Tuesday, May 19, 2015

కొత్త మార్కెట్ దేవుడు – హిందుత్వ

కొత్త మార్కెట్ దేవుడు – హిందుత్వ

Hema venkat rau
దేశంలో రానురాను పెరిగిపోతున్న హిందుత్వవిపరీతపోకడలను దాని విస్తృతభావజాలాన్ని,  రాజకీయార్ధిక  కోణాల్నిడా.కె.బాలగోపాల్ రాసిన”మతతత్వం” పుస్తకపరిచయం ద్వారావివరిస్తున్నారు హేమా వెంకట్రావ్….



     పుస్తకం అంటే ఒకానొక అంశం పైన లేదా అనేక అంశాలపై మనకున్న అవగాహనా, అభిప్రాయాలను నిశితంగా విశ్లేషించుకుని  పదును పెట్టుకునే ఒక సాధనం లేదా  పనిముట్టు . ఈ సాధనలో ఒక చారిత్రక సందర్భం తోడైతే పుస్తకం మన ఆలోచనల్ని మరింత లోతుకు తీసుకువెళ్ళి ఆచరణలో నిలబెడుతుంది. శేష ప్రశ్నలకు జవాబౌతుంది .
ఈ నెల పుస్తక పరిచయం గురించి పుస్తకాల్ని తడుముతున్నప్పుడు  జరిగిన సంఘటనలు  పై పుస్తకం దగ్గరగా నిలిపివేశాయి.  నిజామాబాదులో విద్వేషాలు రెచ్చగొట్టాడని  అక్బరుద్దీన్ని (MIM,MLA)  అరెస్ట్ చేసారు. కాని అతడు ప్రస్తావించినట్టు గుజరాత్,డిల్లి, కాశ్మీర్ల లో మారణకండకు పాల్పడిన హంతకులు శిక్షింపడతారా ? దేశంలోకి రాజకీయ ,పోలీసు న్యాయవ్యవస్థ   మైనార్టీ లకు న్యాయం  చేయగలుతాయా?!  ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కునే లోపే ఆఫ్జల్ గురు పార్లమెంట్ పై దాడి కి  కుట్ర పన్నాడన్న  నేరం పై ఉరికంబం  వేలాడటం మరింత కలవరపరిచింది. సామాజిక కోణం నుంచి న్యాయపరిధి వరకు  జరిగిన సంఘటనలు పరిశీలిస్తే అడ్వకేట్  గానే కాదు సామాజిక కార్యకర్తగా విస్మయం చెందలేదు. ఎందుకంటే పేరుకు లౌకిక సర్వసత్తాక  రాజ్యంగా,  అతిపెద్ద ప్రజాస్వామ్యదేశంగా చెప్పబడుతున్న ఈ గడ్డపై మెజారిటీ భావజాల ప్రభావంతో  మైనారిటీలు బాధింప  బడ్డవారే. అందుకు నేను మినహాయింపు కాదు కాబట్టి విషయాలు  లోతుగా  అర్ధమవుతూనే  వున్నాయి. వీటికిమరింత సైద్దాంతిక  జ్ఞానాన్ని  జోడించడానికి పుస్తకాన్ని వెతుకుతున్న క్రమంలో నా లైబ్రరీలో కంటపడ్డ అమూల్యమైన పుస్తకం ‘మతతత్వం పై  బాల గోపాల్’ .

 ఈ పుస్తకం (వ్యాస సంకలనం) లోని వ్యాసాలు పత్రికలలో గతంలో వచ్చినవి.  పుస్తక పరిచయం కోసం మరొక్క సారి చదువటం  ఇంకా పూర్తి కాక ముందే హైదరాబాద్  దిల్ షుక్ నగర్ లో బాంబు దాడి.  మెజార్టీ భావజాల పెత్తనం పై విరుచుకు పడ్డ విస్పోటనం. యిక   మనకు ఈ నెల చర్చ కొరకు ‘మతతత్వం’  కంటే మించిన విషయం ఏముంటుంది!  అందుకే  ‘మతతత్వం పై’  బాలగోపాల్  పుస్తక పరిచయం .   ఈ సందర్భం లో మత తత్వం వాటి మూలాలు, వాటి విస్తృతి,  దాని వెనుక వున్న ఆర్దిక,సామాజిక కోణాలను అర్ధం చేసుకోటానికి  ప్రయత్నిద్దాం.

image











బాలగోపాల్ వ్యాసాల పరంపరలో రెండు  మేధో  వికాస దశలను చూస్తాము. తొలి వ్యాసాలల్లో బ్రాహ్మణత్వ దృక్పథం   కనిపించక పోవడానికి  ఆయన మేధోగమనo  కారణం.  హిందుత్వపు  తొలి వ్యాసాల్లో  బాలగోపాల్ స్థానికంగా  భూమి మీద ఆధిపత్యం గల కులాలు హిందుత్వంతో,  నయ ఉదారవాదంతో విభేదించిన   తీరును, సంబంధం కలుపుకున్న తీరును విశ్లేషించే విధానం కనిపిస్తుంది.  ఈ విశ్లేషణ పద్ధతి పెట్టుబడి దారి  సిద్దాంతం భారతదేశంలో కులవైరుధ్యం  తో పాటు ఎలా అభివృద్ధి చెందుతుందో తెలుపుతుంది. బాలగోపాల్ మేధో వికాసపు మలి  దశలో భారతదేశపు సామాజిక, రాజకీయ వ్యవస్థలో జాతి, కులం వుందన్న అవగాహన వైపు కదిలారు.   తొలి రచనల్లో నియో ఉదారవాద దృక్పథం ప్రధానంగాను బ్రాహ్మణీయ  జాతి (కులం) విశ్లేషణ అంతర్లీనంగా కనిపించగా మలి రచనల్లో యిది తిరగబడినట్టుగా కనిపిస్తుంది.  ఇక్కడ ఆయన జాగ్రత్తగా చారిత్రక ఆధారాల్తో,  సంక్లిష్టమైన విభిన్న జాతుల సమ్మిళతమైన, సంకీర్ణమైన కొత్త రూపం సంతరించుకున్న దక్షిణాసియా సాంస్కృతిక వైవిధ్యతకు హిందుత్వ  ఎలా గొడ్డలిపెట్టు  వంటిదో వివరిస్తారు. (బిజు మాథ్యూస్ ముందు మాట నుంచి)               మరిక  పుస్తకంలోకి వెళ్ళితే మతతత్వం పై ప్రత్యేకించి హిందుత్వం పై డా.కె . బాలగోపాల్ రాసిన వ్యాసాలను హైదరాబాద్ బుక్ ట్రస్ట్  ఈ పుస్తకం ద్వారా మన ముందు ఉంచింది. మన జీవితాలను తాకే  హిందుత్వ  ప్రభావం  తాలుక విభిన్న అంశాలను  మూడు విభాగాలుగా విభజించారు. మొదటి భాగం హిందూ ధర్మ ప్రజాస్వామ్యం లో దేశ భక్తి.  హిందుత్వం దాని వర్గ వ్యవస్థ, అదే విధంగా ప్రజాస్వామ్యం నుంచి మతాన్ని (వర్గ వ్యవస్థ) ను వేరు చేయలసిన  అవసరం వంటి అంశాలపై రాసిన  వ్యాసాలున్నాయి .  రెండవభాగం హిందుత్వ -విద్య లో డా.కె. బాలగోపాల్   విద్యారంగ కాషాయీకరణ గురించి రాసారు. వీటిలో భారత దేశానికి, దాని విజేతలకు సంబంధించిన చారిత్రిక వాస్తవాలు ఏ  మాత్రం వక్రీకరించకుండా విద్యార్దులకు ‘లౌకికత్వం’ విలువలను బోధించాల్సిన అవసరం గురించి తెలిపారు .  మూడో భాగం మైనారిటీలు-సంఘ పరివారం లో ముస్లింలు , క్రైస్తవులు తదితర ‘అల్పసంఘా’లపై జరిగే దాడులను అణిచివేతకు హిందుత్వము ఎలా  దోహదం  చేస్తుందో చెప్పారు.  బాబ్రి మసీదు కూల్చివేత, గుజరాత్ మారణకాండ,  క్రైస్తవులపై పెరుగుతున్న దాడులు ఈ భాగంలో చర్చింపబడ్డాయి. దేశంలో చోటుచేసుకున్న ఆ చారిత్రక సంఘటనలకి ఒక క్రమపద్దతిలో అర్ధం చేసుకునేందుకు వీలుగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ మూడు భాగాలలోకి వ్యాసాలన్నిటినీ  తేదీల క్రమంలో పొందుపరచడం జరిగింది. 

దేశభక్తి – మైనారిటీలు:

imageదేశంలో జరిగిన బాంబు సంఘటనలు తరువాత  ప్రతి ముస్లిం యువకుడు  అనుమానస్తుడే.  పోలిస్  స్టేషన్ లో  అనేక  మంది   యువకులు    ప్రశ్నించబడడమే కాదు. అనుమానించబడతారు.  మానవహక్కుల కమీషన్లో పోలీస్ వేధింపులతో  జీవించే హక్కును  కోల్పోతున్నామన్న  పిటిషన్లు  ఈ వర్గం నుంచి ఎన్నో!   ఎందుకంటే వారు ముస్లిం వర్గాలు కాబట్టి వీరి అస్తిత్వం భారతీయత గా  గుర్తింపబడటం లేదు.  పాకిస్తానీయులుగా ముద్రింప బడతారు.  పాకిస్తాన్ తో  క్రికెట్ మ్యాచ్  అయితే అది వింటే కూడా దేశభక్తి కొరవడినట్టే . ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం  వస్తుంది, మొన్న ఈ మధ్య  ఒకరు చనిపోతే  హిందూ స్మశానానికి  వెళ్ళటం జరిగింది. అక్కడ మరమత్తుల చేసే పనులు ప్రారంభించడానికి  ఒక శిలాఫలకం వేసారు, ఎమ్.పి  నుంచి కార్పొరేటర్ వరకు అందరి పేర్లు ఉన్నాయి . ఒక్క మేయర్ పేరు తప్ప. మరి ప్రోటోకాలును దాటిన దానికి చర్య లేదా అంటే లేదు . ఎందుకంటే మేయరు మైనారిటికి చెందినవాడు కాబట్టి మతాన్ని దాటి దేశ పౌరులుగా గుర్తించడంలేదు.  బాలగోపాల్ ఏమంటారంటే  దేశభక్తి అనేది  జాతీయ  తత్వపు అతి తీవ్రరూపం.
జాతులు  చరిత్రలో అతి ప్రాచీనమైనవి  గాని జాతీయ  తత్వం యురోపియన్  బూర్జువా విప్లవం తో పుట్టింది. పెట్టుబడిదారి వర్గానికి ప్రపంచవ్యాప్త   మార్కెటు సామ్రాజ్యవాద యుగo  వచ్చేదాక వీలుకాదు కాబట్టి ఒక జాతి (మైజారిటి )నివసించే ప్రాంతం కావాలి. అది దైవత్తమైన చోటు కాకుండా లౌకికమైతే పెట్టుబడిదారుల అవసరాలకు మార్చుకోవచ్చు .
దేశవ్యాప్తంగా వర్తించే చట్టం ఉండాలంటే  ప్రదేశాంతర అధికార కేంద్రాలను దెబ్బ తీస్తే చాలదు.  అంతర్గతమైన స్థానిక . అధికార కేంద్రాలు  కూడా దేబ్బతీయాలి.  శాసన వికేంద్రికరణ జరగ కూడదు. అందుకే జాతీయ ఐక్యత  మనదేశ   బూర్జువా వర్గానికి  చాలా  ప్రధానమయినది.    భిన్న జాతులను,  భాషలను మతాల్ని ఐక్యపరిచే కర్తవ్యాన్ని భారత బడా    బూర్జువా వర్గం తీసుకుంది.     19 వ శతాబ్దం వలస వాదుల సమయం లోనే  ఈ జాతీయత పేరు మీద మెజార్టీ మతస్తులని  సమీకరించడం చూస్తాం  .  మతవాదులు వలసవాద పోరాటంలో పాల్గొన్నట్టు బంకించంద్ర రాసిన ఆనంద్ మఠం లో చూస్తాం .  అది నవలే కావొచ్చు.  కాని వాస్తవత లేకుండా లేదు కూడా. ఆ తర్వాత మత విభేదాలు ఎంతటి మారణ హోమానికి దారి తీసాయో 1947 లో భారత్, పాకిస్తాన్ విడిపోయిన తరువాత జరిగిన దాడులు తెలియ చెబుతాయి.   అందుకే గాంధీకి యూరోప్ లోని ఇటాలియన్ నాయకులైన గార్బాల్డి, మాజీనీలు నచ్చారు.  ఆర్ .ఎస్ .ఎస్ మొదటి నుండి పాకిస్తాన్ ఏర్పాటును, భాషా  రాష్ట్రాలను ప్రాంతీయ భాషలలో విద్యా బోధనను,  ఫెడరల్ రాజ్యంగాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది .
అంతేనా జాతీయ ఐక్యత కాదు.  జాతీయ భావం ప్రజల నరనరాల్లో ఇంకి పోయే  విశుద్ద  జాతీయతత్వం కావాలి. జాతి పేరిట ప్రజల అవసరాల్ని  తమ  అవసరాలకు లోబర్చుకుంటే తప్ప తమకంటే ముందున్న పెట్టుబడి దార్లతో తాను పోటిపడలేనని  గుర్తిస్తుందీ వర్గం . దీనినే ఫాసిజం అంటారు. రెండున్నర  దశాబ్దాలు ఆలస్యంగా వచ్చిన టాటా,బిర్లా లకు, రాక్ఫెల్లర్, ఫోర్డులతో పోటి పడడానికి యిది  అవసరo.  మొదటి ప్రపంచ యుద్దంలో ఘోరంగా పరాజయం పొందిన జర్మనీ బూర్జువా వర్గం మళ్ళీ   బలం పుంజు కోవాలంటే  ముందు కార్మికులను అణచాలనే సోషలిస్ట్లు, కమ్యునిస్టులను, కార్మిక వర్గ కార్యకర్తలను ఫాసిస్టు దాడికి  గురిచేసారు. అందుకే  ఎప్పుడైనా కూడా జాతి పేరిట బూర్జువా వర్గం తన అవసరాలను సంరక్షిస్తుంది.
అయితే బ్రిటీష్ కాలంలో వాళ్ళని తరిమి వేయడం జాతీయ భావం అని పరిగణించే దశను ఈ సంస్థలు సరి పెట్టుకోలేదు. ఆర్.ఎస్.ఎస్ చీఫ్ గోల్వాల్కర్  దృష్టిలో ఒకే చోట నివసిస్తే చాలదు.  ఒకే దృక్పథాన్ని ఆమోదించాలి.  ఒకే జీవితాశయం, సంస్కృతి, భావలు,  నమ్మకాలు, సంప్రదాయాలు కలిగి ఉండాలి. ఈ భారత జాతికి ముస్లింలు, క్రిస్టియన్లు చెoద దల్చుకుంటే  వాళ్ళు ఇక్కడ నివాసులైతే చాలదు.  వాళ్ళు హిందూ సంప్రదాయాలని ,దృక్పథాన్ని ఆశయాలని అంగీకరించాలీ.  వాళ్ళు అల్లాను, మరియమ్మను  ఆరాధిస్తే ఫర్లేదు  కానీ తమది వేరే మతం,  వేరే ప్రపంచమని, దృక్పథమని అనడానికి వీలు లేదు.  అందుకే ఆర్.ఎస్.ఎస్ నినాదం కూడా  ఈ దేశంలో  ఉండాలంటే ప్రతి ఒక్క పౌరుడు ‘హే రామ్’ అనవలసిందే.
చరిత్రలోకి రెండు వందల సంవత్సరాలు ఆలస్యంగా వచ్చిన భారత బూర్జవా వర్గం తమకంటే కొన్ని వందల రెట్లు బలంగా ఉన్న అమెరికా గుత్త  పెట్టుబడిదారులలో సమానంగా నిలబడటానికి ప్రయత్నం. అందుకే ఇందీరా గాంధీతో సహా జాతి శ్రేయస్సు పేరిటేకదా  జాతీయ చట్టాన్ని జారి చేసి కార్మిక నాయకులను  అరెస్ట్ చేయించబడ్డారు.  గాంధీ, తిలక్ లతో సహా భగవద్గీతను బూర్జవా వర్గ ఆవసరాలకు వ్యాఖ్యానించారు.   జాతీయ శక్తి అన్న ఆలోచనే ధర్మశాస్త్రాలు  పుట్ట్టిన భూస్వామ్య సమాజానికి చెందదు. అది అప్రతిహతం కావడం అంటే భారత పాలక వర్గాలు ప్రపంచ దోపిడీ వర్గాల అగ్రశ్రేణిలో చేరారు. ఏ  ధర్మాన్నయితే  శ్రీకృష్ణుడు, మనువు  ఎరగా చూపి భూస్వామ్య సమాజంలో వర్గ సామరస్యాన్ని సాధించడానికి ఉపయోగించారో ఆ ధర్మాన్ని ఆ పాత ఎరల సరసన, ‘జాతి ఉన్నతి ‘  అనే కొత్త ఎరను చూపిస్తూ పెట్టుబడిదారి వర్గనికి  అవసరమైన వర్గ సామరస్యాన్ని సాధించడానికి ఉపయోగ పడుతుంది. అయితే ఈ ఫాసిస్టూ  సంఘాల ప్రజా సంఘాలన్నీ వర్గ సామరస్య సిద్దాంతాలను  ప్రచారం చేసుకోడానికి కాదు.  తాము ఆశించే జాతి ఐక్యతకు  ప్రధాన శత్రువుగా కనపడే మైనారిటీలను,  కమ్యూనిస్టులను అణగ తొక్కడానికే.   ఒక వైపు సోషలిజం  వ్యతిరేకిస్తూనే గాంధియన్ సోషలిజం గురించి మాట్లాడుతారు. వీరే  మైనారిటీ సబ్ కోటాలను వ్యతిరేకిస్తారు.
బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన జాతీయోద్యమంలో బూర్జువా   జాతీయవాదమే కాకుండా విప్లవ జాతీయ వాదం కూడా  ఉంది.  బ్రిటిష్ సామ్రాజ్యవాద ప్రత్యక్ష పాలనను తొలగించి బడా బూర్జువా   వర్గం చేతుల్లో పాలనను పెట్టడం బూర్జువా జాతీయ వర్గమైతే, స్థానిక దోపిడీకి వ్యతిరేకంగా కదలిన ప్రజలే  సామ్రాజ్యవాదాన్ని సహితం తొలగించగలరన్నది విప్లవ జాతీయవాదం.  సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం శ్రమ దోపిడీని  అంతం చేసే  పోరాటంలో ఒక భాగం మాత్రమే. బూర్జువా జాతీయ వాదానికి కాంగ్రెస్ నుండి ఆర్.ఎస్.ఎస్ వరకు అన్ని సంస్థలు ప్రాతినిథ్యం వహించాయి.  ఇప్పుడూ  వహిస్తున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ  తెలంగాణా,షర్లీ, కాసరగోడు పోరాటాల్లో విప్లవ జాతీయ వాదం మెండుగా కనిపిస్తుంది.   జాతి విముక్తిని శ్రమ దోపిడి నుండి విడదీయ నిరాకరించే విప్లవ కారుల వాదాన్ని, శ్రమ దోపిడిని సంరిక్షించడం  తన ముఖ్య కర్తవ్యంగా  గల బూర్జువా  వర్గం ఈనాటికి సహించదు. అందకే  దేశ భక్తి పేరిట,  జాతి అభివృద్ది పేరిట కమ్యూనిస్టుల మీద, ఉద్యమాల మీద ఉక్కుపాదం మోపారు.  శ్రామిక వర్గానికి విముక్తి నివ్వగల రాజకీయం మాత్రం విదేశాల నుండి వస్తే దాన్ని దేశ  ద్రోహంగా చిత్రీకరిస్తారు . పారిశ్రామిక రంగాలను అమెరికా రష్యా  సామ్రాజ్య వాదులకు ముడి పెట్టినప్పుడు నోరు మెదపరు.  వీరికి అమెరికా దిగ్గజాలు కూడ స్వాగతం పలుకుతారు .

స్వధర్మం : అట్టడుగు కులాలపై  దోపిడీ :

bala 1హిందూ ధర్మానికి ఇప్పుడు కుల కట్టు సాధ్యం కాదు.  కనుక ధర్మం అన్న భావనను పునర్జీవింపజేసే  “స్వధర్మ” ఉల్లంఘన  శిక్షార్హం అన్న పాత ఆలోచనను బ్రతికించడం వారి లక్ష్యo .  స్వధ్మర్మం  పుట్టుకతోనే వస్తుందనే దమ్ము లేదు.  కాబట్టి  కర్మ సిద్దాంతం .  ఒక వృత్తిలో  ప్రవేశించిన తర్వాత  తానే ఉత్పత్తి సాధనాలకు  యజమాని కాజాలడు.  జీతగాడు పొలం దున్నాలి కాని దున్నేవానిదే భూమి అవకూడదు .  ఒకప్పుడు శూద్రులు శ్రమదోపిడిని వ్యతిరేకిస్తే  నరకం ప్రాప్తిస్తుందన్న ఈ మతవాదులే  భూస్వాములకు , పెట్టుబడిదార్లకు నష్టం కలిగించే పోరాటాన్ని దేశానికి నష్టదాయకమైన కల్లోలంగా చిత్రీకరిస్తున్నారు.  మధ్య తరగతి కి సహజమయిన జాతీయ భావాన్ని తమ ఆస్తులు కాపాడుకోవటానికి ఉపయోగించుకుంటున్నారు.  హిందూ ధర్మం శూద్ర కులాలను కుక్కలు,  కాకులు అన్నది.  తిరగబడితే చంపేయమన్నది.  కాని భూస్వాములైన  వీరిలో కొందరు ” హిందూ ధర్మాన్ని” సంరక్షించడానికి ముందుకు వస్తున్నారంటే అది కేవలం తమ భూములను, ఆస్తులను గ్రామాలలో బీటలు వారుతున్న పెత్తనాన్ని కాపాడుకోవడం కోసమే.  ఎప్పుడో జాతీయత పేరున తిలక్ స్వతంత్ర పోరాట సమయంలో గణేష్ ఉత్సవాలను ప్రజలకు పరిచయం చేసారు.   ఈ  రోజున అవి మన  అట్టడుగు కులాల వారిచే మైనారిటీ ప్రజలపై తిరుగుబాటుకు ఉపయోగ పడుతున్నాయి.
దళితులు, ఆదివాసులు హైందవ సమాజం అదుపు నుండి బయటపడుతున్నారని   భయపడుతున్నారు.  వీరు హిందూ  సమాజంలో భాగం కాలేరు. కాని   వెలుపల వుండే  హిందువులనిపించుకోవాలి.   ఇది స్త్రీలకు వర్తిస్తుంది.  అందుకే రాజ్యాంగం  కల్పిస్తున్న మతమార్పిడి హక్కును కూడా కాలరాస్తూ మైనార్టిలపై  దాడులు జరుగుతున్నా యి.  దళిత గోవిందం అంటూ హైందవ దేవుడే దళిత వాడలకు వస్తున్నాడు.  కాని వీరు హిందూ పూజారులు,  మతాధిపతులు  కాలేరు. ఆశించడం కాదు కలలో కూడా ఊహించలేము.
అయితే ఈ సమస్యను మనం శివ సేన, బజరంగ్ దళ్,  విశ్వహిందూ పరిషత్,  ఆర్. ఎస్.ఎస్,  బి జె పిల వ్యాప్తికి,  కుతంత్రాల కు సంబంధించినదిగా చూడకూడదు.  నిజమైన సమస్య ఏమిటంటే సాధరణ హిందూ ప్రజానీకం ముస్లిం వ్యతిరేక ఉద్యమంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యులు కావటమే.  ఇక్కడ హిందువు అన్న మాటలో దళిత, బీసి లను కూడా కలిపి  ప్రయోగిస్తున్నారు.  హైందవ సిద్దాంతం, ప్రాపంచిక దృక్పథం బ్రాహ్మణులకు , బనియాలకు తప్ప వేరే ఎవరికీ మేలు చేయదని ఇతర కులాలకు నేర్పే  రాజకీయ కృషి లేనిదే  ఈ సిద్దాంత విశ్లేషణ వల్ల  ప్రయోజనమేమి ఉండదు .  ఈ కృషి శూద్ర అగ్రకులాల దగ్గర ఫలితం ఇవ్వక పోవచ్చు కాని దళితులు,  పెద్దగా బ్రాహ్మణీకరణ చెందని బి సి కులాల దగ్గర మాత్రం ఫలితం ఇవ్వగలదు.  ఒక దళిత ఉద్యమం,  వేరే ఏ  ప్రజాతంత్ర ఉద్యమమైన గుజరాత్ లో అభివృద్ధి చెంది వుంటే,  వారిని  అన్యాయానికి గురైన,  న్యాయాన్ని కోరుకొంటున్న వర్గంగా ఒక ‘రెబెల్’ గుర్తింపుని ఇవ్వగలిగి వుండేది .  అవేవి లేని చోట విశ్వహిందు  పరిషత్ వారిని ‘హిందువు’ అన్న గుర్తింపు లో  భాగం చేసింది .  ద్వేషించడానికి ఒక ముస్లింను,  క్రైస్తవులను వారి ముందు  నిలబెట్టింది.

హిందూ  మతం — స్త్రీలు

bala2హిందూ మతానికి పునాది మను ధర్మ శాస్త్రం .  బౌద్దమతం దెబ్బనుండి  కోలుకొని తిరిగి బలం పుంజుకొని స్థిరపడుతున్న దశకు చెందిననది మను ధర్మ శాస్త్రం .  ఏ  సమాజం మనుగడకైన రెండు మార్గాలు ఉంటాయి.  1.  ఆ సమాజం విధించే న్యాయనియమాలను ప్రజలు ఇష్ట పూర్వకంగా పాటీంచడం. 2.  న్యాయనియమాలను అధిగమించే వాళ్ళని రాజ్యాంగ  యంత్రం ద్వారా శిక్షించి సమాజంలో నియమబద్ద  ప్రవర్తను నెలకొల్పడం.  ఇష్టపూర్వకంగా ప్రజలు సామాజిక నియమాలను పాటించాలంటే అవి హేతుబద్దమైన ఆమోదం వల్లనైన జరగాలి లేదా మతం, దేవుడు నమ్మకాల నుండి  పుట్టే విశ్వాసాలపైన  జరగాలి.  సంస్కరణకు మనుధర్మ శాస్త్రం లో చోటు లేదు కాబట్టి స్త్రీల విషయంలో రెండవ పద్ధతినే  అనుకరిస్తారు.
స్త్రీ తాను గొప్పదని , తన వాళ్ళు గొప్ప వాళ్ళని భావించి భర్త పట్ల తాను నిర్వర్తించే విధులను నిర్లక్ష్యం చేసే స్త్రీని అందరూ చూసే చోట  సజీవంగా కుక్కలకు వేసి చంపాలని మనువు అంటాడు. ఒక వివాహిత స్త్రీతో లైంగిక  సంబంధం పెట్టుకొనే ఉద్దేశంతో ఆమెను మైమరిపించి ఆమె భర్త దరి నుండి తీసుకుపోవడం  నేరం అంటుంది . భార్య  లైంగికత్వానికి    భర్త యజమాని అనే భావన ఆధునిక చట్టాలలో సహితం బలంగా వుంది .  అదే ఐ పి సి 497 సెక్షను.  కులవ్యవస్థ లేని హైందవేతర సమాజాలలో కూడా స్త్రీ శరీరంపై మగవాళ్ళకు ఇదే పెత్తనం వుంది .  కాబట్టి భారతదేశా చరిత్రలో పితృస్వామ్యానికి వర్ణ వ్యవస్థను మూలంగా భావించలేము.    లైంగిక నేరాల నిర్వచనంలో కాపాడబడేది నేరంలో భాగాస్తురాలైన  స్త్రీ భర్త హక్కులే కాబట్టే కొంతమంది స్త్రీలకు అది వర్తించదు .  ఎటువంటి మగతోడు లేని వ్యభిచారిణులు,  సన్యాసినిలతో  ఏ  మగవాడు లైంగిక సంబంధం పెట్టుకున్నా  అందులో నేరం లెదు.  అందుకే ఈ రోజున కూడా కోర్టులలో కూడా ఒక స్త్రీ  రేప్ కు గురయినా  లేదా మరే నేరం మోపబడ్డ ఆమె క్యారెక్టర్ను  పదే పదే  ప్రస్తావిస్తారు.  కాని ఆమెకు మానవ హక్కులు వర్తిస్తాయి అన్న స్పృహే లేదు.  లైంగిక నేరాలలో శిక్ష తీవ్రత ప్రధానంగా నిర్ణయించేది  కులం కాగా ఆమె పవిత్రతకు పాత్ర ఉంది .  అతని ఆస్తి కాపాడడం కోసం, కొడుకు కలగటం కోసం వేరే వాళ్ళ తో సంభోగించితే  తప్పులెదు.  మగవాళ్ళు స్వలింగ సంపర్కం కు పాలపడితే ప్రాయశ్చిత్తం చేసుకొవాలి.  కాని స్త్రీలకు భౌతిక దండన వుంది.
ప్రతి కుటుంబం ఒక న్యాయ స్థానమే.  అన్ని స్థాయిలలోనూ తప్పు ,ఒప్పు,  నేరం, అధర్మం అనే వాటికి సంబంధించిన విచక్షణను, నిర్వచనాన్ని అవగాహనను మను నీతి బలంగా ప్రభావితం చేసింది.  సాంఘిక నీతిని మను నీతికి అనుగుణంగా కట్టడి చేసాయి.  వ్యక్తుల ఆస్తిని కాపాడే భాద్యత కూడా ఈనాడున్నట్టే ఆనాటి రాజ్యానికి  ఉండింది.  ఆ స్త్రీ శీలవతయితేనే ఆమె ఆస్తి కాపాడబడుతుంది.   స్త్రీలు కుటుంబానికి పరిమితమన్నా శూద్ర, దళిత కులాల స్త్రీలు కుటుంబ ఆర్ధిక వత్తిడి రిత్యా బయటకు రాక తప్పదు. వేశ్యల,  శూద్రుల బ్రతుకే అధర్మమైనది కాబట్టి ఆ వర్ణానికి చెందినా స్త్రీలు, వేశ్యా వృత్తి లో  వున్నా స్త్రీలు ధర్మ విరుద్దంగా ఆ బ్రతుకు అనుమతించబడుతుంది .  ఆ విధంగా కుటుంబం బయట బ్రతికే స్వేచ్చ  అగౌరవ పరచబడతాయి .  కాబట్టి వాటిని కోరుకునే స్త్రీలు గౌరవనీయులు కారు .  అగ్రవర్ణాల స్త్రీలు తమ గౌరవాన్ని కాపాడు కోవాలంటే హక్కులు, శూద్ర  స్త్రీ సాంఘికంగా గౌరవం పొందాలంటే  తన నికృష్టంగా అనుమతించబడిన స్వేచ్చను  వదులుకొని ఆర్య స్త్రీని బానిసత్వంలో అనుకరించాలి.  ఈ మార్పుని కోస్తాంద్ర గ్రామాలలో సాంస్కృతీకరణలో   భాగంగా ఎక్కువగా చూస్తాము.   మనం కోరుకునే హక్కులను సాంస్కృతికంగా, నైతికంగా అగౌరవప్రచటం ఒక అణిచివేత రూపమే.
అన్నిటిని మించి లైంగిక విచ్చలవిడితనం స్త్రీకి వుండే సామాన్య గుణం అని మనువు అంటాడు.  మగవాళ్ళను ఆకర్షించి లోబరుచుకోవడం స్త్రీలకు సంతోషం కలిగించే విషయం అని, స్త్రీల వలన ఎంతటి జ్ఞానికైనా ప్రమాదమేనని  అంటాడు.  ఈ భావం ఆనాటి  మనువుకే   కాదు ఈ నాటి కొంతమంది సో కాల్డ్  విప్లవకారులకు ఉన్నది.  ఆచరణలోను వారి ప్రవర్తన భిన్నం కాదు.
ఈ సమాజంలో రాజ్యాలు ఏలిన, వ్యాపారాలు,  ఉద్యమాలు చేసిన స్త్రీలు ఉన్నారు.  ఈ శాస్త్ర నియమాలు సమాజానికి స్త్రీ పట్ల వుండే వైఖరిని నిర్ణయిస్తాయి.  ఈ నియమాన్ని అతిక్రమించిన వారు ఆ సాంస్కృతిక వైఖరిని, అది కల్పించే వ్యక్తావ్యక్తమైన అవరోధాలను ఎదుర్కొని జీవించవలసి వుంది..  సెక్యులర్ రాజ్యాoగాన్ని రాసుకున్నా ఈనాడు అంతే.  బ్రాహ్మణీయ హిందూ సంస్కృతే హిందూ ప్రజలందరి సంస్కృతి అయ్యింది .  అందుకే పర్సనల్ చట్టాల ప్రజాస్వామీకరణ అవసరం అంటారు వ్యాసకర్త.  ఏ  మతం, చట్టం అయిన స్త్రీకి వైవాహిక జీవితంలో హింస నుండి రక్షణ కల్పించలేకపోయాయన్న చెడు, వాస్తవానికి  పరష్కారం కావాలి గాని, వేరే భావనను అంగీకరించవలసిన  అవసరం ఏమున్నది?
సామాజిక భద్రతను నిలబెట్టడం కోసం రాజ్యం పాల్పడే హింస విషయంలో ఎటువంటి సంకోచానికి  తావు లేకుండా చాల కట్టు దిట్టం చేస్తుంది మనుస్మృతి.  ఈ రోజున న్బిర్భంధ చట్టాలను,  చట్ట బాహ్యమైన రాజ్యహింసను ఎట్టి  పరిస్థితిలోను  విడనాడకూడదని ఆర్. ఎస్.ఎస్. వంటి సంస్థలు పట్టుబడటానికి ఈ తాత్వికతే మూలం .

చరిత్ర – చదువుపై కాషాయ నీడ:

మెజార్టీ  మతం అయిన హిందూ మతం మరింత వేళ్ళూనుకోవాలి కాబట్టి దానికి చరిత్ర-చదువు పై పట్టు కావాలి.  అందుకే మైనారిటీ స్కూల్స్ పై దాడి, చరిత్ర పాట్టాలు తిరిగి రాయాలన్న తక్షణ కర్తవ్యంగా కనపడుతుంది .  విద్యావ్యవస్థ లోని  కొద్దిపాటి ఆధునికత, ప్రజాస్వామ్యం అనే భావాలను పూర్తిగా క్షీణింప చేసే ప్రయత్నాలు మొదలయ్యయి. పైకి ఏమి చెప్పినా అంతరంగంలో మాత్రం కాషాయం నిండిన  వాళ్ళు ఈ దేశంలో చాల మంది వున్నారు.  దానిని ఎదుర్కొంటానికి ఓ పోరాటం అవసరం . రాజకీయంగానే కాదు పరిశోధనాత్మకంగా, వైజ్ఞానికంగా ఎదుర్కొవాలి.  దానికి ప్రజాతంత్ర ఉద్యమాలు సిద్దంగా ఉన్నాయా అని బాలగోపాల్  సూటిగా ప్రశ్నిస్తారు .

ప్రజాస్వామిక విలువలు-హిందూ మతోన్మాదం:

b3రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమము కులాన్ని ఆశ్రయిస్తే, రామజన్మభూమి-బాబ్రి మసీదు  వివాదం మతాన్ని ఆశ్రయించింది .  మొదటిది హిందూ మతం లో అగ్రకులాధిప త్యం కోసం ఆత్మాహుతులకు  దారి తీయగా, రెండవది హిందూ మతాధిపత్యం కోసం మైనార్టీల పై  విద్వేషం రెచ్చగొడుతుంది.  ఈ రెండు ప్రజాస్వామిక విలువలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాలు మండల కమీషన్ నిలుపుదల  చేయడానికి రామ జన్మభూమి-బాబ్రి మసీదు వివాదాన్ని ముందుకు తెచ్చారు .  ముస్లిం దేశాలలో లౌకికవాదం లేనప్పుడు మనకు మట్టుకు ఎందుకు అని మతోన్మాదుల వాదన.  కాని వీరు బంగ్లాదేశ్  లో మైనార్ట  హిందువులపై దాడులు జరుగుతున్నాయని గగ్గోలు పెడతారు .  అందుకే తస్లీమా నస్రీన్ ‘లజ్జ ‘ రచయితకు అంతటి స్వాగతం మన దేశం లో  లభిస్తుంది .
సామాజిక ఆర్ధిక వికాసం కల్పించడానికి ప్రత్యకమైన హక్కులు, సదుపాయాలూ కల్పించడాన్ని బుజ్జగింపు అంటున్నారు.  మతవాదులు మైనార్టీ వారికే కాదు మెజారిటీ స్త్రీలకు అన్యాయమే చేస్తారు.   అందుకే డా.అంబేద్కర్ ప్రవేశ పెట్టిన  హిందూ కోడ్  బిల్ ను వ్యతిరేకించారు.  మైనార్టీ,  మెజార్టీ అన్న తేడా లేకుండా పౌరులందరూ సమానంగా చూడాలి అన్న హిందూత్వ వాదన ప్రమాదo.  అసమానతలు పెరుగుతాయి తప్ప తగ్గవు.  మనమైతే ఆ దేశ పౌరులు కాకపోయినా అమెరికాలో,  ఇంగ్లాండ్ లో గుడులు కట్టుకోవచ్చు.  కాని మన పౌరులైన  వేరే మతస్తులుకు మన దేశంలో అలా  కుదరదు మరి.  ఈ దృక్పథం  మైనారిటిలకే కాదు  ప్రజాస్వామ్యానికే చేటు.  ఇలా మెజారిటీ భావజాలాన్ని ప్రజలలో ఎక్కించి రాజ్యాధికారానికి రావడం వలన హిందూ మతతత్వ విలువలే రాజ్యాంగ విలువలయ్యే ప్రమాదం ఉంది.  అందుకు ఉదాహరణాగా బిజెపి ప్రభుత్వం కర్ణాటక, ఒడిస్సాలలో  క్రైస్తవ మైనారిటీల పై జరిపిన హింస చరిత్ర చెప్పిన సత్యం. దళిత క్రైస్తవులను క్రైస్తవులుగా గుర్తించక పోవడం మరో కోణం.
నాగో,మీజో కాష్మీరీలు సాంస్కృతికంగా భిన్నమైన వాళ్ళు. స్వాతంత్రం తర్వాత   వారిని బలవంతంగా కలుపుకొని కొన్ని ప్రత్యేక హక్కులు రాజ్యాంగంలో చేర్చడం జరిగింది .  ఆ విషయాన్నికొంత కాలం  తరువాత  పునః పరిశీలిస్తామని తెలియ చెప్పారు.  కాని వారు స్వయం ప్రతిపత్తి కావాలని ఉద్యమిస్తే వారి మానవ హక్కులను కూడా ప్రభుత్వం  కాలరాస్తుంది.  దానికి మద్దతు హిందుత్వ వాదులే. ఏ పోరాట అణిచివేతకైనా  సిద్దమే.  గతంలో ఎల్.టి.టి.యి, పీపుల్స్  వార్, పంజాబ్, కాశ్మీర్,  ఈశాన్య భారత పోరాట సంస్థలకు ప్రభుత్వం నిషేదిస్తే సమర్దించాయి .   నూతన ఆర్ధిక విధానాలను కాంగ్రెస్ తలుపులు తెరిస్తే, జీవన హక్కులు లేకుండా చేస్తుంటే అన్ని పార్టీలు అంతో ఇంతో విమర్శించాయి . కాని బిజె.పి ‘భేష్’ అని కితాబు యిచ్చింది.  2006 లో  విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులుకు ఆహ్వానం పలికింది.  పోలీస్ న్యాయ వ్యవస్థ వీరికి మద్దతు పరోక్షంగా తెలుపుతుంది.   అందుకే బాబ్రి మసీదు కూల్చివేత, గుజరాత్ హింసాత్మక సంఘటనల్లో మైనార్టీల బలిలో ఈ వ్యవస్థలు మౌనo   వహించాయి.    హిందుత్వవాదులు కోపం ముస్లింలపైననే, ముస్లిం మతవాదం పై కాదు.  అభ్యుదయ భావాలు కల్గిన ముస్లింలను  వీరు ఆదరించరు.  ముస్లింలు సనాతన వాదం పిడికిలి నుండి బయటపడాలని హిందుత్వ వాదులు కోరుకోరు.  వారంతా సనాతన వాదులుగా వుంటే   తమ ద్వేషాన్ని సహెతుకమైనదిగా రుజువు చేయాలని కోరుకుంటారు.  గుజరాత్ నేర్పిన లెసన్స్ లో అదొకటి…
హైందవం పేరు మీద చేస్తున్న ఆగడాలనూ,  వాళ్ళు దేశంలో నిలబెట్టదలుచుకొన్న  సంస్కృతిని, తమను తాము హిందువులుగా భావించే వారిలోని  మెజార్టీ  సహితం సమర్ధిస్తున్న దాఖలాలు లేవు.  అలాగే కొంతమంది నిరాయుధులను చంపి, మరి కొంతమంది బలి పశువుల్ని చేయడం తప్ప మెజార్టి  పేరు మీది నడిచిన దౌర్జన్యానికి మైనార్టి  పేరు మీద నడిచే దౌర్జన్యం జవాబని నమ్మేవారు సైతం సాధించింది  ఏమి లేదు అంటారు బాలగోపాల్.

హిందుత్వ భావజాలం:

b4ఈ హిందుత్వ  అనబడే భావజాలం యొక్క ఆవసరం  ఎందుకొచ్చింది? పాలకవర్గాలు దశాబ్దాలుగా ఒక కలగలుపు వ్యూహం తోటే పాలించారు.  నిరంకుశ ప్రభుత్వ అధికారాలచే నియంత్రించబడే   ప్రణాళిక బద్దమైన అభివృద్ధి కొంత మోతాదులో సంక్షేమం  కొన్ని సంస్కరణలు, పెద్ద మొత్తం లో సోషలిజం,  లౌకిక వాదం,  ప్రజాస్వామిక వాదం అనే నెహ్రు భావజాలం  తో కొంత కాలం నడిచింది .  ఆ భావజాలం విఫలమైనప్పుడు నిర్దాక్షణ్యమైన   పోలీసులు, తుపాకీ ఉండనే వున్నాయి.  సంక్షేమం,  సంస్కరణ అనేవి ప్రభుత్వ ఖజానాకు భారంగా భావించ బడ్డాయి.  పోలీసు, తుపాకి సర్వాంతర్యామి అయ్యింది.  ప్రణాళికలు, పబ్లిక్ రంగం అనే వాటి పునాదిపైన సంపదల సృష్టి, పంపిణి మదుపు జరగాలని పాలక వర్గం జాతీయ ఏకాభిప్రాయం కూలిపోవడంతో దేశంలోనే వనరుల కోసం, అధికారం కోసం పాలక వర్గాలు ఒకరి గొంతులు ఒకరు కోసుకొంటున్న తరుణంలో తమ సంపదలలో ఒక చిన్నముక్క ప్రజల పరంమవడం ఇష్టం లేదు.
గతంలో ఎంచుకున్న ప్రణాళికబద్ద  అభివృద్ధి ఆస్తిపరులైన వర్గాలను సాంకేతికంగా ఆధునికపరిచి మరింత వేగంగా  సంపదలు వృద్ది చేసుకునే విధంగా,  మరింత సుస్థిరంగా, సమతూకంతో ఈ ప్రక్రియలు సాగే విధంగా చూడ్డమే ఈ ప్రణాళికబద్ద వ్యూహం.  ఫలితంగా సాంకేతికంగా ఆధునికరించబడిన వర్గాలు పాత  ఏకాభిప్రాయాన్ని   చీల్చి చెండాడుతున్నాయి.   కోత్తగా సంపదను పోగు చేసుకోడానికి అడ్డంకిగా  మార్తున్నాయి. పాత  ఒప్పందం ప్రకారం జాతి నిర్మాణం లో రాజ్యం యొక్క అన్ని అంగాలు పాలుపంచుకునేవి.  ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో అ ఉమ్మడి అంగికృత విలువలన్నీ కులిపోవడం తో వ్యవస్థలన్నీ పూర్తిగా నాశనం అయ్యాయి.  ఈ అరాచకత్వం, అవకాశవాదం నగ్నమైన దోపిడిల నుంచి  కొత్త ఏకాభిప్రాయ నిర్మాణం జరగవలసింది.
1980ల నుండి ఈ పరిణామం జరుగుతుందని చెప్పడానికి  సంపదలను పోగు చేసే కర్తవ్యం అధికార యంత్రాంగం చేతుల నుండి ప్రైవైట్ శక్తుల చేతులకు బదిలీ కావడమే. ఆర్దిక సూత్రాలేగాక తుపాకులు, బాంబులే నిర్ధారించే  అవకాశాన్ని కూడా చూడొచ్చు. చాలా  సామాజిక, రాజకీయ గందర గోళం జరగకుంటే,  ఆర్ధికంగా అనేక అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కో కుండా పుట్టుకోచ్చే  ప్రక్రియే  ఒక యుద్ద ప్రభుల మార్కెట్ ఆర్ధిక వ్యవస్థే .  ఈ వ్యవస్థకు ప్రజామోదం  సమకూర్చగల భావజాలం కావాలి.   ఉత్తమ విలువలతో ఆ భావజాల నిర్మాణం  జరిగే వీలు లేనప్పుడు ప్రజలలో వ్యాప్తిలో  ఉన్న అత్యంత ప్రతికూల విధ్వంసక  అప్రజాస్వామిక  భావాల ఆధారంగా ప్రజలను ఆకర్షించే ప్రయత్నం జరుగుతుంది.  మన అస్తిత్వం,  మన సంస్కృతి అనే అంశాలు ఉదార వాదం,  సోషలిజం లాగా ఒక సమగ్ర  ప్రాపంచిక దృక్పథాన్ని తయారుచేయడానికి పనికిరావు.  అందువల్ల  ఒక ప్రాచీన ప్రాపంచిక దృక్పథం తో  ఈ  భావలు జోడిoచబడుతున్నాయి.  మన దేశంలో కొత్తగా తయారవుతున్న వికృత వ్యవస్థయొక్క వికారాత్మక, విధ్వంసక, అప్రజాస్వామిక సారానికి సరిగ్గా సరిపోయే ప్రాపంచిక దృక్పధం  ‘హిందూత్వం’.
మోక్షం అనే సంప్రదాయ భావానికి  హిందుత్వ పూర్తిగ ఆధునికమైన (లౌకికమైన) దేశ భక్తి అనే భావాన్ని జోడించిoది.  సమానత్వం అన్నది  ఎంత ఆధునికమో ఈ దేశ భక్తి అనే భావన అంతే ఆధునికం. కాని దీని స్వభావమే అమానుషం, దుర్భరం.   భారత రాజకీయ సందర్భంలో మతత్వాన్ని, లౌకికవాదాన్ని పరస్పర విరుద్ద భావాలుగా ప్రస్తావించడo జరుగుతుంది.  కానీ మతతత్వం అంటే ఒక లౌకిక ప్రయోజనం కొరకు విని యోగించడం అని మర్చిపోకూడదు అంటారు  రచయిత  . జీవితం పట్ల అసంతృప్తి దాన్ని మార్చుకోవాలని,  బాగుచేసుకోవాలని కోరుకోవడం తప్పు అని వివరించే హిందుత్వకు  మించిన భావజాలం దోపిడీ వర్గాలకు ఎక్కడ దొరుకుతుంది?. కనీసం యూరోప్ లో ఫాసిజం   అధికారంలోకి వచ్చేంత వరకు జనరంజకంగ ఉండేది.  ఇక్కడ హిందుత్వకు అది కూడా  లేదు.

హిందుత్వ-స్టేట్ : పెట్టుబడి

ఈ మొత్తం విధ్వంసక క్రమం ప్రజలంతా కోరుకుంటునట్టుగా నమ్మబలుకుతున్నారు.  ఈ మధ్య న్యాయస్థానాలు కూడా కఠినమైన శిక్షలు వేసి ప్రజలు కోరుకుంటున్నారు అంటున్నాయి.  గాయపడ్డ భారత ప్రజల మానసిక ఆవేదనకు  ఉపశమనం  మొహమ్మద్ అఫ్జల్ ను  ఉరితీయవలసిందే అని   సుప్రీం కోర్టు ప్రకటించి కింద కోర్టు లో విధించిన మరణ శిక్షను ఖరారు చేసింది. 1993 లో జరిగిన బాంబుదాడుల పై తీర్పు  మెజార్టీ ప్రజల మనోభావాలను సంతృప్తి పరిచింది కాని ఈ రోజున గుజరాత్ గాయం యింకా మానలేదు.  బాధితులకు న్యాయం దొరకకపోగా, ఆ సంఘటనలకు భాద్యులు నేడు జాతీయ,  అంతర్జాతీయ హీరోలు.   అంటే ఒక విధంగా న్యాయవ్యవస్థ కూడా  మతీకరణ  జరిగిందన్నమాట.   పోలీస్ స్టేషన్లు మానవ హక్కుల విధ్వంసానికి   మైనార్టీల పట్ల వేదికలయ్యాయి.
image (1b5ఇప్పుడు నరమేధాలు కూడా మనలను కదిలించలేకపోతున్నాయి.  మనదేశంలో కొన్ని కులాలల్లోనూ, సమూహాలలోను   ఉదాహరణకు ముస్లింలను అనుమానించ దగిన వాళ్ళుగా, సమస్య వస్తే వేను వెంటనే కలిసి ఒక్కటయ్యే వాళ్ళుగా  భావిస్తుంటాం.  అట్లాంటి  ముద్రగల ముస్లిం సముదాయం కూడా  నిర్లిప్తత అనే జబ్బుకు గురైంది.   అందుకే రామ జన్మ భూమి విధ్వంసం కాడ్నుంచి  అఫ్జల్ గురు హత్య సారీ ఉరి వరకు వీరి నుంచి స్పందన అంతే సమంగా లేదు.  అందుకే మతకల్లోలం రాజ్యపు టెర్రరిజంగా  మారుతుంది.
హిందుత్వ అన్నది కుహానా లౌకిక వాదానికి వ్యతేరేకంగా బయలు దేరింది కాదు.  నిజమైన లౌకికవాదానికి ఇతర ప్రజాస్వామిక విలువలకు వ్యతిరేకంగా ముందుకొచ్చిన సిద్దాంతం.  హిందుత్వ అనే భావజాలం కేవలం బిజెపి పార్టి యొక్క ప్రాపంచిక దృక్పథంగా  మాత్రమే కుదించరాదు.  కాంగ్రెస్ పార్టి యొక్క అవకాశవాద పాపాలకు ప్రతిస్పందనగా చూడరాదు.  మధ్య యుగాల విలువల పునరుద్దరణ కార్యక్రమంగా అసలే  చూడరాదు.  ఇది స్పష్టంగా వర్తమాన-రాజకీయ-ఆర్ధిక సందర్భంలో భారత వర్గాలు అవలంభిస్తున్న  సరికొత్త భావజాలంగా అర్ధం చేసుకో వాలి.  పాలనా యంత్రాంగం, పోలీసు వ్యవస్థ, దేశ  అత్యున్నత న్యాయవ్యవస్థ స్పందించిన తీరు ఈ రోజు మన ముందుంది .  మనం ఎదుర్కొంటుంది కేవలం సంఘపరివార్ దుష్టత్వాన్ని మాత్రమే కాదు యిది  అంతకన్నా విస్తారమైన విరాట్ సమస్య.
భారత రాజకీయ తలం లో పీడిత ప్రజలు ఆక్రమించుకున్న స్థానం పై ఆధిపత్య శక్తులకు కలుగుతున్న ఆక్రోశం దురాగ్రహం కింద స్థాయిలో పెల్లుబుకుతున్న  ప్రజాస్వామిక  సమానత్వ ఆకాంక్షల పట్ల తలెత్తుతున్న వ్యతిరేకత నుంచి కూడా హిందుత్వ లాభం పొందుతుంది. ఆకలి, బాధ, దోపిడీకి వ్యతిరేకం గా రగిలే ఆక్రోశాన్ని ప్రత్యేక సదుపాయాలను సులభంగా ద్వేషంగా మార్చి మైనారిటీ లపై ఉసిగొల్పుతున్నారు .
1990 లో దేశభక్తి, జాతీయత పేరు మీద అధికారంలోకి  వచ్చిన హిందుత్వ బి. జె. పి   పార్టి ప్రజల మద్దతు పొందింది . ఆ తర్వాత   ప్రజలు అంతకంటే తీవ్రంగా ఆకలి, అభివృద్ధి ని కోరుకొని బి. జె. పి  పార్టి ని కాలదన్నారు.  ఇప్పుడు అంతర్జాతీయ పెట్టుబడిదారి సంక్షోభం అందులోంచి పుడుతున్న సామ్రాజ్యవాద దురాక్రమణ  ధోరణి అనే సందర్భంలో హిందూత్వ  అన్ని ముసుగులను  చించుకొని నగ్నంగా బయటకి వస్తుంది. హిందుత్వ అంతర్జాతీయ పెట్టుబడితో ఒప్పందం కుదుర్చుకొంటున్నది.     ఈ  ప్రత్యేక  సందర్భం లో జాతీయత-సుస్థిరత- అభివృద్ధి అనే నినాదంతో దేశ భక్తుల అవతారం ఎత్తుతున్నారు. వారి మోడల్ గా  /అవతారంగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మన ముందున్నాడు. బహుశ రేపు కాబోయే ప్రధాన మంత్రి కూడా.

ప్రజాస్వామిక శక్తుల కర్తవ్యం:

యూరోప్ లో  శర వేగంగా పెట్టుబడిదారి అభివృద్ధి జరగడం వల్ల  ఏర్పడ్డ భౌతిక శక్తుల వలన ప్రజాస్వామ్యం విస్తృతం అయ్యి ఫాసిజం  యొక్క ఆవశ్యకత లేకుండా పోయింది.  కాని మూడో ప్రపంచ దేశంలో ఈ సత్వర అభివృద్ధి లేదు.  రెండవది మన సమాజం లో ఒక పీడిత సమూహము తన కన్నా కాస్త ఎక్కువ లేక తక్కువో పిడనకు గురౌతున్న మరొక పీడిత సమూహాన్ని శత్రువుగా భావించే ధోరణి బలంగా వుంది. అన్ని స్థాయిల్లోను సమానత్వం కోసం పీడిత ప్రజలందరి మధ్య ఐక్యత సాధించడం  ప్రజాస్వామిక శక్తులు నిర్లక్ష్యం చేయకూడదు .
బాలగోపాల్ ఉద్దేశం, ఆచరణలో కూడా ఏమంటారంటే  సమాజంలో ఉన్న భిన్న  ఆధిపత్య రూపలకు వ్యతిరేకంగా ప్రశ్నించకుండా రాజ్యాధికారాన్ని  ప్రశ్నించడం సాధ్యం కాదు.  ప్రశ్నించినా దానికి కావలసిన మద్దతు దొరకదు.  ఇది  పౌర,  మానవ హక్కుల సంఘాలయొక్క  ముఖ్యమైన కర్తవ్యం.  రాజ్యహింసకు వ్యతిరేకంగా పోరాడటమే కాకుండా భిన్న ఆధిపత్య రూపాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం గురించి వక్కాణించారు. అందుకే  మనo అక్టోబర్ 2009  మానవహక్కుల వేదిక నిర్వహించిన సభలో చాలా స్పష్టంగా హిందూ  మతోన్మాదం కు వ్యతిరేకంగా ఆయన  నినదించడం చూస్తాం.    మైనారిటీ హక్కుల పరిరక్షణ కై ఎలుగెత్తి పిలుపును యిచ్చారు.  బహుశా అదే బాలగోపాల్ చివరి బహిరంగ సభ కూడానేమో.
ఈ పుస్తానికి బిజూ మాత్యుస్ రాసిన  ముందు మాట ఎంతో వివరణ తో కూడుకున్నది .  శ్రీశ్రీ మహాప్రస్థానానికి చలం ముందు మాటలా.. ఇలా  అనొచ్చో లేదో కాని నిజంగా హైలెట్.    బిజూ మాత్యుస్ రాసిన ముందుమాటలో బాలగోపాల్  ఆలోచనా విశ్లేషణా చట్ట్రాన్ని మరింత మెరుగుపరచాలంటే హిందుత్వ అభివృద్దికి భూమికగా అభివృద్ధి ఆధారిత రాజ్య పతనం అవ్వడాన్ని  ఆయన చూపిన తీరుని అర్ధం చేసుకోవాలంటారు.  ఈ అభివృద్ది కారక రాజ్యం రూపొందించిన అఖిల భారతీయ గుర్తింపు నయ ఉదారవాదానికి బద్దలు కొట్ట వలసిన అవసరం ఉంది.  దీంట్లోంచి ఇతర గుర్తింపులు బయటకు వచ్చాయి. అందుకే నయా ఉదారవాదం విస్తరించిన కాలంలోనే అనేక రకాల ఉనికి ఉద్యమాలు పుట్టు కొచ్చాయి.  స్వాతంత్రం అనంతరం పెద్ద పెద్ద సంస్థలు, ఈ అఖిల భారతీయత నుంచి లాభం పొందని వారు, బృందాలు అఖిల భారతీయత పట్ల విముఖత చూపారు. పెట్టుబడిదారి విధానం దీనికి సహకరించింది.   ఈ స్థానంలో హిందుత్వ గుర్తింపును నిర్మించే పనిలో ఉంది. కాని ఈ గుర్తింపుల వలన హిందూ అంటే భారతీయుడు అన్న సమాన అర్ధాన్నిచ్చే స్థాయికి హిందుత్వ ఎదగ లేక పోతుంది అంటారు.  అయినప్పటికీ పాత అఖిల భారతీయ భావన స్థానం లో కొత్త ఆధిపత్యాని నెలకొల్పే కొత్త భారతీయ గుర్తింపును సృష్టించగల శక్తిగా హిందుత్వం, నయా ఉదారవాదపు మన్నననూ, బ్రాహ్మణీయ శక్తుల వెన్నుదన్నూ పొందుతుంది. ఈ గుర్తింపు  కేపటిలిజానికి, నిచ్చెన మెట్ల కుల ఆధారిత సమాజానికి పనికి వచ్చే గుర్తింపు. పాత డెవలప్ మెంటలిస్టు రాజ్యం రూపొందించిన నిర్మాణాలన్నిటినీ ఇంకా నయా ఉదారవాదం బద్దలు కొడుతూనే ఉంది.  కొత్త భారతీయ గుర్తింపు రూపొందించే అవకాశం  లేకపోలేదు అంటారు.   పాత అభివృద్ధి కారక రాజ్యం సృష్టించినటు వంటిది కాక ఎంతో సరళంగా, వెసులు బాటుగల గుర్తింపుగా రూపొందించే  అవకాశం ఉంది.  వామపక్షాలు,  రైటిస్తు  శక్తులూ ఈ నూతన ఆధిపత్య గుర్తింపును సృష్టించేందుకు తోపులాడుకొంటారు.  ఈ తోపులాట సందర్భంలో ప్రతిసారీ హిందుత్వం అనేక ఇతర గుర్తింపులను తోసివేసి, తాను ముందుకు పోవాలనే  ప్రయత్నిస్తూనే ఉంటుంది అంటారు.

ముగింపు:

ఈ పుస్తకం 1980 నుంచి పెల్లుబికిన హిందుత్వ పై ఒక అవగాహనా కలిపించడానికి భూమిక అవుతుంది.   బాలగోపాల్ తన ప్రపంచ చారిత్రక దృక్పధoలో బలమైన అవగాహనతో దేశీయ, స్థానిక, ప్రాంతీయ పరిస్థితులను అర్ధం   చేసుకున్న తాత్వికుడిగా మనల్ని వ్యాస పరంపరలో ముందుకు తీసుకుని వెళ్తారు. భారత రాజకీయార్ధం ఉదార వాదం వైపు మలుపు తీసుకోవడం,  దేశం పూర్తి స్థాయి పెట్టుబడి దారి విధానం లోకి ప్రవేశించడానికి హిందుత్వం వికసించడానికి మధ్యగల సంభందాన్నివిశదీకరిస్తారు .  కులానికి, పెట్టు బడిదారి విధానానికి మధ్యగల సంబంధాన్ని స్పష్టంగా చూపుతారు. హిందూ మతం స్త్రీల పై సాగే హింసకు ఎలా మూలమయ్యిందో సోదాహరణంగా తెలియ చేస్తారు.  హిందుత్వ ఏ రకంగా అంచెలంచలుగా పేర్చబడిన మార్కెట్ అనుకూల విధేయ వ్యక్తులను రూపొందించేందుకు నడుము కట్టిందో వివరించారు . దేశం లోని బూర్జువ  వర్గం  సామ్రాజ్యవాద ప్రపంచీకరణలో  దళారీ బూర్జువా వర్గంగా మారి గుత్త పెట్టుబడిదారి  వర్గం చేతుల్లో ఎలా కీలు బొమ్మలుగా మారుతున్నారో అవగాహన కలిపిస్తారు.
నాకు బాలగోపాల్ తో పరిచయం హిందుత్వం పెల్లుబుక్కుతున్న సమయంలోనే జరిగింది. అదే కాలంలో వచ్చిన నయా  ఉదారవాదం హక్కుల సంఘం  లో పని చేస్తున్న మాలాంటి వారిలో  ఎన్నో ప్రశ్నలను రేపింది . హక్కుల కార్యకర్తగా నిమగ్నత, అధ్యయనం  , పోరాటాలతో ముడిపడి ఉన్న సచేతనతో ఆయన ఎప్పుడు మమల్ని చైతన్య పరిచే వారు.   సెజ్ లో పని చేస్తున్నమాకు  సెజ్ యాజమాన్యం  క్రిష్టియన్ మైనారిటీల చర్చిలను స్వాధీన పరుచు కొంటే వారి   హక్కుల కోసం కోర్టులకు వెళ్లి నప్పుడు ఒక న్యాయవాదిగా,  సహ కార్యకర్తలా  మాతో నడిచారు.   ఎంతగా ఆత్మీయంగా, ఆచరణాత్మకంగా సలహాలు ఇచ్చేవారో అంతగాను ఉద్యమ క్రమంలో తప్పులు దొర్లితే  సూటిగానే విమర్శించేవారు.  ఒక సెజ్ లో దళిత బిసి  కులాల సమీకరణకు అంబేద్కర్ జయంతిని చేస్తున్నప్పుడు తన ఎజెండాలో మా ప్రోగ్రాం లేక పోయినా  వచ్చారు . మా దళిత నాయకులు  అంబేద్కర్ విగ్రహాన్ని పాలతో అభిషేకం చేస్తే అంతే తీవ్రంగా విమర్శించారు. ఏ హిందూ మతాన్ని అంబేద్కర్ వ్యతిరేకించాడో  ఆ  మత పద్దతులే దళితులు కూడా తెలిసో తెలియకో  అనుకరిస్తుంటే అ భావజాలాన్ని నిరోధించ వలసిన కర్తవ్యం ఒక సామాజిక  కార్య కర్తగా నాకు ఉందని హేచ్చరించారు.
అన్ని సార్లు అన్ని అంశాలలో బాలగోపాల్ తో ఏకీభవించక  పోయినా ఎన్నో విషయాలను అవగాహనా చేసుకోడానికి, ఆచరణకు ఆయన ఆలోచనా విధానం, ఆచరణ స్పూర్తినిచ్చాయి.   అందులో హిందుత్వ ఒకటి. అలాంటి  వ్యక్తి ఈ రోజున మన మధ్య  లేకపోవడం విషాదం.  నేడు  భారత సమాజంలో జరుగుతున్న దాడుల మూలాలు,   హిందుత్వ చట్రం లో జరుగుతున్న దోపిడి వాటి విశ్లేషణా  పరిధిని మరింత లోతుగా  విపులీకరించే సమయంలో బాలగోపాల్  ఇంకా ఉంటే  బాగుండేది.  ఈయన చూపిన బాటను విశదీకరించడం,  సిద్దంతీకరణ పూర్తి చేయడం నేడు అత్యవసరం.
ఈ వ్యాసాన్ని ఒక ఉదంతాన్ని చెప్పి ముగిస్తాను.  మొన్న హైదరాబాదు లో బాంబు పేలుళ్ళ తర్వాత పోలీసులు టెర్రరిజం కు వ్యతిరేకంగా  బేనర్స్ పెట్టారు. అందులో బాంబు దాడులు  గుడి ముందో, మార్కెట్ లోనో  జరుగుతాయని తెలుపుతుంది. అంతవరకు అయితే పర్వాలేదు.  కాని బూచి లాంటి ఒక పూజారి వర్గ ప్రతినిధి టెర్రరిజం   డౌన్ డౌన్ అని నినాదాల పైన చాల గంభీరంగా  అచ్చు మనువు లా దర్శనమిస్తాడు.  అతని ముఖంలో ఈ విధ్వంసాలన్నిటికీ  మూలం అయిన వారిని శిక్షించాలి   జాగ్రత్త అన్న హెచ్చరిక తో ప్రజల్ని రెచ్చ కొడుతున్నట్టు ఉంటుంది.   కాని ఎక్కడా బాబ్రి మసీదు కూల్చివేత, గుజరాత్ లో ముస్లింల పైన హిందూల  దాడులు గురించి వారి మనోభావాల ను  ఏవి  అందులో చూపించరు.   అఫ్జల్ గురు తీర్పులోను, ప్రభుత్వ ప్రచారo లో రాజ్యం  దాని అంగాల పరోక్ష దౌష్ట్యాన్ని ఎలా అర్ధం చేసుకొందాం?  ఈ రోజున అంబానీ, టాటా, బిర్లాలు లాంటి దళారి పెట్టుబడి దారి వర్గం,  సామ్రాజ్యవాద పెట్టుబడికి ప్రతినిధి అయిన అమెరికా  నరేంద్ర మోడీ లాంటి సంఘపరివార్ సభ్యుడిని కాబోయే ప్రధానిగా కోరుకొంటున్నదంటే దాని తరువాత జరిగే పరిణామాలు ఒక్కసారి ఊహించండి.  ఈ దోపిడీ  స్వామ్యానికి  హిందుత్వ ఒక   సాధనంగా మారుతున్న తీరును అవగాహన చేసుకోవడానికే  కాదు,  మన ప్రజాస్వామిక విలువలు కాపాడుకోటానికి, హిందుత్వ వ్యతిరేక పోరాటానికి మద్దతు యివ్వటానికి  “మతతత్వంపై బాలగోపాల్”
పుస్తకం ఒక పని ముట్టుగా ఉపయోగపడి  మనల్ని కార్యోన్ముఖులను చేస్తుంది.
పుస్తకం ప్రతులకు :                                                        వెల    : రూ  150/-
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం  ; 85 బాలాజీ నగర్
గుడిమల్కాపూర్ హైదరాబాద్ –  500 067
ఫో నెం  :  040 23521849

ఏ హిందూ మతం తనను తరిమి వేసిందో,  అదే మతంలోని స్త్రీల దుస్థితికి విచారించి వారి కోసం హిందూ కోడ్ ను తీసుకురావటానికి ప్రయత్నించి,ఆ ప్రయత్నం హిందుత్వ మతవాదుల వలన విఫలమైతే  నిరసనగా,  నిబద్దతతో తన పదవినే వదులుకున్న గొప్ప వ్యక్తి డా. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భమున అతనికి  నివాళి తో …

–  నక్కా హేమా వెంకట్రావ్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
- See more at: http://vihanga.com/?p=8653#sthash.ah9rEToj.dpuf

No comments:

Post a Comment

Text