Thursday, May 21, 2015

దశాబ్దాల పోరాట చరిత్రకు చిచ్చు – హైకోర్టు మార్గదర్శకాలు- హేమలలిత

దశాబ్దాల పోరాట చరిత్రకు చిచ్చు – హైకోర్టు మార్గదర్శకాలు- హేమలలిత

      ప్రముఖ మహిళా విప్లవకారిణి క్లారాజెట్కిన్‌తో లెనిన్‌ ఓ మాట అంటారు. ‘చట్టం ప్రాతిపదిక మాత్రమే చట్ట సమానత్వం సంపూర్ణ సమానత్వం కాదని, యిది నూటికి నూరుపాళ్ళు వాస్తవమే’. సమానత్వం కోసం చట్టాల్ని ప్రాతిపదిక చేసుకోవాలని ఆపై సంపూర్ణ సమానత్వం పొందడంలో చట్టం తొలి అడుగు కావాలని స్త్రీలు ఎన్నో పోరాటాలు చేసారు. అయితే వీటికి భిన్నంగా గడిచిన దశాబ్దాల మహిళా మేధావుల కృషి, ఉద్యమకారుల సంఘాల పోరాటాల సాక్షిగా స్త్రీల మనోభావాలకు, సామాజిక స్థితిగతులకు వ్యతిరేకంగా స్త్రీలపై మరింత హింస ప్రజ్వరి ల్లేలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కొన్ని మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది.
భార్యా భర్తలను ఏకం చేయడం కంటే వారి బంధాన్ని విచ్ఛిన్నం చేయిడానికి భారత శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 498(ఎ) (భార్యపై భర్త, ఆయన తరుపు బంధువులు క్రూరత్వాన్ని ప్రదర్శించడానికి సంబంధించిన సెక్షన్‌) ఒక ఆయుధంగా ఉపయోగపడటం దురదృష్టకరమని హైకోర్టు అభిప్రాయపడింది. భర్తను దారిలోకి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది ఈ సెక్షన్‌ ఉపయోగించి పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారని వ్యాఖ్యానించింది. సరైన సలహాలు ఇచ్చేవారు లేకనే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమైతున్నాయని భర్తని మాత్రమే కాకుండా అత్తమామలు, ఆడపడుచులు వారి బంధువులను వేధింపులకు గురిచేయటానికి ఈ సెక్షన్‌ను ఉపయోగిస్తు న్నారని పెర్కొన్నది. అయితే ఇది ఈనాటి తీర్పు మాత్రమే కాదు. అత్తింటి వారిపై అభియోగాలు (అనవసర) మోపరాదని వరకట్నం మృతికేసుల్లో సుప్రీమ్‌కోర్టు ఒక కీలక తీర్పును 2010లో ఇచ్చింది.
ఇంతకీ 498′ఎ’ సెక్షన్‌ అంతట మహమ్మారీగా కనిపిస్తుంది. నిజానికి రెండింతులు పైగానే ముద్దాయిలు విడుదలౌతున్నారు. చట్టం ప్రకారం 498′ఎ’ ప్రకారం ఒక స్త్రీ తనపై జరిగే హింస వలన అత్మహత్య చేసుకొనే పరిస్థితులు నెలకొన్నా, లేక వరకట్నం కోసం డిమాండ్‌ చేసి హింసించడం నేరము. ఈ సెక్షన్‌తో పాటు అపరాధిత నమ్మక ద్రోహం (406), బెదిరించడం (506) కూడ ఒక్కొక్కసారి మోపబడతాయి. ఒకవేళ వరకట్నం మృతి జరిగితే 304′బి’, అత్మహత్య చేసుకోవటానికి ప్రేరింపించడం 306 లాంటివి కూడా మోపబడతాయి. కాని ప్రాసిక్యూషన్‌ గట్టి సాక్ష్యాధారాలతో నిరూపించవలసి వుంటుంది. ఇవి చాలా వరకు కోర్టులో నిలబడవు. విచారణ ముగిసేలోపే చాలా కేసులు సయోధ్యకు వస్తాయి. ఒకవేళ శిక్షించబడ్డ ముద్దాయిలు అప్పీలు చేసుకోవటానికి బెయిల్‌ మంజూరు అవుతుంది. అలా వాడు సుప్రీంకోర్టుకు వెళ్ళెలోపల ఇక్కడ స్త్రీ జీవితం చిధ్రమౌతుంది. ఇన్ని అవకాశాలు ఉన్న ముద్దాయిలకు అన్యాయం జరుగుతుందనే ధోరణి హైకోర్టు, సుప్రిం కోర్టులలో కల్పించడం వారి పితృస్వామిక ధోరణికి నిదర్శనం.
సుప్రీమ్‌కోర్టు ప్రీతిగుప్తా వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ జార్ఖాండ్‌ కేసులో ఇచ్చిన అదేశాల మేరకు ‘లా’ కమిషన్‌ చాలా స్పష్టంగా 498′ఎ’ సెక్షన్‌ నాన్‌ బెయిలబుల్‌గా ఉండాలనే సిఫార్స్‌ చేసినది. అంతేకాకుండా పార్లమెంటరీ కమిటి ఒక్క సంవత్సరం పాటు వివిద రాష్ట్రాలలో పర్యటించి, ఈ సెక్షన్‌ అమలులో స్థితిగతులను తెలుసుకోవటానికి అధ్యయనం చేసింది. అయినప్పటికి ఆ కమిటి ఈ సెక్షన్‌ను ప్రజలు వ్యతిరేఖిస్తుందన్నారని చెప్పలేదు. కాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు ప్రజాభిప్రాయాలకు భిన్నంగా వెళ్ళడం ఆశ్చర్యకరం. హైకోర్టు అదేశాల ప్రకారం కేసు దర్యాప్తు డి.యస్పీ ర్యాంకుకు తగ్గని వారితో చేయాలి. ఒకవేళ తప్పుగా కేసులో ఇరికించారని అనుమానిస్తే, జిల్లా పోలీసు అధికారిగార్కి తెలియజేసి చార్జిషీటులో వారి పేరును తొలిగించవచ్చును. మేజిస్ట్రేట్‌ యాంత్రికంగా జైలుకు పంపకూడదు. ధనం, కులం, మతం అవినీతి అధికార హోదాలో ఉన్నప్పుడు స్త్రీలకు ఎటువంటి న్యాయం జరుగుతుందో ప్రజాస్వామిక వాదులుగా మనం ఊహించగలం.
ఈ తరహా మార్గదర్శకాలు డా|| బాబా సాహబ్‌ వ్రాసిన రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. 1950లలో హిందూ కోడ్‌ బిల్లు కోసం ఆయన చేసిన పోరాటం స్పురణకొస్తున్న సందర్భం ఇది. ఆనాడు ఫాసిస్టు మతవాద శక్తులు ఏలాగతై స్త్రీల హక్కుల రక్షణకు గండి కొట్టారో ఈనాడు ప్రపంచీకరణలో స్త్రీల స్థితి గతులకు అడ్డుపడుచున్నారు. ఈ తరహా మార్గదర్శకాలు మహిళా మేదావులు చేసిన కృషిని అపహస్యం చేయడమే కాదు, మహిళా సంఘాల అవిరణ పోరాట స్ఫూర్తిని అవమానపర్చినట్లే ఇలాంటి పితృస్వామిక భావజాలంతో కూడిన తీర్పులను ఇస్తున్న న్యాయ వ్యవస్థను ప్రశ్నించవలసిన అవసరం నేడు ఉంది. వ్యవస్థ మారనంత వరకూ సామాజికంగా స్త్రీలకు రక్షణ లేదన్నప్పటి అవగాహన మన న్యాయవ్యవస్థకు లేదనటానికి ఈ తీర్పు ఒక తార్కాణం. తను చేసిన చట్టాలను సక్రమంగా సరైన రీతిలో అమలు చేయలేని యాంత్రాంగం ఈనాడు తాను చేసిన చట్టాలనే తానే నిర్వీర్యపర్చుతుందన్నటానికి ఇది ఒక తాజా ఉదాహరణ.
సంఘటితంగా హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అడ్డుకోవాల్సిన చారిత్రిక బాధ్యత మన స్త్రీలందరిపైన ఉన్నది. స్త్రీలకోసం మన కేంద్ర పదవినే వదులుకొన్న త్యాగమూర్తి బాబాసాహెబ్‌ లాంటి పురుషుల సహాకారం, బాధ్యత ఉంది. అందరం కలిసి దశాబ్దాలుగా పోరాడి, సాధించి, పొందిన చట్టాలను రాజ్యాంగ స్ఫూర్తిని తూట్లు పొడవకుండా కాపాడుకోవల్సిన అవశ్యకత నేటి మన కర్తవ్యం. స్త్రీల హక్కులను హరించే ఈ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఐక్యమవుదాం. మన హక్కులను మనం తిరిగి పొందేందుకు అవిశ్రాంతిగా మన లక్ష్యం వైపు కలసినడుద్దాం.

ఆమె @ సమానత్వం కాలం

                   ఆమె @ సమానత్వం కాలం 
"ఆమె ఆవేశం అర్థం కావాలంటే ఆమె స్థానం లో మన ముండాలి . అంతే కాదు ,                    ఆమె గుండె కూడా మనకుండాలి " - కాళీ పట్నం రామారావు మాష్టారు

                                              -హేమా వెంకట్రావ్

భూమి-సేకరణ- పునరావాసం-స్త్రీలు

భూమి-సేకరణ- పునరావాసం-స్త్రీలు

హేమ
జార్ఖండ్‌లో భూనిర్వాసితుల పోరాటానికి మద్దతుగా నిల్చిన సిస్టర్‌ జాన్‌ వల్సను మైనింగ్‌ మాఫియా హతమార్చిందని వార్తాపత్రికలో (18.11.11) చూసి హతాశురాలినయ్యాను. భూవనరులను ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా బహుళజాతి కంపోనీలకు దోచిపెట్టకుండా ప్రజలతో కలిసి జాన్‌వల్స పోరాడింది. భూమి నుండి స్త్రీలను వేరు చేయడానికి దానిపై ఆధిపత్యానికి పురుషాధిక్య వ్యవస్థ ప్రయత్నిస్తున్నా స్త్రీలు ప్రతి భూపోరాటంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నారు. కాని వారి మనోభావాలు, ఆవేదన పాలకవర్గాల నిర్ణయాధికారంలో చోటు చేసుకోలేదు. ఫెడరిక్‌ ఏంగిల్స్‌ అన్నట్టు ‘ప్రపంచ మహిళలు చారిత్రక ఓటమికి గురయ్యారు’ ఈ నేపథ్యంలో జాతీయ భూసేకరణ పునరావాసం బిల్లు ఒకసారి పరిశీలిద్దాం.
పట్టణీకరణ-పారిశ్రామికాభివృద్ధి, వాటి మౌలిక సదుపాయాల కల్పన పేరుతో మూడింట రెండొంతులు స్త్రీలు పాల్గొనే గ్రామీణ వ్యవస్థను విచ్ఛిన్నం చేసి కార్పొరేటు సంస్థలకు భూమిని అప్పగించడానికి ప్రభుత్వం పూనుకుంది. వలస పాలనతో 1894లో చేసిర భూసేకరణ చట్టానికి ప్రతిగా ఈ చట్టం రాబోతుంది. ప్రజల్నుంచి ఎలాంటి అడ్డంగి లేకుండా ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులను భూ సేకరణ జరపవచ్చు. ప్రేవేటే కంపెనీల కోసం అయితే 80% అనుమతి వుంటేచాలు. కాని ఈ 80%లో ఎంత మంది స్త్రీలు పట్టాదారులు? దళిత బహుజన వర్గాల్లో భూమి సాగుకు స్త్రీలే అధికంగా పాల్గొంటారు. యిక 20% మంది నిర్ణయాలు అసలు పరిగణనలోకి రావు. భూమి విలువను కట్టేదపుడు మార్కెట్టు వ్యవస్థ, దాని వినియోగం బట్టి ధరను నిర్ణయిస్తున్నారే తప్ప స్త్రీల అభిప్రాయాలకు తావే లేదు. స్వాధీనం చేసుకునే భూమి 100 ఎకరాలు మించితేనే సామాజిక పర్యవసానం గురించి ఈ బిల్లు మాట్లాడుతుంది. అంతకంటే తక్కువైతే ఈ భూ యజమానుల సంగతేమటన్న దానికి జవాబు లేదు. నీటివనరుల భూమి, బహుళ పంటలు పండే భూమి స్వాధీనపరుచుకోమని చెప్పినా కాకినాడ, సోంపేట, నందిగ్రాం తదితర ప్రాంతాల్లో ఏం జరుగుతుందో మనందరికి తెలుసు. భూ సేకరణకై గుర్తించబడ్డ స్థలాన్ని బాధిత స్థలంగా నిర్వచించారే కాని ఆ ప్రాజెక్టు ఉత్పత్తుల ఫలితంగా నష్టపోయే ప్రాంతాన్ని గుర్తించలేదు. దాని మూలంగా వెలువడే కాలుష్యం అనారోగ్య పరిణామాలు ప్రసక్తే లేదు. ఎవరి భూమిని సేకరించారో వారినే బాధితులుగా గుర్తించారే తప్ప వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు, కౌలుదార్ల వర్గం, వారి స్త్రీల గురించి ప్రస్తావన లేదు.
భూమి ఒక వనరుగా కాక ఒక వస్తువుగా మారినక్రమంలో భూవనరులను పోగొట్టుకోవడమే కాకుండా దానితో జీవనాధారమైన జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పోగోట్టుకుంటారు. అప్పటివరకు శ్రామిక వర్గంగా వున్న స్త్రీలు కొత్త ప్రాజెక్టులలో స్థానం లేక మిగులు మనుషులుగా మిగిలిపోతారు. ఈ బిల్లు భూమికి సంబంధించిన పంచాయితీ ఎక్స్‌టెన్షన్‌  అయి షెడ్యూల్డ్‌ ఏరియాస్‌ చట్టానికి, 2006  అది హక్కుల చట్టానికి, గిరిజనులు అధికంగా వుండే 5వ షెడ్యూల్‌ ప్రాంతంలోని భూముల బదలాయింపు చట్టానికి లోబడి వుంటుందని పేర్కొన్నా వాటి అతిక్రమణ అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది.లోక్‌సభ ఎన్నికల్లో ఆహార రక్షణ, భద్రత అనేది యు.పి.ఏ కూడమి ప్రజలకు యిచ్చిన వాగ్ధానం. అందుకు మరింత భూమిని సేద్యానికి వినియోగించకుండా ఉన్న భూమిని పారిశ్రామీకరణ పేరుతో కంపెనీలకు బదలాయిస్తున్నారు. దేనికి అనువుగానే ప్రజల్ని మభ్యపెట్టడానికి ఆహారాన్ని బదులుగా నగదు చెల్లిస్తామని ఆహార భద్రతా చట్టాలలో పేర్కొన్నారు. దీనివలన ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసి చిల్లర వ్యాపారంలో కూడా విదేశీ బహుళజాతి కంపెనీలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పూనుకుంది. యిప్పటివరకు కాస్తో కూస్తో అందుతున్న కుటుంబాలకు అందదు.
యిక ‘పునరావసం’ ఒక రాజకీయ అవసరంగా గుర్తించి జాతీయ విధానాన్ని పొందుపరిచారు ఈ బిల్లులో. భూమి విలువతో పాటు యిల్లు, 20 వ సంవత్సరాలు రెండు వేల రూపాయల చొప్పున అందిస్తారు. కుటుంబంలో ఒకరికి ఉపాధి లేనట్లయితే 2 లక్షల రూపాయిలు యివ్వబడతుంది. రవాణాఖర్చులు, సెటిల్‌మెంటు, తాత్కాలిక ఉపశమన గ్రాంటు, పశుశాల, చిన్న దుకాణాల నిర్మాణం చేపడతారు. భూ విలువలో 25% షేర్లరూపంలో యివ్వబడుతుంది. యిల్లు భార్యభర్తల పేరు మీద యివ్వొచ్చు కాని యివ్వాలన్న నిబంధనలేదు ప్రభుత్వం నుంచి కల్పింపబడిన ఏ నష్టపరిహారమైనా, సదుపాయాలైనా పితృస్వామ్య వ్యవస్థలో ఎటువంటి పోరాటం చేయకుండానే పురుషునికి దక్కుతాయి. పురుషులు వస్తు వినిమయ వ్యామోహంలో పడి ఆ డబ్బును ఖర్చు చేస్తున్నారు. కొన్నాళ్ళ తరువాత డబ్బు యిబ్బందితో వాటికి అమ్మి సరైనా ఉపాధి దొరకక మరింత పేదరికంతో కూరుకుపోవడం కాకినాడ సెజ్‌లో అనుభవమే. ఆదివాసి సమాజంతో, సహా నష్టపరిహారాన్ని  విందులు, వినోదాలు, తాత్కాలిక అవసరాలకే హెచ్చిస్తున్నారు.
ప్రజాభిష్టం, కుటుంబాలపై సాంఘిక, ఆర్థిక అంశాల ప్రభావం, భూపరిధి తదితర అంశాలపై అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు చేసినా అందులో స్త్రీలు ఉండాలన్న నిబంధన లేదు. దేశ జనాభాలో మూడింట ఒక వంతు జనాభావున్న అసంఘటిత కార్మికులు దేశానికి రెండొంతుల ఆదాయాన్ని అందిస్తున్నారు. అధిక శాతం వీరిలో వ్యవసాయ, అనుబంధిత మహిళా కార్మికులే.
ఈ మొత్తం క్రమాన్ని పరిశీలించినట్లయితే స్త్రీలను భూమిక, దాని వనరులు నుండి గెంటివేసి ఆర్థిక స్వాతంత్య్రం కోల్పోయేలా చేస్తుంది. పితృస్వామిక భావజాలం ఉన్న సమాజంలో పురుషుల హింస ఈ పేట్రేగి కుటుంబభారం మొత్తం స్త్రీమీద పడుతుంది.కాబట్టి దేశాన్ని కబళించబోయే ఈ భూసేకరణ బిల్లులో మానవీయ ముఖ్యంగా స్త్రీకోణం లోపించింది. అత్యవసర పరిస్థితులలోనే భూసేకరణ పరిమితులతో జరగాలి. భూమికి భూమి యితర సదుపాయాలు కల్పించాలి. కుటుంబాన్ని యిద్దరి కలయికగా కాకుండా పితృస్వామ్య భావజాల ప్రభావిత యూనిట్‌గా గుర్తించి స్త్రీలకు ప్రాధాన్యం యివ్వాలి. స్త్రీలను ఉత్పత్తి చేసే మనుష్యులుగా చూసి శ్రమ ఆధారిత పరిశ్రమలు ప్రభుత్వ పరంగా తెరవాలి. వికేంద్రీకరణ, వనరులు, స్థానిక సాంకేతిక నైపుణ్యం ఉపయోగించుకొని నడిపే పరిశ్రమలు కోసం ఉద్యమించాలి. భూమిని వాటి వనరులను బహుళజాతి కంపెనీలకు దోచిపెట్టడానికి రూపొందించబడిన భూసేకరణ పునరావసం పునర్మిర్మాణం బిల్లు 2011ను వ్యతిరేకించడం పురుషుల కంటే దేశపౌరులుగా మనదే ఎక్కువ బాధ్యత!!

సూఫీ భిక్షుకి ఆమె!

సూఫీ భిక్షుకి ఆమె!

హేమ
కడివెడు కన్నీళ్ళను దాచుకుంటూ శిథిలమైన జీవిత అఖండ శకలాలను ఏరికూర్చి జీవన బీభత్స చిత్రాన్కి వన్నెలను అద్దుకోవాలని కుటుంబం నుండి సమాజ సంక్షోభ అంచులకు చేరుతుంది సూఫీ భిక్షుకిలా ఆమె. ఆమె ఎవరో కాదు సంఘటిత, అసంఘటిత అసలు కారణాన్కి చెందక ప్రభుత్వ దమననీతికో, విదేశీవిదేశాల విధ్వంసానికో లేక దాతృతృప్తి లోగిలిలో పురుడు పోసుకున్న ‘స్వచ్ఛంద సంస్థల’ కార్మికబిడ్డ.
వేకువనే లేచి వంటిల్లు అనే యుద్ధక్షేత్రంలో గెలుపు ఓటమిలకు సంబంధం లేనట్లుగా పోరాడే ప్రతిదీ అమర్చి పరుగులాంటి నడకతో సంస్థకు చేరుతుంది. అక్కడ మహిళా సాధికారత, పేదరిక నిర్మూలనా పథకాల కాడినెత్తుకొని నడుస్తున్న ఆమెకు పక్కింట్లో వదిలేసిన పాపాయి రోదనలు, రాత్రి మీటింగుల తర్వాత యింటికెళ్తే భర్తపెట్టే శారీరక మానసిక చిత్రహింస పరంపరలను, మనసు చేసే పోరాటాన్ని ఫైళ్ళ రూటున దాచేసి అలంకరించిన గానుగెద్దులా నడిచిపోతుంది. ఆమె కనపడనిది ఎక్కడ? 60, 70 దశకాలలో మొదలైన సంక్షేమ సంస్థలలో, 80వ దశకంలో అభివృద్ధి పథకాల హోరులో, తొంభైలలోని దళిత, స్త్రీవాద సంఘాలలో ఆపై ప్రపంచీకరణ నేపథ్యంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న హక్కుల సంఘాలలో, పన్ను ఎగవేతలో భాగంగా కార్పోరేటు సంస్థలు సృష్టిస్తున్న ట్రస్ట్‌లలో ఆమె మనకు తారసపడుతుంది.
ఏది ఏమైతేనేమి! ఆమె ఒక ఒంటరి అడ్డా మాలి  ! ఆమె ఏ సంఘటిత, అసంఘటిత రంగాన్కి చెందినది కాదు. ఏ యూనియన్లు, సైద్ధాంతిక మేధావులు ఆమె అశ్రువులను తుడచి ‘మేమున్నామ’ని ముందుకు రాలేదు. శతాబ్ది లక్ష్యాలు విజన్‌ 2020, దేశం వెలుగు పోతుందని చెప్పిన జాతీయ విధానాలు ఆమెను పరిగణలోకి తీసుకోలేదు. చట్టాలను అవపోసన చేసి అన్యాయాన్ని ఎదురించమని ప్రజల్ని సంఘటితపరిచే ఆమె ఏ చట్టం పరిధిలోకి రాదు. ఏవీ కొన్ని అతికొన్ని సంస్థలలో తప్ప పి.ఎఫ్‌. వైద్య సదుపాయాలకై ఇ.ఎస్‌.ఐ. లాంటి అసంఘటిత కార్మికుల చెందే విధానాలు లేవు. జీతాల్లో తారతమ్యాలు, కోతలు, అవమానాలు, లైంగిక వేధింపులు సర్వసామాన్యమే! ఉద్యోగభద్రత వారి ఊహకందనిదే. పోరాటాలు తప్పితే పే కమీషన్లు, పెన్షన్లు వారి లోగిల్లో విశ్రాంతి తీసుకోవు. కనీసం ఏ కంపెనీలో పనిచేసినా నాలుగు డబ్బులు వెనుక వేసుకునే ఇతర అసంఘటిత స్త్రీల జీవనభద్రత కంటె వీరి భద్రత ప్రశ్నార్థకమే! ఏ క్షణాన యాజమాన్యపు క్రీనీడపడివున్న కాస్తంత ఆసరా పోతుందనే విషాదం మాటున ప్రజాస్వామ్య సాక్షిగా బతుకీడుస్తుంది. పనిచేసేచోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం ముసాయిదాలో కూడా ‘ఆమె’ మనకు కన్పించదు. స్త్రీల పట్ల ఎన్నెన్నో గణాంకాలు, సాధికారత అభివృద్ధి కొలతలు! కాని ఆమె ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే చేతికందొచ్చిన పచ్చటి పంటపొలం మీద కట్టివేయబడ్డ దిష్టిబొమ్మలా బతుకు దృశ్యం వెక్కిరిస్తూనే వుంటుంది!
పొట్టచేత పట్టుకొని 8 గం||లకు పైగా, వివిధ సమయాల్లో పనిచేసే ఆమెను స్వచ్ఛంద కార్యకర్తగా పిలుస్తారే తప్ప ఒక కార్మికురాలిగా గుర్తించరు. ఇందులో ఎన్నో రకాలు! ప్రొఫెషనల్‌, నాన్‌ప్రొఫెషనల్‌, వాలంటరీ సోషల్‌ వర్కర్లు యిలా ఏవేవో పేర్లు. పనివిధానం వేరు కావచ్చు కాని బాధ్యతలు ఒక్కటే. ప్రొఫెషనల్‌ సోషల్‌ వర్కర్లకు ఒకటి రెండు సంఘాలు వున్నా అందులో ఎంతమంది వున్నారు? వాటి లక్ష్యాలు, జరుగుతున్న న్యాయం ఏమిటి అన్నది ఆ కోర్సు చదివిన చాలామందికే తెలియదు. యికపోతే నిరంతరం ప్రజల్ని సంఘటితపరిచే ప్రక్రియలో తలమునకలై అటు పితృస్వామ్య భావజాలాన్కి, ప్రపంచీకరణలో అత్యంత ఛీప్‌ లేబర్‌గా మారి సమిధలవుతున్న ఈ కార్మికురాలికి ఎలాంటి సంఘాలు లేవు. వ్యూహాలు, విధానాలు రచించి సమాజమార్పుని కోరి పిడికిలెత్తిన ఆమెకు తమ హక్కులపట్ల నడుంబిగించే అవకాశాలను ‘సేవాతత్పరత’ అనే పేరుతో మసిపూసి కావాలనే మొదట్నుంచి రంగం మూసివేసింది. దోపిడి భావజాలం గురించి మాట్లాడే తాము కూడా దోచుకోబడుతున్నామని తెలిసినా మౌనం ఎందుకు మౌనం వహిస్తున్నారు? తమ హక్కుల్ని తాము పొందలేని ఈ కార్మికులు ఏ సమాజ విముక్తిని కోరుతున్నారు? ఈ ‘సేవ’ ‘దాతృత్వం’ ‘స్వచ్ఛందం’ వెనుక దాగిన కుట్రలేమిటి?
భూమి, వనర్లు స్వంత ఆస్తిగా కాకుండా సమాజపరమై స్వేచ్ఛగా మనిషి వాడుకున్నంత వరకు ఈ ‘స్వచ్ఛంద లేదా దాతృత్వపు’ భావనలు ఏమి సంఘంలో లేవు. ఎప్పుడైతే మనిషికి స్వంత ఆస్తి, స్వలాభం మొదలయ్యాయో అప్పుడే సమాజం వర్గాలుగా విడిపోయి దోపిడి అణిచివేత మొదలయ్యింది. ఆ మూలాల నుంచి పుట్టుకొచ్చిన భావనలు ‘దాతృత్వం, సేవ’, తమ నిరంతర దోపిడి నిరాటంకంగా కొనసాగించడానికే ఆయా వ్యవస్థలు కనుగొన్న నయా సైద్ధాంతిక రూపకల్పనకి మారుపేర్లు. ఈ భావనలు ‘గ్లోరిఫై’ చేయబడి సమాజంలో ఆమోదింపచేసుకున్నాయి దోపిడి వర్గాలు. ఈ భావనలు అనేక రూపాలు ఎత్తుతున్నాయి కూడా! రూపమేదైనా సారం ఒక్కటే! పెట్టుబడిదారీ విధానం మార్కెట్టు కోసం పూర్ణరూపాలైన ప్యూడల్‌ భావజాలాన్ని మరింతగా ఉధృతం చేస్తుంది. యిక దాతృత్వపు మూస నుండి హక్కుల ముసుగులో ప్రపంచీకరణ పెట్టుబడి పేరుతో మార్కెటు కోసం పలు అవతారాలు ఎత్తుతుంది. ఈ మాయా పంజరంలో చిక్కుకుని విలవిలలాడుతున్న పక్షి వైనం ఈ స్వచ్ఛంద కార్యకర్త/కార్మికురాలిది.
మరోవైపు వ్యవసాయం, వృత్తులు కాపాడుకోవడం మొదలైన ప్రజా పోరాటాలు జల్‌, జంగిల్‌, జమీన్‌ వాటిలో దాగివున్న వనర్లు కాపాడుకోవడంకోసం చేస్తున్న పోరాటంగా మారుతున్నాయి. ఈ రోజు మార్కెటు భావజాలాన్కి అశేష ప్రజానీకాన్కి ఘర్షణ మొదలైంది. అందుకే ప్రజలు మార్కెట్టు శక్తులపై దాడి జరిపినప్పుడల్లా స్వచ్ఛంద కార్యకర్తలు గూడా ఈ దాడులకు బలవుతున్నారు. నిన్న, మొన్న జరిగిన అస్మిత, స్పందనల కార్యకర్తలపై దాడి కూడా ఇలాంటిదే. సోంపేట, కాకరాపల్లి సెజ్‌లలో అభివృద్ధి పథకాల పేరున గ్రామాలకు వస్తున్న కార్యకర్తలను కూడా తరిమికొడితే కంటినీరు నింపుకొన్నారు, ప్రభుత్వ దమననీతిలో పావులయ్యారు.
అందుకే ‘ఆమె’ బతుకు ‘ఈగ కథ’లా కాకూడదు. ప్రకృతి, వనర్లు, జీవనోపాధులను, కుటుంబాలను, వ్యక్తిత్వాలను, మానవ సంబంధాలను ధ్వంసం చేసే దాతృత్వపు మూలాలను ప్రశ్నించగలగాలి. ఈ వ్యవస్థచే ఉపయోగించబడి విసిరివేయబడుతూ ప్రాథమిక హక్కుల్ని కూడా కాలరాస్తున్న వ్యవస్థ మీదకి, ఆర్థిక, సామాజిక రంగాల ఆధిపత్య శక్తుల మీదకు ఆమె ఆగ్రహం మళ్ళించగలిగితే ఆమె అడవిబిడ్డే కాగలదు. భ్రష్టుపట్టిన, అవినీతికి మూలమైన, అధికార లాలసతో కూడిన స్వార్థపూరిత దాతృత్వపు నీడల నుంచి దాటితే అప్పటి వరకు వల్లెవేసిన ఐక్యతా, భాగస్వామ్యం, వ్యక్తిగత నిబద్దత నిజమైన ఆయుధాలు కాగలవు. సామాజిక స్పందన, సహానుభూతి కలిసిన నూతన మానవావిష్కరణ దిశగా పయనిస్తున్నవారితో చేయి కలిపితే ప్రజా ఉద్యమాలు మరింత అరుణిమ దాలుస్తాయి. అప్పుడే కదా దోపిడీ, పెత్తనం లేని స్వీయ విముక్తి గీతాన్ని కూడా విశ్వాసాల సారంగిపై సూఫీ భిక్షుకిలా ఆమె పాడగలదు!!

October

October 

మనసెరిగి…

మనసెరిగి…

హేమ
మనసా వాచా నిన్నే వలచా, నడిచా నీ నీడగా’.. ఇది  నేటి యువత పాట. ‘ధర్మేచ, అర్థేచ, కామేచా నాతి చరామి’ తరాలుగా మనతో చేయిస్తున్న పెళ్ళి బాసలు. అయితే యిపుడు ఈ గొడవంతా ఎందుకంటే బాబు?
ఈ మనసు, బాసల మధ్య మనమంతా ఎంత ఎదిగామనేది ఒక ప్రశ్నగానే మిగిలింది కాబట్టి. మనలో చాలామందికి నయనతార పేరు తెలిసే వుంటుంది. తెలుగు సినిమాలో హీరోయిన్‌గా నటించింది. మంచినటి అనడంలో సందేహం లేదు.  ఆమె అసలు పేరు నయన మరియం కురియన్‌.  క్రైస్తవ మతస్థురాలు. అయితే ప్రభుదేవా అనే సహనటుడితో  ప్రేమ, పెళ్ళి నేపథ్యంతో ఇటీవల హిందుమతంలోకి మారిపోయింది. పత్రికలో ఈ విషయం చాలా ప్రముఖంగా వచ్చింది. అయితే ఆమె మతం మార్చుకోవడం తన ఇష్టం. రాజ్యాంగం కల్పించిన హక్కుకూడా అనొచ్చు కాని సాధారణంగా మనిషి తన  తన ఉన్నతి కోసం మార్పును ఇష్టపడడటం జరుగుతుంది.   మరి ఏ ప్రగతిని ఆశించి నయనతార  హిందూ మతంలోకి మారిందో! ఈ దేశంలో తరతరాలుగా హిందూ మతంద్వారా అణిచి వేతలో  నలిగిపోయిన పేద దళిత బహుజన వర్గాలు తమ విముక్తికోసం క్రైస్తవ మతంలోకి, ఇస్లాం మతంలోకి మారారన్నది  చారిత్రక వాస్తవం. అయితే ఆ లక్ష్యం ఏ మేరకు నేరవేరిందన్నది వేరే చర్చ.
వేదాలు, గాయత్రి మంత్రం  స్త్రీలు చదవకూడదని అలా చేస్తే వారి  నాలుక కోసేయమని, వింటే వారి చెవుల్లో సీసం పోయమని ఆదేశించిన మతంలోకి నయనతార ఎలా వెళ్ళందో! దళితులను, శూద్రుల్ని టార్గెట్‌ చేసి ఊడిగం చేయించుకొని ఎదురు తిరిగితే రక్తపుటేర్లను ప్రవహింపచేసిన బ్రాహ్మణ మతం ఎందుకు నయనతారకు శరణ్యం అయ్యిందో!.  ఇదంతా తనకు తెలిసే జరిగిందా? ఎవరైనా బలవంతంగా రుద్దారా అనే విషయాలు మనకైతే యిదమిద్దంగా తెలియవు. వారి వ్యక్తిగత విషయాలు మనకెందుకని వదిలేసినా నయనతార ‘ఒక సెలబ్రెటి’ ఆమె చర్యలు సామాన్య స్త్రీలపై తప్పక ప్రభావం చూపిస్త్తాయి.నయనతారను సీతమ్మవారుగా బాపు ‘రామరాజ్యం’ లో ప్రాణం పోసాడు. మనకు ఇప్పుడు నయనతార అంటే అపర సీతమ్మవారు. మళ్ళీ మనవాళ్ళలో కొందరైనా సీతమ్మవారి కష్టాలు చూసి కన్నీళ్ళు పెడతారు. స్త్రీల చైతన్యం కొంతమేరకు పెరుగుతున్నప్పుడల్లా మధ్య మధ్యలో తిరిగి సీతమ్మతల్లిని ఆదర్శంగా తెరమీదకు తీసుకొస్తుంటారు. నయనతారలాంటివాళ్ళు హిందూ మత ప్రస్థానం కూడా ఆ విషయాన్నే నొక్కి చెప్పుతుంది.
నయనతార  మత మార్పిడి విషయంలో రెండు విషయాల గురించి మనం ప్రధానంగా ఆలోచించాలి. స్త్రీలపై ఇప్పటికీ పనిచేస్తున్న పితృస్వామిక భావజాలం మరియు మొత్తంగా  ‘హైందవీకరణం’  చేయబడుతున్న భారతసమాజం గురించి.  మనదేశంలో ప్రతి మనిషికి తనకు ఇష్టమైన మతాన్ని ఎంచుకునే హక్కును రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25(ఏ) కల్పించిందికూడా. కాని ఈ విషయాన్ని అగ్రవర్ణ, వర్గ భావజాలాన్ని నరనరాన జీర్ణించుకొన్న పురుష సమాజం ఏనాడు ఒప్పుకుంది కనుక! గుజరాత్‌లోని ముస్లిం స్త్రీలపై దాడులు, ఒరిస్సాలోని కాందమాళ్‌లో ఆదీవాసీలపైన జరిగిన దహనకాండ, మంగళూరు క్రైస్తవ స్త్రీలపై భౌతిక, సాంస్కృతిక దాడులు, ఉత్తరప్రదేశ్‌లోని నన్‌పై (కైస్తవ సన్యాసినులు)అత్యాచార అత్యాచారం దీనికి అద్దం పడతాయి.
ప్రపంచీకరణ నేపథ్యంలో పెట్టుబడిదారి వర్గాన్ని, మార్కెట్టు విస్తరణే ముఖ్యం. మెజార్టీ మతం ఏదైతే వుందో దానిలో కలిసిపోవాల్సిన అవసరం ఈ అంతర్జాతీయ పెట్టుబడిదారి వర్గాలకు వుంటుంది. ఈ వ్యవస్థలోని సామాజిక నిర్మాణాలతో రాజీ చేసుకుంటుంది. ఈ క్రమంలో సెక్యులరిజం(లౌకికం)పోయి లౌక్యం వస్తుంది. సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వర్గం తమ మనుగడకోసం, హిందువులు, ముస్లింలు లేదా క్రైస్తవులు మైనార్టీలుగా, గుంపులుగా విడదీయడం, విఢజించు, పాలించు సూత్రాన్ని రాజ్యంతో అమలు చేయిస్తుంది. వాళ్ళు దేశంలోని ప్రధాన వర్గాన్ని తయారు చేసుకొని ఆఖరికి పెట్టుబడులను కూడా హైందవీకరణచేస్తున్నారు. (ఆర్‌.ఎస్‌.రావు-కొత్తచూపు)  అడ్డొచ్చిన వారిపై అటాక్‌ లేదా వారిని కో అప్ట్‌ (సంలీనం) చేసుకోవడం హిందూ మత లక్షణం. ఈ పెట్టుబడిదారులు హిందుత్వంద్వారా తమకు అనువైన మార్కెటును ఏర్పాటు చేసుకుంటున్నారు.  కాబట్టి  యిక్కడున్న అధికార (భారతదేశం సెక్యులర్‌ స్టేట్‌ అంటారేమో. క్షమించండి!) మతానికి రాజ్యానికి దానికనుబంధమైన అంగమైన ప్రెస్‌కు అవినావభావ సంబంధం వుంది. యిన్ని హంగులన్న అంతర్జాతీయ పెట్టుబడిదారీ వర్గం దేశంలో తాము తయారు చేసుకున్న ఒక దళారీవర్గంలో మొత్తం సమాజాన్ని హైందవీకరణ చేయడానికి ప్రయత్నాలు ముమ్మురంగా జరుగుతున్నాయి. ఈ హిందు మతోన్మాదాన్ని మెజార్టీ-మైనార్టీ అనికాకుండా ఏకశిలా సంస్కృతిని ముందుకు తీసుకువస్తున్నారు.
అందుకే రాజ్యం ఈ రోజున  మీడియా సహకారంతో నయనతార మత మార్పిడిని గ్లోరిఫై చేస్తే కథనాలు ప్రచారం చేస్తుంది. ఆమె వ్యక్తిగత విషయాన్ని సమాజంపై ప్రభావం పడేలా చేయడం వెనుక కుట్ర దాగివుంది. మరో విధంగా స్త్రీ ఏవర్గానికి, కులానికి, మతానికి చెందినదైనా పురుషుడికోసమే ‘ఆమె’ జీవితం అనే ఒక పితృస్వామ్య భావజాలాన్ని మరింతగా మరింత బలపడేలా చేయడానికి  ఈ వర్గాలు  ప్రయత్నిస్తున్నాయి.  మొత్తం భారత సమాజాన్ని  హైందవీకరణ చేసి తమ పెట్టుబడులకు, లాభాలకు ఢోకా లేకుండా చేసుకొనే ప్రయత్నమే మైనార్టీలపైన దాడులు, లేదా  మెజార్టీ హైందవీకరణ చేసి తమ పెట్టుబడులకు లాభాలకు ఢోకా లేకుండా చేసుకునే ప్రయత్నానికి మైనార్టీలపైన దాడులు లేదా మెజార్టీ మతం తీసుకున్న వారిపై అత్యంత ప్రేమాభిమానాల పబ్లిసిటీ.  ఈ దేశంలో వుండాలంటే జైశ్రీరామ్‌ అనాలన్న నినాదంతో బాబ్రీ మసీదు కూల్చివేత, మైనార్టీలపై హింసా, అల్లర్లు, స్త్రీలు అని కూడా చూడకుండా వారిపై టెర్రరిస్టుల ముద్ర వేస్తున్న ధోరణులు, ప్రయత్నాలు మనందరి జీవనభద్రతకే ముప్పు. ‘మనసెరిగిన మన కథలో(వ్యధలో) ఎన్ని సామాజిక  కోణాలు వున్నాయి. సామ్రాజ్య వాద కుట్రలు దాగి వున్నాయి. కాబట్టి పరమత స్త్రీలను ఉన్నామదంతో ఊచకోత కోసి, ‘నస్త్రీ స్వాతంత్య్ర మర్హతి’ అని ఘోషించే హైందవ మతంలోనికి వెళ్ళే కాని నయతారలే కాకుండా స్వేచ్ఛకోసం మతన్మోదానికి వ్యతిరేకంగా పోరాడే  తస్లీమా నస్రీన్‌లు మనకు ఆదర్శం కావాలి.

August

August 

Text