Thursday, May 21, 2015

కరవాక మహిళ

కరవాక మహిళ

హేమ  అటు భూమి ఇటు సంద్రానికి మధ్య తెరచాప లాంటి తీరమే కరవాక ప్రాంతం. 
మానవాళిని అలరిస్తూ భూమిని ముద్దాడి వెనుతిరిగే కడలి అలల నురగలు, ఇసుక తిన్నెలు, మడ అడవులు కొన్నిచోట్ల సముద్రపు పొంగులో ఉద్భవించిన  నీటికత్తాలు, ప్రకృతికి పరవశిస్తూ స్వేచ్ఛగా గాలిలో పల్టీలు కొడుతూ క్షణకాలం సంతోషాన్ని పంచుతూ పదసవ్వడి అలికిడికే బుడుగున నీళ్ళలో జారిపోయి తన్మయత్వంతో అలల సయ్యాటలాడే విహంగాల మధ్య సూర్యోదయం నుంచి సూర్యస్తమయం వరకు తన వారికోసం బాధ్యతలను మోసే తరంగమే ఆమె కరవాక మహిళ.
తీరంలో సాంప్రదాయ మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళి వస్తే పట్టిన చేపలను గ్రేడింగు చేయటం, వేలం పాటపాడటం, అమ్మకం ధర నిర్ణయించడం, శుభ్రపరచడం, ఎండబెట్టడం, నిల్వచేయడం, అమ్మడం తదితర అన్ని పనులు చేస్తుంది. వలలు తయారు చేయటం, వేటకు అవసరమైన వనరులు సమకూర్చడం,  నావ తదితర పరికరాలను శుభ్రపరచటంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. గతంలో స్త్రీలు చేపలవేటలో పాల్గొనేవారు కాదు. ఇపుడు అలవి వల వేటలో పాల్గొంటారు. కొన్ని చోట్ల పురుషులతో పాటు నావలపై వలను లాగటానికి సహాయపడతారు. దేశంలో వ్యవసాయ ఉత్పత్తిలో స్త్రీల భాగస్వామ్యం విషయమై ఓ మేరకు లెక్కలు వున్నా 7000 కోట్ల పైగా విదేశీ మారకం  సంపాదిస్తున్న కరవాక మహిళ శ్రమశక్తి, ఉత్పత్తిలో ఆమె భాగం గురించి గణాంకాలు ఏమి లేవు.
కరవాకతో మమేకమై స్థానిక వనరులను సామాన్య ఉమ్మడి ఆస్తులగా ఓ మేరకు అనుభవిస్తున్న కరవాక మహిళ జీవితంలో సునామీ కంటే తీవ్రమైన ‘ప్రపంచీకరణ’ చుట్టు ముట్టేసింది. రొయ్యల సాగు, నాగరీకరణ, పారిశ్రామికరణ, పారిశ్రామిక కాలుష్యం, ఓడరేవుల అభివృద్ధి, ఆధునీకరణ, పర్యాటకాభివృద్ధి, కోస్టల్‌ కారిడారు కరవాక మహిళ జీవన విధానంలో చిచ్చురేపాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంవలన సముద్రంలో పట్టిన చేపలు అత్యాధునిక నౌకలతోనే ప్రాసెసింగు, గ్రేడింగు,ప్యాకింగు జరిగిపోవటంవలన కరవాక మహిళ ఉపాధి కోల్పోతోంది. మార్కెటింగులో అనేక మార్పులు వచ్చాయి. స్థానిక వ్యాపారవ్యవస్థ పతనమై కమీషన్‌ ఏజెంటు వ్యవస్థ రావటంవలన పురుషులే అగ్రభాగాన వున్నారు. పరిశ్రమలోని లాభాలు చూసి ఇతర ఆధిపత్య వర్గాల కులాలు పెట్టుబడులు పెట్టడంవలన వారి పురుషుల చేతుల్లోకి మత్స్య పరిశ్రమ వెళ్ళిపోయింది. ప్రభుత్వం వ్యాపార దృక్పథంలో ఈ వృత్తిలో ప్రవేశించిన వారిని మత్స్యకారులుగా గుర్తించడంలవలన ‘కరవాక మహిళ’ తన ప్రత్యేక అస్థిత్వాన్ని కోల్పోయింది. వలల తయారీ స్థానికంగా వుండడంవలన గతంలో స్త్రీలు, పిల్లలకు ఆర్ధికంగా కొండంత ఆసరాగా వుండేది. బడా కంపెనీలను రాయితీలు, సబ్సిడీలు, యాంత్రీకరణ కరవాక మహిళనే కాదు మొత్తంగా మత్స్యసరుదనే దెబ్బ కొట్టింది. ఈ పెను మార్పు వలన మత్స్యకారులు యితర రాష్ట్రాలకు (సెప్టెంబరు నుండి ఏప్రిల్‌ వరకు) మరబోట్లుపై కూలీలుగా పనిచేయడానికి వెళితే ఆర్ధికంగా, సామాజికంగా హింసను యిబ్బందులు ఎదుర్కొంటారు. ఒక వేళ కుహానా అభివృద్ధి పేరిట ప్రాజెక్టులు వచ్చినా ఉద్యోగం పురుష లక్షణం అన్న పితృస్వామిక భావజాలం కలిగిన సమాజంలో కరవాక మహిళకు, ఎలాంటి ఉపాధి దొరకదు అని గత ప్రాజెక్టులే చెబుతున్నాయి.
తమ అవసరాలు తీర్చుకోవడానికి ప్రభుత్వ సహాయ సహకారాలతో ఏర్పడిన సహకార సంఘాలు పురుషులకు నాలుగువేలకు పైగా వుంటే స్త్రీల సహాకార సంఘాలు మూడు వందలకు మించి లేవు. ఏవో చిన్న చిన్న రుణాలు పొందడం తప్ప ఈ సంఘాలద్వారా కరవాక మహిళలకు ఒరిగింది ఏమి లేదు. ఆంధ్రప్రదేశ్‌ మత్స్య సహకార సంఘాల సమాఖ్యలో స్త్రీల పాత్ర మచ్చుకైనా కనబడదు. స్త్రీల సాధికారత గురించి మాట్లాడే ప్రభుత్వం గతంలో సునామీ వచ్చిన సందర్భంలో మత్స్యకారులకు ఉచితంగా యివ్వవలసిన దానిని రుణాలు రూపంలో యిచ్చి మహిళలు కాస్తో కూస్తో దాచుకున్న డబ్బును అప్పుల క్రింద జమ చేసుకుంది, యింక ప్రకృతి వైపరీత్యాలు, సునామీ పైన పేరు చెప్పుకొని దేశ విదేశాల నుంచి డబ్బులు దండుకున్న సంస్థలెన్నో!
సామాజికంగా వెనుకబడిన కులాలకు (బిసి.ఎ) చెందిన కరవాక మహిళపై పితృస్వామ్య భావజాల ప్రభావం ఎక్కువగానే వుంటుంది. పొద్దుపొడుపుతోపాటు లేస్తే పొద్దు గుంకే వరకు ఉపాధి వెతుకులాటతో పాటు పిల్లల పెంపకం, చదువు, ఆరోగ్యం, పరిశుభ్రత, ఆర్ధిక లావాదేవీలు స్త్రీలపైనే ఆధారపడి వుంటాయి. అయినప్పటికీ వాళ్ళు భర్త, తండ్రుల ద్వారానే సమాజంలో గుర్తింపు పొందుతారు. వీరిలో నిరక్షరాస్యత, బాల్యవివాహాలు ఎక్కువే. ఆర్ధిక వెసులుబాటు వున్నా గృహహింస కూడా ఎక్కువే. చేపల బుట్టలను తలపై పెట్టుకొని ఊరూర తిరిగి అమ్ముకుని కరవాక మహిళ ఎక్కువగా . నరాలు, తల సంబంధిత అనారోగ్యంతో బాధపడుతుంది. అధిక శ్రమ, అనాదరణ ఆమెను మరింత క్రుంగదీస్తుంది. యింతేకాకుండా సమాజంలోని ఆధిపత్య కులాలు మత్స్యకారుల గ్రామాలకు వచ్చి దాడులుచేసి స్త్రీలను పరాభవించిన సందర్భాలెన్నో!  దీనిని తీర ప్రాంత గ్రామాలతో పాటు గుంటూరుజిల్లా రేపల్లె చుట్టూ  ప్రక్కల గల తీర ప్రాంతం, యితర ప్రాంతాలలో కరవాక మహిళలు ఎండుచేపలు సంతల్లో   అమ్ముకోవడానికి వచ్చినపుడు అక్కడి ఆధిపత్య కులా పురుషులు వీరి దగ్గర డబ్బులు దండుకోవడం అంటూ బత్తాలు అంటూ చేయడం పరిపాటిగా మారిందని వాపోతున్నారు. ఇదీ నేటి స్వతంత్ర, భారత వనిలో కరవాక మహిళ దుస్థితి.

No comments:

Post a Comment

Text