కథ కాదు ; అంత కన్నా లోతైన ఆత్మకథ
-నక్కా హేమా వెంకట్రావు |
”కథ కాదు ; అంత కన్నా లోతైన ఆత్మకథ….” తన తోటి సెక్స్ వర్కర్ల బాధామయ గాధలెన్నో వుండగా పుస్తకం రాసుకోడానికి తన ఆత్మ కథనే ఎందుకు ఎంచుకున్నారన్నప్రశ్నకు ‘ఒక సెక్స్ వర్కర్ ఆత్మ కథ’ రచయిత్రి నళిని జమీలా చెప్పిన జవాబిది.జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ మనసులో ముద్రించుకుపోయిన అనుభవాలను సినిమాలో దృశ్యాల్ల కళ్ళ ముందుకు తెచ్చుకుంటూ రాసారు ఆమె తన ఆత్మ కథని. జీవితాన్ని అతి తరచుగా సమీక్షించుకుంటూ నెమరు వేసుకునే లక్షణం వలన జ్ఞాపకాలను భద్రంగా పదిలపరచుకున్న నళిని జీవన దృశ్య మాలికలను అతి సుళువుగానే అక్షరీకరించారు. జీవితంలో ప్రతి అడుగునా ఓ పోరాటం చేయాల్సిన పరిస్థితుల్లో బ్రతికిన నళిని ఆ అనుభవాల స్మృతుల్ని ఓ గొప్ప జీవన శక్తిగా మలచుకుంది .
మనుషులందరూ కులాలుగా విడిపోయిన భారత సమాజంలో కేరళ లోని కల్లూరులో ఓ బిసి కులంలో పుడుతుంది .వర్గ రాజకియాలను ఎత్తిపట్టి రాజ్యమేలుతున్న కమ్యూనిస్ట్ స్టేట్ లో కులం పోషిస్తున్న అణచివేత పాత్ర తమ జీవితంలో జరిగిన సంఘటనలు కళ్ళకు కట్టినట్లు విశదీకరిస్తుంది నిచ్చెన మెట్లవంటి కులసమాజంలో క్రింది కులాలతో సహజీవనం ఒప్పుకొని కుటుంబ నిబంధనలు , ఆ తర్వాత సమాజంలో కులం యొక్క దాష్టికం ప్రతి స్థాయిలో అనుభవిస్తుంది. మాతృస్వామ్య సమాజంగా పేరు పడ్డ మలయాళ సమాజంలో పితృస్వామ్య ఛాయలు అతి చిన్నతనం నుంచి కాటేస్తాయి. ఆ వివక్షల నుంచి అవసరం వెన్నాడుతుంటే కుటుంబం అనే చట్రం నుంచి బాలశ్రామికురాలిగా బయట ప్రపంచంలోకి అడుగుపెడుతుంది .అక్కడ మరింతగా వర్గం మతం రాజ్యం మరింత హింసకు గురిచేస్తాయి . సెక్స్ వర్కర్ల మధ్య నున్న మేధావిగా మేధావి వర్గంలోని కొంతమంది కామెంట్ చేస్తే అత్యంత వ్యంగ్యంగా మేధావి వర్గంలోని సెక్స్ వర్కర్ గానే గుర్తించమని జవాబిస్తుంది .హింసను ఎదుర్కొంటూనే వ్యక్తిగా తన ఉనికిని కాపాడుకుంటూ ఆ వృత్తిలో వున్న తన లాంటి వారికోసం పోరాడే క్రమంలో ఎదిగిన ఒక యూనియన్ లీడర్ కథే ఓ సెక్స్ వర్కర్ ఆత్మ కథ .
నడవటానికి కూడా శక్తి లేక నేలమీద డేకుతూ వచ్చిన నళిని నాయనమ్మ ఆమె తమ్ముణ్ణి దగ్గరకు తీసుకుని ఓదార్చే దృశ్యం తో మొదలవుతుంది ఆత్మ కథ . పలక కోసం అన్నతో పోట్లాడి తన్నులు తిన బడే ఆ మూన్నాళ్ళ ముచ్చట మూడవ తరగతి తో ముగిసిపోతుంది .ధాన్యం లెక్కలు చూసుకునే పాటి చదువు చాలన్న వాళ్ళ పెద్దమ్మ సలహాతో బడికి వెళ్ళలేక పోతుంది .ఆ నిస్సహాయతని ఎలా వెళ్ళ గక్కాలో తెలియని ఆమె రోడ్డెక్కి ఏడుస్తూ హాయిని పొందేది. తండ్రి కమ్యునిస్ట్ పార్టీ సభ్యుడు. నెలకో నారింజపండు ఇచ్చేవాడు తప్ప అంతకు మించి అండగా నిలిచేవాడు కాదు.తండ్రి కమ్యూనిస్ట్ , నారాయణ గురు శిష్యుడైనా దళితులతో క్రిస్టియన్లతో ఆడ నిచ్చే వాడు కాదు. ఆర్ధిక లేమితో భయంతో బిక్కచచ్చిపోయే వాళ్ళ అమ్మను చూసాక డబ్బుకూ ,మనిషి హుందాతనానికి వుండే సంబంధం చిన్నతనం లోనే అర్ధం చేసుకుంది. అలా తొమ్మిదేళ్ళ వయసులో లుంగీ చుట్టుకుని పెంకుల ఫ్యాక్టరీ లో పనికి చేరిపోతుంది.పగిలి పోయిన పెంకులు ఏరేటప్పుడు తెగి గీరుకుపోయిన చేతుల్ని చూసి నళిని అమ్మ ఏడ్చినా తప్పనిసరి పరిస్థితుల్లో పనికి వెళుతుంది.అట్లా బరువులు మోయడం కంటే ఇళ్ళల్లో పాచిపనులు చేసుకోవడం వలన మంచి తిండి కూడా దొరుకుతుందని సలహా ఇవ్వడంతో బంధువుల ఇంట్లో పనికి చేరుతుంది.
అక్కడ ఇంట్లో ఒక సభ్యుడు చేసిన లైంగిక చర్యకు భయపడి పని మానేసి మట్టి బావుల్లో పనికి చేరుతుంది.అక్కడ కూడా ఇలాంటి సమస్యలే ఎదురవుతాయి.చెయ్యిపట్టి లాగినా కావలించుకున్నా నోరెత్తకుండా వూరుకునే వారికే మంచి కూలి దక్కేది. రోజంతా మండుటెండలో ఊపిరి సలపని పని చేసినా ఆడవాళ్ళకు తక్కువ కూలి దక్కేది. బిసి ఇళవ కులానికి చెందిన ఈమెపై కుల వివక్ష ఎదురవుతుంది. పనిచెయ్యడం సంపాదన సంగతి చూసుకోవడం వాటితో పాటు వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడం ముఖ్య మనుకున్న నళిని ఆ తర్వాత జీవితంలో వేసే ప్రతి అడుగులోనూ అదే దృక్పథాన్ని కొనసాగించింది.
రెక్కలు ముక్కలు చేసుకుని పని చేసినా తండ్రి మాత్రం పెత్తనం చేస్తూ షరతులు పెట్టేవాడు.నళిని అన్నయ్య పెళ్లి విషయంలో మద్దతు ఇచ్చినందుకు ఇంటినుంచి వెళ్ళ గొడతాడు . 18 ఏళ్ళ వయసులో ఎక్కడికి వెళ్ళాలో తెలియక తనని ప్రేమించిన చంద్రన్ అనే వ్యక్తి కోసం వెతుకుతూ వెళ్ళినా ప్రయోజనముండదు. ఆ వెతుకులాటలో ఆకతాయి మూకకు నాయకుడైన సుబ్రహ్మణ్యం సహాయం తీసుకుని అతనికి భార్యగా మిగిలిపోతుంది.సారా వ్యాపారం చేసే అతను నళినికి సారా తాగటం నేర్పిస్తాడు.మూడున్నరేళ్ళపాటు అతనితో కలిసి బతుకుతుంది. యిద్దరు పిల్లలని వదలిపెట్టి విపరీతమైన తాగుడు వల్ల కాన్సర్ వచ్చి చచ్చిపోతాడు. అలాంటి పరిస్థితుల్లోనే పిల్లలని పోషించుకోడానికి అత్తగారి పోరు వలన స్నేహితురాలి సహాయంతో వ్యభిచార కూపం లోకి దిగుతుంది. మనిషిలో సున్నితత్వము , క్రూరత్వము రెండూ వుండటం సాధ్యమేనని మొదటి క్లయింట్ నేర్పిన పాఠం. ఎమర్జెన్సీ రోజులలో నళినిని అరెస్ట్ చేసి విపరీతంగా కొడతారు. అయినా సరే రాత్రిళ్ళు మా దగ్గరకి వచ్చేది మీరే . పగలు మా దగ్గర కొచ్చేదీ మీ పోలీసులే .చావ గొట్టేదీ మీరే అని పోలీసులని ప్రశ్నిస్తుంది . అదే పోలీసాఫీసరుతో గడుపుతానని మాటిచ్చి అతని సహాయంతో బయట పడుతుంది. ఒక్క పోలీసులేనా? మార్క్సిస్ట్ నాయకులు కూడా ఆమెను ఉపయోగించుకోవాలని చూస్తారు.
ఆనాడు సాముహిక అత్యాచారాల్లాంటివి ఉండేవి కావు కాబట్టి ఎంతో వేడుకగా కాలం గడిచిపోయేది. అందరి మధ్య ఒక ప్రత్యేక తరహా సహజీవనం సాగిపోతుండేది అంటుంది నళిని.డబ్బున్న వాళ్ళని నళిని ఎప్పుడూ కాదనలేదు. కారణం వాళ్ళు హుందాగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారంటుంది. ఆ హుందాతనం ఉత్త నటనే తప్ప నిజమైనదేమి కాదని ఆమెకు తెలుసు. ఎప్పుడూ ఆధిపత్యాన్ని చెలాయించాలని చూసే మగవాళ్ళతో సంబంధాలను నిలుపుకోటానికి ఇష్ట పడేది కాదు. ఏ పిల్లలకోసం సంపాదన మొదలెట్టిందో ఆ పిల్లలనే అత్తింటి వారు దూరం చేస్తారు.
యిక ఆ వృత్తి మానేయాలని కోరుకుని కోయ్యక్క అనే ముస్లిం వ్యక్తిని పెళ్ళి చేసుకుంటుంది. నళిని సెక్స్ వర్కర్ అన్న సంగతి తెలిసి భర్త బావమరిది సంబంధం పెట్టుకోవాలని చూస్తాడు. బిడ్డ పుట్టినా… మత విశ్వాసంతో పుట్టిన పిల్ల కాదు కాబట్టి భర్త ఇష్ట పడటం లేదని తెలుసుకుని కట్టు బట్టలతో బయటకు వచేస్తుంది. షాహుల్ హమీద్ అనే వ్యక్తి కోరిక మేరకు అతనితో సహ జీవనం చేస్తుంది. దాంతో ఆమె పేరును జమీలాగా పేరు మార్చేసుకుంటుంది. షాహుల్ మంచి వ్యక్తి అయినా కూతుర్ని స్వంత బిడ్డలా చూసుకుంటున్నా ఏదో భయం నళినిని వెంటాడుతూనే వుండేది. కొన్నాళ్ళ పాటు అతనితో ఊటీలో కూడా వ్యాపారం చేస్తుంది. కానీ ఆ డబ్బు ఆమె చేతికి అందేది కాదు.నష్టాన్నే చవిచూసి వెనుదిరుగుతుంది. మోజు తీరిపోయిన షాహుల్ ఆమెను వదిలించుకోటానికి అనేక ఎత్తుగడలు వేస్తాడు. ఇక అతను వెళ్ళ గొట్టక ముందే బయటకు పోవడం గౌరవంగా ఉంటుందని నిర్ణయించుకుంటుంది.
జబ్బుతో పదమూడేళ్ళ కూతురితో మసీదు చేరుకుంటుంది.ఎరిగిన వాళ్ళు అడిగితే అప్పటి వరకు సహచర్యం చేసిన నళిని సహచరుడు- ఆమెకు పిచ్చి అని ప్రచారం చేస్తాడు. తిండికి కూడా కష్టపడిన నళిని ఒక మసీదు నుంచి ఇంకో మసీదుకు మారుతూనే వుంటుంది. నళినిని ముస్లింలు పూర్తిగా స్వీకరించరు గానీ , హిందువులు మాత్రం వెలివేస్తారు.చివరికి బ్రతుకు దేనికీ చెందకుండా పోయింది అంటుంది. తెలిసిన వాళ్ళ సహాయంతో ఒక మెడికల్ కాలేజీ లో చేరి అష్టకష్టాలు పడి ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటుంది. కొన్నాళ్ళు సెక్స్ వర్కర్ గాను మరి కొన్నాళ్ళు రకరకాల పనులలోను వుంటూ వచ్చిన నళిని సెక్స్ వర్కర్ల కోసం పనిచేసే జ్వాలాముఖి అనే సంస్థతో పరిచయమయ్యాక సెక్స్ వర్కర్ గానే కొనసాగాలనే నిశ్చయించుకుంటుంది. తన కూతుర్ని తెలిసిన వాళ్ళింట్లో వుంచి తన గురించి ఏమి దాచకుండా అంతా చెబుతుంది.
రకరకాలుగా ప్రవర్తించి వేధించే విటులగురించి, పోలీసుల వేధింపుల గురించి సంఘంలో స్వేచ్ఛగా చర్చించుకుంటారు. వ్యభిచార వృతి నేరమే అయితే ఆ నేరంలో భాగస్తుడిని ఎందుకు శిక్షించరు ? అని వాదించే నళిని వాదనకు అందరు ఆకర్షితులవుతారు. సంస్థ సభ్యుల కష్టసుఖాలను పట్టించుకోవాలని వాదించి నెగ్గుతుంది. తమ కష్టసుఖాలు ప్రజలకు తెలియపరచి ప్రజలసహకారాన్ని పొందాలని బహిరంగ సభలను ఏర్పాటు చేస్తుంది. ఆ సభల్లో పోలీసులు ,రౌడీలు సెక్స్ వర్కర్లను కొట్టడము , వేధించటం… ఇక కొనసాగనివ్వమని సంస్థ లక్ష్యంగా ప్రకటిస్తుంది.మా దగ్గరకు వచ్చేవారిలో లాయర్లు , డాక్టర్లు ,వ్యాపారవేత్తలు ఎందరో వున్నారు. వాళ్ళంతా సంఘంలో మర్యాదస్తులుగా చలామణి అవుతున్నారు. మేం మాత్రం ఎందుకు నేరస్తులుగా నిలబడాల్సి వస్తుంది అని నిలదీస్తుంది. ఆ తర్వాత ఎంతో మంది లాయర్లు, సోషల్ వర్కర్ల మద్దతు కూడగడుతుంది. అలా నాయకురాలిగా ఎదిగిన నళిని ఎన్నో సభలకు నాయకత్వం వహిస్తుంది.
పాత రోజుల్లాగా గౌరవంగా చూడకపోయినా , వేధింపులయినా మానుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది. ఇదే వృత్తిలో అనేకసార్లు మృత్యు ముఖం లోకి వెళ్ళి తిరిగి వస్తుంది. ప్రమాదమనేది తప్పనప్పుడు దానికి స్వయంగా ఎదురు వెళ్ళటమే మంచిదని అనుభవం ద్వారా తెలుసుకుంటుంది. సెక్స్ వర్కర్ల వేధింపుల పైన మాఫియా గ్యాంగుల హత్యల పైన అందరిని సంఘటిత పరచి సమాజానికి వారి వెతలు తెలియ జేస్తుంది. సెక్స్ వర్కర్లకు కనీస వేతనం వంద రూపాయలైనా వుండాలని, ఇళ్ళు కట్టుకోటానికి, రేషన్ కార్డులకు, ఉచిత వైద్య సదుపాయాలను ఏర్పాటు చెయ్యాలనే డిమాండ్లు ముందుకు తెస్తుంది. పోలీసులఆగడాలను ప్రశ్నిస్తుంది. జైలు పాలవుతుంది. ఆ జైలు జీవితాన్ని కూడ హాయిగా తీసుకుంటుంది.
అంతేకాదు సమాజంలో కిందస్థాయి మనుషులలో- ప్రవర్తించడంలో మాములు వాళ్ళకు, ఉద్యమ కార్యకర్తలకు రాజకీయ చైతన్యంలో తేడా ఏమి వుండదంటుంది.చాల గొప్ప వాళ్ళుగా అభ్యుదయ వాదులుగా చలామణి అయ్యే మనుషుల్లో కొందరు ఆచరణలో హీనంగా ప్రవర్తిస్తారని అనుభవం ద్వారా తెలుసుకుంటుంది. సెక్స్ వర్కర్ల కోసం ఒక డాక్యుమెంటరీ తయారు చేస్తుంది. సెక్స్ వర్కర్ల ఫోరం ఏర్పాటుకు తోటి సంస్థ సభ్యులతో కలసి కలకత్తా వగైరా ప్రదేశాలకు వెళుతుంది. తన డాక్యుమెంటరీ ప్రదర్శించడానికి థాయిలాండ్ మరియు ఇతర దేశాలకు వెళుతుంది. అక్కడ ఫిల్మ్ తీయడం నేర్చుకుంటుంది. సెక్స్ వర్కర్లకు ఫోటోగ్రఫీ , డాక్యుమెంటరీలు తీయడంపై వర్క్ షాపులు నిర్వహిస్తుంది. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో నళిని డాక్యుమెంటరీ ను ప్రదర్శిస్తారు. చివరిగా ఒక సినిమా తీయాలన్న ప్రయత్నం మొదలుపెడుతుంది. సెక్స్ వర్కర్లతో పాటు , స్వలింగసంపర్కులను, యునిక్స్ లకు సభలు ఏర్పాటు చేస్తుంది. ఎక్కడకు వెళ్ళినా సెక్స్ వర్కర్ల సంస్థ జ్వాలాముఖి తమ ఆత్మ విశ్వాసానికి చిహ్నమంటుంది.
ఆడవాళ్ళ కంటే సెక్స్ వర్కర్లకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయంటుంది. మిగతా ఆడవాళ్లలాగా మొగుడి కోసం వంటలు వండి ఎదురు చూస్తూ కూర్చునే అవసరం వుండదు. వారి మురికి గుడ్డలు వుతక నక్కరలేదు. భర్త ఆస్తుల్లో కాస్త వాటా ఇమ్మని దేబరించక్కరలేదు. సెక్స్ వర్కర్గా వున్నందుకు కుమిలిపోతూ వుండటం కన్నా ఈ వాస్తవాలను గుర్తించడం మంచిదంటుంది. ఎన్ని పనులు చేసినా కూతురి ఆలనా పాలన మరచిపోదు. అట్టహాసంగా పెళ్ళి చేసి పంపితే సంవత్సరానికే తిరిగి వస్తుంది. తిరిగి వచ్చిన కూతురు సంఘం పనుల్లో పాలు పంచుకుంటూ తల్లిని అర్ధం చేసుకునే స్థాయికి ఎదుగుతుంది.
సెక్స్ వర్కర్ల పునరావాసం పేరిట అప్పుడప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు చూసి ఆడవాళ్లు అందరిని ఒక చోట పడేసి తిండికి బట్టకు దేబరించాల్సిన బిచ్చగత్తెలుగా మారుస్తున్నారంటుంది నళిని. ఈ పునరావాసం పేరిట ఒక ప్రత్యేకమైన గుంపుగా విడదీయటంలో మరింత నిస్సహాయతలోకి ఒంటరిని చేస్తుంది. ఈ పునరావాసం సెక్స్ వర్కర్లను కుటుంబాలతోను, సమాజంతోనూ విడదీస్తుంది అని వాపోతుంది . రాడికల్ ఆలోచన వున్న నళిని తను నాస్తికురాలో ఆస్తికురాలో తెలియదంటుంది . కానీ మసీదులో పడివున్న రోజుల్లో మంత్రించిన నీళ్ళను తీర్ధంగా పుచ్చుకోవటము , తల మీద నెమలి ఈకలు వుంచి దీవించటము మనస్సుకు శాంతి ఇచ్చిన మాట నిజమే నంటుంది.
సెక్స్ వర్క్ ను నేరంగా చూడటం మానెయ్యాలని కోరుకునే నళిని లైసెన్సు ఇవ్వమని కోరదు. ఎందుకంటే దాంతో మరికొన్ని సమస్యలు తలెత్తు తాయంటుంది. డాక్టర్ల దగ్గర,పోలీసులదగ్గర లైసెన్సు పొందే పద్ధతిలో లంచగొండితనం,అవినీతి పొంచే వుంటాయి అంటుంది. ఇద్దరు వ్యక్తులు పరస్పర అవగాహనతో సెక్స్ సంబంధాల్లోకి వెళ్ళ దల్చుకుంటే దానివలన మిగిలిన సమాజానికి జరిగే హాని ఏమి లేనపుడు ఆ విషయాన్ని నేరంగా పరిగణించవలసిన అవసరం లేదంటుంది. బొంబాయి లాంటి ప్రదేశాల్లో లైసెన్సులు ఇవ్వడం అబద్ధమని , ఆరోగ్య పరిస్థితిని బట్టి సర్టిఫికెట్లు ఇస్తారంటుంది . సెక్స్ అవసరం స్త్రీకి ఉంటుందని అసలు సెక్స్ వర్కరుకు , లైంగిక దోపిడీకి తేడా ఉంటుందనీ ….సెక్స్ రాకెట్లను వేరుగా చూడాలని కోరుతుంది.
తమ వృత్తి పట్ల ఆనందంగా లేమనీ… బతుకు తెరువుకోసం రాళ్ళూ తట్టలు మోసినట్టు ,పారిశుద్ధ్య పని చేసినట్టు .మేం కూడ మా వృత్తిని చేపట్టాం.ఆయా వృత్తుల వాళ్ళు క్రమంగా వాటికీ అలవాటు పడినట్టే మేము కూడ ఈ జీవితంలో భాగంగా చేసుకున్నాం . ఎంతో అనారోగ్యమైన పనులు చేసే కార్మికుల కంటే మా పునరావాస సమస్యను చర్చించడానికి కారణం ఆ వృత్తిని నైతిక సమస్యగా గుర్తించడమే అంటుంది. డబ్బు తీసుకోవటం అనే దానికి అన్ని వృత్తులలో లేని తప్పు వాళ్ళకే ఆపాదించటం సరైనది కాదంటుంది.వేశ్య అన్నా సెక్స్ వర్కర్ అన్న పదాలు తేడా తప్ప భావనలో తేడా లేదంటుంది.
ప్రేమ ఆప్యాయత , ఓదార్పు ఇవి శరీరాన్ని మనసుని ఎంత శాతం ప్రభావితం చేస్తాయో లెక్కలు కట్టడం అర్ధం లేని పని అని, ఇద్దరి పురుషుల మధ్య స్త్రీల మధ్య కూడ కలగొచ్చుఅంటుంది. కళ్ళతో చూసి తృప్తి పడటం , స్పర్శతో ఆనందించటం మరింత గాఢమైన శృంగారనుభవం ఇవన్ని వేర్వేరు రూపాల వ్యక్తికరణే , సెక్స్ ను కొనటం అమ్మటం అనే విషయాలు ఖచ్చితమైన శాశ్వతమైన సత్యాలు ఏవీ కావని నళిని అభిప్రాయం. సెక్స్ వర్కర్లు కూడ హైక్లాసు , మధ్యరకం , కింది తరగతి అనే మూడు రకాల వాళ్ళు వుంటారు. పెద్ద సంపాదన కలిగిన వారిని సెక్స్ వర్కర్లుగా చూడరు. లోకం దృష్తిలో నుంచి తప్పించుకోటానికి కాపాడుకునేందుకు వెసులుబాటు దొరుకుతుంది. కింది తరగతి వాళ్ళ జీవితాలే దుర్భరంగా వుంటాయి. పోలీసులు అరెస్టు , గుండాల దాడులు అన్నీ వాళ్ళకే. సెక్స్ వర్కర్లను అతి తీవ్రంగా వేధించుకు తినేది బ్రోకర్లు , భర్త లూనూ. నిజానికి భర్తలనే వాళ్లే బ్రోకర్లు కాబట్టి తమను తాము రక్షిం చుకోటానికి నోరు పెట్టుకుని బతకాల్సి వస్తుందంటుంది. సాధారణ భర్తలకు , ఈ క్లైంటులకు పెద్ద తేడా కనపడదంటుంది.
ఏ స్త్రీ కూడ సెక్స్ వర్కర్ గ పుట్టదు. పరిస్థితుల ద్వారా తయారుచేయబడుతుంది. తమ చదువులకు ఏ ఉద్యోగము దొరకని వాళ్ళు ,భర్తల దౌర్జన్యానికి గురైన వాళ్ళు , పెద్ద మొత్తాల్లో కట్నాలు తేనందున అత్తవారిం టినుంచి గెంటివేయ బడ్డ వాళ్ళు, రరకాల సమస్యల వల్ల వీధిన పడ్డ వాళ్లే ఈ స్త్రీ లంతా. తలకు మించిన భారాన్ని మోయాల్సిన వాళ్ళకు , ఏదో ఒకరకంగా సంపాదించాలన్నదే ప్రధాన లక్ష్యం గా మారుతుంది. చేస్తున్న పని గౌరవప్రద మైనదా కాదా అని ఆలోచించి ఎన్నిక చేసుకునే వెసులుబాటు వుండదు. ఉద్యోగాలు సంపాదించే క్రమంలో కూడ ఎందరో స్త్రీలు శారీరక దోపిడీకి గురవుతున్నారు. అలాగే ఇంటిలో పనిచేసే వారిమీద దౌర్జన్యాలు సర్వసాధారణ మైనాయి . కేరళలో సెక్స్ వర్కర్లు స్త్రీల కన్నా మగవాళ్ళే ఎక్కువంటుంది నళిని . ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా స్త్రీల మీద దౌర్జన్యానికి వెనుకాడడంలేదు. ఆడవాళ్లంటే తమ ఆనందం కోసం తయారయిన వస్తువులు అనుకునే దృష్టి నానాటికీ పెరుగుతుంది అని వాపోతుంది.
సెక్స్ వర్కర్ల మధ్యన ఓ మేధావి అన్న కామెంటును నేను మేధావులమధ్య సెక్స్ వర్కర్ ను అని ప్రతి స్పందిస్తుంది. ఒకసారి ఈ వృత్తిలోకి అడుగు పెట్టిన తర్వాత ధైర్యం గా నిలబడాలి. తన మీద తాను జాలిపడటం మానేసి ఒక వాస్తవంగా గుర్తించాలంటుంది.గౌరవ నీయమైన స్త్రీలకు చవక రకం ఆడవాళ్లకు మధ్య నుండే సరిహద్దు రేఖ చాల బలహీనమైనదని , మగవాళ్ళ దృష్టి లో ఏ స్త్రీ కు సమాన హోదా లేదంటుంది. క్లయింటు చేతుల్లో దెబ్బలు తినటాన్ని హింసగా గుర్తించ గలిగిన వాళ్ళు కూడ భర్తల చేతుల్లో దెబ్బలు తినటంలోని హింస అంత సులభంగా అర్ధం చేసుకోలేరంటుంది.
పిల్లలగురించి మాట్లాడుతూ పిల్లలను పెంచి పెద్ద చేయటానికి మేము పడే బాధలను జనం ఎప్పుడూ అర్ధం చేసుకోరంటుంది. పిల్లలను గాలికి వదిలి వేస్తారని ఒక అపోహ ప్రజల్లో వుంది. కానీ పిల్లలకు దూరమైన స్త్రీల నిస్సహాయత వేదన ఎవరికి అర్ధం కావు. ఏ క్లయింటు సెక్స్ వర్కర్ నుంచి ఆప్యాయతను కోరుకోడు. వాళ్ళెప్పుడు తమ అధికారాన్ని ప్రదర్శించు కునేందుకు ప్రయత్నిస్తారు. సెక్స్ రాకెట్ వలలో పడి ధ్వంసమై పోతున్న అమ్మాయిల రక్షణ కోసం కొన్ని సూచనలు చెయ్యాలంటుంది. ఇదొక స్త్రీ ఆత్మ కథ కావటంతో ఫెమినిస్ట్ లు దాన్ని ప్రచారంలోకి తెచ్చారని రకరకాల కథనాలు వస్తాయి కానీ జీవితం కొనసాగినంత కాలం తన అనుభవాలు ఇతరులకు ఉపయోగకరంగా వినిపిస్తానంటుంది నళిని జమీలా .
చివరిగా , మేడిపండు లాంటి సమాజ విలువల్ని , పరిస్థితులను ప్రశ్నించే నళిని జమీలా యొక్క ఆక్రోశం సమాజానికి సవాలు విసురుతుంది. ఆమె ప్రశ్నల పరంపరను కేవలం కుటుంబానికే సంధించదు, సమాజం లోని అన్నీ వర్గాలకు ఎక్కు పెడుతుంది.కులం,మతం ,వర్గం ఏదీ మినహాయింపు కాదన్న వాస్తవం మన ముందుంచుతుంది. సెక్స్ అనేది ఒక వృత్తిగా తీసుకోవచ్చా లేదా అనే మీమాంస బదులు మన మేధావులు సమస్యను చర్చించాలని కోరుతూ దాని సంబంధిత సామాజిక,ఆర్ధిక,రాజకీయాల మూలాలను పరోక్షంగా నిలదీస్తూ మనల్ని ఆలోచింప చేస్తుంది నళిని జమీలా , సెక్స్ వర్కర్ ను నేరంగా చూడవద్దని కోరే నళిని లైంగిక దోపిడిని అంతే తీవ్రంగా ఖండిస్తుంది. స్తీల జీవితంలో హింస ఏ స్థానంలో వున్నా తప్పదని తెలియ జెప్పే నళిని ఏ స్త్రీ కూడ సెక్స్ వర్కర్ గ పుట్టదని ప్రభోదిస్తుంది. ప్రపంచీకరణ నేపధ్యంలో స్త్రీ అంగడి సరుకుగా మారిన క్రమంలో ప్రజా జీవితంతో , సమస్యలతో సంబంధం ఏర్పరచుకుని సమాజాభివృద్ధికి పని చేయాలని కోరే రచయిత్రి ఏ స్త్రీ కూడ ఈ వృత్తి లోకి రాకుడదని ,అలాంటి సమాజం రావాలని కోరుకుంటుంది. అలాంటి సమాజం కోసం మనమందరం పాటు పడవలసిన అవసరం,మన ఉద్యమాల్లో ఆ స్త్రీల ఆకాంక్షకు , ఆవేదనకు స్పేస్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా వుంది.
నళిని జమీలా వ్రాసిన : ‘ఎన్ ఆటో బయోగ్రఫీ ఆఫ్ సెక్స్ వర్కర్’ ను తెలుగులోకి అనువదించి సెక్స్ వర్కర్ ఆత్మకథ గా హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు అందించారు. అనువాద రచనలలో ఎంతో అనుభవం వున్న కాత్యాయనిగారు చాల సులువుగా , సూటిగా స్వేచ్ఛానువాదం చేసారు. ఈ పుస్తకం వెల రు – 50 / మాత్రమే. అన్ని పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది. స్త్రీ జీవితంలోని వివిధ కోణాలను అర్ధం చేసుకోవాలని కోరుకునేవారికి ఈ పుస్తకం ఒక దర్పణంలా ఉపయోగపడుతుంది.
– హేమ
(చిన్న వివరణ ; పేరులో భర్త పేరో ,తండ్రి పేరో పెట్టుకుని పురుషాధిపత్యం భరిస్తూ అతడి ద్వారా గుర్తింపు పొందడం ఎంతవరకు సమంజసం అని కొంతమంది మిత్రులు మెయిల్ చేసారు. అస్తిత్వ పోరాటాలు వచ్చిన తర్వాత అణచివేత ,ఆధిపత్యాల మీద ఒక్కొక్కరు ఒక్కో విధంగా నిరసన తెలియ జేసారు. నా పేరు వెనుక ఒక నేపథ్యం వుంది. ఏది ఏమైనప్పటికీ నా పేరు సిద్ధాంత పరంగా సమాజానికి తప్పుడు సంకేతాలు అందిస్తుందని,నా రచనల విశ్వసనీయత పై దెబ్బ తీస్తుందని భావించినపుడు తప్పకుండా సరిదిద్దుకోవాల్సిన అవసరం వుంది. అందుకే ఇక ముందు హేమ వెంకట్రావు గా కాక ‘హేమ’ గ మీ ముందు వుంటాను. కృతజ్ఞతలు )
No comments:
Post a Comment