మానవ హక్కుల కమీషన్ – మనం
హేమ
నమ్మిన సిద్ధాంతం కోసం చావునే లెక్క చేయకుండా నడిచిన బాటలో అతడు నేలకొరిగితే, కలల శకలాలలను మూట గట్టుకొని ఆశయాల సజీవ స్వప్నమై జనసంద్రంలో కలిసి జీవైక హక్కులకై పోరాడాలనుకుంటుంది ”ఆమె” ఒక అక్క. హింసాహింసల మధ్య సన్నటి పరదాలను తొలగించి చూస్తే పగిలిన జీవన దర్పణంలో అస్తిత్వం వెయ్యి ముక్కలై పకపకమని నవ్వుతుంది. ”ఆమె” ఒక ఇల్లాలు. గ్రీన్ హంట్‌లో భాగంగా సర్కార్ సైన్యాలు అడవి బిడ్డల్ని చేరబడితే న్యాయస్థానాల ముంగిటకు నడిచి వచ్చిన ”ఆమె”, వాకపల్లి. ప్రభుత్వఆసుపత్రిలో నీడలేక రోడ్డు మీదే ప్రసవించి, బిడ్డలను కోల్పోయే ”ఆమె” పేదరాలు. వీరందరూ, తమహక్కుల గురించి ప్రశ్నిస్తూన్న వాళ్లే. అయితే ఇంతకు మునుపులా కాకుండా వీరందరూ ‘మానవ హక్కుల కమీషన్’ కు రావడం కొత్త మలుపు. అందుకే ఈ మానవ హక్కుల కమీషన్ అంటే ఏమిటో తెలుసుకునే చిన్న ప్రయత్నమే ఇది.
రెండు ప్రపంచ యుద్ధాలు మానవ జీవితంలో అంతులేని విషాదాన్ని, వేదనను మిగిల్చాయి. ఈనేపథ్యంలో మానవహక్కులను నిర్వచించడం ఆనాటి తక్షణకర్తవ్యంగా మారి విశ్వజనీన మానవ హక్కుల ప్రకటనకు దారితీసింది. మానవహక్కులంటే ”భారతరాజ్యాంగంలోని ప్రాధమిక హక్కులలో పొందు పరిచి అభయమివ్వబడిన వ్యక్తి జీవితం, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం, గౌరవం లేక ఇంకా అంతర్జాతీయఒప్పందాలలో పొందుపరిచి భారతదేశ కోర్టులలో అమలు పరిచే అవకాశం వున్న హక్కులన్ని మానవ హక్కులే” అని గ్రాంథిక భాషలో చెప్పిన నిజానికి స్త్రీ జీవితంలో పెత్తనాన్ని వ్యతిరేకించేదే హక్కు. స్త్రీ తాను నమ్మినదానికై ఆత్మగౌరవంతో శ్రమించి బుద్దిబలంతో దోపిడీ వివక్షకు వ్యతిరేకంగా జీవించేదే మానవ హక్కు. అందుకే స్త్రీల హక్కులన్ని మానవ హక్కులుగా మనముందుకొచ్చాయి. కొన్ని స్త్రీల ప్రగతికి బతికే హక్కుకి అడ్డంకులుగా మారినప్పుడు ఆ హక్కుల పరిరక్షణలో భాగంగా వాటిని త్రోసిపుచ్చే ప్రయత్నంలో సంఘనియమాలను చట్టాలను ఉల్లంఘిస్తే వాటికి వ్యతిరేకంగా పోరాడితే అది జీవించే హక్కు వ్యక్తీికరణలో భాగంగా చూడాలి. అందుకే బ్రతికేహక్కుకోసం అమలులో వున్న నియమాలను ధ్వంసం చేసే హక్కు ప్రతి స్త్రీ కలిగివుంటుంది. అయితే ప్రశ్నల్లా వాటిని ఎక్కడ ప్రశ్నించాలా అన్నదే. అందుకు కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు రాజ్యం ప్రకటించింది.
వాటిలో భాగంగానే మహిళా జాతీయకమీషన్, షెడ్యూల్డ్ కులాల, జాతుల జాతీయ కమీషన్, మైనారిటీ జాతీయకమీషన్, మానవ హక్కుల కమీషన్లు ఏర్పడ్డాయి. ఈ మధ్య మనం మహిళ కమీషన్‌కంటే మానవ హక్కుల కమీషన్ కొన్ని సామాజిక పొరపాట్లపై ప్రతిస్పందించడం గమనిస్తాం! (అవి ఏమేరకు న్యాయం చేకూర్చనప్పటికీ కూడా..) ఇదే మానవ హక్కుల కమీషన్ స్త్రీల హక్కులకై చేస్తున్న కృషిని పరిచయం చేయడానికి ప్రయత్నిస్తాను. మానవ (స్త్రీల) హక్కుల ఉల్లంఘన కమీషన్ దృష్టికి వచ్చినప్పుడు కమీషన్ తనకుతానుగా గాని, బాధితులుగాని, బాధితుల తరఫునగాని ఎవరైన ఫిర్యాదు చేసినప్పుడు కమీషన్ విచారిస్తుంది. ఏదైనా కోర్టులో విచారణలో వున్నప్పుడు ఆ కోర్టు అనుమతితో కమీషన్ స్త్రీల హక్కుల విషయంలో జోక్యం కలుగజేసు కోవచ్చు. జైళ్ళను అదేవిధంగా వ్యక్తులను చికిత్సకోసం, సంస్కరణలకోసం, రక్షణకోసం సంబంధించిన ఇతర ప్రభుత్వ సంస్థలను దర్శించి అక్కడ నిర్భంధంగా వున్న వ్యక్తుల బాగోగుల గురించి, స్థితిగతుల గురించి అధ్యయనం చేసి వాటి మెరుగుదలకు కావలసిన చర్యలు చేపట్టవచ్చు. అవసరమైతే నష్టపరిహారాన్ని ఇప్పించవచ్చు. మానవ హక్కుల భావవ్యాప్తికై సాహిత్యాన్ని అందరికీ అందేటట్లు చేయడం, సెమినార్లు నిర్వహించడం మీడియాద్వారా కృషిచేయడం చేస్తుంది.
సాధారణంగా కమీషన్లు పితృస్వామ్యం, కులస్వామ్యం, ధనస్వామ్యం చేసే ఉల్లంఘనలకంటే పోలీసుహక్కుల ఉల్లంఘనకై కమీషన్లో వ్యాజ్యాలు వేస్తుంటారు. సమాజంలో వున్న శక్తివంతమైన గ్రూఫులు పాల్పతున్న మానవ హక్కుల ఉల్లంఘన విచారణపై కమీషన్ సామర్థ్యంపై ప్రజలకు అనుమానం వుంది. (నిజానికి ఎంతోమంది స్త్రీలకు ఈ కమీషన్ గురించి తెలియదు) ఇంకో విషయం ఏమిటంటే మానవ హక్కు ఉల్లంఘనకు పాల్పడుతున్న పబ్లిక్ సర్వ్‌ంట్‌లే కాదు ప్రేక్షక పాత్ర వహించేవారు కూడా ఉల్లంఘనకు బాధ్యులవుతారు. క్రిమినల్ ప్రొసిజర్ కోడ్‌లోని 26వ ఛాప్టర్ సె.195 ప్రకారం కమీషన్‌ను సివిల్ కోర్ట్‌గా పరిగణిస్తారు. ఈ కమీషన్‌కు బాధితులకు, బాధితకుటుంబాలకు సత్వర న్యాయసహాయం అందజేయడానికి సిఫారస్సు చేయడానికి మాత్రమే అవకాశం వుంది. అంతేకాని ఆదేశించే అవకాశం అధికారం లేదు. అంటే కమీషన్ అధికారానికి నియంత్రణ వుంది. అదే విధంగా ఉల్లంఘనలకు పాల్పడిన వ్యక్తులపై తగినచర్యలు తీసుకోమని సిఫారస్సు మాత్రమే కమీషన్ చేయగల్గుతుంది.ఈ సిఫారస్సుపై ప్రభుత్వ చర్యలు తెలియజేయాలి. కమీషన్ రిపోర్ట్లు ఉభయ సభలకు అందజేయపడ్తాయి. దీనివలన ప్రజల నిరసనని ప్రభుత్వాన్ని గురి చూసే అవకాశం వుంది. సాయుధదళాలు స్త్రీలపై జరిపే హక్కుల ఉల్లంఘనపై కేంద్రప్రభుత్వం నుంచి రిపోర్టు రాకపోయిన సంతృప్తి చెందకపోయినా విచారణ జరపడానికి అవకాశం లేదు.( మానవ హక్కులు – మంగారి రాజేందర్) మానసిక బాధిత స్త్రీలపౖౖె జరిగిన సంఘటన ఈ నేపథ్యాన్నే గుర్తు చేస్తుంది. మానవ హక్కుల పరిరక్షణకి పాల్పడుతున్న ప్రభుత్వేతర సంస్థలను ప్రోత్సహించడం కమీషన్ బాధ్యత అయినప్పటికీ ఈనాటికీ స్త్రీల హక్కులకోసం పోరాడుతున్న మహిళాసంఘాల సహకారాన్ని తీసుకున్న దాఖలాలు కాని, ప్రోత్సహించిన సందర్భాలు కాని కమీషన్‌కు లేవు. ( ఒక మానవ హక్కుల న్యాయవాదిగా తెలిసినమేరకు) అలాగే జనాభాలో సగభాగమైన స్త్రీలకో కమీషన్ సభ్యుల నియామకంలో ప్రత్యేకఅవకాశాలు లేవు. హక్కుల పరిరక్షణలో భాగంగా స్త్రీలకు ఒక హెల్ప్‌లైన్ లేక స్త్రీల హక్కుల భావపరివ్యాప్తికి సాహిత్యం, ప్రత్యేక సమావేశాల ఏర్పాట్లు లేవు. మరి స్త్రీల హక్కుల పరిరక్షణ ఎలా అంటారా? మన హక్కులకై ప్రాతినిధ్యానికై మనమే నడుం కట్టాలేమో! అయితే ప్రభుత్వం లేక రాజ్యం సామాజిక సంబంధాలను యధాతధా స్థితిలో కొనసాగించే పరికరం. అది కూడా కుటుంబాన్ని మతాన్ని, వర్గాన్ని మరీ ముఖ్యంగా పితృస్వామ్య విలువల్ని పరిరక్షించడానికే పాటుపడుతుంది. కాబట్టి సంబంధిత న్యాయమూర్తులకు పితృస్వామ్యంపట్ల అవగాహన ప్రగతిశీల భావాలు లేకపోతే మరింత సమస్యల్లో యిరుక్కున్నట్టే. కమీషన్ యొక్క స్వేచ్ఛ, సమానత, సౌభ్రాతృత్వ ప్రమాణాలను ప్రశ్నించవలసిన అవసరం కేవలం బాధిత స్త్రీలకే పరిమితం కాకూడదు. ఈ కమీషన్ మానవ హక్కుల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు యిచ్చే సూచనలలో సిఫార్సులలో, స్త్రీల పాత్ర పెరగాలి. మానవ (స్త్రీల) హక్కుల పరిరక్షణ అన్నది స్త్రీ పురుషుల స్నేహ సంబంధాల కోసం తీవ్ర అన్వేషణ చేసే ప్రతి ఒక్కరి సాంఘిక బాధ్యత కూడా.
ఐక్యరాజ్యసమితిలో మానవ హక్కుల కమిటీలో భారతదేశం ఒకటి అయిన తరుణంలో అలసిన స్వప్నాలతో ‘ఆమె’ శిథిలం కాకమునుపే, ఆకుపచ్చని జీవితం సాయుధమై తిరగబడకముందే విధ్వంస విస్పోటానికి ‘ఆమె’ నాంది కాకముందే మానవహక్కుల మరో ఇంధ్రధనస్సు ఆవిష్కరణ సాధ్యం కాదేమో!
No comments:
Post a Comment