేసింది.

           ఈ చారిత్రక నేపధ్యం, ప్రపంచీకరణ పోకడలలో రూపం,సారం మారుతున్న పుస్తకం, ఓ స్వాప్నిక కాలంతో ఊసులాడుతూ బాసల ఊయలలో అల్లిన  పద మల్లికలు, మానవ /స్త్రీ విముక్తిలో పుస్తకం పాత్ర… వీటి సమాధానాల అన్వేషణే ఈ పయనం…

           పుస్తకం జ్ఞానానికి ప్రతిరూపం.  అలలు మాటున, సముద్రపు వొడ్డున నడుస్తూ రూపరహిత చిత్రాలు వేసిన ఇసుక తిన్నె, అమ్మవొడిలో పడుకుని కథ వింటూ పిచ్చిగీతలు గీసిన నేల తల్లి, ఊహ వచ్చిన తరవాత బొగ్గు ముక్కతో గీసిన మట్టిగోడ అనే చిత్రపటం.. ఇవన్నీ పుస్తక ప్రతి రూపాలే. కాకపోతే మనలో కొందరం అదే స్ధాయిలో ఆగిపోతాం. అవేవి కుదరకపోతే మన కళ్ళముందున్న కాగితపు రంగుల ప్రపంచాన్ని బొమ్మలుగా మన హృదయాన్ని హత్తుకుంటాము. మరికొంతమంది ఓనమాలు దిద్దుకుని ముందుకు సాగుతాము. ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటాం.స్వానుభవంతో జ్ఞానాన్ని పొందుతాం.  ప్రతి ఒక్కరు తమ తమ అవకాశాలను బట్టి జ్ఞానానికి రూపురేఖలు దిద్దుకుంటాం. అయితే ఆధునిక శాస్త్ర జ్ఞానానికి, సాంప్రదాయ జ్ఞానానికి మూలం అనుభవమే..!

              ప్రతి మనిషికి జన్మత: కొన్ని నిర్దిష్టమైన స్ధల,కాల పరిమితులు పుట్టుకతోనే సంక్రమిస్తాయి. ప్రకృతి పరమైనవి కొన్ని,  సమాజపరంగా ఏర్పడ్డవి మరి కొన్ని. వ్యవస్ధాపరంగా మనుషులలో  వర్గ, కుల, లింగ వివక్షలతో కూడిన విభజన ఉంది. ఈ విభజన సమాజంలో అసమానులను తయారు చేసి పరిమితులు విధించింది. సమాజ గమనంలో స్త్రీలను గృహలక్ష్మి పేరుతో  జ్ఞాన సముపార్జనకి అనర్హురాలిగా పురుష స్వామ్యం ప్రకటించింది.

             స్త్రీ తన పరిసరాలతో పెంపొందించుకున్న జ్ఞానం సమాజపరం చేసింది. కాని అక్షరరూపం ఇవ్వలేక పోయింది. ఆమె జ్ఞానం పురుషస్వామ్య  పరమయ్యింది. వ్యవసాయాన్ని కనుక్కున్నది స్త్రీ. వ్యవసాయోత్పత్తి రంగంలో 60% పైగా పనులు స్త్రీలే చేస్తారు. మనిషి ఎదగటానికి కావలిసిన ఆహార సేకరణ, వంట, వార్పు, పిల్లల పెంపకం స్త్రీకి సంబంధించిన జ్ఞానమే! కాని మన సమాజంలో నల భీమ పాకం, రైతే రాజు లాంటి సామెతలతో నిండి పోయింది. స్త్రీలను తాజ్ హోటల్ లలో సంప్రదాయ రుచులు పేరిట ప్రవేశపెట్టి లాభాలను పొందటానికి పెట్టుబడిదారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇది లాభాల వేట కోసమే కాని స్త్రీలకై మాత్రము కాదు. ఇప్పటికి పేరొందిన చెఫ్ లు మగవారే. హోటల్ మేనేజ్ మెంట్స్ పురుషాధీనంలోనే ఉన్నాయి. చెట్టు చెట్టుకు పేరు పెట్టి గుర్తించి పిలిచే ఆదివాసి స్త్రీల కోయిల పాటలో, చందమామను పరిచయం చేసే అమ్మ జ్ఞానంలో, పాటలో శ్రమను మరిచే పల్లె పడుచు దగ్గర తరాల చరిత్ర ఉంటుందని గుర్తించలేము.

            పురుషుల జ్ఞానాన్ని గుర్తించి సమాజంలో ప్రతిష్టించినంతగా స్త్రీల జ్ఞానానికి సముచిత స్థానం లేదు. ఇలా స్త్రీల జ్ఞానానికి వైరుధ్యాల పరిమితుల్ని చూస్తాం. అననునిత్యం మారుతున్న ప్రకృతి, సమాజం మీద పూర్తి జ్ఞానం ఉండటం సాధ్యం కాదు కాని అవగాహన పెంపొందించుకునే విషయంలో స్త్రీ ఎంతో తపన చెందుతుంది. ఆ అన్వేషణ తపన జ్ఞానానికి దారులు వెతుకుతాయి. దాని నుంచి ఓ ఆలోచన, ఆచరణ తద్వారా కొత్త జ్ఞానం పుట్టుకువస్తుంది. జ్ఞానం మరింత పదునెక్కుతుంది. ఆ ఆలోచన ఆచరణలో పెట్టినప్పుడు  ట్రయల్ ఎండ్ ఎర్రర్ పద్ధతిలో కార్యరూపం దాల్చి అదే జ్ఞానం సమాజపరమవుతుంది. అలాగే తన ఆదరణకు సంబంధం లేని ఇతరుల ఆలోచన ద్వారా రూపొందిన ఆచరణ ద్వారా కూడా మనిషి జ్ఞానాన్ని పొందుతాడు. ఈ ఆలోచన జ్ఞానం తమకు అనువైన రీతిలో స్త్రీలపై పితృస్వామ్యం రుద్దుతుంది. ఇందులో స్త్రీల ప్రమేయం ఏమీ ఉండదు. స్ధల, కాల పరిమితులతో సంబంధం లేకుండా స్త్రీల సమస్యలన్నింటిని ఒకే కోణంలో చూపబడతాయి. శాస్త్రీయత ఆధారంగా స్త్రీల సమస్యలకు సరి కొత్త న్యాయబద్దమైన సమాధానం వెతకడం పరిష్కార దిశవైపు నడవడం నేటి సమాజ అవసరత. ఆచరణ ఆలోచన, మధ్య వైరుధ్యాల్ని తొలగించితే మార్పుకు దోహదపడుతుంది. ప్రకృతిని మనకు అనుకూలంగా మార్చుకోవడమే కాకుండా సమాజపరంగా వ్యవస్ధాగత మార్పుల్లో భాగం కాగలం. ఈ ప్రయత్నంలో మనల్ని మనం విముక్తి చేసుకుంటూ సమాజ విముక్తిలో భాగం కాగలం. అందుకు ఆయుధం పుస్తకం!

               ఆ పుస్తకమే మనకి అందుబాటులోకి రాక కొన్ని తరాలు మిగిలిపోయాయి. మన మీద సాంఘిక పరమైన ఆంక్షలు ఎన్నో కదా! మనం కులం, మతం, వర్గంగా విడదీయబడ్డ వాళ్ళం. వ్యవస్ధలు మారిన కొద్ది పుస్తకం మన చేతుల్లోకి వచ్చింది. మనకున్న వెసులుబాటుతో  శ్రామికురాలిగా, ఇల్లాలుగా, ద్విపాత్రాభినయం లేదా త్రిపాత్రాభినయం చేస్తున్న స్త్రీలకు పుస్తక పఠనానికి అవకాశమేది? ఉన్నా అది తక్కువే కదా! ఇక చదివిన పుస్తకం మీద చర్చల వాతావరణానికి కుటుంబంలో, సమాజంలో కొనసాగింపు ఎక్కడ? స్త్రీలను రోల్ మోడల్ గా ఈ వ్యవస్ధ, మీడియా తన అవసరాల కొద్దీ తయారుచేస్తుందే కాని తనకు తానుగా  రోల్స్ ఎక్కడా డిఫైన్ చెయ్యనివ్వడం లేదు. ఈ వైరుధ్యాన్ని పరిష్కరించుకునే దిశలో స్త్రీకు పరిమితులు ఉన్నా సంఘర్షిస్తూనే ఉంది జీవితానికి ఒక అర్ధాన్ని వెతుక్కుంటుంది. ఇన్ని గోడల మధ్య తన ఆలోచనను, ఆచరణను ఆసక్తిని అక్షరీకరించడానికి ప్రయత్నిస్తుంది. మొల్ల, మీరా కొత్తతరం అచ్చమాంబ ఇలా ఎందరో! కాకపోతే స్త్రీ వాదులు అన్నట్టు స్త్రీ సాహిత్యానికి, పుస్తకాలకు అంత ప్రాచుర్యము  లేదు. అయినా సరే! ఒక ప్రయత్నము ఆగలేదు.

          ఇప్పుడు పుస్తకం అనేక కొత్తరూపాల్లో వస్తుంది.  అంతర్జాలం, ప్రింట్ మీడియా ముఖ్యమైనవి. ఈ మధ్య కాలంలో పుస్తక పఠనం, ప్రింటింగ్ పెరిగిందని ఒక నివేదిక తెల్పినట్టు గుర్తు. ఇది స్త్రీల విషయంలోనా? సందేహమే! రచయిత్రుల సంఘాలు ఏర్పడుతున్నాయి. ఇది మార్పుకు సంకేతమే! వివిధ సైద్ధాంతిక దృక్పధాలు కలిగినా సంఘటితమవుతూ స్త్రీవాద అస్తిత్వానికి ఊపిరులూదుతున్నారు. కథ, కథానిక, కవిత, నవల, నాటిక ఇలా వివిధ ప్రక్రియలలో తమ ఆలోచనా అనుభవాల్ని జ్ఞానాన్ని సమాజపరం చేస్తున్నారు. తన సామాజిక కర్తవ్యాన్ని నిర్వహించడానికి ముందుకొస్తున్నారు. అలా ముందుకు వచ్చిన పుస్తకాలెన్నో!

          అలాగే స్త్రీల జీవిత కోణాలని ఆనాటి  సామాజిక పరిస్థితులను, సంఘర్షనలను  ఆవిష్కరించి సవాలు చేసిన చలం లాంటి రచయితలు ఉన్నారు. వారి కంట్రిబ్యూషన్ తక్కువేమీ కాదు. వారి భిన్న దృక్పధాలు, అనుభవం, జ్ఞానాన్ని అనుసరించి అవి వెలువడ్డాయి.

నింగికెగిసిన “చందమామ” నా పుస్తకం

నేర్చుకుంటున్న నాలుగు అక్షరముక్కల్ని కూడబలుకుంటున్న వయసులో నాకు తెలిసిన పుస్తక ప్రపంచం చందమామ  ! అమ్మ ఒడి నుంచి బడికి వెళ్ళే క్రమంలో జీవితంలో ఉండే వైరుధ్యాలను అర్ధం చేసుకోలేని పరిస్ధితి, సృజనాత్మకతకు బదులుగా కాల్పనికతను ఆస్వాదించే వయసులో భవిష్యత్తును రంగుల కలలోకి తీసుకెళ్ళేది. ఇప్పటికి జీవన సంఘర్షణలో స్వాంతన కోరుతున్నప్పుడు కాల్పనిక జగత్తులోకి వెళ్ళీపోవాలన్న కాంక్ష రగిలినప్పుడు గుర్తొచ్చేది నా నుండి నింగికెగిసిన పుస్తక నేస్తం  చందమామే!

               స్వాతంత్ర్యం అంటే బ్రిటిషు వాళ్ళు వెళ్ళిపోయి, మనల్ని మనం పరిపాలించుకునే వ్యవస్ధ అని నమ్మే సంధి కాలంలో పుట్టిన నాకు పరిచయమైన మొదటి పుస్తకం వేంకటేశ్వర సుప్రభాతం. వలస వాదుల  నుండి దేశాన్ని విముక్తం చేయడానికి నైజాం నవాబు ఆధిపత్యాన్ని, భూమి కోసం భుక్తి కోసం సాయుధంగా ఎదుర్కొన్న కమ్యునిస్ట్ పార్టీ ప్రభావాన్ని పక్కన పెట్టి దేశంలో అధికార మార్పిడి తెల్లదొరలనుండి నల్ల దొరలకు స్వాతంత్ర్యం పేరిట జరిగిందన్న వాస్తవాన్ని గ్రహించలేని సాధారణ ప్రజానీకంలో భాగమైన మా  అమ్మానాన్నలు పరిచయం చేసిన పుస్తకం అది. కులం, మతం, వర్గ ప్రయోజనాల్ని మూసలో  పోసి ప్రజాస్వామిక వ్యవస్ధను తీర్చిదిద్దిన ఆనాటి నాయకత్వం అప్పటి తరానికి అవే విలువలని అంట గట్టింది. ఆ పుస్తకంపై అమ్మ పసుపుకుంకుమ పెట్టి చాలా నిష్టగా చదివేది. సంస్కృతం లో ఉన్న ఆ పుస్తకం ఎంతవరకు అర్ధమయ్యేదో తెలియదు. ఆమె దాన్ని అర్ధం చేసుకోవాలని కోరుకోలేదు. నాన్న పెట్టే హింస నుంచి ఇంట్లో నాలుగు గోడల మధ్య నాన్నకు దూరంగా గడిపే ప్రయత్నంలో పూజా పుస్తకం ఓ వెసులుబాటు అని అమ్మ అనేది. ఒకే అంశానికి బొమ్మా బొరుసు లాంటి రెండు కోణాలలాగా పుస్తకం అంటే ఒక కన్నీటి రూపంగాను, అమ్మ ఒడిగా మదిలో మిగిలిపోయింది.

              ప్రాపంచిక విలువలు, దాని జ్ఞానం బట్టి సమాజానికి దిశా నిర్దేశం జరుగుతుంది కాబట్టి అప్పట్లో మిక్సడ్ ఎకానమీ పేరుతో పెట్టుబడిదారీ దేశాలైన అమెరికా, ఇంగ్లండుల నుండి సోషలిస్ట్ దేశమైన రష్యాలో ప్రయోగాల అనుభవాల నుండి దేశ ప్రయోజనాలను తీరుస్తామని ఆనాటి పాలకులు, ప్రచారం చేశారు. ఆ దశలోనే కాంగ్రెస్ హయాంలో నెహ్రూ మహలని బోస్ దర్శకత్వంలో దేశాభివృద్ధని కొన్ని పధకాలు రూపొందించారు. స్ధిరవ్యవసాయ వ్యవస్ధ నుండి పరిశ్రమల కేంద్రంగా ఉండే వ్యవస్ధకి అంటే భూమి వ్యవస్ధ నుండీ పెట్టుబడి ప్రాధాన్య వ్యవస్థకు మారుతున్న కాలమది. పెట్టుబడికి కావలసిన వెసులుబాటు కల్పించారు. పెట్టుబడికి కార్మికులు అవసరమయ్యారు . ఈ క్రమానికి ముందే  చాలా మంది ఉద్యోగరీత్యా రంగూన్ లాంటి విదేశాలకు వెళ్ళే గోదావరి జిల్లాల్లో పుట్టిన నాన్న కుటుంబీకులు ఉన్న కాసింత భూమి కుటుంబ అవసరాలకు సరిపోదు కాబట్టి కొత్తగా వచ్చిన విద్యావకాశాలు కల్పించి నాన్నను ఓ వైట్ కాలర్ ఉద్యోగానికి పంపించేశారు. పెట్టుబడి విచ్చిన్నం చేసిన వ్యవస్ధల్లో ఉమ్మడి కుటుంబం ఒకటి. న్యూక్లియర్ కుటుంబం ఏర్పడుతున్న తరుణంలో మా అమ్మ నాన్నతో ఏడడుగుల బంధంతో వచ్చేసింది.

             చిన్నపాటి టౌన్ లో పుట్టినా వ్యాపార సంస్కృతి, ప్రసార సాధనాల మాధ్యమం ద్వారా సమాచారం అంతగా అమ్మకు అందుబాటులోకి రాలేదు. స్త్రీకి ఉత్తరం ముక్క రాసేంత, పిల్లల్ని  మంచి కార్మికులను తయారు  చేయడానికి అవసరమైన చదువు పెట్టుబడిదారీ వర్గం సమాజాన్ని ప్రోత్సహించింది. మొత్తంగా వ్యవస్ధను ప్రశ్నించే ఎదగని దశలో అమ్మ  సంబంధాలన్నీ భూమితోనే ముడిపడి వాటి భావజాలానికి ప్రతిబింబంగానే ఉండేవి. ఆమె ఆ వ్యవస్ధలో దొరికే కాసింత రక్షణనే కోరుకుంది తప్ప వేటి మీద ధ్యాస ఉండేది కాదు. అందుకే 70 వ దశకంలో అమ్మ పేపరు చదవడం చూడలేదు. అదేదో నాన్న ప్రపంచంలా ఉండేది. ఎప్పుడైనా యద్దనపూడినో, మాదిరెడ్డినో చదవాలని ప్రయత్నం చేసినా నిరంతరం పని ఒత్తిడితో సాధ్యపడేది కాదు. అప్పట్లో వంటింట్లో వెసులుబాటుకు ఇన్ని పరికరాలు లేవు. ఎప్పుడో ఒక సారి గుడిపాటి వెంకట చలాన్ని చదవబోతే ’గుడిసేటి దానా ’ అని పరమ బూతులు లంకించుకున్న నాన్న ఉగ్ర రూపం ఇంకా గుర్తుండి పోయింది. పాతివ్రత్య ధర్మాన్ని, పితృస్వామ్య  కట్టుబాటునో పెంపొందించే పుస్తకాలే అమ్మకు పరిమితం. బహుశా ఇది అమ్మ పరిస్ధితి మాత్రమే కాదు. అప్పుటి  అందరి స్త్రీల పరిస్దితి ఇంతేనేమో..!

             ఆధునీకరణ సమాజంలో వ్యవస్ధాపరమైన మార్పులకు దోహదపడినా కొంత జ్ఞానం పుస్తక రూపంలో అందుబాటులోకి వచ్చినా అందరి అమ్మల లాగానే మా అమ్మను చేరలేదు. ఆలోచనా పరిధి విస్తృతమయ్యి చైతన్య స్ధాయిలో మార్పులు రాలేదు. సహజంగానే తన సమస్యలన్నింటికి సమాధానం తరాలుగా అనుసరిస్తున్న సమాధానాలే ఉంటాయని వాటిని మార్చలేమనే నిర్దుష్ట అభిప్రాయానికి వచ్చేసింది. సమస్య ఏదైనా మారిన సమాజ నేపధ్యంలో జ్ఞానం ఆధారంగా క్రొత్త సమాధానాలు వెతకలేని పరిస్థితులు, సమాజ కట్టడిలో తాను అలాగే మిగిలిపోయి మాకు అదే సారాన్ని పుస్తకరూపంగా కాక మౌఖికంగా అందించింది. కుటుంబంలో పాత సంబంధాలు పోయి కొత్త సంబంధాలు రాకపోయి తాను కోరిన రక్షణ పొందకపోయిన  అమ్మకు నిరాశే మిగిలింది. అన్వేషణ ఆగకపోయినా ఆ ప్రశ్నలను అక్షర రూపంలో బహిరంగంగా సంధించలేకపోయింది.

           ఉమ్మడికుటుంబంలో కుటుంబ సభ్యులు అందరు బాధ్యతను పంచుకునే క్రమం నుంచి పిల్లలను చదివించడం, మార్కెటుపని, అతిధిసత్కారం లాంటి పనులు మీద పడ్డాయి. ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన నాన్నకు పచ్చటి పొలాలు, ఊరి జనం, ప్రేమలకు దూరంగా ఉండటం మొత్తంగా గ్రామం నుంచి విడివడి ఎక్కడో బ్రతకడం బాధకి గురిచేసింది. తనపై అధికారుల జులుం,ఉమ్మడి కుటుంబ బాధ్యతలు మనిషిలో క్రూరత్వాన్ని పెంచాయి. తాను హింసకి గురౌతూ అమ్మను గురిచేశాడు. అలాంటి హింసాత్మక వాతావరణంలో పుస్తకానికి చోటెక్కడ?

                      నాన్నకు చదువు ఉద్యోగాన్నయితే ఇచ్చింది కానీ సమాజపు కులపుకోరల్లోంచి తప్పించలేకపోయింది. హోదా అయితే ఉంది కాని అది ఆఫీసు వరకే పరిమితం శూద్ర కుటుంబానికి చెందిన అమ్మానాన్నలు అగ్రవర్ణ ఆధిపత్య కులాల వారికి అంటరానివారే! వారి వంటింట్లోకి, పూజగదిలోకి కూడా ప్రవేశం రద్దే! మంచి నీళ్ళను కూడా దోసిట్లో ఎత్తిపోస్తే తాగే రోజులవి. పేరంటానికి పిలిచి కడకు తాంబూలం కొంగులో వేసే సంస్కృతిని అమ్మ అదే ధర్మం, తన కర్మ ఫలం అనుకునేది. అమ్మ అవమానాలు తప్ప లోకపు విలువలు తెలియని నేను ఆ అగ్రవర్ణాల వంటింట్లోకి దూరి పాత్రలన్నీ ముట్టుకుని దేవుడి ప్రసాదం ఎత్తుకుని వచ్చేస్తే నాన్నతోనే చెట్టుకు కట్టించి కొట్టించారు. అప్పట్లో దేవతలతో చంపబడిన రాక్షసుల కంటే ఆ బ్రాహ్మణ కుటుంబాలే మరింత రాక్షసంగా కనిపించాయి. ( ఆ దేవతల నీతి గురించి తరవాత తెలుసుకున్నాను అనుకోండి అది వేరే కథ. )

             అదిగో, అప్పుడే అందిన పుస్తకం బైబిలు. కుల అణచివేతకు గురైన కూడా మా కుటుంబంపై రుద్దబడిన బ్రాహ్మణ భావజాల మంత్రోక్త సంస్కృతి పుస్తకాల ( అవి ఎంత అర్ధం కాకపోయినా ) సారమే ఆధ్యాత్మిక ఆకర్షణగా ఉండేది. అందరూ  ఏ మడి లేకుండా ముట్టుకునే బైబిలు చూడగానే ఏదో భక్తి భావం, సంభ్రమంగా అనిపించేది. ఎందుకంటే  మామూలు పుస్తకాన్ని చదివినట్టే ఎప్పుడు దు:ఖ భారంతో నిండిపోయినా తెరుచుకోవడమే. దానికి “మడి’ లేదు. నాకు అర్ధం కాని చదవలేని పరభాషా శ్లోకాలచే రుద్దబడే ఆధ్యాత్మికత లేదు. ఎంతో ఆత్మీయంగా మనసును హత్తుకునేలా చేసింది.  నాకు తెలిసిన భాషలో కూడా దైవత్వానికి అర్ధం కనుగొనవచ్చని అనిపించింది. దైవత్వం యొక్క రహస్యాలను చేధించినంత సంబరం కల్గింది. నా కళ్ళ ముందే నాన్న బైబిలును తగలబెడ్తుంటే బ్రాహ్మణూలూ, హిందూ జ్ఞానమే కొలబద్దగా నమ్మే నా తండ్రి లాంటి వారందరి కుల మత  బానిసత్వపు ఆలోచనా విధానాన్ని అర్ధం చేసుకోలేని వయసు అది. ( అప్పట్లో క్రైస్తవ మతం అంటరాని  మతంగానే చూపబడేది.)

           1960 దశకం చివరిలో అభివృద్ధి అంటే సమాజ పరిణామ క్రమంలో వచ్చిన ఫలితం అని కాక ఫలితాన్నే అభివృద్ధిగా చూసే భావజాలం విస్తరించింది. స్వపరిపాలనలో సోకాల్డ్  అభివృద్ధి పథకాలు, ఆర్ధికపరంగా చూస్తే మిశ్రమ ఆర్ధిక వ్యవస్థ  విఫలత, వ్యవసాయానికి పరిశ్రమలకు మధ్య ఉండవలసిన సమన్వయం, ఐక్యత కొరవడి సమాజంలో సంక్షోభాన్ని సృష్టించింది. ఈ సంక్షోభం నుంచి పుట్టుకొచ్చిందే శ్రీకాకుళం నక్సల్బరి ఉద్యమం. వాటి ప్రభావం నాన్న మీద ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా ఉండేది కామోసు! ఆ తరం పిల్లల్ని ప్రభావితం చేసిన సోవియట్ యూనియన్ నుంచి వచ్చే పిల్లల సాహిత్య పుస్తకాలు తెచ్చేవాడు. ఎక్కడ సోవియట్ యూనియన్ రష్యా ? ఎక్కడ తాలూకా స్ధాయి పాఠశాలలు ? నాన్న ఎక్కడ నుండి తెచ్చేవాడో కానీ ప్రతినెలా ఒక కానుకగా ఇచ్చేవాడు. దళసరి పేజీలతో రంగురంగుల బొమ్మలతో మెరుస్తూ పేజీలు తిప్పుతుంటే ఒక అద్భుత లోకంలోకి విహరిస్తున్నట్లు ఉండేది. కానీ ఇప్పటి తరానికి ఆ పుస్తకాలు అందుబాటులోకి రాకుండా పోవడానికి అనేక అంతర్జాతీయ రాజకీయకారణాలు ఉన్నాయి.

         అదే 1969లో తెలంగాణ ఉద్యమం ప్రాంతీయ ఉద్యమాలకి ఒక దిశను చూపించింది. ఉద్యోగరీత్యా తెలంగాణలో ఉండేవాళ్ళం. అందరూ మమ్మల్ని ఆంధ్రావాళ్ళూ అని పిలిచేవాళ్ళు. గొడవలు జరుగుతున్నాయంటే ఆంధ్రా కుటుంబాలన్నీ ఒకచోట చేరిపోయేవి. మా కుటుంబాన్ని కాపాడింది తెలంగాణ మిత్రకుటుంబాలే. మేము గోదావరి జిల్లాలకి వెళితే మేము మాట్లాడే భాష వెక్కిరింపబడేది. పుస్తకంలోని భాషే సుమారు ఇంట్లో ఉండేది. కాని మేము మిత్రుల వద్ద పరిసరాలలో నేర్చుకున్న యాస వేరే. సాధారణంగానే పుస్తక భాషే గొప్పదని చెప్పిన ఆధిపత్య భావజాల ప్రభావం ప్రజల మీద ఉన్నట్టే మా మీద ఉండేది. రాజకీయాలు తెలిసిన తర్వాతే ప్రాంతీయ మండలికాలు అణిచివేయబడి ఒక వర్గ మాండలిక భాషే పుస్తకాన్ని ఎలా ఆక్రమించుకుందో అర్ధం అయ్యింది.

           జై ఆంధ్రా ఉద్యమం 1970 లలో మిన్నంటుతుంటే నాన్న ఏవేవో ఉద్యమానికి సంబంధించిన పేపర్లు, పుస్తకాలు తెచ్చేవాడు. ఆ రాజకీయాలు గాని పుస్తకాలుగాని కుటుంబానికి సంబంధం లేనట్టుగా అతని కస్టడీలోనే ఉండేవి.  దానికి భిన్నంగా అమ్మ దాచుకుని చదివే షాడో డిటెక్టివ్ నవలలు పావలాకు అద్దెకు దొరికేవి. వాటిని నాన్నకు తెలియకుండా పరుపు క్రింద దాచుకుని చదువుకునేవాళ్ళం. అవి చదువుతున్నంత సేపూ ఎంత త్రిల్!

              అప్పట్లో రాజకీయ పరిస్ధితి చూస్తే నెహ్రూ మరణం తర్వాత జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధికారం కోసం కుమ్ములాట మొదలయ్యింది. జాతీయ కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ గా విడిపోయింది. సరిగ్గా అదే సమయంలోనే శ్రీకాకుళం నక్సల్బరీ పోరాట ప్రభావంతో మేధావులు, మధ్య తరగతి బుద్ది జీవుల సెక్షన్ ఒకటి తయారయ్యింది. ఆ వర్గం దేశంలోని దోపిడీని, వివక్షతను గుర్తించి ప్రజా ఉద్యమాలకు బాటలు వేసింది. ప్రజల్లో చైతన్యం కలిగించింది.                      ప్రజల్లోని అసంతృప్తి అశాంతిగా మారకముందే నాయకత్వపు పెనుగులాటలో గెలిచిన ఇందిరా కాంగ్రెస్ 20 సూత్రాల పథకం , బ్యాంకుల జాతీయం లాంటి పథకాలతో ఆకట్టుకుందామని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దేశంలో తన మనుగడే ముప్పని భావించిన ఇందిరా గాంధీ మానవ హక్కులను హరిస్తూ ఎమర్జెన్సీ ప్రకటించింది. మేధావులు వామపక్ష భావజాలం అండగా నిలిచే వారిని అభ్యుదయ వాదులతో సహా జైళ్ళకి పంపి జైళ్ళను నింపేసింది.  భూమయ్య, కిష్టయ్యగౌడ్ పౌరహక్కుల  పోరాటయోధులు ఉరితియ్యబడ్డారు. ఆ రాజకీయాలు గాని, సాహిత్యం గాని  మధ్య తరగతి మేధావి వర్గానికి కొంతమేరకు కొన్ని ప్రదేశాలలో చేరిందేమోకానీ సంప్రదాయ మధ్య తరగతి స్త్రీలకు అంద లేదు. ఆ తర్వాత ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమ అండతో  జనతాపార్టీ అధికారంలోకి వచ్చినా ఎక్కువకాలం నిలువలేకపోయింది. అనేకరకాల ఎత్తుగడలతో ఇందిరా కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకున్నా పోరాటాల స్పూర్ధి యువతపై ఉండేది.

1980లలో ఒక వైపు నవలా సాహిత్యం, విప్లవ సాహిత్యం రెండూ వచ్చేవి. మెయిన్ స్ట్రీమ్ పత్రికలైన ఆంధ్రజ్యోతి, పత్రిక , ప్రభలలో సీరియల్స్ ఒకవైపు,,విప్లవ సంఘాలనుంచి వచ్చిన పుస్తకాలు మరోవైపు . తెలంగాణా జిల్లాల్లో( నాకు తెలిసి ) విప్లవ సాహిత్యం విద్యార్ధులను ఆకట్టుకుంది.ఆ పుస్తకాలు ఇచ్చిన నూతన చైతన్యంతో ఆలోచనా పరిధి పెరిగి సమస్యల పరిష్కారాన్ని వాటిలో వెతుక్కునే వాళ్ళం. దేశీయ సాహిత్యమే కాదు విదేశీ ఉద్యమ సాహిత్యం యొక్క పరిచయం ఎంతో స్పూర్తినిచ్చేది. ప్రపంచాన్ని మార్చే ఆయుధాలుగా పుస్తకాలు చాలా అపురూపంగా అనిపించేవి. సమస్యలకు మూలాలు వ్యవస్థలోనే ఉన్నాయన్న స్పృహ, శాస్త్రీయమైన ఆలోచనా విధానం ఆచరణలో కూడితే ప్రతదీ  సాధించవచ్చనే ఆత్మ విశ్వాసాన్ని నింపిన సహచరులు  పుస్తకాలు.

          1980 లో కాలేజీలో అడుగుపెట్టేటప్పుడు రకరకాల మిత్రులతో పరిచయం.  పుస్తకాలు, సినిమాల గురించి మాట్లాడే వాళ్ళేదో  మరో  ప్రపంచంలో ఉన్నట్టు ఉండేవాళ్ళం. అయిన ఎక్కువగా సబ్జెక్టుతో కుస్తీ పట్టేవాళ్ళే  ఉండేవాళ్ళు. శరత్ చంద్ర, ప్రేమ్ చంద్, రవీంద్రలను పలకరించి, చలాన్ని గుండెలకి హత్తుకుని , కొడవటిగంటిని పలరించేవాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే ! ఆ అతి కొద్దిమందికోసం ఎంత వెతుకులాట… బయటకు వెళ్ళటానికి కూడా పర్మిషన్ అడగవలసిన ఆ రోజుల్లో గవర్నమెంటు లైబ్రరీకి వెళ్ళి శ్రీదేవి రాసిన కాలాతీత వ్యక్తులు లాంటి కథలు చదవడం అంటే స్వేచ్ఛకు తొలిమెట్టుగా భావించే వాళ్ళం!

ఇపుడు గ్రంధాలయాలు లేవు. గ్రంధాలయ ఉద్యమాలు లేవు. 2000 సంవత్సరంలో అనుకుంటా దళిత బహుజన మేధావి మిత్రులు గ్రామాలలో గ్రంధాలయాల కోసం కృషి చేసినట్టు గుర్తు. 80 వ దశకంలోనే లైబ్రరీలు మూతపడటానికి సిద్ధమవుతున్న కాలం. కొందరు ప్రైవేటు లైబ్రరీలలో పుస్తకాలు అద్దెకు ఇచ్చేవారు. కాని అందులో మ్యాగజైన్లు, కొంతమంది రచయితల పుస్తకాలే దొరికేవి. వాటిలో ఎన్కౌంటర్ మ్యాగజైన్ ఒకటి. దానిలో పేరున్న విదేశీ నవలలు అనువదించి వేసేవారు. పుస్తకాలు చదివిన తర్వాత ఎన్నో గంటలు చర్చించుకునే వాళ్ళం. ఆ పుస్తకాలు స్త్రీల సామాజిక పరిస్ధితిని పరిచయం చేసేవి. సమస్త మూలాలు తెలుసుకోవాలనే ఉద్విగ్న భావాలను పెంపొందించిన పుస్తకాలు అవి. ఈనాటి తరానికి వాటి (పుస్తకాల) పట్ల సరైన దృక్పథం, ఓపిక కూడా లేవు. అసలు వాళ్ళు కళాశాల లైబ్రేరిలకు వెళ్ళటమే గగనమేమో !

        టినేజిలో  యుద్దనపూడి, మాదిరెడ్డి ,యండమూరి నవలలు, సీరియల్స్ ప్రభావితం చేస్తున్న తరుణంలో కూడా మనసుని ఆకట్టుకునేది మాలతి చందూర్ ప్రశ్నలు- జవాబులు “ప్రమాదాననం”  కాలమ్ . ఇది  ఆంధ్రప్రభలో వచ్చేది. ఎన్నో ప్రశ్నలకు ఆమె దగ్గర సమాధానం ఉన్నట్టనిపించేది. పెద్దయిన తరవాత యిలాగే మరిన్ని పుస్తకాలు చదివి కోట్ చెయ్యాలనే స్ఫూర్తి ఆ కాలమ్ యిచ్చేది. అప్పట్లో యువతను ప్రభావితం చేసిన పుస్తకాల్లో వాసిరెడ్డి సీతాదేవి ‘మరీచిక’ నవల.ఆ నవల రెండు పరస్పర వ్యతిరేక ధోరణులను చర్చించి యువతరానికి అవి రెండు ఎండమావులే అని తేల్చింది.  నక్సల్బరి అందించిన స్పూర్తితో కొంతమంది యువకులు శ్రీకాకుళం, సిరిసిల్ల విప్లవాగ్నులు సృష్టిస్తుంటే , పీకల లోతు సంక్షోభంలో కూరుకుపోయిన అంతర్జాతీయ పెట్టుబడిదారి ఆర్ధిక వ్యవస్థలు యువతకి హరే రామ హరే కృష్ణ అంటూ అరాచక హిప్పి సంస్కృతిని అంటించిన వైనాన్ని, అంతా మాయే  అంటూ యువత గంజాయి దమ్ములో తేలిపోయిన  అంశాల్ని చర్చించింది.
ఆ దశలోనే  వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దిన పుస్తకాలెన్నో! రష్యన్ , చైనా సాహిత్యం ఉత్తేజపరిచేవి. గోర్కి అమ్మ, తండ్రి కొడుకులు,స్కార్లేట్  లెటరు, రక్తాశ్రువులు,  ఏడుతరాలు , చైనాలో స్త్రీ విముక్తి ఇలా  ఎన్నో! మరోవైపు శ్రీ శ్రీ , శివసాగర్, తిలక్ అమృతం కురిసిన రాత్రి , రంగనాయకమ్మ విశ్లేషణలతో కూడిన పుస్తకాలు ముఖ్య మైనవి.  రంగనాయకమ్మ జానకి విముక్తి, బలిపీటం లాంటి పుస్తకాలు అమ్మ తరం వారి జీవితాల లోని అణిచివేతను అర్థం చేయించి  జీవితం లో విముక్తి కోరే ఆలోచనలను, స్పూర్తిని కలగచేసేవి.    కుటుంబంలో ఘర్షణల మధ్య నండూరి ఎంకి పాటలు మనసుని ఉల్లాసపరిచేవి.  యువతకు అలంకరణ ఆభరణాల పట్ల ఉండే ఆకర్షణకు  దూరంగా, వ్యక్తిత్వానికి విలువను,  ఆచరణకు స్పూర్తినిచ్చేవిగా పుస్తకాలు ఉండేవి.

       స్వాతంత్రం వచ్చిన 40 ఏళ్ళ కాలం లో అంటే 80ల తర్వాత వ్యవసాయ ఆధారిత కులాలు భుమిపైన పరిశ్రమలపైన  రాజకీయంగా పట్టు సంపాదించాయి.    అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ సారధ్యం లో తీర్చిదిద్దిన రాజ్యాoగం  అణగారిన కులాలకు కల్పించిన వెసులుబాటు, క్రైస్థవ మిషనరీలు ఇచ్చిన సహాయంతో దళితులు కాస్తంత చదువు నేర్చుకొని పుస్తకానికి  దగ్గరయ్యారు. మరోవైపు   అప్పటివరకు ప్రభుత్వం చిత్త  శుద్దితో చేపట్టని పథకాలు ఈ వర్గాలకు చేయూతని ఇవ్వలేక పోయాయి.  సామాజిక సంబంధాలతో మార్పులేకుండా ఆధిపత్య ధోరణులు పెరిగిపోవడం తో సమాజం చిన్న చిన్న భాగాలుగా విడిపోయింది.  భారతీయ కుల విధానం శ్రమసంబధాలతో ముడిపడి ఉంది కాబట్టి  ఎస్.సి. బి.సి. విభజనలతో వున్న కులాలలో అత్యధిక శాతం  ఉత్పతి సాధనమైన భూమి లేనివారే.  శారీరక శ్రమలకు బందీ అయినవారే .  ఈ సంబంధాల నేపధ్యం లో దళితులు తీవ్ర విద్వేషం , వివక్ష, వెలివేతలకు గురయ్యారు. కారంచేడు, కంచికచర్ల, చుండూరు, వేంపేట ఆధిపత్య  కులాల దురాహంకారానికి సాక్ష్యాలుగా నిలిచాయి.

కారంచేడు తర్వాత దళిత బహుజన వర్గాల పోరాట స్పూర్తి ఆనాటి విప్లవోద్యమాల ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసింది. భారత దేశంలో వర్గం కులంగా వ్యవస్థికృతం  అయిందని తొలిసారిగా ఆలోచన  మొదలయింది. ఆనాటి దళిత ఉద్యమ నాయకత్వం విప్లవ పంధాను  వదిలి సోకాల్డు రాజకీయ పార్టీల బాటనే ఎన్నుకొన్నారు.  తాత్విక చింతనకు  జ్యోతీరావు పులే, అంబేడ్కర్, పెరియార్, నారాయణగురులను ఆదర్శంగా పేర్కొన్నారు. ఈ అస్తిత్వ ఉద్యమాలు  ఆంధ్రప్రదేశ్ లో నెలకొని ఉన్న ఆధిపత్య కులాల సమస్యలతో నిండిన సాహిత్యానికి  ధీటుగా  ఆయ వర్గాల సమస్యలను ముందుకు తెచ్చాయి.
అప్పటికే జాషువా, బోయి భీమన్న, ఉన్నవ లక్ష్మీ నారాయణ లాంటి వారు దళిత జీవన చిత్రాన్ని సాహిత్యములో ఆవిష్కరించారు. హేతువాద సంఘాల ప్రభావము ఉన్నప్పటికీ వాటి సాహిత్యం అందరికీ అందుబాటులో ఉండేది కాదు. దళిత ఉద్యమ సాహిత్యం పుంఖాను పుంఖాలుగా వారి బాధలనుండి, అణచివేతల నుండి పుట్టుకొచ్చింది. 1995 లో వర్గీకరణ ఉద్యమం దళిత కులాలలోని అంతరాలను ముందుకు తెచ్చింది. దళిత సాహిత్యాన్ని వివిధ కోణాలతో సుస్సంపన్నం చేసింది. గుర్రం జాషువా- గబ్బిలము, ఉన్నవ లక్ష్మీ నారాయణ – మాలపల్లి, కత్తి పద్మారావు అంబేద్కర్ వాల్యుమ్స్ , భారతదేశములో స్త్రీ, పితృస్వామ్యంలో స్త్రీ, కొలకనూరి ఇనాక్ దళితకథలు, ఎండ్లూరి కొత్తకల, వర్గీకరణం, శిఖామణి, ఆల్చిప్ప, సిలకొయ్య, వేమూరి ఎల్లయ్య కక్క, మద్డురి నగేష్ బాబు, గూడె అంజయ్య, ఇలా ఎందరి పుస్తకాలో సాహిత్యానికి సామాజిక విలువలను  అద్దాయి. కలేకూరి ప్రసాద్ పాట కర్మ భూమిలో పూసిన ఓపువ్వా కన్నీరు తెప్పించేది.

         కుల అణచివేతకు వ్యతిరేకంగా వచ్చిన దళిత ఉద్యమాల చైతన్యంతో స్త్రీల సమస్యలన్నీ ఒకటి కాదని దళితస్త్రీల వెతలను అనేకమంది రచయిత్రులు తమ రచనలద్వారా సమాజానికి పరిచయం చేశారు. డాక్టర్ విజయభారతి, చల్లపల్లి స్వరూపారాణీ వ్యాసాలు, అసత్య గానం, మా అక్క ముక్కుపుల్ల గిడ్నె పోయే అంటూ పరిచయం చేసిన జూపాల సుభద్ర, జాజుల గౌరి మన్ను బువ్వ,  ఆధిపత్య కులాల సాహిత్య హద్దులను చెరిపేసిన నల్లపొద్దు,  దళిత  క్రిస్టియన్ స్త్రీల సామాజిక కోణాలని పరిచయం చేసిన డా.వినోదిని, ఆల్ ఇండియన్ ఆర్ మై బ్రదర్స్, సిస్టర్స్, ముగింఫు, మాదిగ ఉపకులాల స్త్రీల సమస్యలని ఎత్తిపట్టిన రేగటి సాళ్ళు మొదలయినవి కొన్ని మాత్రమే ఇక్కడ ప్రస్తావించాను . ఈ సాహిత్యం మొత్తం అప్పటివరకు ఉన్న సాహిత్యం పై సవాళ్ళు విసరడమే కాదు. తమ అస్థిత్వానికి ఊపిరి పోసింది.

         1990లలో పుస్తకాన్ని పితృస్వామ్య భావజాల విశ్రుంఖలత నుంచి తప్పించి స్త్రీ జీవితాన్ని వేదికగా మలచిన ఘనత స్త్రీల ఉద్యమానిదే. పెత్తందారీ సంబంధాలు, స్త్రీల లైంగికత పైన నియంత్రణ, అణచివేతను బలంగా స్త్రీవాదం త్రిప్పికొట్టింది. ఆంధ్రప్రదేశ్ లో సారా ఉద్యమం రచనలకు ఉత్తేజాన్ని ఇచ్చింది. పి.సత్యవతి, అబ్బూరి చాయాదేవి మొదలుకొని కొత్తతరం రచయిత్రుల వరకు అన్నీ ఆలోచింపజేసేవి. ఓల్గా రాసిన స్వేచ్చ పై భిన భిన్న అభిప్రాయాలు వచ్చాయి. నిర్దిష్టం గా మారని సంభంధాలు, స్త్రీ కోరుకునే స్వేచ్చ మధ్య సంఘర్షణ సాహిత్యములో ప్రస్పుటించేవి.

      స్త్రీవాద సాహిత్యాన్ని పరిశీలిస్తే సామ్రాజ్యవాద దశలో సాంకేతిక పరిజ్ఞానము పెరిగి  వస్తుత్పత్తికి ఆధారముగా పెరిగిన క్రమములో 1960-70 మధ్య కాలములో ఒక తీవ్రమైన సంక్షోభానికి దారితీసింది. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకముగా చదువులు, విద్యా సంస్ధలకు వ్యతిరేకముగా విద్యార్ధి ఉద్యమాలు, కుటుంబం, పితృస్వామ్యానికి వ్యతిరేకముగా స్త్రీ ఉద్యమాలు విస్తృత స్ధాయిలో జరిగాయి. స్త్రీవాదానికి ఒక సిద్ధాంత చట్రం ఆచరణ, కార్యక్రమాలు, పితృస్వామ్య స్వభావం, చరిత్ర సంస్కృతి, జ్ఞానం,ఉద్యోగ అవసరాలు, కుటుంబ వ్యవస్ధ ఇలా ఎన్నో వాటి మీద అధ్యయనము జరిగింది. ఆ అధ్యయనములో విభిన్న ధృక్పధాలు, ఉన్నా కూడా స్త్రీ కేంద్రముగా ప్రపంచాన్ని చూడాలన్న ఆకాంక్షలో అనేకపుస్తకాలు వెలువడ్డాయి. మనదేశానికి వస్తే ఈ కాలంలో సాహిత్యంలో కుటుంబం, వైవాహిక వ్యవస్ధ, అందులో స్త్రీలు ఎదుర్కునే సమస్యలు, ప్రధానం. ఆ తరువాత ముందే చెప్పుకున్నఎకనామిలో ఏర్పడిన సంక్లిష్ట సంక్షోభం నుండి బయట పడటానికి ప్రత్యామ్నాయముగా ప్రజా ఉద్యమాలు పెల్లుబికిన నేపధ్యములో స్త్రీ చైతన్యము కూడా బహుముఖముగా పెరిగింది. ఇది సాహిత్యములో కూడా ప్రతిఫలించింది. లోతుగా పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తముగా స్త్రీ చైతన్యం పెరగటానికి ఒక మూలం పెట్టుబడి దారి వ్యవస్ధలో అంతర్జాతీయముగా పెట్టుబడి పెరిగే క్రమములో చూడవచ్చు.

        ముదునూరి భారతి “ అభివృద్ధిని ఇలా చూద్దాం “ లో ఇలా అంటారు. “ సమాజపు చైతన్యం బట్టి గురజాడ అప్పారావు, చలం,కందుకూరి వీరేశలింగం తమ రచనలు సాగించారు. ఈ దశ నుండి సామాజిక చైతన్యములో స్త్రీల సమస్యలమీద ఉండే అసంపూర్ణతను పూరించడానికి స్త్రీలే  సమస్యల మీద స్పందించడంతో సాహిత్యం ద్వారా సామాజిక చైతన్యానికి తొలి మెట్టు వేశారు. రెండవ దశలో స్త్రీల సమస్యల మీద ఉండే సామాజిక చైతన్యానికి అదే సమాజంలో ఉండే చైతన్యానికి తేడాలు. మూడవ  దశలో ఈ రెండు చైతన్యాల మధ్య ఉండే వైరుధ్యానికి మూలాలు వెతికే క్రమములో  స్త్రీ వాదము ఒక సిద్ధాంత రూపములో ఒక తాత్విక వారధిగా  ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక విశ్లేషణాగా  సమాజము ముందుకు  వచ్చింది. అంటే స్త్రీ దృక్పధంతో మానవ చరిత్రను అన్ని  కోణాలలో చూడవలసిన ఆవశ్యకతను ఒక ప్రతిపాదికగా సామాజిక చైతన్యంలో భాగంగా ప్రధాన పాత్ర పోషించాయి. . స్త్రీని మనిషిగా చూడటం అనే దృక్పధం నుండి సమాజాన్ని చూడటం సమాజ చైతన్యములో మార్పులకు దోహద పడటం, ఆ క్రమములో మనిషిగా స్త్రీలను, ఆ స్త్రీ భాగమైన సమాజములో కూడా చలనము సాధ్యమౌతుందనే సారాంశాన్ని ఇచ్చింది.  స్త్రీ సమస్యలకు  కేంద్రముగా వచ్చిన పుస్తకం భిన్న సిద్ధాంతాలను మన ముందు పెట్టింది. జయ ప్రభ “పైట” పెట్టుబడిదారి విధానాకి, స్వేచ్చకు ప్రతిరూపంగా స్త్రీల సాహిత్యంలో పెను తుఫాను రేపితే  జూపాక సుభద్ర “పైట” కవిత భూస్వామ్య వ్యతిరేక శక్తులతో పోరాటం లో కొంగునడుముకు చుట్టవే అని విప్లవ స్పూర్తిని నింపింది.  మనకు తెలియని మన చరిత్ర, ఆచరణే  రచనలుగా మలచిన రత్నమాల గమనము, ఘర్షణ, విప్లవ పంధాను తెలియజేస్తూ  అన్ని తరాలకు చారిత్రక విశ్లేషణను అందజేసింది. సాహిత్య ప్రపంచంలో స్త్రీలు తమ సమస్యలను చైతన్యవంతముగా కథలు, నవలల రూపంలో ప్రతిఫలించే క్రమం, దానిలో వచ్చిన మార్పులను అధ్యయనము చేసి సిద్ధాంతీకరించడం లాంటి ప్రయోగాన్ని కాత్యాయిని విద్మహే మొదలగువారు చేశారు. స్త్రీ చైతన్యము బహుముఖముగా పెరిగిన కాలములో స్త్రీ సమస్యలను అర్ధం చేసుకోవడంతో పాటు వాటి మూలాలను కనుగొనడంలో బలమైన సిద్ధాంత పరిజ్ఞానాన్ని పెంచుకుని ధిక్కరించే స్వరాన్ని రచయిత్రుల ద్వారా పుస్తకం స్త్రీ లోకానికి  ఇవ్వగలిగింది. వాటిని  వ్యాఖ్యానించడంలోను పరిష్కరించడంలోను,  పుస్తకాలు చైతన్యానికి ప్రతిరూపముగానిలిచాయి. విభిన్న దృక్పధాలు ఉన్నా కూడా స్త్రీ కేంద్రంగా ప్రపంచాన్ని అర్ధం చేసుకోవడానికి సాధనాలయ్యాయి. అందులో సాధన రాసిన రాగో వ్యక్తి ఆలోచనకు సమాజ సంచలనానికి  పరస్పర సంబంధం ఉండాల్సిన అవసరాన్ని ఎత్తి చూపింది. విమల,అనిశెట్టి రజిత, శిలాలోత, కొండేపూడి, ఘంటసాల నిర్మల, కవిత్వం స్త్రీల ఇతివృత్తాలని మలిచాయి. ఈ తరం బ్లాగు కథల్ని మల్లేశ్వరి పరిచయం చేసింది.

        స్త్రీలందరూ ఒక వర్గం లో లేరనటానికి నిదర్శనముగా మైనారిటీ స్త్రీల విషయములో జరిగిన దాడులు తెలియజెప్పాయి. ఉత్తరభారతదేశములో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ద్వారా సంస్కరణల పేరిట1980ల చివర ఒక్కసారిగా పెల్లుబికిన హిందూత్వం 1990 లలో 2000 లలో   క్రమముగా భారతావనికి మొత్తం విస్తరించింది.  భారత రాజకీయార్ధం నయా ఉదారం వైపు మలుపు తీసుకోవడం దేశం పూర్తి స్ధాయి పెట్టుబడి దారి విధానం లోకి ప్రవేశించడానికి హిందూత్వం వికసించడానికి మధ్య సంబంధం ఉన్నది. భారతదేశపు మొదటి దశాబ్దాలు ఒక అఖిల భారత గుర్తింపును అభివృద్ధి కారక రాజ్యాన్ని రూపొందిస్తామని చెప్పింది. ఈ అఖిల భారతీయ అభివృద్ధి పేరిట రాజ్యం పాక్షిక ఆధిపత్యం కలిగి ఉండింది. అయితే నయా ఉదారవాదం ముందుకు తెచ్చే స్వంత స్వార్ధాన్ని మాత్రమే చూసుకునే ఉపయోగితవాద వ్యక్తి రూపొందాలంటే పాత అఖిల భారతీయత్వం సరిపోదు. తన ప్రత్యేక అవసరాల కోసం నయా ఉదారవాదం అఖిల భారత గుర్తింపును అది నిర్మించేందుకు పనికి వచ్చిన డెవలప్ మెంట్ రాజ్యాన్ని బద్దలు చేయబూనింది. అందుకే బాబ్రి మసీదు కూల్చడం అనే చర్చ హిందూత్వ ప్రేరణ నినాదము మాత్రమే కాదు. 1990 వరకు తాత్కాలికముగా ఒక దగ్గరకు తెచ్చిన అనేక గుర్తింపులతో కూడిన అఖిల భారతీయతను బద్దలు చేయడం, కూల్చడం, తద్వారా అనేక విభిన్న గుర్తింపులు మళ్ళీ బయటకు వచ్చేట్లు చెయ్యడం అనే పనికి ఇది ఆరంభం.

        బద్దలైపోయిన అఖిల భారతీయ గుర్తింపు స్ధానంలో హిందూత్వం ఒక అఖిల హిందూ గుర్తింపును నిర్మించే దశలోకి వెళ్ళింది. అయితే హిందూత్వాన్ని కొరకరాని కొయ్యలాగా దాని బలహీనతను బయట పెట్టే ఇతర గుర్తింపులు కూడా ఈ బద్దలయిన డొల్ల  శిథిలాల నుండి బయటకు వచ్చాయి. మళ్ళీ హిందూ అంటే భారతీయతకు సమాన అర్ధాన్నిచ్చే స్ధాయికి హిందూత్వము ఎదగలేదు. అయినప్పటికీ పాత అఖిల భారతీయ భావన స్థానములో కొత్త ఆధిపత్యాన్ని నెలకొల్పే  కొద్ది భారతీయ గుర్తింపును సృష్టించగల శక్తిగా హిందూత్వము నయా ఉదారవాదపు మన్నననూ, బ్రాహ్మణీయ శక్తుల వెన్నుదన్నులను పొందుతూ ఉంది. భారత్ వెలిగిపోతున్నది అన్న మాట కాని మహాశక్తిగా భారత అవతరణ మాట గాని గుజరాత్ మోడల్ గా అభివృద్ధి అన్న మాట కాని ఇటువంటి నూతన అఖిల భారత గుర్తింపును రూపొందించడంలో భాగమే. ఈ గుర్తింపు కాపిటిజానికి నిచ్చెన మెట్ల కుల ఆధారిత సమాజానికి పనికి వచ్చే గుర్తింపు. ఈ ఆచరణలో భాగముగా  మైనారిటీలమీద అనేక దాడులు జరిగాయి. గుజరాత్, ఒరిస్సా, కర్నాటక ఎక్కడైనా కావచ్చు. (బాలగోపాల్ ” మతం” ) అయితే ఈ నయా ఉదారవాదం సృష్టిస్తున్న దుర్భర దారిద్ర్యం లోను హిందూత్వం అంటే భారతీయత అని చెప్పే జాతీయతను లౌకిక వామ పక్ష వాదులు త్రిప్పికొట్టారు. ఈ కొనసాగింపు సాహిత్యం లోనూ చోటు చేసుకున్నది.

మైనార్టి ముస్లిం స్త్రీలపై గుజరాతి కల్లోలం కదలిక తెస్తే ఆ వర్గానికి చెందిన స్త్రీలే కాకుండా ఇతరులు తమ సాహిత్య ద్వారా ఆ దాడులను ఖండించి ఆ వర్గానికి అండగా నిలబడ్డారు .షాజహానా ” నఖాబ్  ” ఇతర రచనలలో మతం తమ  మానవ హక్కులను, స్వేచ్ఛను ఎలా కట్టడి చేస్తుందో ఘోషిస్తే, గీతాంజలి తన కథలలో  ముస్లిం స్త్రీల వ్యథల్ని ప్రపంచానికి తెలియజేసారు.   ప్రజాస్వామిక రచయిత్రులు సంఘం నాకు తెలిసి మొట్టమొదటి సారిగా క్రైస్తవ మైనార్టీ స్త్రీల సాహిత్యాన్ని సేకరించాడానికి గుంటూరు సభలో (2010)లో శ్రీకారం చుట్టింది.   అలాగే” మట్టి పూల “సాహిత్య సంఘం ఈ అంశాన్ని  గుర్తించింది. కొలకలూరి స్వరూప రాణి , వినోదిని ,పుట్ల హేమలత ,హేమ వెంకట్రావ్ యీలా  ఎంతోమంది  రచయిత్రులు క్రైస్తవ మైనార్టి స్త్రీలు సాంఘీక ,ఆర్ధిక రాజకీయ కోణాల్ని స్పృశించి మెజార్టీ వర్గానికి తెలియ జేశారు .

       ప్రాంతీయ అసమానతలు ప్రజ్వరిల్లిన నేపద్యం లో ప్రజా ప్రతి ప్రతిఘటనలో ఏంతో  మంది  కవయిత్రులు ,కళాకారులు పుట్టుకొచ్చారు .ఉద్యమానికి పాటను ,ఆటను అందించి ప్రజలకు సందేశాన్ని అందించారు .అందులో జూపాక సుభద్ర , రత్నమాల ,అనిశెట్టి రజిత , జ్వలిత ,జాజుల గౌరీ ,గోగు శ్యామల ,ఎన్ .రమాదేవి ,ముదిగంటి సుజాత రెడ్డి ,దేవకీ, సూరేపల్లి సుజాత  తదీతరులు తమ అచ్చమైన  తెలంగాణా  మాండలికంలో ప్రజల ముందుకు వచ్చారు. విమలపాటకు ప్రతిరూపంగా నిలిచిపోయింది .”తెలంగాణా వెతలే కధలై “కవితా సంపుటి అందుకు నిదర్శ నం .ఆదివాసి ,రచయిత్రుల సంకాలనాలు వచ్చినవి  అతి కొద్ది మాత్రమే !ఈ రచయిత్రులు మెయిన్ స్ట్రీమ్ ప్రత్త్యమ్నయ  సాహిత్యంలోకి విరివిగా రాలేదు . బి సి రచయిత్రులలో కే .వరలక్ష్మి ,విజయ లక్ష్మి ,నాగమ్మ పూలే మొదలగువారు బతుకు వెతలను ప్రశ్నించారు.  స్త్రీలు రచించిన నాటకాలు అంతగా ప్రాచుర్యం పొందలేదు .

           1990 సంవత్సరం తర్వాత సామ్రాజ్య ప్రపంచికరణ నేపద్యంలో అభివృద్ధి అంటే సమాజం మొత్తం పరివర్తన జరిగి మారిపోవడం కన్నా అభివృద్ధి అంటే సాంకేతిక పరిజ్ఞానం మొదలైన వనరులు అందించి ఉత్పత్తులలో వృద్ధి సాధించే  ప్రక్రియగా  మిగిలిపోయింది. అభివృద్ధి అంటే పెరుగుదలకు సంబంధించిన కొలమానం

ముఖ్య వనరులైన  విద్య,ఆరోగ్యం మొదలైన సాముహిక మార్పులతో మాత్రమే సరిపోదు.సమాజంలో గుణాత్మకమైన మార్పు రావాలని,సమస్యకు  సమాధానం అన్వేషించే మనిషి ఆలోచన విధానం  కూడా మారిపోవాలని స్టీ గేలిట్జ్ లాంటి ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడ్డా ఆచరణలో జరుగలేదు. ప్రపంచం అంటే కొంతమంది గుత్త పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్ళిపోవడం ,లాభాలు గడించడం ,రాజ్యాన్ని వాటి అంగాల్ని పెట్టుబడి గుప్పిట్లో ఉంచడం సామ్రాజ్య వాద ప్రపంచీకరణ లక్ష్యంగా మారిపోయింది. వీటికి వ్యతిరేఖంగా వచ్చిన ఉద్యమాలు నిర్వాసిత మహిళా ,దళిత ,ఆదివాసిలను సమాజపు చేతనలో భాగమైయ్యేటట్టు  చేసాయి.
ఎందుకంటే మన ఆర్ధిక వ్యవస్థ ను మార్కెట్ ఆధారిత వ్యవస్థగా మారుతున్న క్రమంలో వీరే  ఎక్కువగా నష్టపోతున్నారు. ఉపాధి  కల్పనల పేరిట ఉత్పత్తి వనరులను ప్రజలనుంచి లాక్కుంటూ స్త్రీలు వీధిన పడుతున్నారు.  ఉన్న వనరులన్నింటిని ఒకవైపు పోగొట్టుకుంటుంటే పునరావాసం కింద వచ్చే అన్ని రాయితీలు పితృ స్వామ్య వ్యవస్థ లో  పురుషులకే చెందుతాయి కాబట్టి జల్ జంగిల్ జమీన్  మాదేనంటు ప్రత్యేక ఆర్ధిక మండలులపై భూ వ్యతిరేక పోరాటంలో స్త్రీలు భాగమయ్యారు. వారి పోరాటాంలోని సారం, సామాజిక కోణం సాహిత్య రూపంలో ఎక్కువగా రాలేదన్నది వాస్తవం.  వీటిలో జ్ఞాపకం  వచ్చేవి కారా మాష్టారు గారి ” యజ్ఞం” రఘోత్తమ రెడ్డి” పని పిల్ల”  గీతాంజలి “నేను పోలేపల్లి పీనుగను” అల్లం రాజయ్య ,నల్లూరి రుక్మిణి, గీతాంజలి, పాణి, రత్నమాల ,తాయమ్మ కరుణ,కె .లలిత,హేమా వెంకట్రావ్, మల్లేశ్వరి  లాంటి కొంత  మంది ఈ నేపధ్యం లో రాసినా పోరాటాల ఆకాంక్షలను వివిధ ప్రక్రియలలో ఇంకా ప్రతిఫలించ వలసి వుంది .

          సేజ్ వ్యతిరేక పోరాటాలలో పాల్గొన్నపుడు అనేక ప్రశ్నలు మా ముందు ఉండేవి. సైద్దాంతిక విశ్లేషణ  అవగాహన కొరకు ఆర్ .ఎస్ .రావు “కొత్త చూపు” నిజంగానే ఎన్నో సంశాయాలకు  కొత్తచూపుతో  సమాధాన్నిఅందించింది.   అలాగే ముదునూరి భారతి రచనలు సమస్యల భూమికను అర్ధం  చేసుకోవడంలో అమ్మ చందమామని చూపి అన్నం తినిపించినంత సులువుగా అర్ధం చేసుకునేలా చేసాయి.అరుంధతిరాయ్ రచనలు నిష్కర్షగా మనల్ని లక్ష్యం వైపు తీసుకె ళ్ళేలా ఉంటాయి.  గాడ్ అఫ్ స్మాల్ థింగ్స్, వాకింగ్ విత్ కామ్రేడ్స్   ఆమె రచనలో ముఖ్యమైనవి.

    ఆఫ్రికన్ ,లాటిన్ అమెరికా సాహిత్యం నేటివీటి,  నేలతల్లితో ఉన్న అనుబంధాన్నితెలియచేప్తాయి.   పౌర హక్కుల  ఉద్యమంలో పాలుపంచుకుంటూ రచయిత్రి  అయిన తోనికేడ్ బాన్చారా ,కేథరైన మెన్స్ ,ఎంజిలా కార్టర మేరీ కేల్లిర్, ఉర్శలా కేలాగూన్, ఇలా బెల్ అలెండ ,మొదలగు రచయిత్రులు, పేదరికం, ఒంటరితనం.,నిస్సహాయిత ,సంస్కృతి, హక్కులు ఉల్లంఘన యిలా రక రకాల అంశాల మీద రచనలు చేసారు .

        జీవిత ప్రతి మలుపులోను చిటికిన వేలు అందించిన పుస్తకం ఈనాటి తరానికి  దూరమే. పేస్ బుక్ ,ట్విట్టర్లు, ఇ-మెయిల్స ముంచెతు తున్నాయి .  నేటి యువతకు పుస్తక ప్రపంచాన్ని పరిచయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. పుస్తకం ‘ఇ ‘పుస్తకంగా మాత్రమే మిగిలిపోకుండా పుస్తకాన్ని కాపాడుకోవాల్సిన బాద్యత మనపై ఉంది.   టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతూ సమాజంలోని విలువల్ని మార్చివేస్తున్నప్పుడు పుస్తకం పరిష్కార మార్గాల్ని వెతుక్కోవటానికి నేస్తం కావాలి. ఎందుకంటె సమాజంలో సాంప్రదాయ బద్దమైన మార్పుకి వ్యతిరేకించే ధోరణి ఒకటైతే మార్పును కాంక్షించే తరం మరొకటి కావడంతో ఘర్షణ అనివార్యమౌతుంది.  ఈ ఘర్షణల మద్య వైరుధ్యాల మూలకారణాలు వెతకడంలోను ,అవగాహన పెంచుకోవడానికి పుస్తకం తరాల మధ్య  వారిధిలా పని చేస్తుంది .

 ఈ సందర్బంలో మనం స్త్రీ వాద పత్రికల్ని గురించి మాట్లాడుకోవాలి. మహిళల అధ్వర్యంలో తెలుగు పత్రికలూ నడిచాయి . వింజుమూరి వెంకట రత్నమ్మ మొట్ట మొదటి సాహిత్య పత్రికను 1914లో ‘అనసూయ ‘ను ఎడిట్ చేసి ప్రచురించారు . కొన్నాళ్ళు క్రితంవరకు వచ్చి ఆగిపోయిన  కాత్యాయని  ‘చూపు’ పత్రిక స్త్రీ జీవితపు కోణాల్ని ఆవిష్కరించింది. యిప్పటికి కాత్యాయని అంటే చూపు కాత్యాయనే  కదా అని అడగడం పరిపాటయింది . ద్విదశాబ్దాన్ని పూర్తి చేసుకున్న మరో  స్త్రీ వాద పత్రిక భూమిక సమాజంలోజరుగుతున్నా  మార్పులను  స్త్రీ కోణం నుంచి చూడడం,అర్ధంచేసుకోవడం,  విశ్లేషించడం లో స్త్రీ వాద దృక్పథం తో నడుస్తుంది. మార్కిస్టు దృక్పథం తో మహిళా మార్గం  ,స్త్రీ శక్తి, మాతృక మొదలగు పత్రికలు  వర్గ దృక్పథం  తో వస్తున్న పత్రికలు .ఈ పత్రికలు స్త్రీల ప్రాపంచిక అవగాహన పెంచడం లోను ,తమదైన దృక్ప థా న్ని ఏర్పరచుకోవడంలోను ఒక నూతన ఒరవడిని  సృష్టించాయి. మొట్టమొదటి వెబ్ స్త్రీ వాద  పత్రికను  అందించిన ఘనత పుట్ల  హేమలత “విహంగ” ద్వారా కలిగింది.  ఇది వెబ్ పత్రికలలో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారమే !  ఒక సంవత్సరం పూర్తి చేసుకోక ముందే మిగిలిన పత్రికలకు ధీటుగా నిలిచింది.

            ప్రతి ఆలోచనా ,భావము పుస్తకంలో అక్షర సైనికుల్లా నిలువలేకపోవచ్చు. నిలిచిన ప్రతి అక్షరం ప్రజల దగ్గరకు వెళ్ళలేకపోవచ్చును. ఒక వ్యవస్థ నుంచి ఇంకొక వ్యవస్థకి మారే క్రమంలో పుస్తకం ఆయుధంగా మారినప్పుడు నిషేధం సర్వ సాధరణంగా మారిపోయింది. ఈ నిషేధం పాలకుల వలన లేదా కుటుంబం, సమాజం ద్వారా ప్రత్యక్షంగాను, పరోక్షంగాను జరుగవచ్చు.  అప్పటి చలం నుంచి ఇప్పటి తస్లీమా నస్రీన్ తరం వరకు పుస్తకం పై నిషేధం కొనసాగుతూనే ఉంది .సంకెళ్ళు వేయబడ్డ “పుస్తకం” ప్రశ్నిస్తూ పౌర సమాజాన్ని జాగృత పరుస్తూనే ఉంది .

       పైన ఉదహరంచిన సందర్భాలు ,పుస్తకాలు నాటి సామాజిక ఆర్ధిక ,రాజకీయలతో ముడిపడిన వ్యక్తీకరణలే.  ఈ పుస్తకాల పరిచయం అంటే విషయాన్ని,  ఆయా స్థల ,కాల పరిస్థితుల తో అర్ధం చేసుకోవడం ఒక ఎత్తు అయితే ఆ రచయిత్రి ధృకోణాన్ని అర్ధం చేసుకోవటం మరొక ఎత్తు. ఇన్ని అర్హతలు నాకు ఉన్నాయో లేవో తెలియదు కాని  స్త్రీ వాద పత్రికలలో నేను చేసిన పుస్తక పరిచయాలు, ముఖ్యంగా “విహంగ” మొదటి సంచిక లోనే “ఒక సెక్స్ వర్కర్ ఆత్మకథ ” పుస్తక పరిచయానికి వచ్చిన ఆదరణే నాకు ధైర్యాన్నిచ్చింది .ఈ పుస్తక పరిచయం నాలో మరింతగా స్త్రీ సమస్యలను విశ్లేషించే అరుదైన అవకాశాన్ని ఇవ్వడమే కాకుండా ప్రాపంచిక అవగాహనను, ఆర్ద్రతను పెంచుతాయన్న ఆశ, నమ్మకం ఈ ప్రయత్నానికి చేయూతనిచ్చింది .

నిత్య ఘర్షణమైన జీవితంలో ఏ కూసింత ఆనందం కల్గినా, ఆసరా ఇచ్చినా అది పుస్తకమే ! పుస్తకాలలో ఇష్టమైనవి చదవటం, చదివి  విన్పించటం, వినటం ఏ  మాత్రం నైరాశ్యం ఎదను అలుముకున్నా  కవితా వనం లో సేదతీరటం, పాల్గొంటున్న  ఉద్యమాలలో ప్రశ్నలు ఉవ్వెతున్న ఎగిసిపడుతున్నప్పుడు ప్రజానుభవంతో పాటు సైధ్దాంతిక క్లారిటీ కోసం అధ్యనం చేయడం స్వానుభావమే.  అందుకే పుస్తకం ఒక బంధాన్ని, శాంతిని , సమాధానాన్ని ఇచ్చే ఓ అజ్ఞాత నేస్తం.  ఇంకా చెప్పాలంటే ఓ ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్.

నాలోని ఆర్తిని, ఆసక్తిని, ఉద్యమ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పుస్తకాలను సేకరించి, చదివి, నోట్ చేసి, నా వెనుక పడి  విన్పించి, చర్చించి, విశ్లేషించి  అక్షరీకరించే దాకా వదలని పుస్తక నేస్తాలు వున్నారు.  అందులో ముఖ్యుడు పుస్తక నేస్తం,సహచరుడు వెంకట్రావు.  వారి సహకారం తోటే ఈ పుస్తక పరిచయం.

–  నక్కా హేమా వెంకట్రావ్

 రచయిత్రి పరిచయం:

రచయిత్రి విద్యార్ధి దశ నుండి అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు.  రాష్ట్రంలోనే ఆదర్శప్రాయంగా చెప్పుకోబడ్డ కాకినాడ సెజ్ ఉద్యమంలో  ఉద్యమ నాయకత్వాన్ని పంచుకొని ప్రభుత్వం చేత అక్రమ కేసులను ఎదుర్కొంటున్నారు.  వారి హక్కుల  కోసమే కాకుండా సోంపేట, కాకరపల్లి, పోలేపల్లి మొ// ప్రజల పక్షాన ఒక సామాజిక కార్యకర్తగా, న్యాయవాదిగా పనిచేస్తున్నారు.  పౌర హక్కుల కోసం పోరాడే  ఈమె లక్షిం పేట దమనకాండకు ఇతర ఉద్యమాలకు అండగా  మానవ హక్కుల కమిషన్ లో  నిలిచి వారి పక్షాన వాదిస్తున్నారు. ప్రజా ఉద్యమాల సంఘీభావ కమిటి ఏర్పాటు చేసి ప్రజా ఉద్యమాలకు సంఘీభావాన్ని కూడగట్టటానికి  ప్రయత్నం చేస్తున్నారు. మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలోని సెజ్ ఉద్యమాలతో మమేకమవుతూ వారి తిరుగుబాటును, ఉద్యమ స్పూర్తిని   వ్యాసాలుగా అనేక పత్రికలలో ప్రచురించారు.   సామాజికంగా  మైనారిటీ వర్గానికి చెందిన రచయిత్రి ప్రజాస్వామిక రచయిత్రుల సంఘంలో క్రైస్తవ  మైనార్టీల ప్రతినిధిగా సాహిత్య రంగంలో కృషిచేసారు., చేస్తున్నారు.  ఒక స్త్రీగా, మానవ హక్కుల కార్యకర్తగా,న్యాయవాదిగా, రచయిత్రిగా తనకున్న అధ్యనయం, ఆచరణ,అనుభవాలతో నేటి సామాజికార్ధిక రాజకీయ అవసరాలకు వివిధ పుస్తక పరిచయాలు స్త్రీ లోకానికి   ఎంతో అవసరం అంటున్నారు. వారి నుండి ప్రతి సంపుటిలో మన కోసం ఒక పుస్తకం పరిచయం చెయ్యబడుతుంది.      అందుకు వారిని అభినందిస్తూ  మీ నుంచి ప్రతి స్పందన కోరుతూ…

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
- See more at: http://vihanga.com/?p=6300#sthash.NY07mDkD.dpuf

కథ కాదు ; అంత కన్నా లోతైన ఆత్మకథ

కథ కాదు ; అంత కన్నా లోతైన ఆత్మకథ

-నక్కా హేమా వెంకట్రావు 

”కథ  కాదు ; అంత కన్నా లోతైన ఆత్మకథ….” తన తోటి సెక్స్ వర్కర్ల   బాధామయ  గాధలెన్నో  వుండగా పుస్తకం రాసుకోడానికి తన ఆత్మ కథనే ఎందుకు ఎంచుకున్నారన్నప్రశ్నకు ‘ఒక సెక్స్ వర్కర్ ఆత్మ  కథ’  రచయిత్రి  నళిని జమీలా చెప్పిన జవాబిది.జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ మనసులో ముద్రించుకుపోయిన  అనుభవాలను సినిమాలో  దృశ్యాల్ల కళ్ళ ముందుకు తెచ్చుకుంటూ  రాసారు ఆమె తన  ఆత్మ  కథని.  జీవితాన్ని అతి తరచుగా  సమీక్షించుకుంటూ  నెమరు వేసుకునే లక్షణం వలన జ్ఞాపకాలను భద్రంగా పదిలపరచుకున్న నళిని జీవన   దృశ్య మాలికలను అతి సుళువుగానే అక్షరీకరించారు. జీవితంలో ప్రతి అడుగునా ఓ  పోరాటం చేయాల్సిన పరిస్థితుల్లో బ్రతికిన నళిని ఆ అనుభవాల స్మృతుల్ని ఓ గొప్ప జీవన శక్తిగా మలచుకుంది .

మనుషులందరూ కులాలుగా విడిపోయిన భారత సమాజంలో  కేరళ లోని కల్లూరులో  ఓ  బిసి కులంలో పుడుతుంది .వర్గ రాజకియాలను ఎత్తిపట్టి  రాజ్యమేలుతున్న  కమ్యూనిస్ట్  స్టేట్  లో కులం పోషిస్తున్న అణచివేత పాత్ర  తమ జీవితంలో జరిగిన సంఘటనలు కళ్ళకు కట్టినట్లు   విశదీకరిస్తుంది  నిచ్చెన మెట్లవంటి   కులసమాజంలో క్రింది  కులాలతో సహజీవనం ఒప్పుకొని కుటుంబ నిబంధనలు , ఆ తర్వాత సమాజంలో కులం యొక్క  దాష్టికం ప్రతి స్థాయిలో అనుభవిస్తుంది.  మాతృస్వామ్య సమాజంగా పేరు పడ్డ మలయాళ సమాజంలో పితృస్వామ్య ఛాయలు అతి చిన్నతనం నుంచి కాటేస్తాయి.  ఆ వివక్షల నుంచి  అవసరం  వెన్నాడుతుంటే  కుటుంబం అనే చట్రం నుంచి  బాలశ్రామికురాలిగా బయట ప్రపంచంలోకి అడుగుపెడుతుంది .అక్కడ మరింతగా  వర్గం  మతం రాజ్యం మరింత హింసకు  గురిచేస్తాయి . సెక్స్ వర్కర్ల మధ్య నున్న మేధావిగా మేధావి వర్గంలోని కొంతమంది కామెంట్ చేస్తే అత్యంత వ్యంగ్యంగా మేధావి వర్గంలోని సెక్స్  వర్కర్ గానే గుర్తించమని జవాబిస్తుంది .హింసను  ఎదుర్కొంటూనే  వ్యక్తిగా తన ఉనికిని  కాపాడుకుంటూ ఆ వృత్తిలో వున్న తన లాంటి వారికోసం  పోరాడే క్రమంలో ఎదిగిన ఒక  యూనియన్ లీడర్  కథే ఓ సెక్స్ వర్కర్  ఆత్మ కథ .

నడవటానికి  కూడా  శక్తి లేక నేలమీద  డేకుతూ వచ్చిన నళిని నాయనమ్మ  ఆమె తమ్ముణ్ణి దగ్గరకు తీసుకుని ఓదార్చే   దృశ్యం తో  మొదలవుతుంది ఆత్మ  కథ . పలక కోసం  అన్నతో పోట్లాడి తన్నులు తిన బడే   ఆ మూన్నాళ్ళ ముచ్చట  మూడవ తరగతి తో ముగిసిపోతుంది .ధాన్యం  లెక్కలు  చూసుకునే పాటి చదువు  చాలన్న వాళ్ళ పెద్దమ్మ సలహాతో బడికి వెళ్ళలేక పోతుంది .ఆ నిస్సహాయతని ఎలా  వెళ్ళ గక్కాలో తెలియని  ఆమె రోడ్డెక్కి  ఏడుస్తూ  హాయిని పొందేది. తండ్రి   కమ్యునిస్ట్ పార్టీ సభ్యుడు. నెలకో నారింజపండు ఇచ్చేవాడు తప్ప అంతకు మించి అండగా నిలిచేవాడు కాదు.తండ్రి కమ్యూనిస్ట్  , నారాయణ గురు   శిష్యుడైనా దళితులతో క్రిస్టియన్లతో ఆడ నిచ్చే వాడు కాదు.  ఆర్ధిక లేమితో భయంతో బిక్కచచ్చిపోయే  వాళ్ళ అమ్మను చూసాక డబ్బుకూ ,మనిషి హుందాతనానికి వుండే సంబంధం చిన్నతనం లోనే అర్ధం చేసుకుంది. అలా తొమ్మిదేళ్ళ వయసులో  లుంగీ  చుట్టుకుని పెంకుల   ఫ్యాక్టరీ  లో  పనికి చేరిపోతుంది.పగిలి పోయిన పెంకులు  ఏరేటప్పుడు తెగి గీరుకుపోయిన చేతుల్ని చూసి నళిని అమ్మ ఏడ్చినా  తప్పనిసరి పరిస్థితుల్లో పనికి వెళుతుంది.అట్లా బరువులు  మోయడం కంటే  ఇళ్ళల్లో పాచిపనులు చేసుకోవడం వలన మంచి తిండి కూడా దొరుకుతుందని సలహా ఇవ్వడంతో బంధువుల ఇంట్లో పనికి చేరుతుంది.

అక్కడ ఇంట్లో ఒక సభ్యుడు చేసిన లైంగిక చర్యకు భయపడి పని మానేసి మట్టి బావుల్లో పనికి చేరుతుంది.అక్కడ కూడా ఇలాంటి సమస్యలే ఎదురవుతాయి.చెయ్యిపట్టి లాగినా కావలించుకున్నా  నోరెత్తకుండా  వూరుకునే వారికే మంచి కూలి దక్కేది. రోజంతా మండుటెండలో ఊపిరి సలపని పని చేసినా  ఆడవాళ్ళకు తక్కువ కూలి దక్కేది.   బిసి   ఇళవ కులానికి చెందిన     ఈమెపై కుల వివక్ష ఎదురవుతుంది. పనిచెయ్యడం   సంపాదన సంగతి చూసుకోవడం  వాటితో పాటు వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడం   ముఖ్య మనుకున్న నళిని  ఆ తర్వాత జీవితంలో వేసే ప్రతి అడుగులోనూ అదే దృక్పథాన్ని  కొనసాగించింది.

రెక్కలు ముక్కలు చేసుకుని పని చేసినా  తండ్రి మాత్రం పెత్తనం చేస్తూ షరతులు పెట్టేవాడు.నళిని అన్నయ్య  పెళ్లి విషయంలో  మద్దతు ఇచ్చినందుకు ఇంటినుంచి  వెళ్ళ గొడతాడు . 18   ఏళ్ళ వయసులో ఎక్కడికి వెళ్ళాలో తెలియక తనని ప్రేమించిన చంద్రన్ అనే వ్యక్తి కోసం  వెతుకుతూ వెళ్ళినా ప్రయోజనముండదు. ఆ వెతుకులాటలో ఆకతాయి మూకకు  నాయకుడైన సుబ్రహ్మణ్యం సహాయం తీసుకుని అతనికి భార్యగా మిగిలిపోతుంది.సారా వ్యాపారం చేసే  అతను నళినికి   సారా  తాగటం నేర్పిస్తాడు.మూడున్నరేళ్ళపాటు  అతనితో కలిసి బతుకుతుంది.  యిద్దరు పిల్లలని వదలిపెట్టి విపరీతమైన తాగుడు వల్ల   కాన్సర్ వచ్చి చచ్చిపోతాడు. అలాంటి  పరిస్థితుల్లోనే పిల్లలని పోషించుకోడానికి అత్తగారి పోరు వలన స్నేహితురాలి సహాయంతో  వ్యభిచార కూపం  లోకి దిగుతుంది. మనిషిలో సున్నితత్వము , క్రూరత్వము  రెండూ  వుండటం సాధ్యమేనని మొదటి క్లయింట్ నేర్పిన పాఠం. ఎమర్జెన్సీ    రోజులలో  నళినిని అరెస్ట్ చేసి విపరీతంగా కొడతారు. అయినా సరే రాత్రిళ్ళు మా  దగ్గరకి వచ్చేది  మీరే . పగలు మా దగ్గర కొచ్చేదీ  మీ పోలీసులే .చావ గొట్టేదీ   మీరే అని పోలీసులని ప్రశ్నిస్తుంది . అదే    పోలీసాఫీసరుతో  గడుపుతానని మాటిచ్చి అతని సహాయంతో బయట పడుతుంది. ఒక్క పోలీసులేనా?   మార్క్సిస్ట్    నాయకులు కూడా ఆమెను ఉపయోగించుకోవాలని  చూస్తారు.

ఆనాడు సాముహిక   అత్యాచారాల్లాంటివి  ఉండేవి కావు కాబట్టి ఎంతో వేడుకగా కాలం గడిచిపోయేది.  అందరి మధ్య ఒక ప్రత్యేక తరహా సహజీవనం సాగిపోతుండేది  అంటుంది నళిని.డబ్బున్న వాళ్ళని నళిని ఎప్పుడూ కాదనలేదు. కారణం వాళ్ళు  హుందాగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారంటుంది. ఆ హుందాతనం ఉత్త నటనే తప్ప  నిజమైనదేమి కాదని ఆమెకు తెలుసు. ఎప్పుడూ ఆధిపత్యాన్ని చెలాయించాలని చూసే  మగవాళ్ళతో  సంబంధాలను నిలుపుకోటానికి ఇష్ట పడేది  కాదు. ఏ పిల్లలకోసం సంపాదన మొదలెట్టిందో  ఆ పిల్లలనే అత్తింటి వారు దూరం చేస్తారు.

యిక ఆ వృత్తి  మానేయాలని కోరుకుని  కోయ్యక్క అనే ముస్లిం వ్యక్తిని పెళ్ళి చేసుకుంటుంది.  నళిని  సెక్స్ వర్కర్ అన్న సంగతి  తెలిసి  భర్త  బావమరిది సంబంధం  పెట్టుకోవాలని చూస్తాడు.   బిడ్డ పుట్టినా… మత  విశ్వాసంతో పుట్టిన  పిల్ల కాదు కాబట్టి   భర్త ఇష్ట పడటం లేదని  తెలుసుకుని కట్టు బట్టలతో  బయటకు వచేస్తుంది.  షాహుల్ హమీద్  అనే వ్యక్తి  కోరిక మేరకు  అతనితో సహ జీవనం చేస్తుంది.  దాంతో ఆమె పేరును  జమీలాగా పేరు మార్చేసుకుంటుంది.   షాహుల్ మంచి వ్యక్తి అయినా   కూతుర్ని స్వంత బిడ్డలా చూసుకుంటున్నా  ఏదో భయం నళినిని వెంటాడుతూనే వుండేది.  కొన్నాళ్ళ పాటు అతనితో ఊటీలో కూడా వ్యాపారం చేస్తుంది.  కానీ ఆ డబ్బు ఆమె చేతికి అందేది కాదు.నష్టాన్నే     చవిచూసి వెనుదిరుగుతుంది. మోజు తీరిపోయిన షాహుల్ ఆమెను వదిలించుకోటానికి అనేక ఎత్తుగడలు వేస్తాడు. ఇక అతను  వెళ్ళ గొట్టక ముందే బయటకు పోవడం గౌరవంగా ఉంటుందని నిర్ణయించుకుంటుంది.

జబ్బుతో పదమూడేళ్ళ కూతురితో మసీదు చేరుకుంటుంది.ఎరిగిన వాళ్ళు అడిగితే  అప్పటి వరకు సహచర్యం చేసిన నళిని సహచరుడు- ఆమెకు పిచ్చి అని ప్రచారం చేస్తాడు. తిండికి కూడా   కష్టపడిన  నళిని ఒక మసీదు నుంచి ఇంకో  మసీదుకు మారుతూనే వుంటుంది. నళినిని ముస్లింలు పూర్తిగా స్వీకరించరు గానీ , హిందువులు మాత్రం వెలివేస్తారు.చివరికి బ్రతుకు దేనికీ  చెందకుండా  పోయింది అంటుంది. తెలిసిన వాళ్ళ సహాయంతో ఒక మెడికల్  కాలేజీ లో చేరి అష్టకష్టాలు పడి ఆరోగ్యాన్ని  బాగు చేసుకుంటుంది. కొన్నాళ్ళు సెక్స్  వర్కర్ గాను మరి కొన్నాళ్ళు రకరకాల పనులలోను వుంటూ వచ్చిన నళిని సెక్స్ వర్కర్ల కోసం పనిచేసే జ్వాలాముఖి అనే సంస్థతో  పరిచయమయ్యాక  సెక్స్ వర్కర్ గానే  కొనసాగాలనే నిశ్చయించుకుంటుంది. తన కూతుర్ని తెలిసిన వాళ్ళింట్లో  వుంచి తన గురించి ఏమి దాచకుండా  అంతా చెబుతుంది.

రకరకాలుగా ప్రవర్తించి వేధించే విటులగురించి, పోలీసుల వేధింపుల   గురించి సంఘంలో  స్వేచ్ఛగా  చర్చించుకుంటారు. వ్యభిచార వృతి నేరమే అయితే  ఆ నేరంలో భాగస్తుడిని ఎందుకు    శిక్షించరు ? అని వాదించే నళిని వాదనకు అందరు ఆకర్షితులవుతారు. సంస్థ సభ్యుల కష్టసుఖాలను పట్టించుకోవాలని వాదించి నెగ్గుతుంది. తమ కష్టసుఖాలు ప్రజలకు తెలియపరచి  ప్రజలసహకారాన్ని పొందాలని బహిరంగ సభలను ఏర్పాటు చేస్తుంది. ఆ సభల్లో పోలీసులు ,రౌడీలు సెక్స్ వర్కర్లను   కొట్టడము , వేధించటం… ఇక కొనసాగనివ్వమని సంస్థ లక్ష్యంగా  ప్రకటిస్తుంది.మా దగ్గరకు  వచ్చేవారిలో లాయర్లు , డాక్టర్లు ,వ్యాపారవేత్తలు  ఎందరో వున్నారు. వాళ్ళంతా సంఘంలో మర్యాదస్తులుగా  చలామణి అవుతున్నారు. మేం మాత్రం  ఎందుకు నేరస్తులుగా నిలబడాల్సి వస్తుంది అని నిలదీస్తుంది. ఆ తర్వాత ఎంతో మంది లాయర్లు, సోషల్ వర్కర్ల మద్దతు  కూడగడుతుంది. అలా నాయకురాలిగా ఎదిగిన నళిని ఎన్నో సభలకు నాయకత్వం  వహిస్తుంది.

పాత రోజుల్లాగా గౌరవంగా చూడకపోయినా ,  వేధింపులయినా  మానుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది. ఇదే వృత్తిలో అనేకసార్లు మృత్యు ముఖం   లోకి వెళ్ళి  తిరిగి వస్తుంది. ప్రమాదమనేది తప్పనప్పుడు  దానికి  స్వయంగా ఎదురు వెళ్ళటమే మంచిదని అనుభవం ద్వారా  తెలుసుకుంటుంది. సెక్స్ వర్కర్ల  వేధింపుల పైన మాఫియా గ్యాంగుల హత్యల పైన  అందరిని సంఘటిత పరచి సమాజానికి వారి వెతలు తెలియ జేస్తుంది. సెక్స్ వర్కర్లకు కనీస వేతనం వంద రూపాయలైనా వుండాలని, ఇళ్ళు కట్టుకోటానికి, రేషన్ కార్డులకు,   ఉచిత వైద్య సదుపాయాలను ఏర్పాటు చెయ్యాలనే డిమాండ్లు ముందుకు తెస్తుంది. పోలీసులఆగడాలను ప్రశ్నిస్తుంది. జైలు పాలవుతుంది. ఆ జైలు జీవితాన్ని కూడ హాయిగా తీసుకుంటుంది.

అంతేకాదు సమాజంలో కిందస్థాయి మనుషులలో- ప్రవర్తించడంలో  మాములు వాళ్ళకు, ఉద్యమ కార్యకర్తలకు  రాజకీయ చైతన్యంలో   తేడా ఏమి వుండదంటుంది.చాల గొప్ప వాళ్ళుగా అభ్యుదయ వాదులుగా  చలామణి అయ్యే  మనుషుల్లో కొందరు ఆచరణలో హీనంగా ప్రవర్తిస్తారని అనుభవం ద్వారా తెలుసుకుంటుంది. సెక్స్ వర్కర్ల కోసం ఒక   డాక్యుమెంటరీ   తయారు చేస్తుంది. సెక్స్ వర్కర్ల ఫోరం ఏర్పాటుకు తోటి సంస్థ సభ్యులతో కలసి కలకత్తా వగైరా ప్రదేశాలకు వెళుతుంది. తన డాక్యుమెంటరీ  ప్రదర్శించడానికి థాయిలాండ్ మరియు ఇతర దేశాలకు వెళుతుంది. అక్కడ  ఫిల్మ్ తీయడం నేర్చుకుంటుంది. సెక్స్ వర్కర్లకు ఫోటోగ్రఫీ ,  డాక్యుమెంటరీలు తీయడంపై   వర్క్ షాపులు నిర్వహిస్తుంది. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్  లో   నళిని డాక్యుమెంటరీ ను ప్రదర్శిస్తారు. చివరిగా ఒక సినిమా తీయాలన్న ప్రయత్నం మొదలుపెడుతుంది. సెక్స్ వర్కర్లతో పాటు , స్వలింగసంపర్కులను, యునిక్స్ లకు    సభలు ఏర్పాటు చేస్తుంది. ఎక్కడకు వెళ్ళినా  సెక్స్ వర్కర్ల  సంస్థ జ్వాలాముఖి తమ ఆత్మ విశ్వాసానికి  చిహ్నమంటుంది.

ఆడవాళ్ళ కంటే  సెక్స్ వర్కర్లకు  కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయంటుంది. మిగతా ఆడవాళ్లలాగా   మొగుడి కోసం వంటలు వండి ఎదురు చూస్తూ కూర్చునే అవసరం వుండదు. వారి మురికి గుడ్డలు  వుతక నక్కరలేదు. భర్త ఆస్తుల్లో కాస్త వాటా ఇమ్మని  దేబరించక్కరలేదు. సెక్స్ వర్కర్గా వున్నందుకు కుమిలిపోతూ వుండటం కన్నా ఈ వాస్తవాలను గుర్తించడం మంచిదంటుంది. ఎన్ని పనులు చేసినా కూతురి ఆలనా  పాలన మరచిపోదు. అట్టహాసంగా పెళ్ళి చేసి పంపితే సంవత్సరానికే తిరిగి వస్తుంది. తిరిగి వచ్చిన కూతురు సంఘం పనుల్లో పాలు పంచుకుంటూ తల్లిని అర్ధం చేసుకునే స్థాయికి ఎదుగుతుంది.

సెక్స్  వర్కర్ల పునరావాసం పేరిట అప్పుడప్పుడు జరుగుతున్న  కార్యక్రమాలు చూసి    ఆడవాళ్లు అందరిని ఒక చోట పడేసి    తిండికి బట్టకు దేబరించాల్సిన   బిచ్చగత్తెలుగా మారుస్తున్నారంటుంది నళిని. ఈ పునరావాసం పేరిట  ఒక ప్రత్యేకమైన గుంపుగా విడదీయటంలో  మరింత నిస్సహాయతలోకి ఒంటరిని చేస్తుంది. ఈ పునరావాసం సెక్స్ వర్కర్లను  కుటుంబాలతోను, సమాజంతోనూ విడదీస్తుంది అని వాపోతుంది . రాడికల్ ఆలోచన వున్న నళిని తను నాస్తికురాలో ఆస్తికురాలో తెలియదంటుంది . కానీ మసీదులో పడివున్న రోజుల్లో మంత్రించిన నీళ్ళను తీర్ధంగా పుచ్చుకోవటము , తల మీద నెమలి ఈకలు వుంచి దీవించటము మనస్సుకు శాంతి ఇచ్చిన మాట నిజమే నంటుంది.

సెక్స్ వర్క్ ను  నేరంగా చూడటం మానెయ్యాలని కోరుకునే నళిని  లైసెన్సు ఇవ్వమని కోరదు. ఎందుకంటే దాంతో మరికొన్ని సమస్యలు తలెత్తు తాయంటుంది. డాక్టర్ల దగ్గర,పోలీసులదగ్గర లైసెన్సు పొందే పద్ధతిలో లంచగొండితనం,అవినీతి  పొంచే  వుంటాయి అంటుంది. ఇద్దరు వ్యక్తులు పరస్పర అవగాహనతో సెక్స్ సంబంధాల్లోకి  వెళ్ళ దల్చుకుంటే దానివలన మిగిలిన సమాజానికి జరిగే హాని ఏమి లేనపుడు ఆ విషయాన్ని నేరంగా  పరిగణించవలసిన  అవసరం లేదంటుంది. బొంబాయి లాంటి ప్రదేశాల్లో లైసెన్సులు ఇవ్వడం అబద్ధమని , ఆరోగ్య పరిస్థితిని బట్టి సర్టిఫికెట్లు ఇస్తారంటుంది . సెక్స్ అవసరం స్త్రీకి ఉంటుందని అసలు సెక్స్  వర్కరుకు , లైంగిక దోపిడీకి తేడా ఉంటుందనీ ….సెక్స్ రాకెట్లను వేరుగా చూడాలని కోరుతుంది.

తమ వృత్తి పట్ల ఆనందంగా లేమనీ… బతుకు తెరువుకోసం రాళ్ళూ తట్టలు మోసినట్టు ,పారిశుద్ధ్య పని చేసినట్టు .మేం కూడ మా వృత్తిని చేపట్టాం.ఆయా  వృత్తుల వాళ్ళు క్రమంగా  వాటికీ అలవాటు పడినట్టే మేము కూడ ఈ జీవితంలో భాగంగా చేసుకున్నాం . ఎంతో అనారోగ్యమైన  పనులు చేసే కార్మికుల కంటే మా పునరావాస సమస్యను చర్చించడానికి కారణం ఆ వృత్తిని నైతిక  సమస్యగా గుర్తించడమే అంటుంది. డబ్బు తీసుకోవటం అనే దానికి అన్ని వృత్తులలో లేని తప్పు వాళ్ళకే ఆపాదించటం సరైనది కాదంటుంది.వేశ్య అన్నా సెక్స్ వర్కర్   అన్న పదాలు తేడా తప్ప  భావనలో తేడా లేదంటుంది.

ప్రేమ ఆప్యాయత , ఓదార్పు ఇవి శరీరాన్ని మనసుని ఎంత శాతం ప్రభావితం చేస్తాయో లెక్కలు  కట్టడం అర్ధం లేని పని  అని, ఇద్దరి పురుషుల మధ్య  స్త్రీల మధ్య కూడ   కలగొచ్చుఅంటుంది. కళ్ళతో చూసి తృప్తి పడటం ,  స్పర్శతో ఆనందించటం మరింత గాఢమైన  శృంగారనుభవం ఇవన్ని వేర్వేరు రూపాల   వ్యక్తికరణే  ,  సెక్స్ ను కొనటం అమ్మటం అనే విషయాలు ఖచ్చితమైన శాశ్వతమైన సత్యాలు ఏవీ  కావని నళిని అభిప్రాయం. సెక్స్ వర్కర్లు కూడ   హైక్లాసు , మధ్యరకం , కింది తరగతి అనే మూడు రకాల వాళ్ళు వుంటారు. పెద్ద సంపాదన కలిగిన వారిని సెక్స్ వర్కర్లుగా చూడరు. లోకం  దృష్తిలో నుంచి తప్పించుకోటానికి కాపాడుకునేందుకు వెసులుబాటు దొరుకుతుంది. కింది తరగతి వాళ్ళ జీవితాలే దుర్భరంగా వుంటాయి. పోలీసులు   అరెస్టు , గుండాల దాడులు అన్నీ  వాళ్ళకే. సెక్స్ వర్కర్లను అతి తీవ్రంగా  వేధించుకు తినేది బ్రోకర్లు , భర్త లూనూ. నిజానికి భర్తలనే వాళ్లే బ్రోకర్లు కాబట్టి తమను తాము  రక్షిం చుకోటానికి నోరు పెట్టుకుని బతకాల్సి వస్తుందంటుంది. సాధారణ భర్తలకు , ఈ  క్లైంటులకు పెద్ద తేడా కనపడదంటుంది.

ఏ స్త్రీ కూడ సెక్స్  వర్కర్ గ పుట్టదు. పరిస్థితుల ద్వారా తయారుచేయబడుతుంది. తమ చదువులకు ఏ ఉద్యోగము దొరకని వాళ్ళు ,భర్తల దౌర్జన్యానికి గురైన వాళ్ళు , పెద్ద మొత్తాల్లో కట్నాలు తేనందున అత్తవారిం టినుంచి గెంటివేయ బడ్డ వాళ్ళు, రరకాల సమస్యల వల్ల వీధిన పడ్డ వాళ్లే ఈ స్త్రీ లంతా. తలకు మించిన భారాన్ని మోయాల్సిన వాళ్ళకు , ఏదో ఒకరకంగా సంపాదించాలన్నదే ప్రధాన లక్ష్యం గా  మారుతుంది. చేస్తున్న పని గౌరవప్రద మైనదా కాదా అని ఆలోచించి ఎన్నిక చేసుకునే వెసులుబాటు వుండదు. ఉద్యోగాలు సంపాదించే క్రమంలో కూడ  ఎందరో  స్త్రీలు శారీరక  దోపిడీకి గురవుతున్నారు. అలాగే ఇంటిలో పనిచేసే వారిమీద దౌర్జన్యాలు సర్వసాధారణ మైనాయి . కేరళలో సెక్స్ వర్కర్లు స్త్రీల కన్నా  మగవాళ్ళే ఎక్కువంటుంది నళిని . ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా స్త్రీల మీద దౌర్జన్యానికి వెనుకాడడంలేదు. ఆడవాళ్లంటే తమ ఆనందం కోసం తయారయిన వస్తువులు అనుకునే దృష్టి నానాటికీ  పెరుగుతుంది అని వాపోతుంది.

సెక్స్ వర్కర్ల  మధ్యన ఓ మేధావి అన్న కామెంటును నేను మేధావులమధ్య సెక్స్ వర్కర్ ను అని ప్రతి స్పందిస్తుంది. ఒకసారి ఈ వృత్తిలోకి అడుగు పెట్టిన తర్వాత    ధైర్యం గా  నిలబడాలి.  తన మీద తాను జాలిపడటం మానేసి ఒక వాస్తవంగా  గుర్తించాలంటుంది.గౌరవ నీయమైన స్త్రీలకు చవక రకం ఆడవాళ్లకు మధ్య నుండే సరిహద్దు రేఖ చాల బలహీనమైనదని , మగవాళ్ళ దృష్టి లో  ఏ స్త్రీ కు సమాన హోదా లేదంటుంది. క్లయింటు చేతుల్లో దెబ్బలు తినటాన్ని హింసగా గుర్తించ గలిగిన వాళ్ళు కూడ భర్తల చేతుల్లో  దెబ్బలు తినటంలోని  హింస అంత సులభంగా అర్ధం చేసుకోలేరంటుంది.

పిల్లలగురించి మాట్లాడుతూ పిల్లలను పెంచి పెద్ద చేయటానికి మేము పడే బాధలను జనం ఎప్పుడూ అర్ధం చేసుకోరంటుంది. పిల్లలను గాలికి వదిలి వేస్తారని ఒక అపోహ ప్రజల్లో వుంది. కానీ పిల్లలకు దూరమైన స్త్రీల నిస్సహాయత వేదన ఎవరికి అర్ధం కావు. ఏ క్లయింటు సెక్స్ వర్కర్ నుంచి ఆప్యాయతను కోరుకోడు.  వాళ్ళెప్పుడు తమ అధికారాన్ని  ప్రదర్శించు కునేందుకు ప్రయత్నిస్తారు. సెక్స్ రాకెట్ వలలో పడి ధ్వంసమై పోతున్న అమ్మాయిల రక్షణ కోసం కొన్ని సూచనలు చెయ్యాలంటుంది. ఇదొక స్త్రీ ఆత్మ కథ  కావటంతో ఫెమినిస్ట్  లు దాన్ని ప్రచారంలోకి తెచ్చారని రకరకాల కథనాలు వస్తాయి  కానీ జీవితం కొనసాగినంత కాలం తన అనుభవాలు ఇతరులకు ఉపయోగకరంగా వినిపిస్తానంటుంది నళిని జమీలా .
చివరిగా , మేడిపండు లాంటి సమాజ విలువల్ని ,  పరిస్థితులను ప్రశ్నించే నళిని జమీలా యొక్క ఆక్రోశం సమాజానికి సవాలు విసురుతుంది. ఆమె ప్రశ్నల పరంపరను కేవలం కుటుంబానికే  సంధించదు, సమాజం లోని అన్నీ వర్గాలకు ఎక్కు పెడుతుంది.కులం,మతం ,వర్గం ఏదీ మినహాయింపు  కాదన్న వాస్తవం మన ముందుంచుతుంది. సెక్స్ అనేది ఒక వృత్తిగా తీసుకోవచ్చా లేదా అనే మీమాంస బదులు మన మేధావులు సమస్యను   చర్చించాలని కోరుతూ దాని సంబంధిత సామాజిక,ఆర్ధిక,రాజకీయాల మూలాలను పరోక్షంగా నిలదీస్తూ మనల్ని  ఆలోచింప చేస్తుంది నళిని జమీలా , సెక్స్ వర్కర్ ను నేరంగా చూడవద్దని కోరే నళిని లైంగిక దోపిడిని అంతే తీవ్రంగా ఖండిస్తుంది. స్తీల జీవితంలో హింస ఏ స్థానంలో వున్నా  తప్పదని తెలియ జెప్పే  నళిని ఏ స్త్రీ కూడ సెక్స్  వర్కర్ గ  పుట్టదని ప్రభోదిస్తుంది. ప్రపంచీకరణ నేపధ్యంలో స్త్రీ అంగడి సరుకుగా మారిన క్రమంలో ప్రజా జీవితంతో , సమస్యలతో సంబంధం ఏర్పరచుకుని సమాజాభివృద్ధికి పని చేయాలని కోరే రచయిత్రి ఏ స్త్రీ కూడ  ఈ వృత్తి లోకి రాకుడదని ,అలాంటి సమాజం రావాలని కోరుకుంటుంది. అలాంటి సమాజం కోసం మనమందరం పాటు పడవలసిన అవసరం,మన ఉద్యమాల్లో ఆ స్త్రీల ఆకాంక్షకు , ఆవేదనకు స్పేస్ ఇవ్వాల్సిన అవసరం  ఎంతైనా వుంది.

నళిని జమీలా వ్రాసిన  : ‘ఎన్ ఆటో బయోగ్రఫీ  ఆఫ్ సెక్స్ వర్కర్’ ను తెలుగులోకి అనువదించి సెక్స్ వర్కర్ ఆత్మకథ గా  హైదరాబాద్  బుక్ ట్రస్ట్ వారు అందించారు. అనువాద రచనలలో ఎంతో అనుభవం వున్న కాత్యాయనిగారు చాల సులువుగా , సూటిగా  స్వేచ్ఛానువాదం చేసారు. ఈ పుస్తకం వెల   రు – 50 /  మాత్రమే. అన్ని పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది. స్త్రీ జీవితంలోని వివిధ కోణాలను అర్ధం చేసుకోవాలని కోరుకునేవారికి ఈ పుస్తకం  ఒక దర్పణంలా  ఉపయోగపడుతుంది.


– హేమ
(చిన్న వివరణ  ; పేరులో భర్త పేరో ,తండ్రి పేరో పెట్టుకుని పురుషాధిపత్యం భరిస్తూ అతడి ద్వారా గుర్తింపు పొందడం ఎంతవరకు సమంజసం అని కొంతమంది మిత్రులు మెయిల్ చేసారు. అస్తిత్వ  పోరాటాలు వచ్చిన తర్వాత అణచివేత ,ఆధిపత్యాల మీద ఒక్కొక్కరు ఒక్కో విధంగా నిరసన తెలియ జేసారు. నా పేరు వెనుక ఒక నేపథ్యం  వుంది. ఏది  ఏమైనప్పటికీ  నా పేరు సిద్ధాంత పరంగా సమాజానికి తప్పుడు సంకేతాలు అందిస్తుందని,నా రచనల విశ్వసనీయత పై దెబ్బ  తీస్తుందని భావించినపుడు తప్పకుండా సరిదిద్దుకోవాల్సిన అవసరం వుంది. అందుకే ఇక ముందు హేమ వెంకట్రావు గా  కాక ‘హేమ’ గ మీ ముందు వుంటాను. కృతజ్ఞతలు )

- See more at: http://vihanga.com/?p=617#sthash.m9fjKx8V.dpuf

Monday, April 1, 2013

సామాన్యుడు కాదు సామ్రాజ్యవాద దళారీ-’ఒక దళారీ పశ్చాత్తాపం’ పుస్తక పరిచయం

‘ఒక దళారీ పశ్చాత్తాపం’ పుస్తక పరిచయం

రచయత: జాన్ పెర్కిన్స్
తెలుగు: కొణతం దిలీప్

Hema venkatrauపుస్తక పరిచయానికి భూమికగా పుస్తకం తో నా నడకగురించి గత సంచిక లో వివరించాను. అప్పట్లో పుస్తకంఅంటేకవిత్వం, ఒక మంచి కధ , నవల అంతే!

శ్రీశ్రీ గీతాలతో ఊగిపోయి, చలం మైదానంలో ఓలలాడికుటుంబరావు సాహిత్యంతో కుదుటపడి, అభివృద్ది వెలుగు నీడల్లాంటి రాజకీయ విశ్లేషణలతో తేరుకొని కొత్త వెలుగులనుఅవగాహన చేసుకుంటున్న క్రమంలో నా కంట పడిన ఒకమంచి పుస్తకమే జాన్ పెర్కిన్స్ దళారీ పశ్చాత్తాపం .అయితే ఇది కవిత్వమూ కాదు సాహిత్యం కాదు. ఒక దళారీపశ్చాత్తాపమే !మన కళ్ళు మిరమిట్లు గొలిపే అభివృద్ధి వెనుక జరిగే కుట్రల గురించి జాన్ పెర్కిన్స్ చెబుతుంటే నిజమా ? ఇంత అన్యాయామా” అని అనుకోకుండా ఉండలేము, ఈ పుస్తకం చదివిన తరువాత విప్లవ కవి చెరబండరాజు కవితా పాదం ఒకటి గుర్తుకు వచ్చింది. 
OkaDalariPaschatapam by John Perkins“ఆగస్ట్ 15 విద్రోహం గురించి చెప్పందే ఈ రోజు అన్నం సహించదు నాకు”.
ఇన్ని విద్రోహాల మధ్య మనం ఎంత అమాయకంగా బ్రతికేస్తున్నామో! మన జీవితాలను, పిల్లల భవిష్యతుని గాలిలో దీపం లా ఎలా వదిలేసి ఉండగలుగుతున్నామో అని ఆశ్చర్యం కలుగుతుంది. మన గుండెల్ని పిండేసే నిజాలు ఈ పుస్తకం నిండా. ప్రతి క్షణం ఎంత అప్రమత్తం గా ఉండాలో, ప్రతి చిన్న విషయాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో కొరడాతో కొట్టినట్టు చెప్పిన పుస్తకం ఇది. ఇవాళ ఈ పుస్తకం మనం చదవకపోతే ఇంకే విషయాన్ని సంపూర్ణం గా అవగాహన చేసుకోలే మెమో !
ఈ విషయా ల గురించి ఒక దళారీ రాయటం ఏమిటి? దాన్ని మనం ఎగబడి చదవడం ఏమిటి?
ఒక భోగి వేమారెడ్డి యోగి వేమన అయినట్టు, ఒక సిద్దార్ధుడు (రాజు) బుద్దుడిగా మారినట్టు జాన్ పెర్కిన్స్(దళారీ ) పెట్టుబడి దారీ వ్యవస్థ పొట్ట విప్పిచూపిస్తున్న్నాడు.
దళారీలు, బ్రోకర్లు మనకు కొత్తే మీ కాదు. బ్రిటిష్ వారు మన దేశాన్ని అంచెలంచెలు గా ఆక్రమించు కోవడానికి, వారి అధికారం అలా కొనసాగి పోవటానికి అడుగడుగునా తమకు అనుకూలంగా ఉండే దళారీ వ్యవస్థను ఏర్పాటు చేసుకొన్నారు. చాలా క్రింది స్థాయిలో పనిచేసే ఈ దళారీ వ్యవస్థ ఈ రోజు అమెరికా , ప్రపంచ బాంకు పథకాలను అన్ని దేశాలు తు .చ తప్పకుండా అమలు చేసే పనిలో కుడా ప్రవేశించాయి. ఈ దళారీ లను ఇంగ్లీష్ లో ఎకనామిక్ హిట్‌మెన్ అంటారు. అప్పట్లో రాజీకీయాలలో అదృశ్య హస్తం, పాకిస్తాన్ హస్తం ఉందనే వాళ్ళు . అలాగే ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లు, పధకాలు అమలయ్యే క్రమం లో ఈ దళారీల పాత్ర గురించి ఈ పుస్తకం లోచదువుతూంటే ఒళ్ళు గగుర్పోడుస్తుంది.
ప్రతి నాయకుడి చావు ఒక హత్యే అని ఎవరన్నారో గాని అది అక్షరాలా సత్యమని లాటిన్ అమెరికా దేశాధి నేతల విమాన ప్రమాదాల వల్ల తేటతెల్లమవుతుంది. అయితే ఈ దుర్మార్గ వ్యవస్థల్నినిలబెట్టేందుకు జరిగే ఈ బలులు మనకు ఆమోద యోగ్యమా? మనం తేల్చుకోవాలి. మన నాగరికతల్ని, సంస్కృతుల్ని విధ్వంసం చేస్తున్న ప్రపంచీకరణను మనం ఎలా ఎదుర్కుంటామన్న నిర్ణయం మీదే మన అభివృద్ది ఆధారపడి ఉంటుందని నాకు అర్ధమయ్యింది. కానీ పోరాటం మన అందరిది. భవిష్యత్తూ మనదే. అందుకే అబివృద్ది వెలుగు నీడల్ని అర్ధం చేయించే పుస్తకాల్ని చదువుదాం. మనచుట్టూ కమ్ముకున్న చీకట్లను పారద్రోలుదాం .

ఈ దళారీ పుట్టుక ..

1951 లో తన సహజవనర్లను దోచుకొంటున్న బ్రిటిష్ తో ఇరాన్ తలపడినప్పుడు ఒక నిర్ణయాత్మక పరిణామం సంభవించింది. ఈ సంఘర్షణ పర్యవసానంగా ఇరాన్ ప్రధాన మంత్రి దేశంలోని చమురు వనర్లన్నిటిని జాతీయం చేసాడు. దానితో చిర్రెత్తిన బ్రిటన్ తన రెండవ ప్రపంచయుద్ద మిత్రుడు అమెరికాను సాయం అడిగింది. అయితే ఇరాన్ ఫై సైనిక చర్య తీసుకొనే సాహసం చేయలేకపోయాయి. ఇలా చేస్తే ఇరాన్ తరుపున సొవియట్ యూనియన్ రంగంలోకి దిగుతుంద ని భయపడ్డాయి.
ఇరాన్ కు సేనల బదులు కేర్మిట్ రుజ్వేల్తును అనే ఎకనామిక్ హిట్ మాన్ ను పంపించింది అమెరికా. కేర్మిట్ అక్కడ అద్భుతంగా పనిచేసాడు. కొందరిని డబ్బుతో కొన్నాడు. మరి కొందరిని బెదిరించి లొంగ దీసుకొన్నాడు. దేశామంతటా వీధి పోరాటాలు ,హింసాత్మక ప్రదర్శ నలు జరిపించాడు. అప్పటి ప్రధానికి ప్రజల్లో పట్టులేదని భ్రమను కలుగజేసాడు ఫలితంగా అతడు పదవిని కోల్పోయాడు . అమెరికా మద్దత్తు తో షా ఇరాన్ అధ్యక్షడు అయ్యాడు . ఎదురులేని నియంతలా మారి ఇరాను ను పాలించాడు. ఇదే పరిణామక్రమాన్ని మనం ఈజిప్టు సుడాన్ నిన్నమొన్న జరిగిన పొలిటికల్ వార్లో చూడొచ్చు.
కేర్మిట్ రుజువేల్ట్ ఒక వృత్తికి ప్రాణం పోసాడు. అదే సామ్రాజ్యవాద దళారి.
1960లలో ఒక కొత్త పరిణామం సంభవించింది. అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు (ప్రపంచ బ్యాంకు, ఐ ఎం ఎఫ్ ) అప్పుడప్పుడే వేల్లూనుకు న్నాయి. అమెరికా, దాని యురోపియన్ సామ్రాజ్యవాద మిత్ర దేశాల పెట్టుబడితో నడిచే ఈ ద్రవ్య సంస్థలు, బహుళ జాతి కార్పోరేషన్ల మధ్య ఒక పరస్పర లాభాదాయకమయిన బంధం ఏర్పడింది. ఇకఫై సి .ఐ.ఎ ఏజెంటు లా కాకుండా ఈ దళారీలు జీతాలు ప్రివేటు కంపేనీల నుండి తీసుకొంటారు. పనులు మాత్రం అమెరికన్ సామ్రాజ్యవాదులుకు పనికి వచ్చేలా చేస్తారు.

అందుకే మనం కొంచెం చరిత్ర పట్ల శ్రద్ద పెట్టాలి. అప్పుడే విషయాలు స్పష్టంగా అర్ధం కావడం మొదలవుతుంది. క్యమ్యూనిజం బారిన పడకుండా దేశాన్ని రక్షించడమే ఈ పనులలొ ఒకటి. సమసమాజం అనే కమ్మని కలని చిదిమేసే కుట్ర..
1971 నాటికి ఇండోనేషియా కమ్యూనిజం దారిన పోకుండా ఆపాలన్న అమెరికా తాపత్రయం ఇంకా ఎక్కువైంది. దానికి కారణం అప్పుడు వియత్నాం లో అగ్రరాజ్యానికి తగిలిన ఎదురుదెబ్బలు.
దక్షిణ ఆసియాలో అమెరికా ఆధిపత్యాన్ని నిలబెట్టడానికే జాన్ పెర్కిన్స్ పనిచేసే కంపెనీ ఆధ్వర్యములో ఇండోనేషియా విద్యుదీకరణ ప్రాజెక్ట్ చేపట్టారు. ఇరాన్ లో షా ప్రభుత్వం లాగే సుహార్తోను అమెరికా చేతిలో కీలుబొమ్మగా మార్చడమే వ్యూహం. అంతే కాదు అప్పుడు ఇండోనేసియాలో ప్రయోగాత్మకంగా జరపబడుతున్న ఆ ప్రయత్నం సఫలమవుతే ఇతర దేశాలలో కూడా ఇదే నమూనా చూపవచ్చుననేది అమెరికా ఆలోచన.

అచ్చంగా చంద్రబాబు హయాంలో ఇండోనేషియా నమూనానే అమలు జరిగింది.

దళారీ స్వగతం..

ఇవాళ పని కోసం ఆరాటపడే మనుష్యుల కోసం వెతుకుతూ మా వాళ్ళు థాయిలాండ్, ఫిల్లిప్పిన్స్, బోట్ స్వనా ,బోలివీయ ఇంకా అనేక దేశాలకు వెళుతున్నారు. ఇప్పటికే దుర్బరదారిద్రయంలో ఉన్న తమ బిడ్డలకు కడుపునిండా నాలుగు మెతుకులు పెట్టలేని వారిని ఇంకా దోపిడీ చెయ్యడానికి వీళ్ళు వెళుతున్నారు. అమెరికా లోని పెద్ద పెద్ద నగరాలలో ఉన్న ఖరీదయిన ఆఫీసులల్లో ఈ దళారీలు ఉంటారు. విలాసవంత మై న జెట్ విమానాలలో తిరుగుతూ ఖరీదయిన 5 స్టార్ హోటల్స్ లో బస చేస్తూ వీరు శ్రామికులకోసం వెతుకుతారు .

బానిస వ్యాపారులు ఇప్పటికి ఉన్నారు. కాకపోతే పుర్వంలా వాళ్ళు ఆఫ్రికా అడువుల్లోకి వెళ్లి నల్లవారిని కట్టేసి పట్టుకు రారు. చార్లెస్టన్, కార్ట్ జిన్నా, హవానాల్లో బానిసల వేలం పాటల వేదికలు లేవిప్పుడు. ఇప్పుడు దళారీలు ఫ్యాక్టరీలు కట్టి స్థానికంగా దొరికే శ్రామికు లను అందులో పనిచేయించుకుంటారు.

ఆ ఫ్యాక్టరీలలో జీన్స్ పాంటులు, టెన్నిస్ బూట్లు, వాహనాల విడిభాగాలు, కంప్యూటర్ విడిభాగాలు తయారుచేస్తారు. తమ ఇష్టం వచ్చిన దేశాలలో వాటినిన అమ్ముకుంటారు .ఒక్క్కోసారి వాళ్ళు అసలు ఫాక్టరీ కూడా పెట్టరు . స్థానికంగా వున్న పెద్దవ్యాపార వేత్త తో ఫాక్టరీ పెట్టిస్తారు తమ వస్తువులు తయారు చేయించుకుంటారు, ఇప్పటి భారతి వాల్మార్టు లాగ.

ఇలా వెళ్ళే దళారి యువతీయువకులు తమను తాము చాల ఉన్నతమైన మనుష్యులు అనుకుంటారు . ఆయా
దేశాల పురాతన శిధిలాల ఫోటోలను తెచ్చి స్వదేశం లో గర్వంగా ప్రదర్శించుకుంటారు. విదేశాలలో వ్యాపారం చేయడంలో గల సాధక బాధకాల గురించి సదస్సులలో పిచ్చాపాటిగా మాట్లాడుకుంటారు. వాళ్లకు విదేశంలో ఏ చికాకు కలగకుండా వారి కంపెనీ ఒక పెద్ద లాయరును నియమిస్తుంది. వాళ్ళు చేస్తున్న పని సరైనదేనని వారిని అనుక్షణం నమ్మించడానికి మానసిక వైద్యులతో సహా అన్ని “వసతులు ” సమకూరుస్తుoది వారి కంపెనీ.

బానిసలు పూర్తి గా పరిణామం చెందని మానవులని, వారిని సంస్కరించెందుకే కిరస్తానీ మతం లోకి వారిని చేర్చు కుంటున్నామని పూర్వకాలపు బానిస వ్యాపారి అనుకునేవాడు. తమ ఆర్ధిక వ్యవస్థ , తమ సమాజం బానిసల శ్రమశక్తి పైనే ఆధారపడినదని అతగాడికి తెలుసు.

అసలేమి లేకపోవడం కన్న నేను ఇచ్చే డాలర్ మిన్న అనీ , ఇటువంటి ఉద్యోగాలు చేయడం వలన పేద ప్రజలకు అంతర్జాతీయ సమాజంతో కలిసే ఒక గొప్ప అవకాసం కల్పిస్తున్నామని కొత్త బానిస వ్యాపారులు అనుకుంటున్నారు. తాము చేసే ఈ పనుల వలన తమ కంపెనీ అయితే లాభాపడుతుందేమో కాని తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోని వీరికి ఎప్పటికి అర్ధం కాదు.

లాటిన్ అమెరికా దేశాలలో దళారి అనుభవాలు :

పనామా కాలువలో దొంగలుపడ్డారు

అట్లాన్టిక్ , పసిఫిక్ మహా సముద్రాలను కలుపుతూ పనామ కాలువ తవ్వాలని ఒక ఫ్రెంచ్ ఇంజనీర్ నిర్ణయించే నాటికి పనామ కొలంబియా దేశం లో అంతర్భాగంగా ఉండేది. 1881 లో ఫ్రెంచ్ వారి నేతృత్వం లో మొదలయిన కాలువ పనులకు అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయి. చివరికి భారి ఆర్ధిక నష్టంతో పనులు ఆగిపోయాయి. పనామ కాలువను ఒక అమెరికన్ కంపెనీకు అప్పగించమని కోరింది అమెరికా. కొలంబియానిరాకరించింది.

1903 లో రుజువేల్ట్ అప్పటి అమెరికా అధ్యక్షుడు పనామా ఫై దాడికి ఆదేశించాడు. ఒక స్థానిక ప్రజా నేతను మట్టుబెట్టి ఒక కీలుబొమ్మ నేతను ప్రతిష్టించి మొదటి కాలువ పనులను అమలులోకి తెచ్చారు. దీని ప్రకారం పనామా కాలువ ఇరువైపుల అమెరికా అధీనంలో ఉంటుంది. అయితే ఈ వొప్పందం లో వింత ఏమిటంటే దీనిపి సంతకం చేసినవారు అమెరికా సెక్రటరీ అఫ్ స్టేట్ మరియుఒక ఫ్రెంచ్ ఇంజనీరు. పనామ దేశస్తులు ఎవ్వరు సంతకం చెయ్యకపోవడం గమనార్హం.

1968 లో స్వతంత్రం ప్రకటించు కోనేదాక అమెరికన్ సేనలు పనామాను కంటికి రెప్పలా కాపలా కాసేవి. ఒమర్ తోరిజాన్ పనామా దేశాధ్యుక్షుడు అయ్యాక పనామాకు తన గడ్డపై , తన ప్రజలపై , తమ కాలువ పై సర్వ హక్కులు ఉన్నాయని వాదించేవాడు.

అట్లాంటి పనమాకు ఒక భారి అభివృద్ధి పధకం తయారుచేయడానికి దళారి జాన్ పెర్కిన్స్ నియమించబడ్డాడు. ఈ పథకం వలన ప్రపంచ బ్యాంకు ఇంటర్ అమెరికన్ డెవలప్మెంట్ బ్యాంకు కలిసి పనామకు కోట్ల కొద్ది డాల్లర్లు అప్పుగా ఇవ్వడానికి వీలవుతుంది. విద్యుత్ ,వ్య్వవసాయ రంగాలకు ఉద్దేశించిన ఈ అప్పు కేవలం ఒక మోసపూరిత ఎత్తుగడ. పనామాను ఎప్పటికి తమ పాద దాసిగా చేసుకొనేందుకు అమెరికా వేసిన పాచిక.

కాని పనామ దేశ స్త్ర్రీలను వ్యభిచారం చేయనివ్వరు. వారు బార్ గల్స్ గాను, డాన్సుర్లుగా పనిచేయవాచ్చు. కాని శరీరాలను అమ్ముకోకూడదు. ఆ పని విదేశీయులకు వదిలివేయబడింది.

1989 డిసెంబర్ 20 నాడు పనామ పై అమెరికా ఏకపక్ష దాడికి దిగింది. పనామ చేసిన నేరమల్లా గుప్పెడు మంది అమెరికన్ ప్రభుత్వ పెద్దలను, బహుళ జాతి కంపెనీలను వ్యతిరేకించడమే. తమ దేశంలో ఒక కాలువను తమకు నచ్చిన వారితో (జపనీస్) నిర్మింప చేసుకోవాలనే ఆకాంక్షని వ్యక్తపరచడమే.

అమెజాన్ అడవుల్లో గ్రీన్ హంట్

తనకు తెలిసిన ప్రతి సంస్కృతి 1990 చివరి సంవత్సరాలలో ఒక కీలకమైన దశకు చేరుకున్నామని చెబుతుందని జాన్ పెర్కిన్స్ ఒక మంచి పరిశీలన చేస్తాడు . యాదృ చ్చికంగా మన దేశంలోనూ, ఇతర దేశాల లాలోను సంస్కరణల ‘స్వర్ణ’ యుగం అదే.

ఈక్వెడార్ అనే చిన్న దేశాన్ని తన అమెజాన్ అడవులను చమురు కంపెనీలకు అర్పించమని అంతర్జాతీయ సంస్థలు, బహుళజాతి సంస్థల ఒత్తిడి చేసాయి. రచయిత ఈ సందర్భంగా ఒక వ్యాఖ్య చేస్తాడు.
ఈక్వెడార్ లో ఇప్పుడు జరుగుతున్నసంఘర్షణ ధనవంతులు దరిద్రులు మధ్య కాదు, పీడితులు పీడింప బడే వారి మధ్యే కాదు — ఇది మన నాగరికత ఏ పాటిదో తేల్చే సమరం అంటాడు.

ఈక్వెడార్ లో సతత హరిత అడువులు చాల విలువైనవి. ఇక్కడ స్థానిక తెగలు వారి సంస్కృతి విలువైనవే. ఇక్కడ నివశించే సమస్త జీవజాతులు విలువైనవే.

ఆఫ్ఘనిస్తాని .ఇరాక్, వెంజుల్లల్లో ఉన్న ఉద్రిక్తతలు కూడా ఈక్వెదార్లొ అమెరికా వేలుపెట్టకుండా నిరోధించా లేకపోయింది . ఎందుకంటే ఈ సంఘర్షణకు అమెరికన్ సేనలు అవసరం లేదు. ఇక్క్కడ యుద్ధం చేస్తున్నది బరిశేలు, బల్లాలు , పాత తుపాకీలు చేబూనిన అడివి పుత్రులు కదా. వారిని ఎదుర్కోవడానికి ఆధునిక ఈక్వెడార్ సైన్యం సరిపోతుంది. కొద్దిమంది అమెరికన్ స్పెషల్ ఫొర్సెస్ కు చెందినా “నిపుణులు ” ఉంటే చాలు. ఇలాంటి “యుద్ధం” ఒకటి జరుగుతున్నట్టు కూడా మా అమెరికన్ ప్రజలకు తెలియదని ఆశ్చర్య పోతాడు జాన్ పెర్కిన్స్. మన దేశం లో దండకారణ్యంలో గ్రీన్ హంట్ పేరిట ఇలాంటి యుద్ధం ఒకటి జరుగుతుందని మనలో మాత్రం ఎందరికి తెలుసు?

కొలంబియా గెరిల్లాలు

1970లలో కొలంబియా లొ జాన్ పెర్కిన్స్ కంపినీకు అనేక మౌలిక వసతుల రూపకల్పన కాంట్రాక్టులు దక్కాయి. అప్పుడే పౌలా అనే కొలంబియా యువతీ పరిచయమవుతుంది. ఆమె తమ్ముడు ప్రజా గెరిల్ల సైన్యం లో ఒక్కడు. పౌలా ఒక రోజు పెర్కిన్స్ తో నిర్మొహమాటంగా మాట్లాడుతుంది.

” మీరు ఆనకట్ట కడుతున్న్న నది ఒడ్డున నివసిస్తున్న రెడ్ ఇండియన్లు ,రైతులు మిమ్మల్ని ద్వేషిస్తున్నారు. నగరాలలో నివసిస్తున్న ప్రజలు కొందరు మీ కంపెనీ క్యాంపులపై దాడి చేస్తున్న గెరిల్లాల పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వీళ్ళని కమ్యూనిస్టులని,టెర్రరిస్టులు , స్మగ్లర్లు అని అంటుంది. కాని వాస్తవం ఏమిటంటే వాళ్లు మామూలు ప్రజానీకం . మీ కంపెనీ నాశనం చేస్తున్న భూములపై నివసిస్తున్నారు.

గెరిల్లాల పట్ల రచయితకు సానుభూతి ఉంది

” నమ్మిన ఆశయాల కోసం నిలబడ్డారు వాళ్ళు. నిజమైన ప్రపంచాన్ని ఎంచుకున్నారు వాళ్ళు ” రెండు ప్రపంచాల మధ్య ఊగిసలాడుతున్నాను నేను అని రచయిత వాపోతాడు.

ఈ అనుభవాలు మచ్చుకి కొన్ని మాత్రమే ! మనదేశం లోనూ జరుగుతున్న’ అభివృద్ధి’ పరిణామాలకు కొన్ని విషయాలు దగ్గరగా వున్నాయనిపిస్తుంది కదా! అందుకే ఈ దళారి పశ్చాతాపం మనలోకూడా ఉన్న నిజమైన మనిషిని నిదురలేపుతుంది.

- నక్కా హేమా వెంకట్రావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

This entry was posted in పుస్తక సమీక్షలు and tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

3 Responses to సామాన్యుడు కాదు సామ్రాజ్యవాద దళారీ-’ఒక దళారీ పశ్చాత్తాపం’ పుస్తక పరిచయం

  1. Usha kiran says:
    సమగ్రమైన సమీక్ష అందించారు. తప్పకుండ చదవాలి ఈ పుస్థకాన్ని. అభినందనలు.
  2. nsmurty says:
    ఇది చాలా అద్భుతమైన పరిచయం హేమా గారూ. మీకు నా హృదయ పూర్వక అభినందనలు.

Text