సెజ్ సెగల్లో సామాన్యుడు విలవిల
హైద్రాబాద్ మిర్రర్ ` ఆదివారం 6, ఎప్రిల్ 2008
-హేమా వెంకట్రావ్
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గర సహజవాయువు నిక్షేపాలు బాగావున్నాయి. కాబట్టి ఓ.ఎన్.జి.సి. వారికి శుద్ధి కర్మాగారం (రిఫైనరీ) నెలకొల్పడానికి భూమి కావాలంటూ ప్రభుత్వం చర్చ మొదలుపెట్టింది. ఒక్క ఒ.ఎన్.జి.సి.యే కాక ఇతర ప్రైవేటు రంగం, పెట్రోలియం కంపెనీలకు కూడా రిఫైనరీల కోసం భూమి కావాలి కాబట్టి ఇక్కడ 12,500 వేల ఎకరాలతో సెజ్ (ప్రత్యేక ఆర్థిక మండలి)ని నెలకొల్పనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తొలుత కాకినాడ రూరల్ సామర్లకోట, పీఠాపురం, యు.కొత్తపల్లి మండలాల్లో సెజ్‌ను ప్రతిపాదించగా వరి విస్తారంగా పండే ప్రాంతం కావడంతో స్థానిక రైతాంగం భూములు వదులుకోవడానికి నిరాకరించింది. అలాగే ఈ ఏరియా రియల్టర్‌లకు అనువుగా వుండడం వల్ల కూడా ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. దీంతో చివరకు సెజ్ ప్రతిపాదన యు.కొత్తపల్లి మండలం, తొండంగి మండలంలోని తీరప్రాంత గ్రామాలకు మారింది.
ఈ దశలోనే ఒ.ఎన్.జి.సి. తమకు కాకినాడ దగ్గర రిఫైనరీ నెలకొల్పే ఉద్దేశ్యం లేదని ప్రకటించింది. తొలి ప్రతిపాదనలో సారవంతమైన భూములు ఉన్నాయి. కాబట్టి దాని స్థానంలో తీరప్రాంతములోని చవిటి నేలను ఎంపిక చేశామని ప్రభుత్వం నమ్మబలుకుతున్నది. అయితే రెండవసారి ఎంపిక చేసిన భూములు కూడా ఏమంత సారహీనమయిన నేలలు కావు. వందల ఎకరాలు జీడిమామిడి, సరుగుడు, కొబ్బరి, సపోటా, మామిడి తోటలతో పాటు వరి పండే భూమి కూడా ఉంది. సరుగుడు నారు ఇక్కడ నుండే రాష్ట్రానికి ఎగుమతి అవుతుంది. అర ఎకరంలో సర్వేనారు పోస్తే లక్షన్నర ఆదాయం వస్తుంది. సరుగుడు తోట నాలుగేళ్ళు పెంచి కలప అమ్మితే ఎకరానికి లక్షన్నర ఆదాయం తెస్తుంది.
సెజ్‌ల కోసం సారవంతమైన భూములు తీసుకోకూడదనే నిబంధనలకు అనుగుణంగా భూరికార్డులనే తారుమారు చేశారు. పచ్చని వరి పొలాలను రికార్డుల సాక్షిగా సారహీనమైన భూములను, బినామీ భూములను సెజ్‌లకు ‘అంటగట్టడం’ కోసం గ్రామాలను లాక్కొన్నారు. అయితే గమనించవలసినది ఏమిటంటే కాకినాడ సెజ్‌కోసం ఏ భూసేకరణ జరిగిందో అది సెజ్ పేరున కాక కొనుగోలు డెవలపర్ కె.వి.రావు పేరిట చేస్తూ అతను, అతని వారసులు భూమిపై హక్కులను అనుభవించవచ్చునని రిజిస్ట్రేషన్ పట్టాలో నమోదు చేయబడిరది. భూములు దళితులకు ఇచ్చినా, ఆ భూములను నాయకులు వారి ప్రమేయం లేకుండానే అమ్మేసుకున్నారు. ఒకరి సర్వే నెంబర్లలోని భూమిని వేరొకరి పేరుతో అమ్మేసారు. ఒక రైతు కంటి ఆపరేషన్ కోసం హైదరాబాద్ వెళ్ళి స్వగ్రామం వస్తే అతని భూమి సెజ్ పరమైంది. అతడి కంటి చూపుతోపాటు గుండె కొట్టుకోవడం కూడా మానేసింది. ప్రభుత్వ ధర 50 వేల నుండి లక్షన్నర వరకు ఉంటుంది. సెజ్‌ల పుణ్యాన మూడు లక్షలన్నా దక్కుతున్నాయని అదే ప్రభుత్వ లెక్కలయితే లక్షకు లోపే నష్టపరిహారం వుంటుందని రెవెన్యూ సిబ్బంది జనాన్ని బెంబేలెత్తించారు. దీనికి సెజ్ చట్టంలో ఎలాంటి జవాబు దొరకదు.
ఎక్కడా లేని విధంగా రైతుల భూములలో పేదలు సరుగుడు, కొబ్బరి, జీడిమామిడి, సపోటా తోటలలో, రెండు అంతర పంటలు పండిరచుకుంటున్నారు. ఈ పంటల ప్రతిఫలాలు రైతుకు చెందవు. చేసుకున్న పేదలకు దక్కుతాయి. ఇందులో పప్పుధాన్యాలు, దుంపలు, వంటచెరకు, పశువులకు మేత లభిస్తాయి. ఈ పంటలను పండిరచడం వలన రైతుల భూమిని సంరక్షించుకోవడమే కాక సేద్యానికి చేసే పనులు ఉచితంగా రైతుకు చేస్తారు. ఇది ఎన్నో ఏండ్లుగా రైతుకు, పేదలకు మధ్య ఉన్న అవినాభావ సంబంధం. యాజమాన్యం హక్కు ఉన్న రైతులకు అనేక సేవలు అందించి బ్రతికే చాకలి, మంగలి, కుమ్మరి తదితర చేతివృత్తి కులాలు, ప్రకృతిలోని ఫలసాయం పైన ఆధారపడి బ్రతికే వెయ్యి కుటుంబాలకు పైగా గీత కార్మికులు, 1500 కుటుంబాలకు పైగా ప్రభుత్వ భూముల్లో పశువులను మేపే యాదవులను ఈ గ్రామాల్లో చూడవచ్చు. ఈ నేలలో ప్రవహించు ఉప్పుటేర్లలో చేపలు, పీతలు పట్టే మత్స్యకారులు, సముద్రంలో అలివి వేసి గుంపుగా చేపలు పట్టేవారున్నారు. వీరెవరికీ నష్టపరిహారం వచ్చే ప్రశ్నే తలెత్తదు.
ఎగుమతులను ప్రోత్సహించడం కోసం సెజ్‌లపై సకల సదుపాయాలు, అనేక రాయితీలు కల్పించే ప్రభుత్వం జి.ఒ.నెం. 284 ప్రకారం సెజ్ భూముల రిజిస్ట్రేషన్ కోసం ఫీజు మినహాయించి కొన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయింది. పన్ను రాయితి కేవలం కంపెనీకే కాదు. దాని డైరెక్టర్లకు కూడా ఆదాయపు పన్ను చట్టం నుంచి మినహాయింపు ఇస్తుంది. ఎగుమతులను ప్రోత్సహించే పేరిట ఈ రాయితీలు ఆర్థిక ఆరాచకత్వానికి దారి తీస్తున్నాయి.
భూమి, నీరు, అడవి, చేతువృత్తులను నమ్ముకున్న జనంలో 30 వేల మందికి సెజ్‌లో ఉద్యోగం ఇస్తామని చెబుతున్న అధికారులు సాంకేతిక పరిజ్ఞానం లేని తక్కువ చదువులు లేక అసలు అక్షరం వాసనే తెలియని వారికి ఏ విధమయిన ఉద్యోగం ఇస్తారనేది ఒక ప్రశ్న. అయితే ఇప్పుడు కొనసాగుతున్న పునరావాసం పనుల్లో స్థానికులకు చోటు లేదన్నది సత్యం. చట్టంలో కూడా ఎక్కడా సెజ్‌లో నెలకొల్పబోవు కంపెనీ ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలో నిర్దేశించే అధికారం ప్రభుత్వానికి లేదు. పని గ్యారంటీ లేదు. ఆరోగ్య భద్రతా సదుపాయాలు లేవు. సెక్షను 49 ప్రకారం ఏ చట్టం నుండైనా సెజ్‌లకు మినహాయింపు ఇవ్వవచ్చు. ఇది కార్మిక, పర్యావరణ చట్టాలకు వర్తిస్తుంది. పైగా వ్యవసాయం, చేపల వేట మీద ఆధారపడిన సెజ్ ప్రాంతవాసులకు ఎలాంటి ప్రత్యామ్నాయ ఉపాధి చూపిస్తారనేది ఇంకా వెలుగులోకి రాకపోగా అసలు నిజానికి ఏ ఉత్పత్త జరుగనున్నదో కూడా ప్రజలకు ఇప్పటికి తెలియదు.
భూసేకరణకు ఎంపిక చేసిన భూమి బంగాళాఖాతాన్ని ఆనుకుని వున్నది. సి.ఆర్.జెడ్. జి.ఒ. ప్రకారం సముద్రతీరం నుంచి ఐదు కిలోమీటర్ల లోపల రిఫైనరీలు, పరిశ్రమలు నెలకొల్పకూడదు. ఉప్పుటేర్లలో వ్యర్థపదార్థాలు చేరడం వలన మత్స్యసంపద నాశనం అవుతుంది. అలాగే సముద్రంలోకి చేరిన కలుషితం జలసంపదను విధ్వంసం చేయనుంది. ఈ ప్రకృతి వనరుల దోపిడికి కేవలం రెవెన్యూ యంత్రాంగం రాజకీయ అధికారాన్ని మాత్రమే ఉపయోగించకుండా స్థానిక యువతను ఉద్యోగాలు, ఉపాధి పేరిట ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది.
మోసపూరిత పద్ధతుల్లో భూమిని కోల్పోయిన రైతాంగం చేతికి అందిన డబ్బును అప్పులను తీర్చుకోవడానికి, కుటుంబ కార్యక్రమాలకు ఖర్చు చేసుకుని వీధులపాలవుతోంది. సెజ్‌లో 25 శాతం ఉత్పత్తి లేక ఇతర ఆర్ధిక సేవలు అందించే సంస్థలు వుంటాయి. మిగిలిన భూభాగంలో సెజ్ చట్టం. (సెక్షన్ 2) ప్రకారం పారిశ్రామిక, వ్యాపార, సామాజిక వసతులు ఏర్పాటు చేసుకోవచ్చు. వసతుల పేరిట ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఇందులో స్థానికులు సమిధలు, పేదలకు ముఖ్యంగా దళిత జాతులకు సొంత ఇళ్లు నిర్మిస్తామని ఆశ చూపించి ఖాళీ చేయిస్తున్నారు. అందరికీ పునరావాసం కల్పిస్తామని మభ్యపెట్టి స్థానికులను మంచి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహాయ పునరావాస విధానం జి.ఒ. నెం. 66 ప్రకారం నిర్వాసితుల గురించి, ఉపాధికి దూరమయిన వారి గురించి సామాజిక. ఆర్థిక సర్వే నిర్వహించాలి. ఈ సర్వే 90 రోజుల్లో పూర్తి కావాలి. సర్వే ఫలితాలను సంబంధిత గ్రామ పంచాయితీ కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం వుంచాలి. దీని మీద స్థానికుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని 30 రోజుల్లో ఈ సర్వేకు తుది రూపం ఇవ్వాలి. సమీప ప్రాంతంలో భూమిని ‘పునరావాస ప్రాంతం’గా ప్రకటించి బాధితులకు కేటాయించాలి. కాకినాడ సెజ్‌లో వీటిలో ఏదీ ఆచరణలోకి రాలేదు.
ఇక్కడ గమనించాల్సిన విషయం, తాము చేసిన సెజ్ శాసనాలనే పాలకులు తుంగలో తొక్కి ఇష్టానుసారం వేలాది ఎకరాల భూములు కేటాయించడం, ప్రజల జీవన వనరులను అస్మదీయులకు కట్టబెట్టడానికి అత్యుత్సాహం చూపడం. భూస్వాధీనానికి సంబంధించి సెజ్ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం కానీ, కె.వి.రావు బృందం కానీ ఖాతరు చేసిన దాఖలా లేదు. ఇది అన్యాయం అని ఎవరయినా గొంతెత్తితే జైళ్లు నోళ్లు తెరుస్తున్నాయి. అరవై యేళ్ల క్రితం జాతి యావత్తు లేచి నిలబడి సరిహద్దుల అవతలి దాక తరిమికొట్టిన వలస బానిస వ్యవస్థ, సెజ్‌ల రూపంలో తిరిగి భారత భూభాగంలో పాగా వేస్తోందని సామాజిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు. నేడు కొనసాగుతున్న అభివృద్ధి ప్రక్రియలోని విధ్వంసక ముఖమే ఎక్కువగా దర్శనమిస్తూ పౌర సమాజాన్ని కలవరపాటుకు గురి చేస్తుండడం శోచనీయం.
` హేమావెంకటావ్రు
(రచయిత్రి ప్రముఖ న్యాయవాది)
ముద్రితం : హైద్రాబాద్ మిర్రర్ ` ఆదివారం 6, ఎప్రిల్ 2008
No comments:
Post a Comment