Thursday, May 21, 2015

మనసెరిగి…

మనసెరిగి…

హేమ
మనసా వాచా నిన్నే వలచా, నడిచా నీ నీడగా’.. ఇది  నేటి యువత పాట. ‘ధర్మేచ, అర్థేచ, కామేచా నాతి చరామి’ తరాలుగా మనతో చేయిస్తున్న పెళ్ళి బాసలు. అయితే యిపుడు ఈ గొడవంతా ఎందుకంటే బాబు?
ఈ మనసు, బాసల మధ్య మనమంతా ఎంత ఎదిగామనేది ఒక ప్రశ్నగానే మిగిలింది కాబట్టి. మనలో చాలామందికి నయనతార పేరు తెలిసే వుంటుంది. తెలుగు సినిమాలో హీరోయిన్‌గా నటించింది. మంచినటి అనడంలో సందేహం లేదు.  ఆమె అసలు పేరు నయన మరియం కురియన్‌.  క్రైస్తవ మతస్థురాలు. అయితే ప్రభుదేవా అనే సహనటుడితో  ప్రేమ, పెళ్ళి నేపథ్యంతో ఇటీవల హిందుమతంలోకి మారిపోయింది. పత్రికలో ఈ విషయం చాలా ప్రముఖంగా వచ్చింది. అయితే ఆమె మతం మార్చుకోవడం తన ఇష్టం. రాజ్యాంగం కల్పించిన హక్కుకూడా అనొచ్చు కాని సాధారణంగా మనిషి తన  తన ఉన్నతి కోసం మార్పును ఇష్టపడడటం జరుగుతుంది.   మరి ఏ ప్రగతిని ఆశించి నయనతార  హిందూ మతంలోకి మారిందో! ఈ దేశంలో తరతరాలుగా హిందూ మతంద్వారా అణిచి వేతలో  నలిగిపోయిన పేద దళిత బహుజన వర్గాలు తమ విముక్తికోసం క్రైస్తవ మతంలోకి, ఇస్లాం మతంలోకి మారారన్నది  చారిత్రక వాస్తవం. అయితే ఆ లక్ష్యం ఏ మేరకు నేరవేరిందన్నది వేరే చర్చ.
వేదాలు, గాయత్రి మంత్రం  స్త్రీలు చదవకూడదని అలా చేస్తే వారి  నాలుక కోసేయమని, వింటే వారి చెవుల్లో సీసం పోయమని ఆదేశించిన మతంలోకి నయనతార ఎలా వెళ్ళందో! దళితులను, శూద్రుల్ని టార్గెట్‌ చేసి ఊడిగం చేయించుకొని ఎదురు తిరిగితే రక్తపుటేర్లను ప్రవహింపచేసిన బ్రాహ్మణ మతం ఎందుకు నయనతారకు శరణ్యం అయ్యిందో!.  ఇదంతా తనకు తెలిసే జరిగిందా? ఎవరైనా బలవంతంగా రుద్దారా అనే విషయాలు మనకైతే యిదమిద్దంగా తెలియవు. వారి వ్యక్తిగత విషయాలు మనకెందుకని వదిలేసినా నయనతార ‘ఒక సెలబ్రెటి’ ఆమె చర్యలు సామాన్య స్త్రీలపై తప్పక ప్రభావం చూపిస్త్తాయి.నయనతారను సీతమ్మవారుగా బాపు ‘రామరాజ్యం’ లో ప్రాణం పోసాడు. మనకు ఇప్పుడు నయనతార అంటే అపర సీతమ్మవారు. మళ్ళీ మనవాళ్ళలో కొందరైనా సీతమ్మవారి కష్టాలు చూసి కన్నీళ్ళు పెడతారు. స్త్రీల చైతన్యం కొంతమేరకు పెరుగుతున్నప్పుడల్లా మధ్య మధ్యలో తిరిగి సీతమ్మతల్లిని ఆదర్శంగా తెరమీదకు తీసుకొస్తుంటారు. నయనతారలాంటివాళ్ళు హిందూ మత ప్రస్థానం కూడా ఆ విషయాన్నే నొక్కి చెప్పుతుంది.
నయనతార  మత మార్పిడి విషయంలో రెండు విషయాల గురించి మనం ప్రధానంగా ఆలోచించాలి. స్త్రీలపై ఇప్పటికీ పనిచేస్తున్న పితృస్వామిక భావజాలం మరియు మొత్తంగా  ‘హైందవీకరణం’  చేయబడుతున్న భారతసమాజం గురించి.  మనదేశంలో ప్రతి మనిషికి తనకు ఇష్టమైన మతాన్ని ఎంచుకునే హక్కును రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25(ఏ) కల్పించిందికూడా. కాని ఈ విషయాన్ని అగ్రవర్ణ, వర్గ భావజాలాన్ని నరనరాన జీర్ణించుకొన్న పురుష సమాజం ఏనాడు ఒప్పుకుంది కనుక! గుజరాత్‌లోని ముస్లిం స్త్రీలపై దాడులు, ఒరిస్సాలోని కాందమాళ్‌లో ఆదీవాసీలపైన జరిగిన దహనకాండ, మంగళూరు క్రైస్తవ స్త్రీలపై భౌతిక, సాంస్కృతిక దాడులు, ఉత్తరప్రదేశ్‌లోని నన్‌పై (కైస్తవ సన్యాసినులు)అత్యాచార అత్యాచారం దీనికి అద్దం పడతాయి.
ప్రపంచీకరణ నేపథ్యంలో పెట్టుబడిదారి వర్గాన్ని, మార్కెట్టు విస్తరణే ముఖ్యం. మెజార్టీ మతం ఏదైతే వుందో దానిలో కలిసిపోవాల్సిన అవసరం ఈ అంతర్జాతీయ పెట్టుబడిదారి వర్గాలకు వుంటుంది. ఈ వ్యవస్థలోని సామాజిక నిర్మాణాలతో రాజీ చేసుకుంటుంది. ఈ క్రమంలో సెక్యులరిజం(లౌకికం)పోయి లౌక్యం వస్తుంది. సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వర్గం తమ మనుగడకోసం, హిందువులు, ముస్లింలు లేదా క్రైస్తవులు మైనార్టీలుగా, గుంపులుగా విడదీయడం, విఢజించు, పాలించు సూత్రాన్ని రాజ్యంతో అమలు చేయిస్తుంది. వాళ్ళు దేశంలోని ప్రధాన వర్గాన్ని తయారు చేసుకొని ఆఖరికి పెట్టుబడులను కూడా హైందవీకరణచేస్తున్నారు. (ఆర్‌.ఎస్‌.రావు-కొత్తచూపు)  అడ్డొచ్చిన వారిపై అటాక్‌ లేదా వారిని కో అప్ట్‌ (సంలీనం) చేసుకోవడం హిందూ మత లక్షణం. ఈ పెట్టుబడిదారులు హిందుత్వంద్వారా తమకు అనువైన మార్కెటును ఏర్పాటు చేసుకుంటున్నారు.  కాబట్టి  యిక్కడున్న అధికార (భారతదేశం సెక్యులర్‌ స్టేట్‌ అంటారేమో. క్షమించండి!) మతానికి రాజ్యానికి దానికనుబంధమైన అంగమైన ప్రెస్‌కు అవినావభావ సంబంధం వుంది. యిన్ని హంగులన్న అంతర్జాతీయ పెట్టుబడిదారీ వర్గం దేశంలో తాము తయారు చేసుకున్న ఒక దళారీవర్గంలో మొత్తం సమాజాన్ని హైందవీకరణ చేయడానికి ప్రయత్నాలు ముమ్మురంగా జరుగుతున్నాయి. ఈ హిందు మతోన్మాదాన్ని మెజార్టీ-మైనార్టీ అనికాకుండా ఏకశిలా సంస్కృతిని ముందుకు తీసుకువస్తున్నారు.
అందుకే రాజ్యం ఈ రోజున  మీడియా సహకారంతో నయనతార మత మార్పిడిని గ్లోరిఫై చేస్తే కథనాలు ప్రచారం చేస్తుంది. ఆమె వ్యక్తిగత విషయాన్ని సమాజంపై ప్రభావం పడేలా చేయడం వెనుక కుట్ర దాగివుంది. మరో విధంగా స్త్రీ ఏవర్గానికి, కులానికి, మతానికి చెందినదైనా పురుషుడికోసమే ‘ఆమె’ జీవితం అనే ఒక పితృస్వామ్య భావజాలాన్ని మరింతగా మరింత బలపడేలా చేయడానికి  ఈ వర్గాలు  ప్రయత్నిస్తున్నాయి.  మొత్తం భారత సమాజాన్ని  హైందవీకరణ చేసి తమ పెట్టుబడులకు, లాభాలకు ఢోకా లేకుండా చేసుకొనే ప్రయత్నమే మైనార్టీలపైన దాడులు, లేదా  మెజార్టీ హైందవీకరణ చేసి తమ పెట్టుబడులకు లాభాలకు ఢోకా లేకుండా చేసుకునే ప్రయత్నానికి మైనార్టీలపైన దాడులు లేదా మెజార్టీ మతం తీసుకున్న వారిపై అత్యంత ప్రేమాభిమానాల పబ్లిసిటీ.  ఈ దేశంలో వుండాలంటే జైశ్రీరామ్‌ అనాలన్న నినాదంతో బాబ్రీ మసీదు కూల్చివేత, మైనార్టీలపై హింసా, అల్లర్లు, స్త్రీలు అని కూడా చూడకుండా వారిపై టెర్రరిస్టుల ముద్ర వేస్తున్న ధోరణులు, ప్రయత్నాలు మనందరి జీవనభద్రతకే ముప్పు. ‘మనసెరిగిన మన కథలో(వ్యధలో) ఎన్ని సామాజిక  కోణాలు వున్నాయి. సామ్రాజ్య వాద కుట్రలు దాగి వున్నాయి. కాబట్టి పరమత స్త్రీలను ఉన్నామదంతో ఊచకోత కోసి, ‘నస్త్రీ స్వాతంత్య్ర మర్హతి’ అని ఘోషించే హైందవ మతంలోనికి వెళ్ళే కాని నయతారలే కాకుండా స్వేచ్ఛకోసం మతన్మోదానికి వ్యతిరేకంగా పోరాడే  తస్లీమా నస్రీన్‌లు మనకు ఆదర్శం కావాలి.

No comments:

Post a Comment

Text